
లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించిన ‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) సింగింగ్ షో ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతుంది. బాలు గారి మరణానంతరం ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల మొదలైన ఈ షో సిల్వర్ జూబ్లీ సిరీస్‌కి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్, సింగర్ సునీత జడ్జీలుగా ఉన్నారు. సింగింగ్ రియాల్టీ షోలలో ముందంజలో ఉన్న ‘పాడుతా తీయగా’పై గాయని ప్రవస్తి ఆరాధ్య(Pravasthi Aradhya ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ షో న్యాయంగా జరగడం లేదని, టాలెంట్ ఉన్నవాళ్లను కాకుండా నచ్చిన వాళ్లను విజేతలుగా చేస్తున్నారని ఆరోపించారు. ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన ప్రవస్తి.. తాజాగా య్యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేస్తూ..కీరవాణి(M. M. Keeravani), సునీత, చంద్రబోస్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జి సీట్లలో కూర్చొని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు తనను మెంటల్‌గా హింసించారని, బాడీ షేమింగ్ చేశారని ఆరోపించారు.
‘మ్యూజిక్ ఫిల్డ్ నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో పెద్ద పెద్ద వాళ్ల పేర్లును ప్రస్తావించాను కాబట్టి నాకు ఎలాగో అవకాశాలు రావు. కానీ మీఅందరికి నిజం తెలియాలని ధైర్యంతో ఈ వీడియో చేశాను. పాడుతా తీయగా ప్రోగ్రామ్‌లో పాల్గొన్న నన్ను జడ్జీలు(కీరవాణి, చంద్రబోస్, సునీత) మెంటల్‌గా హింసించి, అన్యాయంగా ఎలిమేట్ చేశారు.
ముందుగా సునీత(Sunitha) గురించి చెబుతా. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా నేను స్టేజ్ మీదకు రాగానే ఆమె ముఖం అదోలా పెట్టేవారు. నా ఫ్యాన్స్ కూడా నన్ను అడిగారు. ఆమెతో మీకేమైనా గొడవ జరిగిందా అని మెసేజ్ చేశారు. కానీ నేను అది నమ్మలేదు. కానీ అంతరామమయం పాడే ముందు నేను గమనించాను. ఆమెకు నేనంటే నచ్చదు. అందుకే తప్పు లేకున్నా నెగెటివ్ కామెంట్స్ చేసేవారు. ఓ సారి మైక్ ఆన్‌లో లేదని అనుకొని ‘ఈ అమ్మాయికి హైపిచ్ రాదు కానీ మ్యానేజ్ చేస్తుంది చూడు’ అని కీరవాణికి చెప్పారు. నాకు ఏడుపు వచ్చింది. కానీ తట్టుకొని అంతరామమయం పాడాను. చాలా మంది మెచ్చుకున్నారు. కానీ ఆమె మాత్రం నెగెటివ్ కామెంట్స్ చేశారు. కానీ మిగతావారు పాడినప్పుడు మాత్రం తప్పులు జరిగితే సైగలు చేసేవారు.
ఇక చంద్రబోస్(chandrabose) గారు.. లిరిక్స్ తప్పులు ఉంటే ఆయన చెప్పాలి. మొదటి రెండు ఎపిసోడ్స్ నన్ను మెచ్చుకున్నారు. లిరిక్స్‌లో తప్పులు దొరకపోవడంతో నన్ను మరోలా వేధించారు.
కీరవాణి.. ఆయన నుంచి నెగెటివ్ కామెంట్స్ రాలేదు. కానీ సెట్‌లో ఎలా మాట్లాడతారో చెబుతాను. మెలోడీ పాడిన వారికి ఎక్కువ మార్కులు ఇస్తానని చెబుతారు. ఆయన కంపోజ్ చేసిన పాటలు పాడితే మంచి మార్కులు వేస్తారు. డబ్బుల కోసం నేను వెడ్డింగ్ షోస్ చేయాల్సి వచ్చిందని గతంలో చెప్పాను. ఈ పాయింట్‌పై కీరవాణి మాట్లాడుతూ.. ‘వెడ్డింగ్ షోస్ చేసేవాళ్లు నా దృష్టిలో సింగర్సే కాదు. వాళ్లంటే నాకు అసహ్యం’ అని అన్నారు. అది చాలా హర్టింగ్‌గా అనిపించింది. అలాగే పాడుతా తీయగాలో ఐదో ఫ్రైజ్ సాధించినవాళ్లను నా దగ్గరకు వచ్చి చాకిరీ చేసేవాళ్ల గ్రూప్‌లో చేర్చుకుంటానని చెప్పారు. చాకిరీ అనే పదం వాడినందుకు నాకు బాధగా అనిపించింది. జడ్జీలు వివక్ష చూపడం, నన్ను చీడ పురుగులా చూడడం, నా బాడీ మీద జోకులు చేయడం..నన్ను మెంటల్‌గా ఎఫెక్ట్ అయ్యేలా చేశాయి.
పొడ్రక్షన్ వాళ్లు కూడా మమ్మల్ని అవమానించారు. చీరలు ఇచ్చి బొడ్డు కిందకు కట్టుకో, ఎక్స్‌ఫోజింగ్ చేయాలి అన్నట్లుగా చెప్పారు. చాలా సార్లు తిట్టారు. బాడీ షేమింగ్ చేశారు. ‘ఇలాంటి బాడీకి ఇంకేం ఇవ్వగలను’ అని కాస్ట్యూమ్ డిజైనర్ అన్నారు. వీళ్ల మాటల వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. బాలు సార్ ఉన్నప్పుడు ఇలాంటివి జరిగేవి కాదు. ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్స్ వచ్చిందో పాడుతా తీయగా ఇలా మారిపోయింది. డ్యాన్సులు చేయమని, కుల్లు జోకులు చేయమని చెప్పారు.
ఇక నా ఎలిమినేషన్ రోజు ఏం జరిగిందో చెబుతాను. ఆ రోజు టాప్ 1 వచ్చిన అమ్మాయి చంద్రబోస్ గారి పాట పాడింది. లిరిక్స్ మరిచిపోయినా చంద్రబోస్ గారు కామెంట్స్‌లో అది చెప్పలేదు. ఇంకో అబ్బాయి కీరవాణి పాట పాడితే స్కోర్ ఎక్కువ వేశారు. ఎలిమేషన్ రౌండ్‌లో జరిగింది ఇది. ఎలిమినేషన్ జరిగినప్పుడు కీరవాణి, చంద్రబోస్ అక్కడ నుంచి లేచి వెళ్లిపోయారు. సునీత మాత్రం అక్కడే నవ్వుతూ కూర్చున్నారు. ఎలిమేట్ అయ్యాక.. నేను ఎమోషనల్ అయ్యాను. మా అమ్మ సునీత దగ్గరకు వచ్చి ‘ఎందుకు ఇంత అన్యాయం చేశారు’ అని అడిగితే..‘నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో’అని సీరియస్‌గా అన్నారు. నేను చాలా షోస్ చేశాను కానీ ఏ జడ్జి కూడా ఇలా మాట్లాడలేదు.
నేను ఈ కెరీయర్ వదిలేద్దామని డిసైడ్ అయ్యాకే ఈ వీడియో చేశాను. పెద్ద పెద్ద వాళ్ల పేర్లు బయటపెట్టాను. నాకు ఎలాగో అవకాశం రాదు. మీ అందరికి చెప్పేది ఒక్కటే ఇలాంటి ఫేక్ షోస్ చూడడం మానేయండి. నాలాగే చాలా మంది సఫర్ అయ్యారు. జడ్జిలు ఆ సీటులో కూర్చొని అన్యాయం చేసి సరస్వతి దేవిని అవమానించకండి. చిత్రమ్మ, మనోగారు, శైలజగారు ఉంటే చాలా బాగుంటుంది. మాలాంటి జీవితాలతో ఆడుకోకండి. నాకు ఏమైనా అయినా, నా ఫ్యామిలీకి ఏమైనా జరిగినా కీరవాణి, చంద్రబోస్, సునీతతో పాటు జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్లదే బాధ్యత’ అని సింగర్ ప్రవస్తి పేర్కొంది.