ఐఎన్ఎస్ సింధురక్షక్ ప్రమాదంలో ఇద్దరు విశాఖవాసుల మృతి
ముంబైలో బుధవారం తెల్లవారుజామున జరిగిన జలాంతర్గామి ప్రమాదంలో విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు పెద్దగంట్యాడకు చెందిన రాజేష్ కాగా, మరొకరు గోపాలపట్నం వాసి దాసరి ప్రసాద్. వీరిలో రాజేష్ జలాంతర్గామిలో సూపర్వైజర్గా పనిచేస్తున్నట్లు తెలిసింది.
బుధవారం తెల్లవారుజామున ముంబైలోని నేవల్ డాక్యార్డులో నిలిపి ఉన్న ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో మంటలు చెలరేగి, అది మునిగిపోవడం, భారీ పేలుడు సంభవించడంతో అందులో దాదాపు 18 మంది చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వీరిలో రాజేష్, దాసరి ప్రసాద్ కూడా ఉన్నట్లు విశాఖపట్నంలోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కొంతమంది సిబ్బంది సురక్షితంగా తప్పించుకున్నప్పటికీ.. రాజేష్, ప్రసాద్ మాత్రం మరణించినట్లు తెలియడంతో.. వారిద్దరి కుటుంబ సభ్యలు శోక సంద్రంలో మునిగిపోయారు. వారు ముంబై వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు.
భారత నౌకాదళానికి చెందిన కిలో క్లాస్ జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ సింధురక్షక్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం సంభవించింది. నావల్ డాక్ యార్డుతో పాటు ముంబై అగ్నిమాపక దళానికి కూడా చెందిన అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తెచ్చినట్లు నౌకాదళ అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణం ఏంటో తెలుసుకోడానికి ఒక బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీని నియమిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
జలాంతర్గామిలో మంటలు చెలరేగడంతో పాటు పేలుడు కూడా సంభవించడంతో జలాంతర్గామితో పాటు నౌకాదళ ఆస్తులకు కూడా తీవ్రనష్టం సంభవించింది. మంటలు, పొగలను అదుపుచేయడానికి ముంబై అగ్నిమాపక దళానికి, ముంబై పోర్టు ట్రస్టుకు చెందిన దాదాపు 16 అగ్నిమాపక వాహనాలను సంఘటన స్థలానికి తరలించారు. దక్షిణ ముంబైలోని చాలా ప్రాంతాల్లో ఈ పొగ ప్రభావం కనిపించింది.
సెలవులో ఉండి గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన పి.ఎస్.రహాండలే అనే డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ముందుగా ఇక్కడి పేలుడు శబ్దాన్ని విన్నారు.ఆయన వెంటనే అగ్నిమాపక దళాన్ని, అత్యవసర సర్వీసుల విభాగాన్ని అప్రమత్తం చేయడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది.