
ఐదేళ్ల వయసులోనే పాటలు పాడటం మొదలుపెట్టింది ప్రవస్తి ఆరాధ్య (Pravasthi Aradhya). సరిగమప లిటిల్ ఛాంప్స్ రియాలిటీ షోలో విజేతగానూ నిలిచింది. చిన్నతనంలోనే పాడుతా తీయగా ప్రోగ్రాంలో పాల్గొంది. తెలుగు, తమిళ భాషల్లో పలు రియాలిటీ షోలలో పాల్గొంది. ఇటీవల మరోసారి పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ షోలో పార్టిసిపేట్ చేసింది. ఈ షో నుంచి ఇటీవలే ఎలిమినేట్ అయిన ప్రవస్తి.. తనపై జడ్జిలు సునీత, కీరవాణి, చంద్రబోస్ వివక్ష చూపించారని ఆరోపించింది.
సింగింగ్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్
తననొక చీడపురుగులా చూస్తూ ఆత్మస్థైర్యంపై దెబ్బకొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. షో నిర్మాతలు కూడా కొన్నిసార్లు సరైన డ్రెస్సులు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టేవారంది. షోలో జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన తనకు ఇక భవిష్యత్తు ఉండదని అర్థమై గాయనిగా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించింది. అయితే పాటలంటే ప్రాణమున్న నువ్వు సంగీతాన్ని విడిచిపెట్టొద్దని.. సింగర్‌గా కొనసాగాలని గాయని మాళవిక (Singer Malavika) అభ్యర్థించింది.
కష్టమంతా బూడిదపాలు
అందుకు ప్రవస్తి స్పందిస్తూ.. నాపై విషం కక్కుతూ ఉంటే ఇంకా ఈ ఫీల్డ్‌లో ఎలా కొనసాగగలను? మీరందరూ నేను పాడాలని కోరుకుంటున్నారు. కానీ నా కష్టం, ప్రతిభ అంతా బూడిదలో కలిసిపోతుంటే ఎలా తట్టుకోగలను? వివక్ష చూపిస్తుంటే ఎలా భరించగలను? అని ప్రశ్నించింది. మరోవైపు ప్రవస్తిపై సింగర్ హారిణి ఇవటూరి (Harini Ivaturi) ఆగ్రహం వ్యక్తం చేసింది. నీ డ్రామాలు చాలు.. ప్రశంసల కోసం పాకులాడినప్పుడు విమర్శలు స్వీకరించే ధైర్యం కూడా ఉండాలి.
చదవండి: 'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీ
ఇంకా ఎంతవరకు లాగుతావ్?
పాడుతా తీయగా షోలో చాలా ఎపిసోడ్లు చూశాను. కొన్ని చోట్ల నిన్ను నువ్వు ఇంకా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నీ పొరపాట్లను సరిదిద్దుకోవడం మానేసి అనుభవజ్ఞులైన జడ్జిలను ప్రశ్నిస్తున్నావా? నీకేదైనా అన్యాయం జరిగిందంటే అది షోలోనే తేల్చుకోవాలి. షో అయిపోయాక ఇలా పబ్లిక్‌లో మాట్లాడటం సరికాదు. జడ్జిల క్యారెక్టర్లను తప్పుపట్టడం అన్యాయం. నువ్వు నిరాశలో ఉన్నావని... దాన్ని ఇలా లాగుతూనే ఉంటావా? నీకు నిజంగా దమ్ముంటే వారితోనే నేరుగా మాట్లాడతావ్.
టాలెంట్‌తోనే ఆన్సర్..
ఇంత రచ్చ చేసి ఏం సాధించాలనుకుంటున్నావో నాకు తెలియట్లేదు. నీకంత బాధ ఉంటే నీ టాలెంట్‌తోనే సమాధానం చెప్పాలి. నా సొంత అనుభవమే చెప్తా.. ఒకసారి చివరి నిమిషంలో నేను పాడాల్సిన పాట మార్చేశారు. అయినా సరే దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని పాడా.. బెస్ట్ పర్ఫామెన్స్ గెలుచుకున్నా! ఛాలెంజ్‌లు లేకుంటే మన ఎదుగుదల ఆగిపోతుంది. రియాలిటీ షోలలో ఒత్తిడి భరించలేకపోతున్నావంటే అవి నీకు సెట్టవవు. నీకేదైనా డ్రెస్ నచ్చలేదంటే అప్పుడే ముక్కుసూటిగా చెప్పేయాలి.
అప్పుడే పోరాడాల్సింది
అంతేకానీ ఇప్పుడెందుకు చెప్పడం? నీ ఎలిమినేషన్ అప్పుడు మీ తల్లి.. జడ్జిలతో ఎంత గట్టిగా మాట్లాడిందో.. నీకు జరుగుతున్న బాడీ షేమింగ్ గురించి మేనేజ్‌మెంట్ దగ్గర అంతే గట్టిగా చెప్పాల్సింది. ఇప్పుడు ప్రదర్శిస్తున్న ధైర్యం అప్పుడేమైంది. పబ్లిక్‌గా వాళ్లను విమర్శించడం దేనికి? అని ఆగ్రహించింది. ఈ పోస్ట్‌పై ప్రవస్తి స్పందిస్తూ.. అక్కా, దయచేసి నా బాధను డ్రామా అని పిలవొద్దు. నేను పిరికిదాన్ని అని కూడా అన్నారు. నిజంగా పిరికిదాన్నయితే పవర్‌ఫుల్ వ్యక్తుల గురించి మాట్లాడను. నేరుగా మాట్లాడొచ్చుగా అని ఇంకో పాయింట్ అన్నారు.
నాకు ఛాన్స్ ఇస్తేగా!
వాళ్లు నాకు అవకాశం ఇస్తే కదా నేరుగా మాట్లాడేది. స్టేజీ మీద ఉన్నప్పుడు నేను అడిగే ప్రశ్నలకు వాళ్లు ఏ సమాధానం చెప్పలేదు. నిజంగా పిరికిదాన్నయితే మీరందరూ నాకు వ్యతిరేకంగా మారిపోతారని తెలిసి కూడా ఇలా బయటకు వచ్చి మాట్లాడేదాన్ని కాదు కదా! అని కౌంటర్ ఇచ్చింది. అలాగే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తనకు జరిగిన ఓ మంచిని సైతం పొందుపరిచింది. ఇండస్ట్రీలో చెడు ఉన్నట్లే మంచి కూడా ఉందని పేర్కొంది. సంగీత దర్శకుడు తమన్ 'బ్రో' మూవీలో ఇతర సింగర్స్‌తో కలిసి వెనకాల కోరస్ పాడే అవకాశం ఇచ్చారని పేర్కొంది.
