నా ఇరవయ్యేళ్ల ఆకాంక్ష నెరవేరింది | Vijay Devarakonda Sepeech At Retro Pre Release Event | Sakshi
Sakshi News home page

నా ఇరవయ్యేళ్ల ఆకాంక్ష నెరవేరింది

Published Sun, Apr 27 2025 6:29 AM | Last Updated on Sun, Apr 27 2025 6:30 AM

Vijay Devarakonda Sepeech At Retro Pre Release Event

– విజయ్‌ దేవరకొండ 

‘‘నేను యాక్టర్‌ కావాలనుకున్నప్పుడు సూర్య అన్నని కలవాలనుకునేవాణ్ణి. ‘గజినీ’ సినిమా చూసి.. ఆ బాడీ ఏంటి? డ్యాన్స్‌ ఏంటి? నటన ఏంటి? ఏం చేస్తే ఇవన్నీ వస్తాయో తెలుసుకునేందుకు ఆయన్ని కలవాలని చాలాసార్లు అనిపించేది. కలవాలనే కోరిక ఉన్నా కలవలేకపోయాను. నా ఇరవయ్యేళ్ల ఆకాంక్ష నెరవేర్చిన ఈ మూమెంట్, ఈ ‘రెట్రో’ సినిమా నా జీవితంలో మరపురాని అనుభూతి’’ అని హీరో విజయ్‌ దేవరకొండ చెప్పారు.

 సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రెట్రో’. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించారు. జ్యోతిక, సూర్య నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ రిలీజ్‌ చేస్తోంది. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘రెట్రో’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ–‘‘కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో తమ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న వారందరికీ ఒక మాట చెబుతున్నాను.. మేమంతా మీకు అండగా ఉంటాం. నా లైఫ్‌లో ఒక సినిమాటిక్‌ మెమొరీ అంటే ‘చంచల...’ (సూర్య నటించిన ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ సినిమా) పాట వచ్చినప్పుడు... ఆ రోజు నాకు కలిగిన అనుభూతిని ఈరోజు వరకు మరచిపోలేదు. ఇప్పటికీ ఆ పాటని వింటూ నా బాల్యంలోకి వెళుతుంటాను. 

నాకు ‘పెళ్ళిచూపులు, అర్జున్‌ రెడ్డి’ సినిమాలతో కొంచెం డబ్బు చూసినప్పటి నుంచి చదువుకునేవారి కోసం ఏదైనా చేయాలనే కోరిక ఉండి.. చిన్నగా ట్రై చేశాను. కానీ, పదిహేనేళ్లుగా సూర్య అన్న ‘అగరం ఫౌండేషన్‌’ ద్వారా వేలమంది చదువుకి ఆర్థిక చేయూతనిస్తూ, ఉద్యోగాలు ఇప్పిస్తుండటం చాలా గొప్ప. ఆయన స్ఫూర్తితో ఈ ఏడాది నేను కూడా విద్యార్థులతో ఓ కమ్యూనిటీ ఏర్పరచి వారికి చేయూతనిస్తాం. ఇక కశ్మీర్‌ మనదే.. కశ్మీరీయులు మనవారే. ఇండియా.. పాకిస్తాన్‌ మీద దాడి చేయాల్సిన పనే లేదు. ఈ దాడులు ఇలానే కొనసాగితే పాకిస్తాన్‌ వాళ్లకే విరక్తి వచ్చి వారి ప్రభుత్వంపై దాడి చేస్తారు. ఇక ‘రెట్రో’ సినిమాని నేను థియేటర్లో చూస్తాను. మీరు కూడా చూసి ఎంజాయ్‌ చేస్తారనుకుంటున్నాను’’ అన్నారు.

 సూర్య మాట్లాడుతూ–‘‘కశ్మీర్‌ ఉగ్రవాదుల దాడిలోప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకుశాంతి చేకూరాలి. ఇలాంటి సంఘటన మళ్లీ ఎప్పుడూ జరగకూడదు. ‘రెట్రో’లో లవ్, కామెడీ, యాక్షన్, ఇంటెన్సిటీ.. అన్నీ ఉంటాయి. ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది. నాగవంశీగారిది లక్కీ హ్యాండ్‌ అంటుంటారు. నా తదుపరి చిత్రాన్ని నాగవంశీగారి నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నాను. మే 1న విడుదలవుతున్న నాని ‘హిట్‌–3’ కూడా విజయం సాధించాలి. విజయ్‌ ‘కింగ్‌ డమ్‌’ సినిమా కూడా సక్సెస్‌ కావాలి. ‘అగరం ఫౌండేషన్‌’ గురించి విజయ్‌ మాట్లాడాడు.. అయితే చిరంజీవిగారి బ్లడ్‌ బ్యాంక్‌ నా సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. మా ‘అగరం ఫౌండేషన్‌’కి ఎందరో తెలుగువారు అండగా ఉన్నారు’’ అన్నారు. 

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ–‘‘రెట్రో’ సినిమాని తెలుగులో పంపిణీ చేసే అవకాశం ఇచ్చిన సూర్య సర్‌కి థ్యాంక్స్‌. ఈ సినిమాతో మీకు ఇక్కడ బ్లాక్‌ బస్టర్‌ ఇస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ వేడుకలో ‘రెట్రో’ చిత్ర సహ నిర్మాత కార్తికేయన్‌ సంతానం, డైరెక్టర్‌ వెంకీ అట్లూరి, పాటల రచయిత కాసర్ల శ్యాం, నటుడు కరుణాకరన్‌ మాట్లాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement