Naval dock yard
-
రష్యా యుద్ధనౌకపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి..
మాస్కో: నోవోరోసిస్క్ లోని రష్యా నల్ల సముద్ర నౌకాదళ స్థావరంపై ఉక్రేనియన్ డ్రోన్ దాడికి పాల్పడిండి. ఈ దాడిలో రష్యా యుద్ధనౌక దారుణంగా దెబ్బతింది. దీంతో నౌకాశ్రయంలోని కార్యకలాపాలను నిలిపివేసినట్లు తెలిపింది కాస్పియన్ పైప్‌లైన్ కన్సార్టియం. ఈ దాడికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ ఇంటర్నెట్లో వైరలయ్యాయి. నిరంతరాయంగా కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ రష్యాను చావుదెబ్బ తీసింది. ప్రపంచ దేశాలకు చమురు తోపాటు ధాన్యాన్ని సరఫరా చేసే రష్యా నల్ల సముద్ర నౌకాదళ స్థావరంపై ఉక్రేనియన్ డ్రోన్ దాడి చేసింది. దాడిలో ఒలెనెగోర్స్కీ గోర్న్యాక్ అనే యుద్ధ నౌక తీవ్రస్థాయిలో దెబ్బతింది. డ్రోన్ల ద్వారా సుమారు 450 కిలోల టీఎన్టీని మోసుకెళ్లి ఓడను ఢీకొట్టినట్లు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ వర్గాలుప్రకటించాయి. దాడి సమయంలో యుద్ధనౌకపై సుమారు 100 మంది రష్యా సాయుధులు ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు. రాత్రిపూట జరిగినా కూడా డ్రోన్ కెమెరాలో దాడికి సంబంధించిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ వీడియాను ఉక్రెయిన్ బలగాలు మీడియాకు చేరవేశాయి. దాడి అనంతరం రష్యా బలగాలు రెండు సీ డ్రోన్ల సాయంతో బేస్ వెలుపల ఉక్రెయిన్ డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. దాడిలో జరిగిన నష్టం గురించి మాత్రం వారు ప్రస్తావించలేదు. ఉక్రెయిన్ రిటైర్డ్ నావికా దళాధిపతి ఆండ్రియ్ రైజంకో మాట్లాడుతూ ఈ దాడుల కోసం ఉక్రెయిన్ సముద్ర డ్రోన్లు దాదాపు 760 కిలోమీటర్లు ప్రయాణించి ఉంటాయని. ఉక్రెయిన్ డ్రోన్లు అంత దూరం ప్రయాణించడం ఇదే మొదటిసారని ఆయన అన్నారు. POV: you ram into a Russian landing warship as a little simple drone pic.twitter.com/u79u5A4Shb — Illia Ponomarenko 🇺🇦 (@IAPonomarenko) August 4, 2023 ఇది కూడా చదవండి: పుతిన్ శత్రువుపై మరిన్ని కేసులు.. ఎంత కాలం శిక్ష పడనుందో తెలుసా? -
‘గ్రీన్‌ఫీల్డ్’ను వ్యతిరేకిద్దాం!
భోగాపురం : మన గ్రామాలు, భూములను మనమే రక్షించుకుందాం. అంతా కలిసికట్టుగా గ్రీన్‌ఫీల్డ్‌ను వ్యతిరేకిద్దామని వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. ఆదివారం దల్లిపేట సమీప ంలో అఖిలపక్షం నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ప్రస్తుతం భూముల ధరలు పెర గడం, తీర ప్రాంతానికి, జాతీయ రహదారికి ఆనుకుని ఉండడం, అలాగే విశాఖకు చేరువలో ఉండడంతో ప్రభుత్వం దృష్టి ఎప్పటికప్పుడు మన ప్రాంతంపై పడడం మన దురదృష్టకరమన్నారు. ఒకవైపు మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సంతోషించాలో లేక మన భూము లు తీసుకుని మనల్ని నిరాశ్రయుల్ని చేస్తున్న విధానానికి బాధపడాలో అర్థం కావడం లేదని చెప్పారు. 2014 జనవరి 5న నావెల్‌డాక్ యార్డ్‌కి మన స్థలాలు సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను మనం ఏవిధంగా అడ్డుకున్నామో, ఇప్పుడు కూడా అదేవిధంగా ఎయిర్‌పోర్టు నిర్మాణా నికి వచ్చే అధికారులను అడ్డుకోవాలన్నారు. అప్పట్లో 2950 ఎకరాలు కావాలని కంచేరు, కంచేరుపాలెం, గూడెపువలస, బసవపాలెం రెవెన్యూ పరిధిలో ఉన్న గ్రామాలను, భూములను స్వాధీనం చేసుకునేందుకు అప్పటి యంత్రాంగం సిద్ధమైంది. దీనిపై 2014, జనవరి 26వ తేదీనహైకోర్టును ఆశ్రయించి ఇక్కడి ప్రజల ఇబ్బందులను వారి దృష్టికి తీసుకువెళ్లడంతో కోర్టు స్టేటస్కో ఇస్తూ రైతుల భూములు యధాతథంగా ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హైకోర్టు ఉత్తర్వులు సైతం ధిక్కరించి ఆ భూములతో పాటు అదనంగా మరో 13000 ఎకరాలు కావాలంటూ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు రావడం విచారకరమన్నారు. రైతులంతా గతంలోలా నిరసన తెలిపేందుకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. న్యాయబద్దంగా పోరాటం చేసి మన భూములను, గ్రామాలను కాపాడుకోవాలన్నారు. అనంతరం పలువు రు నాయకులు, రైతులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. అధికార పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఒక్కటిగా ఉద్యమించేందుకు ప్రణాళిక రూపొందించారు. ముందుగా నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, కేంద్రమంత్రి అశోక్, మంత్రి మృణాళిని దృష్టికి సమస్యను వినతిరూపంలో తీసుకువెళ్లి, అనంతరం వారు సానుకూలంగా స్పందించకపోయినట్లయితే వెంటనే ఉద్యమాలు నిర్వహించేందుకు అంతా సిద్ధం కావాలని తీర్మానించారు. టీడీపీ హయాంలోనే అభివృద్ధి గతంలో నాగరికత లేని మా గ్రామాలను అభివృద్ధి చేసింది ఎన్టీఆర్. మా గ్రామాలకు విద్యుత్, తాగునీరు, పాఠశాలలు, రోడ్లు ఆయన హయాం లోనే వచ్చాయి. తిరిగి అదే ప్రభుత్వం మా గ్రామాలను ఎయిర్‌పోర్టు పేరున లాక్కోవడం అన్యాయం. అధికార పార్టీ చెందిన వార మైనా దీన్ని అడ్డుకుంటాం. - దంతులూరి సూర్యనారాయణరాజు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ రాజధాని, ఎయిర్ పోర్టు ఒక్కటి కాదు తూళ్లురులో రాజధాని నిర్మాణానికి భూసేకరణ చేసినట్టు మన మండలంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూసేకరణ చేయడం సరైన పద్దతి కాదు. మన భూముల ధరలతో పోలిస్తే అక్కడ భూముల ధర చాలా తక్కువ. అలాగే రాజధాని అంటే అందరికీ అవసరమైనది. ఎయిర్‌పోర్టు అంటే ప్రైవేటు సంస్థ. కాబట్టి మా భూములు ఇచ్చేది లేదు. - ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, (కాంగ్రెస్), ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రభుత్వం తీరు సరికాదు హుద్‌హుద్ తుపాను తోటలు, పంటలను నాశనం చేస్తే, ప్రభుత్వం వచ్చి ఏకంగా గ్రామాలను, భూములను ఊడ్చుకుపోతుంది. ఇదెక్కడి న్యాయం. ముందు గా మన జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు మన సమస్యలపై విన్నవిద్దాం. వారు సానుకూలంగా స్పం దిస్తే సరేసరి, లేదంటే ఉద్యమాలు చేసైనా మన గ్రామాలను రక్షించుకుందాం. - కర్రోతు బంగార్రాజు, ఎంపీపీ -
విక్రాంత్ నుఅమరుల స్మారక చిహ్నంగా మార్చండి
న్యూఢిల్లీ : కాలం చెల్లిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను అమరుల స్మారక చిహ్నంగా మార్చాలని మహారాష్ట్ర నుంచి కొత్తగా ఎన్నికైన బీజేపీ, శివసేన ఎంపీల బృందం కేంద్రాన్ని కోరింది. ‘విక్రాంత్ ను కాపాడండి, దానిని యుద్ధ మ్యూజియం ‘అమరుల స్మారకం’గా మార్చండి. తుక్కుగా చేయాలన్న ప్రతిపాదనను ఆపేయండి. దారుఖానా చెత్త కేంద్రానికి తరలింపును నిలిపివేయండి. అమరుల స్మారక చిహ్నంగా మార్చే ప్రతిపాదనను మరోసారి పరిగణనలోకి తీసుకోండి’ అని రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్.కె.మాథుర్‌కు 18 మంది ఎంపీలు లేఖ రాశారు. 1997లో ఓడ సామర్థ్యం తగ్గిపోవడంతో దాని భవితవ్యం డోలాయమానంలో పడింది. ఒకప్పుడు దేశానికి ఎంతో గర్వ కారణమైన ఈ పాత ఓడను ముంబై నావికా డాక్ యార్డ్ నుంచి దారుఖానాలోని షిప్ బ్రేకింగ్ యార్డ్‌కు తరలించాలని మే 16న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. విక్రాంత్ యుద్ధ నౌక చాలా పురాతనమైపోయిందని, బాగా దెబ్బతిని శక్తి విహీనమైపోయిందని, దాన్ని మరమ్మతులు చేయడం సాధ్యంకాదని ప్రభుత్వం తెలిపిన తరువాత కోర్టు ఈ తీర్పు వెలువరించింది. దారుఖానా షిప్ బ్రేకింగ్ యార్డ్‌కు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త కిరణ్ పైగాంకర్ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లారు. విక్రాంత్‌ను మ్యూజియంగా మార్చాలని ఆయన తన పిటిషన్లో అభ్యర్థించారు. అతని అభ్యర్థనపై స్పందించిన కోర్టు, ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. యధాస్థితిని కొనసాగించాలని మే 5న చెప్పింది. అయితే దాన్ని తుక్కుగా చేయబోమని, భద్రత రీత్యా ఐఎన్ఎస్ విక్రాంత్‌ను వేరే ప్రాంతానికి మాత్రమే తరలిస్తామని ప్రభుత్వం చెప్పడంతో కోర్టు అందుకు అనుమతించింది. అయితే నిధుల కొరత వల్ల తాము మ్యూజియంను నిర్వహించలేమని ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలోనే వేలం వేసింది. 63 కోట్ల రూపాయలతో ఐబీ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ విక్రాంత్‌ను దక్కించుకుంది. -
‘సింధురక్షక్’ ఘటనపై బయటపడని కారణాలు
సాక్షి, ముంబై: అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉన్న ముంబైలోని నావల్ డాక్‌యార్డులో జరిగిన ‘సింధురక్షక్’ ఘటన కారణాలు ఇప్పటివరకు బహిర్గతం కాకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో భద్రతకు ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో స్వాతంత్య్ర దిన వేడుకలకు ఒక రోజు ముందు ఈ సంఘటన జరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన సాంకేతిక లోపాల కారణంగా జరిగిందా..? లేదా విద్రోహ చర్య...? అని ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఈప్రమాదం ముగ్గురు అధికారులతోపాటు మొత్తం 18 మంది గల్లంతయ్యారు. ఎట్టకేలకు శుక్రవారం ఉదయం గుర్తుపట్టరాని విధంగా ఉన్న మూడు మృతదేహాలను వెలికితీయగలిగారు. అయితే అక్కడి పరిస్థితి బట్టి చూస్తూ మిగిలిన 15 మంది కూడా ప్రాణాలతో ఉండే అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ ఇప్పటివరకు ప్రమాదానికి కారణాలు తెలుసుకోలేకపోవడం విస్మయం కలిగిస్తోందని కొందరు పేర్కొంటున్నారు. పాకిస్తాన్ చర్యలను పసిగట్టేందుకు..? భారత సరిహద్దులో ఓ వైపు చైనా, మరోవైపు పాకిస్తాన్ కయ్యానికి కాలుదువ్వుతున్న నేపథ్యంలో నౌకాదళం ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిని వినియోగించుకోవాలని భావించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే నిఘాకు అనుకూలంగా దీన్ని సిద్ధం చేస్తున్నారని తెలిసింది. దానికి ముందే ఇలా ప్రమాదం జరగడంతో అనేక కోణాల్లో దర్యాప్తు ప్రారంభమైనట్టు సమాచారం. అయితే అధికారికంగా మాత్రం ఎవరు ఎలాంటి వివరాలు తెలియపరచడంలేదు. -
ఐఎన్ఎస్ సింధురక్షక్ ప్రమాదం దృశ్యాలు
ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించి, పేలుడు కూడా జరగడంతో అది పూర్తిగా మునిగిపోయింది.అందులో ఉన్న 18 మంది సిబ్బంది పరిస్థితి ఏమైందో తెలుసుకోడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గురైన జలాంతర్గామి దాదాపు మునిగిపోగా.. కేవలం కొద్ది భాగం మాత్రమే పైకి కనిపిస్తోంది.జలాంతర్గామి పేలుడుపై విచారణకు నౌకాదళం ఆదేశించింది. -
జలాంతర్గామిలో ప్రమాదం.. 18 మంది సిబ్బంది గల్లంతు!
ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించి, పేలుడు కూడా జరగడంతో అది పూర్తిగా మునిగిపోయింది. అందులో ఉన్న 18 మంది సిబ్బంది పరిస్థితి ఏమైందో తెలుసుకోడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గురైన జలాంతర్గామి దాదాపు మునిగిపోగా.. కేవలం కొద్ది భాగం మాత్రమే పైకి కనిపిస్తోంది. జలాంతర్గామి పేలుడుపై విచారణకు నౌకాదళం ఆదేశించింది. భారత నౌకాదళానికి చెందిన కిలోక్లాస్ జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ సింధురక్షక్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం సంభవించింది. నావల్ డాక్ యార్డుతో పాటు ముంబై అగ్నిమాపక దళానికి కూడా చెందిన అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తెచ్చినట్లు నౌకాదళ అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణం ఏంటో తెలుసుకోడానికి ఒక బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీని నియమిస్తున్నట్లు అధికారులు చెప్పారు. పటిష్ఠమైన భద్రతా వలయంలో ఉండే నావల్ డాక్‌యార్డులో బుధవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో మంటలు చెలరేగడంతో ఈ పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో మృతుల సంఖ్య, ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు. తీవ్రంగా గాయపడిన కొంతమంది సిబ్బందిని మాత్రం కొలాబాలోని ఐఎన్హెచ్ఎస్ అశ్విని ఆస్పత్రికి తరలించారు. జలాంతర్గామిలో మంటలు చెలరేగడంతో పాటు పేలుడు కూడా సంభవించడంతో జలాంతర్గామితో పాటు నౌకాదళ ఆస్తులకు కూడా తీవ్రనష్టం సంభవించింది. మంటలు, పొగలను అదుపుచేయడానికి ముంబై అగ్నిమాపక దళానికి, ముంబై పోర్టు ట్రస్టుకు చెందిన దాదాపు 16 అగ్నిమాపక వాహనాలను సంఘటన స్థలానికి తరలించారు. దక్షిణ ముంబైలోని చాలా ప్రాంతాల్లో ఈ పొగ ప్రభావం కనిపించింది. సెలవులో ఉండి గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన పి.ఎస్.రహాండలే అనే డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ముందుగా ఇక్కడి పేలుడు శబ్దాన్ని విన్నారు.ఆయన వెంటనే అగ్నిమాపక దళాన్ని, అత్యవసర సర్వీసుల విభాగాన్ని అప్రమత్తం చేయడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది.