అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉన్న ముంబైలోని నావల్ డాక్‌యార్డులో జరిగిన ‘సింధురక్షక్’ ఘటన కారణాలు ఇప్పటివరకు బహిర్గతం కాకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
సాక్షి, ముంబై: అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉన్న ముంబైలోని నావల్ డాక్‌యార్డులో జరిగిన ‘సింధురక్షక్’ ఘటన కారణాలు ఇప్పటివరకు బహిర్గతం కాకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో భద్రతకు ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో స్వాతంత్య్ర దిన వేడుకలకు ఒక రోజు ముందు ఈ సంఘటన జరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన సాంకేతిక లోపాల కారణంగా జరిగిందా..? లేదా విద్రోహ చర్య...? అని ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఈప్రమాదం ముగ్గురు అధికారులతోపాటు మొత్తం 18 మంది గల్లంతయ్యారు. ఎట్టకేలకు శుక్రవారం ఉదయం గుర్తుపట్టరాని విధంగా ఉన్న మూడు మృతదేహాలను వెలికితీయగలిగారు. అయితే అక్కడి పరిస్థితి బట్టి చూస్తూ మిగిలిన 15 మంది కూడా ప్రాణాలతో ఉండే అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ ఇప్పటివరకు ప్రమాదానికి కారణాలు తెలుసుకోలేకపోవడం విస్మయం కలిగిస్తోందని కొందరు పేర్కొంటున్నారు.
పాకిస్తాన్ చర్యలను పసిగట్టేందుకు..?
భారత సరిహద్దులో ఓ వైపు చైనా, మరోవైపు పాకిస్తాన్ కయ్యానికి కాలుదువ్వుతున్న నేపథ్యంలో నౌకాదళం ఐఎన్‌ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిని వినియోగించుకోవాలని భావించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే నిఘాకు అనుకూలంగా దీన్ని సిద్ధం చేస్తున్నారని తెలిసింది. దానికి ముందే ఇలా ప్రమాదం జరగడంతో అనేక కోణాల్లో దర్యాప్తు ప్రారంభమైనట్టు సమాచారం. అయితే అధికారికంగా మాత్రం ఎవరు ఎలాంటి వివరాలు తెలియపరచడంలేదు.