INS sindhurakshak
-
భువిపైకి సింధు!
సాక్షి, ముంబై: ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదానికి కారణాలతోపాటు అనేక వివరాలు ఇంత వరకు తెలియరాలేదు. దీంతో జలాంతర్గామిని నీటిలో నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 14న నేవల్ డాక్‌యార్డ్‌లో నిర్మితమైన ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో భారీ పేలుళ్లతోపాటు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో జలాంతర్గామిలోని 18 మంది సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటన దేశవిదేశాల్లోనూ సంచలనం సృష్టించింది. ప్రమాదం అనంతరం సుమారు 30 అడుగుల సముద్రం లోతున జలాంతర్గామి మునిగిపోయింది. ప్రమాదంలో ఇంకా కొందరి శవాలు లభించలేదని తెలిసింది. మరోవైపు వెలికితీసిన శవాలు కూడా గుర్తుపట్టరానంతగా కాలిపోయాయి. డీఎన్ఏ పరీక్షల ద్వారా కొన్ని మృతదేహాల వివరాలు గుర్తించారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది..? వీరంతా ఎలా ప్రాణాలు కోల్పోయారు..? తదితర విషయాలను తెలుసుకునేందుకు జలాంతర్గామిని బయటికి తీయాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని బయటికి తీస్తే అనేక వివరాలు అందుతాయని నేవీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 2,300 టన్నుల బరువున్న ఈ జలాంతర్గామిని బయటికి తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మొదట్లో భారీ యంత్రాలతో దీనిని వెలికితీసేందుకు నేవీ సిబ్బంది శ్రమించినా పెద్దగా ఫలితాలు కనిపించలేదని రక్షణరంగ నిపుణుడు ఒకరు తెలిపారు. మనదేశ కంపెనీలకు ఈ భారీ జలాంతర్గామిని నీటి నుంచి బయటికి తీసే సామర్థ్యం లేదని తెలిసింది. అందుకే ఈ రంగంలో అనుభవం ఉన్న అంతర్జాతీయ కంపెనీలను నేవీ ఆహ్వానించింది. ఈ మేరకు ఐదు అంతర్జాతీయ కంపెనీలు జలాంతర్గామిని బయటికి తీసేందుకు ముందుకువచ్చాయి. అయితే వీటిలో ఏదో ఒక కంపెనీతో తొందర్లోనే ఒప్పందం కుదుర్చుకుని సింధురక్షక్‌కు బయటికి తీసే పనులు ప్రారంభిస్తామని నేవీ చీఫ్ అడ్మిరల్ డీకే జోషీ మీడియాకు చెప్పారు. ముందుకు సాగనున్న విచారణ సింధురక్షక్‌కు బయటికి తీయగలిగితే విచారణకు అవసరమైన కీలక ఆధారాలు లభించడంతోపాటు అన్ని రహస్యాలూ బయటపడనున్నాయి. ఈ ఘటనపై కేంద్ర రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ ఆదేశాల మేరకు ‘బోర్డ్ ఆఫ్ ఎంక్వయిరీ’ విచారణ చేపట్టింది. అయితే మూడు నెలలు పూర్తవుతున్నప్పటికీ దీని సభ్యులు ఎలాంటి నివేదికనూ అందించలేదు. సింధురక్షక్‌ను బయటికి తీయగలిగినట్టయితే ఈ సంస్థ కూడా త్వరగా విచారణను ముగించే అవకాశం ఉంది. ఫోరెన్సిక్ నిపుణులకు కూడా మరిన్ని ఆధారాలు లభిస్తాయని చెబుతున్నారు. అనేక కోణాల్లో విచారణ.... ఈ ఘటన ప్రమాదమా ఉగ్రవాద చర్యా అనే కోణంలో కూడా విచారణ సాగినప్పటికీ ఉగ్రవాద చర్యగా పేర్కొనేందుకు ఎలాంటి ఆధారాలూ లబించలేదు. రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ సైతం ఇదే విషయాన్ని ప్రకటించారు. ప్రమాదానికి కారణమేమిటనే విషయంపై కూడా పక్కాగా ఆధారాలు లభించలేదని తెలిసింది. ఓ వైపు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి హెచ్చరికలు మరోవైపు స్వాతంత్య్రదినోత్సవాలకు ఒకరోజు ముందు ఈ ఘటన జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే నావల్ డాక్‌యార్డ్‌లో ఈ ప్రమాదం జరగడంతో రూ.500 కోట్ల విలువైన జలాంతర్గామి ధ్వంసమయింది. ఇందులోని పేలుడు పదార్థాలు, ఇంధనం, ఆక్సిజన్ బాటిళ్ల కారణంగా పేలుళ్లు సంభవించి ఉంటాయని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ విషయంపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. మరమ్మతులు కూడా కారణం కావొచ్చునే కోణంలోనూ విచారణ సాగినా తగిన ఆధారాలు దొరకలేదు. సింధురక్షక్ జలాంతర్గామికి రష్యాలో మరమ్మతులు పూర్తి అయిన అనంతరం 2013 జనవరిలోనే మనదేశానికి వచ్చింది. స్వదేశానికి వచ్చిన అనంతరం కూడా అన్ని విధాలా పరీక్షించారు. సాంకేతికంగా ఎలాంటి దోషాలూ లేవని నిర్ధారించుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన అనంతరం మరోసారి అనుమానాలు తలెత్తాయి. ఇదిలాఉంటే సింధురక్షక్ జలాంతర్గామికి గతంలో కూడా ప్రమాదం చోటుచేసుకుంది. 2010లో విశాఖపట్టణంలో ఉండగా అగ్నిప్రమాదం సంభవించింది. ఆ సమయంలోనూ నేవీ ఉద్యోగి ఒకరు మరణించాడు. -
ఆయుధాలను పేల్చడం వల్లే సింధురక్షక్ ప్రమాదం: ఆంటోనీ
ఐఎన్ఎస్ సింధురక్షక్లో ఆయుధ సామగ్రిని పేల్చడం వల్లే పేలుడు సంభవించి ఉండొచ్చని ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ రాజ్యసభలో సోమవారం వెల్లడించారు. రెండుసార్లు వాయిదా పడిన తర్వాత మధ్యాహ్నం రాజ్యసభ తిరిగి సమావేశమైంది. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ సింధురక్షక్ ప్రమాద అంశం చర్చకు వచ్చినప్పుడు దానిపై ఆంటోనీ మాట్లాడారు. అయితే, పేలుడుకు సంబంధించిన కారణం ఏంటో ఇంతవరకు తెలియరాలేదని, దీనిపై ఫోరెన్సిక్ నిపుణులు దృష్టి పెడుతున్నారని ఆయన చెప్పారు. నీళ్లలో మునిగిపోయిన జలాంతర్గామిని బయటకు తీసి, అందులోని నీరు మొత్తాన్ని తోడిన తర్వాత గానీ వివరాలు తెలియవన్నారు. పేలుడు తీవ్రత, దానివల్ల జలాంతర్గామికి సంభవించిన నష్టాన్ని బట్టి చూస్తే... అందులో ఉన్ 18 మందిలో ఏ ఒక్కరూ బతికుండే అవకాశం కనిపించడంలేదని ఆంటోనీ చెప్పారు. మొత్తం ఎస్ఓపీలకు సంబంధించి ఆడిట్ చేయాలని నౌకాదళం ఆదేశించిందని, ఆయుధాల భద్రతకు సంబంధించిన పరిశీలన మొత్తం జరుగుతోందని, నౌకాదళంలో ఉన్న మొత్తం జలాంతర్గాములన్నింటికి సంబంధించి ఇలాంటి పరీక్షలు చేస్తారని ఆంటోనీ తెలిపారు. -
ఇంకా లభించని 12 మంది నేవీ సిబ్బంది ఆచూకీ
సాక్షి, ముంబై: నగరంలోని డాక్‌యార్డ్‌లో ప్రమాదానికి గురైన ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో గల్లంతైన నేవీ సిబ్బందిలో మరో 12 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. మంగళవారం అర్ధరాత్రి పేలుళ్లు జరిగి సింధురక్షక్ మునిగిపోవడం, అందులో 18 మంది నేవీ సిబ్బంది గల్లంతు కావడం తెలిసిం దే. గల్లంతైనవారిలో శనివారం నాటికి ఆరుగురి మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికి తీశారు. మిగతా 12 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం జలాంతర్గామి మొదటి కంపార్ట్మెంట్ తలుపులు కూడా తెరిచి గజ ఈతగాళ్లు లోపలికి ప్రవేశించారని, కానీ మృతదేహాల జాడ తెలియలేదని ముంబైలో రక్ష ణ శాఖ పీఆర్వో నరేంద్రకుమార్ విస్‌పుతే ‘సాక్షి’కి తెలిపారు. -
జలాంతర్గామి ప్రమాదం: కావాలంటే సాయం చేస్తామన్న అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ
పేలిపోయి మునిగిపోయిన ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి నుంచి మృతదేహాలను వెలికి తీయడానికి అవసరమైతే తాము సాయం అందిస్తామంటూ పలు దేశాలు ముందుకొస్తున్నాయి. ప్రమాద విషయం తెలియగానే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు సహాయ కార్యకలాపాలలో అవసరమైతే సాయం చేస్తామని భారత నావికాదళ అధికారులకు తెలిపాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో పేలుడు, భారీ అగ్నిప్రమాదం సంభవించడం, దానిలో ఉన్న దాదాపు 18 మందీ మరణించి ఉంటారని భావించడం తెలిసిందే. ఇప్పటికి కేవలం నలుగురి మృతదేహాలను మాత్రమే వెలికితీయగలిగారు. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు జలాంతర్గాముల నిర్మాణంతో పాటు ఆపత్సమయాల్లో ఎలా వ్యవహరించాలనే విషయంలో కూడా నైపుణ్యం ఉంది. ప్రస్తుతం భారత నౌకాదళ వర్గాలు కూడా యుద్ధనౌకల విషయంలో రక్షణచర్యలు చేపట్టే అంతర్జాతీయ కంపెనీలతో సంప్రదింపుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం ఐఎన్ఎస్ విద్యగిరి అనే నౌక ముంబై హార్బర్లో ప్రవేశించేటప్పుడు ఓ వాణిజ్య నౌకను ఢీకొనడంతో.. ఇటీవలే నౌకాదళం ఇటీవలే ఓ డచ్చి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. జలాంతర్గామిని పైకి తీసుకురాగలిగితే, దానికి ఎంతమేర నష్టం జరిగింది, పేలుడు కారణంగా దానిలోని ఏయే భాగాలు ఎంతవరకు పాడయ్యాయనే విషయాలు కూడా తెలుస్తాయి. దాంతోపాటు పేలుడుకు గల కారణాలేంటో కూడా తెలిసే అవకాశం ఉంది. ముంబైలో జరుగుతున్న సహాయ కార్యకలాపాలను నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ డీకే జోషి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన రక్షణ మంత్రి ఏకే ఆంటోనీకి, రక్షణ శాఖ కార్యదర్శి ఆర్కే మాథుర్‌కు కూడా ఎప్పటికప్పుడు వివరాలు చెబుతున్నారు. -
సింధురక్షక్ నుంచి నాలుగు మృతదేహాలు వెలికితీత
ముంబయి : ఐఎన్ఎస్ సింధురక్షక్ నుంచి నాలుగు మృతదేహాలను నేవీ అధికారులు శుక్రవారం వెలికి తీశారు. మిగతా మృతదేహాల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ముంబై నేవీ డాక్‌యార్డ్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 18 మంది దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురయిన జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధురక్షక్ లోపలకి నేవీ డైవర్లు వెళ్లలేకపోతున్నారు. సబ్‌మెరైన్ చీకటిగా ఉండడం, నీళ్లతో పూర్తిగా నిండిపోవడంతో లోపలికి వెళ్లేందుకు తీవ్ర అడ్డంకి ఏర్పడుతోంది. దీనికి తోడు భారీ విస్ఫోటంతో లోపలి భాగాలన్నీ వేడితో కరిగిపోయాయి. దీంతో కంపార్ట్మెంట్లలోకి వెళ్లే దారులు మూసుకుపోయాయి. భారీ పంపులతో నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. గాలింపు చర్యలకు అంతరాయం కలుగుతోందని మాత్రమే నేవీ చెబుతోంది. మరోవైపు తమ వారి కోసం నావికుల కుటుంబీకులు మాత్రం ఆశగా ఎదురుచూస్తున్నారు. సింధు రక్షక్‌లో ప్రమాదం జరగడం రెండేళ్లలో ఇది రెండోసారి. గతంలో జరిగిన పేలుడులో ఓ నావికుడు చనిపోగా, ఇద్దరు గాయపడ్డారు. -
'సింధురక్షక్' ఘటనలో మూడు మృతదేహలు లభ్యం
-
'సింధురక్షక్' ఘటనలో మూడు మృతదేహలు లభ్యం
ముంబై డాక్‌యార్డ్‌లో మంగళవారం అర్ధరాత్రి పేలుడు సంభవించిన ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో మరణించిన నావికుల్లో మూడు మృతదేహాలను గజ ఈతగాళ్లు ఈ రోజు ఉదయం కనుగొన్నారని నావికాదళ ఉన్నతాధికారులు శుక్రవారం ముంబైలో వెల్లడించారు. అయితే లభ్యమైన ముగ్గురు మృతదేహాలను గుర్తించలేని విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆ ఘటనలో మృతి చెందిన మరో 15 మంది ఆచూకీ ఇంకా తెలియలేదని వారు తెలిపారు. గత మూడు రోజులుగా మరణించిన ఆ నావిక సిబ్బంది ఆచూకీ కోసం నావికాదళం చేపట్టిన ముమ్మర చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని చెప్పారు. జలాంతర్గామి ఘటనలో మరణించిన వారి వివరాలను న్యూఢిల్లీలోని రక్షణ మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరణించిన ఆ 18 మంది నావికుల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లాకు చెందినవారు ఉన్నారు. ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇదే సింధురక్షక్ మూడేళ్లక్రితం విశాఖతీరంలో ప్రమాదానికి గురైంది. అందులోని బ్యాటరీ వ్యవస్థ ఉండేచోట పేలుడు సంభవించి ఒక నావికుడు మరణించాడు. ఆ ప్రమాదం జరిగిన నాలుగు నెలలకు మరో రెండు జలాంత ర్గాములు ఢీకొట్టుకున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడగల నౌక గురించి మన నావికాదళం 15 ఏళ్లనుంచి పోరాడుతున్నా అరణ్యరోదనే అవుతోంది. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉండగా 2006లో ఆయన సింధురక్షక్లో కొన్ని గంటలు సంచరించినప్పుడు దానికి రక్షణగా అత్యవసర పరిస్థితిలో వినియోగించడం కోసం అమెరికా నుంచి సహాయ నౌకను తెప్పించాల్సివచ్చింది. అది మన నావికాదళానికి అందుబాటులోఉంటే ఇప్పుడు సింధురక్షక్ ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించడం సులభమయ్యేది. -
ఐఎన్ఎస్ సింధురక్షక్ ప్రమాదం: తెలియని సిబ్బంది ఆచూకీ
ఐఎన్ఎస్ సింధురక్షక్ ప్రమాదంలో చిక్కుకుపోయి, ఇప్పటివరకు తెలియకుండా పోయిన 18 మంది సిబ్బంది, అధికారుల ఆచూకీ తెలుసుకోవడం నేవీ డైవర్లకు తలకు మించిన భారం అవుతోంది. జలాంతర్గామిలోకి నీరు ప్రవేశించడం, అది దాదాపు పూర్తిగా మునిగిపోవడం, లోపలంతా అంధకారం ఉండటంతో ఇప్పటివరకు ఒక్కరిని కూడా కాపాడటం గానీ, మృతదేహాలను వెలికి తీయడం గానీ సాధ్యపడలేదు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఎవరైనా బతికి బయటపడతారన్న ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. దీంతో ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా జరిగిన సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు సమయంలో పుట్టిన వేడి వల్ల జలాంతర్గామి లోపలి భాగాలు చాలావరకు కరిగిపోయాయి. దాంతో నౌకాదళ డైవర్లకు అసలు దానిలోని కంపార్టుమెంట్లలోకి ప్రవేశించడం సాధ్యం కావట్లేదు. జలాంతర్గామిలో ఉన్న నీరు మొత్తాన్ని తోడి పారేసేందుకు భారీ పంపుసెట్లను ఉపయోగిస్తున్నారు. బుధవారం జరిగిన ప్రమాదంలో ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిని కోల్పోవడం పట్ల చాలా ఆవేదన చెందినట్లు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇటీవలే మన నౌకాదళం రెండు అసమాన విజయాలు సాధించిందని, వాటిలో ఒకటి తొలి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ కాగా, మరొకటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ అని ఆయన చెప్పారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ డీకే జోషి బుధవారమే ప్రమాదం సంభవించిన నావల్ డాక్ యార్డుకు వెళ్లి సంఘటన స్థలాన్ని సందర్శించారు. పేలుడులో కుట్రకోణం కూడా లేకపోలేదని ఆంటోనీ అనుమానం వ్యక్తం చేశారు. 1997లో 400 కోట్ల రూపాయలతో సమకూర్చుకున్న ఈ జలాంతర్గామికి ఇటీవలే రష్యాలో 450 కోట్ల రూపాయలతో భారీ ఆధునికీకరణ పనులు చేపట్టారు. -
పేలుళ్లతో మూడొంతులమేర మునిగిన ఐఎన్ఎస్ సింధురక్షక్
ముంబైలో ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో జరిగిన మూడు పేలుళ్లు అనంతరం సంభవించిన భారీ అగ్నిప్రమాదం ముంబై వాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొంతసేపటివరకు ఏం జరిగిందో ఎవరికీ అంతుబట్టలేదు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కూర్చున్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. అయితే ఉగ్రవాదుల దాడులపై ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఒకవైపు హెచ్చరికలు, స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక రోజు ముందు ఈ సంఘటన జరగడం నగరవాసులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందా..? లేక విద్రోహ చర్యా అన్న అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత వలయంలో ఉన్న నావల్ డాక్‌యార్డ్‌లో ఈ ఘటన జరగడం అందరిని నిశ్చేష్ఠులను చేసింది. విచారణకు ఆదేశించాం నౌకాదళానికి చెందిన జలాంతర్గామి అగ్నిప్రమాదంలో ముగ్గురు అధికారులతోపాటు మొత్తం 18 మంది మృతి చెందినట్లు అడ్మిరల్ డీకే జోషీ తెలిపారు. ప్రమాదానికి కారణాలేమిటనేది తెలియరాలేదని, విచారణకు ఆదేశించామని చెప్పారు. జలాంతర్గామిలో ఉన్న పేలుడు పదార్థాలు, ఇంధనం, ఆక్సిజన్ సిలిండర్ల వల్ల ఈ పేలుళ్లు సంభవించి ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరమ్మతులే కారణమా... ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిని మరమ్మతుల కోసం 2010లో రష్యా పంపించారు. ఆ దేశానికి చెందిన ‘జ్వోదోచ్కా’ అనే కంపెనీ మరమ్మతులు చేపట్టి 2013 జనవరిలో తిరిగి భారత్‌కు అప్పగించింది. నిర్దేశిత లక్ష్యానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న సింధురక్షక్లో ఆయుధ సామగ్రి భారీగా ఉన్నట్లు చెబుతున్నారు. క్షిపణులు, నౌక విధ్వంసక శక్షిపణులు భారీ స్థాయిలో ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరమ్మతుల అనం తరం మన దేశానికి వచ్చిన ఈ జలాంతర్గామిని అన్ని విధాలా పరీక్షించారు. సాంకేతికంగా ఎలాంటి దోషాలు లేవని స్పష్టం చేసుకున్నారు. అయితే ఈ సంఘటన అనంతరం మరమ్మతుల సమయంలో ఏవైనా లోపాలు ఏర్పడ్డాయా..? అలాంటి లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా... సింధురక్షక్ జలాంతర్గామి గతంలో కూడా ప్రమాదానికి గురైంది. విశాఖపట్టణంలో ఉండగా 2010లో అగ్నిప్రమాదం సంభవించింది. అప్పుడు నౌకదళానికి చెందిన ఓ వ్యక్తి మరణించాడు. కాగా, 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం అనంతరం జరిగిన పెద్ద ప్రమాదం ఇదేనని చెబుతున్నారు. ‘ప్రకటన చేయాల్సిందే’ న్యూఢిల్లీ: ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లలో ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గమిలో జరిగిన పేలుడు, అగ్నిప్రమాదంపై ప్రతిపక్ష బీజేపీ, శివసేన పార్టీ ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై రాజ్యసభలో సర్కార్ నుంచి ప్రకటన చేయాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. రక్షణ శాఖ మంత్రి ఆంటోనీ వెంటనే ప్రకటన చేయాలని, లేకపోతే గురువారం సభ కార్యకలాపాలు జరగనివ్వమని బీజేపీ సభ్యుడు చందన్ మిత్రా అన్నారు. అయితే ముంబైలో ఉన్న ఆంటోని తిరిగి వచ్చిన వెంటనే ప్రకటన చేయిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్ శుక్లా హామీ ఇచ్చారు. -
జలాంతర్గామిలో వరుస పేలుళ్లు: 18 మంది మృతి!
* ముంబై డాక్ యార్డ్‌లో అర్ధరాత్రి దుర్ఘటన * పేలుళ్లతో సగం వరకు మునిగిపోయిన ‘ఐఎన్ఎస్ సింధు రక్షక్’ * రెండు కిలోమీటర్ల వరకు వినిపించిన పేలుడు శబ్దాలు * పక్కనున్న మరో సబ్మెరైన్కూ వ్యాపించిన మంటలు * అగ్నిమాపక దళ తక్షణ స్పందనతో తప్పిన ముప్పు * సంఘటనా స్థలాన్ని సందర్శించిన రక్షణ మంత్రి ఆంటోనీ, నౌకా దళ ప్రధానాధికారి అడ్మిరల్ జోషి * 18 మంది బతికే అవకాశం తక్కువేనని వ్యాఖ్య * జలాంతర్గామిలో టోర్పెడోలు, క్షిపణులు పూర్తి స్థాయిలో ఆయుధాలు * 2010లోనూ ‘సింధు రక్షక్’లో పేలుడు జరిగిన వైనం ముంబై: భారత నౌకాదళ చర్రితలో ముందెన్నడూ ఎరుగని ఘోర దుర్ఘటన ఇది. ముంబై కొలాబా డాక్‌యార్డులో నిలిచి ఉన్న ‘ఐఎన్ఎస్ సింధు రక్షక్’ జలాంతర్గామిలో మంగళవారం అర్ధరాత్రి వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ముగ్గురు అధికారులు సహా 18 మంది సిబ్బందీ కూడా మరణించి ఉంటారని భావిస్తున్నారు. పేలుళ్లతో చాలా భాగం దెబ్బతిన్న జలాంతర్గామి సముద్రంలో సగం వరకు మునిగిపోయింది. దుర్ఘటన జరిగిన సమయంలో సబ్‌మెరైన్‌లో టోర్పెడోలు, క్షిపణులు సహా పూర్తిస్థాయిలో ఆయుధాలు ఉన్నాయి. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి రక్షణ మంత్రి ఆంటోనీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేస్తూ.. వారికి అన్ని విధాలా తోడుగా ఉంటామని అన్నారు. అంతకుమించి మాట్లాడ్డానికి ఆయన నిరాకరించారు. వీరితోపాటు సంఘటనా స్థలానికి వచ్చిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ కూడా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రెండు కిలోమీటర్ల వరకు వినిపించిన పేలుడు శబ్దాలు అర్ధరాత్రి సబ్‌మెరైన్‌లో చోటుచేసుకున్న పేలుడు తాలూకు శబ్దాలు రెండు కిలోమీటర్ల వరకు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. ఈ పేలుళ్లను కొందరు సెల్ఫోన్లతో వీడియో తీశారు. డాక్‌యార్డులో పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలు ఆకాశాన్ని తాకుతున్నట్లు ఆ వీడియోలు స్పష్టంచేస్తున్నాయి. రష్యాలో తయారైన ఈ జలాంతర్గామిలో యాంటీ షిప్ క్లబ్ క్షిపణులు సహా పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్నట్లు నౌకా దళ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది పూర్తి స్థాయి భద్రతను కలిగి ఉందని ఇటీవలే నిపుణులు ధ్రువీకరించినట్లు నౌకా దళ ప్రధానాధికారి చెబుతున్నారు. మరో జలాంతర్గామికీ మంటలు సింధు రక్షక్‌లో పేలుళ్లు జరిగినప్పుడు సమీపంలో 10-15 అడుగుల దూరంలో మరో జలాంతర్గామి సింధురత్న ఉందని, దానికి మంటలు వ్యాపించినప్పటికీ, అదృష్టవశాత్తూ దానికి ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని ముంబై అగ్నిమాపక దళ సిబ్బంది తెలిపారు. తాము సంఘటనా స్థలానికి చేరుకోగానే మంటలను ఆర్పేందుకు యత్నించామని, రెండో జలాంతర్గామికి అంటుకున్న మంటలను ఆర్పగానే దాన్ని మరో ప్రాంతానికి తరలించారని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ పి.ఎస్.రహందలె తెలిపారు. రెండు జలాంతర్గాముల మంటలను ఆర్పడానికి డజన్లకొద్దీ అగ్నిమాపక వాహనాలు ఉపయోగించినట్లు చెప్పారు. 18 మందీ బతికే అవకాశం తక్కువే: నేవీ అడ్మిరల్ జోషి జలాంతర్గామిలో మొదట చిన్న స్థాయి పేలుడు సంభవించిందని, తర్వాత రెండు భారీ పేలుళ్లు సంభవించినట్లు తెలిసిందని నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ డి.కె.జోషి విలేకరులతో చెప్పారు. దీన్ని ఒక విపత్తుగా అభివర్ణించిన ఆయన.. ఈ దుర్ఘటనలో విద్రోహ శక్తుల పాత్ర ఉండే అవకాశమూ లేకపోలేదని, అయితే ప్రస్తుతానికి అలా ఉన్నట్లు సమాచారం ఏదీ అందలేదని అన్నారు. మంగళవారం అర్ధరాత్రి పేలుళ్లు సంభవించగా.. బుధవారం సాయంత్రానికి కూడా అందులోని 18 మంది బతికి ఉన్నారా లేదా అన్నది తెలియరాలేదు. దీనిపై జోషి మాట్లాడుతూ..‘‘అంతా మంచే జరగాలని కోరుకుందాం. కానీ ఎలాంటి పరిస్థితికైనా మనం సిద్ధంగా ఉండాలి. అద్భుతాలు జరగొచ్చు. జలాంతర్గామిలో ఆక్సిజన్ బ్యాగులుండే అవకాశముంది. వాటిని ఉపయోగించుకుని బతికి బయటపడొచ్చు. అయితే ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది’’ అని వ్యాఖ్యానించారు. పేలుళ్లకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయడానికి ఎంక్వైరీ బోర్డును నియమించామన్నారు. గతంలోనూ సింధు రక్షక్‌లో పేలుడు నౌకాదళంలో క్రమేణా జలాంతర్గాముల సంఖ్య తగ్గిపోతున్న సమయంలో ఈ పేలుడు జరిగింది. 2010లో ఇలాగే సింధు రక్షక్‌లో పేలుడు సంభవించి ఒక నావికుడు మరణించారు. ఇద్దరికి గాయాలయ్యాయి. బ్యాటరీ కంపార్ట్మెంట్లో జరిగిన పేలుడు వల్లే దుర్ఘటన జరిగినట్లు నాడు దర్యాప్తులో తేలింది. నౌకా దళానికి ఎదురుదెబ్బ న్యూఢిల్లీ: జలాంతర్గాములు అసలే పరిమితంగా ఉన్న భారత నావికా దళానికి, అగ్నిప్రమాదానికి గురైన ‘సింధు రక్షక్’ జలంతర్గామి మునకతో పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. మరో నాలుగు జలాంతర్గాములతో పాటు ‘సింధు రక్షక్’ను రష్యాలో ఆధునీకీకరించారు. నావికాదళం కార్యకలాపాల్లో ఇవి కీలక పాత్ర పోషించాల్సి ఉన్న దశలో ‘సింధు రక్షక్’ ప్రమాదానికి గురై, మునిగిపోవడం పెద్ద నష్టమేనని, ఈ ప్రమాదంతో కార్యాచరణ సంసిద్ధతకు సంబంధించి తాము కొత్త ప్రణాళికలను రూపొం దించుకోవాల్సి ఉంటుందని సీనియర్ నేవీ అధికారి ఒకరు చెప్పారు. భారత నౌకా దళంలో అణు సామర్థ్యం గల ‘ఐఎన్ఎన్ చక్ర’ సహా 15 జలాంతర్గాములు మాత్రమే ఉన్నాయి. కొద్ది రోజుల్లోనే వేరే కార్యక్రమం కోసం ప్రయాణించాల్సి ఉన్న ‘సింధురక్షక్’ ఈలోగా ప్రమాదానికి గురైంది. ఇది పెద్ద నష్టమే అయినా, భారత నావికాదళం తిరిగి త్వరలోనే పరిస్థితిని చక్కదిద్దగలదని నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ సుశీల్‌కుమార్ ఆశాభావం వ్యక్తంచేశారు. అంతర్గత పేలుడు వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని రిటైర్డ్ వైస్ అడ్మిరల్ ఏకే సింగ్ అన్నారు. ‘సింధు రక్షక్’ ప్రస్థానం 1980ల తొలినాళ్లలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రష్యా నుంచి ఈ జలాంతర్గామిని భారత్ కొనుగోలు చేసింది. డీజిల్ జనరేటర్లు-ఎలక్ట్రికల్ బ్యాటరీ శక్తితో పనిచేసే ఈ సబ్‌మెరైన్‌ను 1997లో భారత నౌకాదళంలో మోహరించారు. దీనికి రూ.400 కోట్లు ఖర్చయింది. దీని ఆధునీకీకరణ కోసం రష్యాకు చెందిన జెవ్దొచ్ఛాక్కా షిప్‌యార్డుతో భారత రక్షణ మంత్రి 2010 జూన్ 4న ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతకు కొద్దినెలల ముందే, 2010 ఫిబ్రవరిలో విశాఖపట్నం తీరం వద్ద ‘సింధురక్షక్’ అగ్నిప్రమాదానికి గురైంది. హైడ్రోజన్ లీకేజీ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు దర్యాప్తులో తేలింది. మరమ్మతులు, ఆధునికీకరణ కోసం రూ.450 కోట్లు వెచ్చించి దీనిని 2010 ఆగస్టులో రష్యాకు అప్పగించారు. క్లబ్-ఎస్ రకం క్షిపణులు, రేడియో లొకేటింగ్ రాడార్ సహా ఇతర పరికరాలతో రష్యా దీనిని మరింతగా ఆధునికీకరించి, 2013 జనవరి 27న భారత్‌కు అప్పగించింది. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 29న మళ్లీ నౌకాదళంలో మోహరించారు. భారత్‌కు మొత్తం 15 జలాంతర్గాములు ఉండగా.. అందులో 10 ఈ సింధుఘోష్ రకానివే. వాటిలో ఇప్పుడు ధ్వంసమైనది తొమ్మిదోది. -
దేశమాత సేవలో.. అమరుడైన రాజేష్
(కేవీపీ రామగుప్తా) పెదగంట్యాడ: మృత్యువు అతడిని వెంటాడింది. దేశమాత సేవలో పునీతుడు అవుదామని కుటుంబంలో చిన్న కుమారుడైనా సరే.. నౌకాదళంలో చేరాడు. తొలుత సెయిలర్గానే జీవితం ఆరంభించినా, పట్టుదలతో కరస్పాండెన్స్ పద్ధతిలో బీటెక్ పూర్తిచేసి, జలాంతర్గామిలో మెకానికల్ ఇంజనీర్‌గా పదోన్నతి పొందాడు. రెండు నెలల క్రితం వరకు కూడా విశాఖపట్నంలోనే పని చేసినా.. ఇటీవలే బదిలీపై ముంబై వెళ్లి, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. విశాఖజిల్లా పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు గ్రామానికి చెందిన తూతిక రాజేష్ (29), గోపాలపట్నానికి చెందిన దాసరి ప్రసాద్ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో రాజేష్‌కు రెండేళ్ల క్రితమే పెళ్లయింది. 2011 జూన్ 23వ తేదీన శ్రీకాకుళం జిల్లా బత్తిలి ప్రాంతానికి చెందిన జ్యోతిని ఆయన పెళ్లి చేసుకున్నారు. నెల్లిముప్పు గ్రామానికి చెందిన అప్పలనాయుడు, కృష్ణవేణి దంపతులకు మొత్తం ముగ్గురు పిల్లలు. వారిలో రాజేష్ అందరికంటే చిన్నవాడు. ఆయనకు రవికుమార్ అనే అన్నయ్య, రోజా అనే అక్క ఉన్నారు. పదేళ్ల క్రితం నౌకాదళంలో సెయిలర్‌గా చేరారు. ముంబైలో మొదటి పోస్టింగ్ లభించింది. ఐదారేళ్ల తర్వాత అతడికి విశాఖ పట్నానికి బదిలీ అయ్యింది. అప్పటినుంచి విశాఖలోనే ఉంటూ... దూరవిద్య పద్ధతిలో బీటెక్ చదివాడు. ఆ తర్వాత పదోన్నతి పొంది మెకానికల్ ఇంజనీర్ అయ్యాడు. రెండు నెలల క్రితం ముంబై బదిలీ కావడంతో భార్యతో సహా అక్కడకు వెళ్లాడు. ముంబైలోని నౌకాదళ క్వార్టర్స్‌లోనే నివాసం ఉంటున్నాడు. ఎంతో నిబద్ధతతో పనిచేసే రాజేష్.. బుధవారం తెల్లవారుజామున జరిగిన జలంతర్గామి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులతో పాటు ఈ ప్రాంత వాసులు కూడా కన్నీరు మున్నీరయ్యారు. -
ఐఎన్ఎస్ సింధురక్షక్ ప్రమాదం దృశ్యాలు
ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించి, పేలుడు కూడా జరగడంతో అది పూర్తిగా మునిగిపోయింది.అందులో ఉన్న 18 మంది సిబ్బంది పరిస్థితి ఏమైందో తెలుసుకోడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గురైన జలాంతర్గామి దాదాపు మునిగిపోగా.. కేవలం కొద్ది భాగం మాత్రమే పైకి కనిపిస్తోంది.జలాంతర్గామి పేలుడుపై విచారణకు నౌకాదళం ఆదేశించింది. -
ఐఎన్ఎస్ సింధురక్షక్ ప్రమాదంలో ఇద్దరు
-
సిబ్బంది ప్రాణాలు పోవడం బాధాకరం: ఆంటోనీ
దేశమాత సేవలో నౌకా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు. పార్లమెంటు వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడారు. ముంబైలో ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదం గురించిన వివరాలను ఆయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు బుధవారం తెలిపారు. సంఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించేందుకు ఆంటోనీ ముంబై వెళ్లనున్నారు. కాగా, భారత నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ డీకే జోషి కూడా ముంబై వెళ్లనున్నారు. ఆయన కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించి వివరాలు, వాస్తవాలు తెలుసుకుంటారు. ప్రమాదం జరగడానికి గల కారణాలేంటో తెలుసుకోడానికి నౌకాదళం ఇప్పటికే ఓ దర్యాప్తు కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదంలో ముగ్గురు అధికారులతో సహా 18 మంది మరణించినట్లు భావిస్తున్నారు. ముంబైలోని నావల్ డాక్‌యార్డులో బుధవారం తెల్లవారుజామున పేలుడు, అగ్నిప్రమాదం సంభవించి భారీ నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. -
ఐఎన్ఎస్ సింధురక్షక్ ప్రమాదంలో ఇద్దరు విశాఖవాసుల మృతి
ముంబైలో బుధవారం తెల్లవారుజామున జరిగిన జలాంతర్గామి ప్రమాదంలో విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు పెద్దగంట్యాడకు చెందిన రాజేష్ కాగా, మరొకరు గోపాలపట్నం వాసి దాసరి ప్రసాద్. వీరిలో రాజేష్ జలాంతర్గామిలో సూపర్వైజర్గా పనిచేస్తున్నట్లు తెలిసింది. బుధవారం తెల్లవారుజామున ముంబైలోని నేవల్ డాక్‌యార్డులో నిలిపి ఉన్న ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో మంటలు చెలరేగి, అది మునిగిపోవడం, భారీ పేలుడు సంభవించడంతో అందులో దాదాపు 18 మంది చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వీరిలో రాజేష్, దాసరి ప్రసాద్ కూడా ఉన్నట్లు విశాఖపట్నంలోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కొంతమంది సిబ్బంది సురక్షితంగా తప్పించుకున్నప్పటికీ.. రాజేష్, ప్రసాద్ మాత్రం మరణించినట్లు తెలియడంతో.. వారిద్దరి కుటుంబ సభ్యలు శోక సంద్రంలో మునిగిపోయారు. వారు ముంబై వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. భారత నౌకాదళానికి చెందిన కిలో క్లాస్ జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ సింధురక్షక్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం సంభవించింది. నావల్ డాక్ యార్డుతో పాటు ముంబై అగ్నిమాపక దళానికి కూడా చెందిన అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తెచ్చినట్లు నౌకాదళ అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణం ఏంటో తెలుసుకోడానికి ఒక బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీని నియమిస్తున్నట్లు అధికారులు చెప్పారు. జలాంతర్గామిలో మంటలు చెలరేగడంతో పాటు పేలుడు కూడా సంభవించడంతో జలాంతర్గామితో పాటు నౌకాదళ ఆస్తులకు కూడా తీవ్రనష్టం సంభవించింది. మంటలు, పొగలను అదుపుచేయడానికి ముంబై అగ్నిమాపక దళానికి, ముంబై పోర్టు ట్రస్టుకు చెందిన దాదాపు 16 అగ్నిమాపక వాహనాలను సంఘటన స్థలానికి తరలించారు. దక్షిణ ముంబైలోని చాలా ప్రాంతాల్లో ఈ పొగ ప్రభావం కనిపించింది. సెలవులో ఉండి గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన పి.ఎస్.రహాండలే అనే డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ముందుగా ఇక్కడి పేలుడు శబ్దాన్ని విన్నారు.ఆయన వెంటనే అగ్నిమాపక దళాన్ని, అత్యవసర సర్వీసుల విభాగాన్ని అప్రమత్తం చేయడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. -
ముంబాయి డాక్‌యార్డ్‌లో అగ్ని ప్రమాదం
-
రష్యాలో రీఫిటింగ్, ఆధునీకరణ.. అయినా తప్పని ప్రమాదం
ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదానికి కారణం ఏంటి? అది ఎన్నాళ్ల క్రితం జల ప్రవేశం చేసింది.. ఈ మధ్య కాలంలో దానికి మరమ్మతులు ఏమైనా జరిగాయా.. ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, భారత నౌకాదళానికి చెందిన డీజిల్-ఎలక్ట్రికల్ జలాంతర్గామి అయిన సింధురక్షక్‌కు ఇటీవలే రష్యాలోని జ్వెజ్డోచ్కా నౌకాశ్రయంలో రీఫిటింగ్ జరిగింది. ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి (ఎస్ 63)కి రీ ఫిటింగ్ చేసి, ఆధునీకరించాలన్న ఒప్పందం ఎప్పుడో 2010 జూన్ నెలలో జరిగింది. ఈ విషయాన్ని రియా నొవొట్స్కి అనే వార్తా సంస్థ తెలిపింది. రీఫిటింగ్లో భాగంగా ఇందులో క్లబ్-ఎస్ క్రూయిజ్ మిసైళ్లను, పదికి పైగా భారతీయ, విదేశీ రక్షణ వ్యవస్థలను, ఉషుస్ హైడ్రో-అకోస్టిక్ (సోనార్) వ్యవస్థను, సీఎస్ఎస్ -ఎంఎ-2 రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు జలాంతర్గామిలో ఉండే కూలింగ్ వ్యవస్థను కూడా సవరించారు. ఇలా మొత్తం సరికొత్త వ్యవస్థలు ఏర్పాటు చేయడం వల్ల జలాంతర్గామికి సైనిక సామర్థ్యం, భద్రత ఎక్కువ అవుతాయని అప్పట్లో పేర్కొన్నారు. ఈ ఒప్పందం కుదరడంతో ఆ తర్వాత దాన్ని రష్యాలోని అత్యంత పురాతనమైన నౌకాశ్రయాల్లో ఒకటైన జ్వెజ్డోచ్కా నౌకాశ్రయానికి తరలించారు. ఈ జలాంతర్గామిలో మొత్తం 52 మంది సిబ్బంది ఉంటారు. ఇది గంటకు గరిష్ఠంగా 19 నాటికల్ మైళ్ల (35 కిలోమీటర్ల) వేగంతో వెళ్తుంది, సముద్రంలో 300 మీటర్ల లోతున తిరుగుతుంది. గతంలో సింధువీర్, సింధురత్న, సింధుఘోష్, సింధుధ్వజ్ అనే నాలుగు జలాంతర్గాములకు కూడా జ్వెజ్డోచ్కా నౌకాశ్రయంలోనే రీఫిటింగ్ చేయించారు. -
జలాంతర్గామిలో ప్రమాదం.. 18 మంది సిబ్బంది గల్లంతు!
ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించి, పేలుడు కూడా జరగడంతో అది పూర్తిగా మునిగిపోయింది. అందులో ఉన్న 18 మంది సిబ్బంది పరిస్థితి ఏమైందో తెలుసుకోడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గురైన జలాంతర్గామి దాదాపు మునిగిపోగా.. కేవలం కొద్ది భాగం మాత్రమే పైకి కనిపిస్తోంది. జలాంతర్గామి పేలుడుపై విచారణకు నౌకాదళం ఆదేశించింది. భారత నౌకాదళానికి చెందిన కిలోక్లాస్ జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ సింధురక్షక్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం సంభవించింది. నావల్ డాక్ యార్డుతో పాటు ముంబై అగ్నిమాపక దళానికి కూడా చెందిన అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తెచ్చినట్లు నౌకాదళ అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణం ఏంటో తెలుసుకోడానికి ఒక బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీని నియమిస్తున్నట్లు అధికారులు చెప్పారు. పటిష్ఠమైన భద్రతా వలయంలో ఉండే నావల్ డాక్‌యార్డులో బుధవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో మంటలు చెలరేగడంతో ఈ పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో మృతుల సంఖ్య, ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు. తీవ్రంగా గాయపడిన కొంతమంది సిబ్బందిని మాత్రం కొలాబాలోని ఐఎన్హెచ్ఎస్ అశ్విని ఆస్పత్రికి తరలించారు. జలాంతర్గామిలో మంటలు చెలరేగడంతో పాటు పేలుడు కూడా సంభవించడంతో జలాంతర్గామితో పాటు నౌకాదళ ఆస్తులకు కూడా తీవ్రనష్టం సంభవించింది. మంటలు, పొగలను అదుపుచేయడానికి ముంబై అగ్నిమాపక దళానికి, ముంబై పోర్టు ట్రస్టుకు చెందిన దాదాపు 16 అగ్నిమాపక వాహనాలను సంఘటన స్థలానికి తరలించారు. దక్షిణ ముంబైలోని చాలా ప్రాంతాల్లో ఈ పొగ ప్రభావం కనిపించింది. సెలవులో ఉండి గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన పి.ఎస్.రహాండలే అనే డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ముందుగా ఇక్కడి పేలుడు శబ్దాన్ని విన్నారు.ఆయన వెంటనే అగ్నిమాపక దళాన్ని, అత్యవసర సర్వీసుల విభాగాన్ని అప్రమత్తం చేయడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది.