ఐఎస్పై రష్యా ముమ్మరదాడి
మాస్కో: సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై రష్యా దాడులను తీవ్రం చేసింది. మంగళవారం మధ్యదరా సముద్రంలో మోహరించిన జలాంతర్గామినౌక నుంచి తొలిసారిగా క్షిపణులను ప్రయోగించి ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్టు రష్యా రక్షణ మంత్రి సెర్గె షోగు చెప్పారు. ఇంతకుముందు యుద్ధనౌకల నుంచి క్షిపణులతో దాడి చేసిన రష్యా.. తాజాగా సబ్మెరిన్ను కదనరంగంలోకి దింపింది.
'రోస్టోవ్-ఆన్-డాన్ సబ్మెరిన్ నుంచి కాలిబర్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించాం. సిరియాలోని రక్కా చుట్టుపక్కల ఉన్న ఉగ్రవాద స్థావాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా దాడులు జరిపాం. నిర్దేశిత లక్ష్యాలను ధ్వంసం చేశాం. ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న ఆయిల్ కంపెనీలు, యుద్ధ సామాగ్రి డిపోలు, గనుల ఫ్యాక్టరీలపై దాడులు చేశాం' అని రష్యా రక్షణ మంత్రి చెప్పారు. గత మూడు రోజులుగా రష్యా మిలటరీ జెట్స్ సిరియాలోని 300 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించారు.