ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదానికి కారణం ఏంటి? అది ఎన్నాళ్ల క్రితం జల ప్రవేశం చేసింది.. ఈ మధ్య కాలంలో దానికి మరమ్మతులు ఏమైనా జరిగాయా.. ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, భారత నౌకాదళానికి చెందిన డీజిల్-ఎలక్ట్రికల్ జలాంతర్గామి అయిన సింధురక్షక్కు ఇటీవలే రష్యాలోని జ్వెజ్డోచ్కా నౌకాశ్రయంలో రీఫిటింగ్ జరిగింది.
ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి (ఎస్ 63)కి రీ ఫిటింగ్ చేసి, ఆధునీకరించాలన్న ఒప్పందం ఎప్పుడో 2010 జూన్ నెలలో జరిగింది. ఈ విషయాన్ని రియా నొవొట్స్కి అనే వార్తా సంస్థ తెలిపింది. రీఫిటింగ్లో భాగంగా ఇందులో క్లబ్-ఎస్ క్రూయిజ్ మిసైళ్లను, పదికి పైగా భారతీయ, విదేశీ రక్షణ వ్యవస్థలను, ఉషుస్ హైడ్రో-అకోస్టిక్ (సోనార్) వ్యవస్థను, సీఎస్ఎస్ -ఎంఎ-2 రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.
దీంతో పాటు జలాంతర్గామిలో ఉండే కూలింగ్ వ్యవస్థను కూడా సవరించారు. ఇలా మొత్తం సరికొత్త వ్యవస్థలు ఏర్పాటు చేయడం వల్ల జలాంతర్గామికి సైనిక సామర్థ్యం, భద్రత ఎక్కువ అవుతాయని అప్పట్లో పేర్కొన్నారు. ఈ ఒప్పందం కుదరడంతో ఆ తర్వాత దాన్ని రష్యాలోని అత్యంత పురాతనమైన నౌకాశ్రయాల్లో ఒకటైన జ్వెజ్డోచ్కా నౌకాశ్రయానికి తరలించారు. ఈ జలాంతర్గామిలో మొత్తం 52 మంది సిబ్బంది ఉంటారు. ఇది గంటకు గరిష్ఠంగా 19 నాటికల్ మైళ్ల (35 కిలోమీటర్ల) వేగంతో వెళ్తుంది, సముద్రంలో 300 మీటర్ల లోతున తిరుగుతుంది. గతంలో సింధువీర్, సింధురత్న, సింధుఘోష్, సింధుధ్వజ్ అనే నాలుగు జలాంతర్గాములకు కూడా జ్వెజ్డోచ్కా నౌకాశ్రయంలోనే రీఫిటింగ్ చేయించారు.
రష్యాలో రీఫిటింగ్, ఆధునీకరణ.. అయినా తప్పని ప్రమాదం
Published Wed, Aug 14 2013 9:24 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
Advertisement