జలాంతర్గామిలో ప్రమాదం.. 18 మంది సిబ్బంది గల్లంతు!
ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించి, పేలుడు కూడా జరగడంతో అది పూర్తిగా మునిగిపోయింది. అందులో ఉన్న 18 మంది సిబ్బంది పరిస్థితి ఏమైందో తెలుసుకోడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ప్రమాదానికి గురైన జలాంతర్గామి దాదాపు మునిగిపోగా.. కేవలం కొద్ది భాగం మాత్రమే పైకి కనిపిస్తోంది. జలాంతర్గామి పేలుడుపై విచారణకు నౌకాదళం ఆదేశించింది. భారత నౌకాదళానికి చెందిన కిలోక్లాస్ జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ సింధురక్షక్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం సంభవించింది. నావల్ డాక్ యార్డుతో పాటు ముంబై అగ్నిమాపక దళానికి కూడా చెందిన అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తెచ్చినట్లు నౌకాదళ అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణం ఏంటో తెలుసుకోడానికి ఒక బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీని నియమిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
పటిష్ఠమైన భద్రతా వలయంలో ఉండే నావల్ డాక్యార్డులో బుధవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో మంటలు చెలరేగడంతో ఈ పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో మృతుల సంఖ్య, ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు. తీవ్రంగా గాయపడిన కొంతమంది సిబ్బందిని మాత్రం కొలాబాలోని ఐఎన్హెచ్ఎస్ అశ్విని ఆస్పత్రికి తరలించారు. జలాంతర్గామిలో మంటలు చెలరేగడంతో పాటు పేలుడు కూడా సంభవించడంతో జలాంతర్గామితో పాటు నౌకాదళ ఆస్తులకు కూడా తీవ్రనష్టం సంభవించింది. మంటలు, పొగలను అదుపుచేయడానికి ముంబై అగ్నిమాపక దళానికి, ముంబై పోర్టు ట్రస్టుకు చెందిన దాదాపు 16 అగ్నిమాపక వాహనాలను సంఘటన స్థలానికి తరలించారు. దక్షిణ ముంబైలోని చాలా ప్రాంతాల్లో ఈ పొగ ప్రభావం కనిపించింది.
సెలవులో ఉండి గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన పి.ఎస్.రహాండలే అనే డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ముందుగా ఇక్కడి పేలుడు శబ్దాన్ని విన్నారు.ఆయన వెంటనే అగ్నిమాపక దళాన్ని, అత్యవసర సర్వీసుల విభాగాన్ని అప్రమత్తం చేయడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది.