Mirza Abbas Ali Opens Up About His Fight With Vishal - Sakshi
Sakshi News home page

Abbas And Vishal: విశాల్‌ చాలమందిని పాడు చేశాడు.. తమిళ హీరోలపై సెన్సేషనల్‌ కామెంట్లు చేసిన అబ్బాస్‌

Published Mon, Aug 7 2023 4:24 PM | Last Updated on Mon, Aug 7 2023 5:07 PM

Abbas Open With Vishal Issue - Sakshi

ప్రేమదేశం సినిమా సూపర్‌ హిట్‌ కాగానే అబ్బాస్‌పై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అప్పట్లో అబ్బాస్‌ కటింగ్‌ చేయండని సెలూన్‌ షాపుల్లో యూత్‌ క్యూ కట్టేవారు. అబ్బాస్ రొమాంటిక్ హీరోగా మారతాడని అంతా అనుకున్నారు. కానీ అబ్బాస్ కెరీర్ మాత్రం ఆశించిన స్థాయిలో లేకుండా కొన్ని సినిమాలతోనే ఫుల్‌స్టాప్‌ పడిపోయింది. ప్రేమదేశం తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించలేదు. చేసేదేమి లేక కుటుంబం కోసం చివరికి సహాయక పాత్రలలో నటించడం ఆయన కొనసాగించాడు. అలా అబ్బాస్ ఎక్కువ కాలం సినిమాల్లో కొనసాగలేదు.

(ఇదీ చదవండి: బిగ్‌ హీరోతో సినిమా ఛాన్స్‌.. ఈ ఒక్క కారణంతో నన్ను తొలగించారు: యంగ్‌ హీరోయిన్‌)

తర్వాత తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్లి అక్కడ కొత్త జీవితాన్ని గడిపాడు. అబ్బాస్ ఎలాంటి సెలబ్రిటీ గుర్తింపు లేకుండా పూర్తిగా సాధారణ వ్యక్తిగా ఇక్కడ జీవించాడు. విదేశాల్లో పెట్రోల్ పంప్ వర్క్, ట్యాక్సీ డ్రైవింగ్, నిర్మాణం వంటి ఉద్యోగాలు చేశానని అబ్బాస్ బాహాటంగానే చెప్పాడు. తాజాగ ఇండియాకు తిరిగొచ్చిన అబ్బాస్‌ ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఒక ఇంటర్వ్యూలో తమిళ స్టార్‌ హీరోల గురించి అబ్బాస్ చెప్పిన మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అజిత్, విజయ్, సూర్య, విశాల్ తదితరుల గురించి అబ్బాస్ ఇలా మాట్లాడారు. 

అజిత్‌ను వైద్యలు కూడా హెచ్చరించారు కానీ 
అజిత్‌కు మంచి వ్యక్తిత్వం ఉందని అబ్బాస్ చెప్పారు. ఒకరకంగా అజిత్‌ తనలాంటి వాడేనని ఆయన అన్నారు. అజిత్‌ ఏదైన ఒక విషయంపై మాట్లాడితే అవి కత్తిపై చెక్కర పూసిన మాదిరి ఉండవు. ఎలాంటి టాపిక్‌పైనా కానివ్వండి సూటిగా ప్రతిస్పందిస్తాడని అబ్బాస్‌ ఇలా పంచుకున్నారు.

'అతను మూర్ఖత్వాన్ని సహించడు. అతనిలో ఏ హీరోలో కనిపించని ఉత్సాహం ఉంది. అతనికి ఇప్పటికే అనేక శస్త్రచికిత్సలు జరిగాయి. వైద్యులు పక్షవాతం వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరించినప్పటికీ అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నాడు. అతనిలో అభిమానుల పట్ల అచంచలమైన అంకితభావం ఉంది. అందుకే అజిత్‌ను ఫ్యాన్స్‌ అంతగా ఇష్టపడుతారు. వారి ప్రేమే అయన్ను ముందుకు నడిపిస్తుంది.' అని అజిత్‌ గురించి అబ్బాస్‌ అన్నారు.

విజయ్‌ సినిమాలంటే ఇష్టం లేదు: అ‍బ్బాస్‌
విజయ్ మృదుస్వభావి... డౌన్‌టు ఎర్త్‌గా ఇప్పటికీ ఆలాగే ఉన్నాడు. అతను ఏదైనా అతిగా చేయడు. అయితే మంచి హాస్యం కలవాడని అబ్బాస్ పేర్కొన్నాడు. మొదట్లో విజయ్ సినిమాలంటే ఇష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అతని సినిమాలంటే చాలా ఇష్టమని ఆయన చెప్పాడు. తన సినిమాలు సమాజానికి మంచి సందేశాలు ఇస్తాయని అబ్బాస్ అభిప్రాయపడ్డారు. 

సూర్యను నడిపించే శక్తి ఎవరంటే: అబ్బాస్‌
సూర్య గురించి, అబ్బాస్ ఇలా అన్నాడు 'సూర్య తన తొలి చిత్రం 'నెరుక్కు నెర్' నుంచి నాకు తెలుసు. సినిమా కెరీయర్‌ ప్రారంభంలో అతనిలో చాలా సిగ్గు కనిపించేది. కెమెరా ముందుకు అంత ఈజీగా వచ్చేవాడు కాదు. కానీ రానురాను అతని జీవితంలో అద్భుతమైన పరివర్తనను చూడటం నిజంగా ఆకర్షణీయంగా ఉంది. సినిమాలను ఎంపిక చేసుకోవడంలో సూర్య అద్భుతం, పని పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి గురించి ఎంత చెప్పినా తక్కువే.

సూర్య విజయానికి జ్యోతిక సపోర్ట్ పెద్ద కారణం. సూర్య నిస్సందేహంగా చెప్పుకోదగ్గ వ్యక్తి అయినప్పటికీ, అతని విజయం వెనుక జ్యోతిక అనే శక్తి ఉందని స్పష్టంగా తెలుస్తుంది. నటీనటులందరికీ ఆయన బెంచ్‌మార్క్‌.' అని సూర్య గురించి అ‍బ్బాస్‌ అన్నారు.

విశాల్‌పై అబ్బాస్ పగ
చాలా ఏళ్ల క్రితం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విషయంలో విశాల్‌తో గొడవ జరిగిందని అబ్బాస్‌ మొదటిసారి రివీల్‌ చేశాడు. 'నా పట్ల విశాల్‌ వ్యవహరించిన తీరుతో  చాలా కోపం వచ్చింది. అతను చేసిన పనికి నేను ఎప్పుడో క్షమించాను కూడా. ఇప్పుడు ఎక్కడైనా ఎదురుపడితే  హాయ్ అని కూడా చెబుతాను. కానీ విశాల్‌తో మాత్రం ఎప్పటికీ సన్నిహితంగా ఉండను. సినిమా పరిశ్రమలో బలమైన బంధాన్ని పెంపొందించుకోవడం నా నిరంతర లక్ష్యం. కానీ విశాల్‌ విషయంలో అది జరగదు. సినీ పరిశ్రమలోని నటులందరూ ఒకేతాటిపైకి తెచ్చేందుకే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభానికి దారితీసింది.

(ఇదీ చదవండి: గుండెపోటుతో ప్రముఖ హీరో భార్య మృతి.. దిగ్భ్రాంతి చెందిన సీఎం)

నటీనటులందరి మధ్య సోదర భావాన్ని పెంపొందించాలనేది దీని వెనుక ఉన్న ఆలోచన. అయితే సీసీఎల్‌ రెండో సీజన్‌లో అతనితో ఒక గొడవ జరిగింది. అతను (నా గురించి) అసత్యాలు చెప్పడం ప్రారంభించాడు. అంతేకాకుండా ఇతరులను కూడా తన మాటలతో పాడు చేశాడు. నేను ఇష్టపడని వాతావరణంలో ఉండటం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో నేను తీవ్రంగా బాధపడ్డాను. బహుశా, ఒకరోజు అతను ఈ విషయంపై గ్రహించాడని అనుకుంటున్న. అంతిమంగా, అతను ఇప్పటికీ (సినిమా) కుటుంబంలో ఒక భాగం.  ఒక కుటుంబంలో విభేదాల రావడం సహజం.' అని అబ్బాస్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement