ఒకే రోజు రెండు యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామి కమిషనింగ్.. ఈ నెల 15న జాతికి అంకితం చేయనున్న కేంద్ర రక్షణ మంత్రి
విశాఖపట్నం క్లాస్‌లో చివరిదైన ఐఎన్‌ఎస్ సూరత్ నేవీ అమ్ముల పొదిలోకి
అదే బాటలో ఐఎన్‌ఎస్ నీల్‌గిరి ఫ్రిగేట్ వార్ షిప్
అత్యాధునిక సబ్‌మెరైన్ ఐఎన్‌ఎస్ వాగ్‌షీర్
నౌకా నిర్మాణంలో చైనాతో పోటీ పడుతున్న భారత్
ఏటా సగటున 20 యుద్ధ నౌకల తయారీ
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళం ఈ సంక్రాంతిని సువర్ణాక్షరాలతో లిఖించనుంది. స్వదేశీ పరిజ్ఞానం వినియోగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతూనే, నౌకాదళ సంపత్తి పెంపుతో ప్రపంచ దేశాలకు సవాల్ విసరనుంది. అత్యాధునికంగా రూపొందించిన రెండు యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామి (సబ్‌మెరైన్)ని ఈ నెల 15న కేంద్ర రక్షణ మంత్రి జాతికి అంకితం చేయనున్నారు.
విశాఖపట్నం క్లాస్‌లో చివరిదైన ఐఎన్‌ఎస్ సూరత్‌తో పాటు ఫ్రిగేట్ వార్ షిప్ ఐఎన్‌ఎస్ నీల్‌గిరి, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఐఎన్‌ఎస్ వాగ్‌షీర్ సబ్‌మెరైన్ భారత నౌకాదళ అమ్ములపొదిలో చేరబోతున్నాయి. ఈ మూడూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నౌకలే. వీటి ద్వారా నౌకా నిర్మాణంలో చైనాకు భారత్ దీటుగా నిలిచింది.
అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన ఆయుధ వ్యవస్థలు, కార్యాచరణతో నౌకాదళం కొత్త బెంచ్‌మార్క్ చేరుకోనుంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు, శత్రు దేశాల కవి్వంపు చర్యల్ని సమర్ధంగా తిప్పికొట్టేందుకు నీలగిరి, సూరత్, వాగ్‌షీర్‌లు సిద్ధంగా ఉంటాయి.
చైనాకు దీటుగా నౌకా నిర్మాణం
నౌకా నిర్మాణంలో విదేశీ పరిజ్ఞానానికి స్వస్తి పలుకుతూ ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవతో విభిన్న యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లను భారత నౌకాదళం అందుబాటులోకి తెస్తోంది. హిందూస్థాన్ షిప్‌యార్డ్, మజ్‌గావ్ డాక్ షిప్ బిల్డర్స్ (ఎండీఎల్), గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్‌ఎస్‌ఈ), కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఎల్ అండ్ టీ వంటి ప్రైవేట్ సంస్థల సహకారంతో అధునాతన నౌకల్ని నిర్మిస్తోంది.
ప్రపంచ నౌకా నిర్మాణంలో ఉన్న చైనా ఏటా సగటున 19 నౌకలు తయారు చేస్తుంటే.., దాన్ని తలదన్నేలా ఇప్పుడు భారత్ ఏటా సగటున 20 యుద్ధ నౌకలు నిర్మిస్తోంది. చైనాలో ఎక్కువగా వాణిజ్య నౌకా నిర్మాణం జరుగుతోంది. భారత్ యుద్ధ నౌకల నిర్మాణంలో ముందంజ వేస్తోంది. మొత్తంగా తక్కువ వ్యవధిలో ప్రపంచ స్థాయి యుద్ధ నౌకలను తయారు చేయగలమనే సంకేతాల్ని భారత్ పంపించింది.
ఐఎన్‌ఎస్ వాగ్‌షీర్ జలాంతర్గామి
అత్యాధునిక ఆయుధ వ్యవస్థ, వేగంగా దూసుకెళ్లే సామర్థ్యం, గుట్టుగా మోహరించే జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వాగ్‌షీర్. ముంబైలోని మజ్‌గావ్‌లో తయారైన వాగ్‌షీర్.. కల్వరి శ్రేణి జలాంతర్గాముల్లో చివరిది. ఫ్రాన్స్ నుంచి బదిలీ చేసిన సాంకేతికతని దీని తయారీకి ఉపయోగించారు. 11 నెలల పాటు సముద్రంలో ప్రయోగాలు చేసిన తర్వాత జాతికి అంకితం చేస్తున్నారు.
సామర్థ్యమిదీ..
బరువు – 1,780 టన్నులు
పొడవు – 221 అడుగులు
వెడల్పు – 20 అడుగులు
ఎత్తు – 40 అడుగులు, డ్రాఫ్ట్ – 19 అడుగులు
వేగం – ఉపరితలంపై గంటకు 20 కిమీ, సాగర గర్భంలో 37 కిమీ
» సామర్థ్యం – ఉపరితలంపై ఏకధాటిగా 12 వేల కిమీ, సాగరగర్భంలో 1020 కిమీ ప్రయాణించగలదు. సముద్రంలో1,150 అడుగుల లోతు వరకు వెళ్లగలదు. 50 రోజులు సాగర గర్భంలో దాక్కోగలదు.
» సిబ్బంది – 8 మంది అధికారులు, 35 మంది సెయిలర్స్
» ఆయుధ సంపత్తి– 21 టార్పెడోలు, 18 ఎస్‌యూటీ టార్పెడోలు, ఎస్‌ఎం.39 యాంటీ షిప్ మిసైల్, 30 మైన్స్.
ఐఎన్‌ఎస్ నీలగిరి
నీలగిరి క్లాస్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ వార్‌షిప్‌లకు ప్రధాన నౌక ఇది. 2019 సెప్టెంబర్‌లో నిర్మాణ పనుల్ని మజ్‌గావ్ షిప్‌యార్డ్ డాక్ లిమిటెడ్‌లో ప్రారంభించారు. 2024 ఆగస్టులో ట్రయల్ రన్ ప్రారంభించి.. అదే ఏడాది డిసెంబర్‌లో నేవీకి అప్పగించారు.
నీలగిరి యుద్ధ నౌక సామర్థ్యమిదీ..
బరువు – 6,670 టన్నులు
పొడవు – 488 అడుగులు
వెడల్పు – 58 అడుగులు
డ్రాఫ్ట్ – 17 అడుగులు
లోతు – 32 అడుగులు
వేగం – గంటకు 59 కిలోమీటర్లు
రేంజ్ – ఏకధాటిగా 4,600 కిలోమీటర్లు
ప్రయాణించగలదు
సిబ్బంది– 35 మంది అధికారులతో కలిపి మొత్తం 226 మంది
క్రాఫ్ట్ క్యారియర్– 2 ఆర్‌హెచ్‌ఐబీ బోట్లు
» సెన్సార్లు, రాడార్లు – ఇంద్ర రాడార్, ఎల్ బ్యాండ్ ఎయిర్ సర్వైలెన్స్ రాడార్, బీఈఎల్ హంసా సోనార్ వ్యవస్థ, అత్యాధునిక కంబాట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్
»ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ – డీఆర్‌డీవో శక్తి ఈడబ్ల్యూ సూట్, రాడార్ ఫింగర్ ప్రింటింగ్ సిస్టమ్, 4 కవచ్ డెకాయ్ లాంచర్స్, 2 ఎన్‌ఎస్‌టీఎల్ టార్పెడో సిస్టమ్స్
» ఆయుధ సంపత్తి – వీఎల్‌ఎస్ 8 సెల్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ 32
» బ్రహ్మోస్ యాంటీ షిప్ మిస్సైల్– 2, వరుణాస్త్ర ట్రిపుల్ ట్యూబ్ టార్పెడో లాంచర్లు – 2, యాంటీ సబ్‌మెరైన్ రాకెట్ లాంచర్లు –2, 76 ఎంఎం ఓటీవో నేవల్ గన్ – 1, ఏకే 630 ఎం గన్–1
» ఎయిర్‌క్రాఫ్ట్ – హెచ్‌ఎఎల్ ధ్రృవ్ లేదా సీ కింగ్ హెలికాప్టర్
ఐఎన్‌ఎస్ సూరత్ యుద్ధ నౌక..
ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా ప్రాజెక్ట్ – 15బీ పేరుతో నాలుగు స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు తయారుచేస్తోంది. వీటికి దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో కీలక నగరాలైన విశాఖపట్నం, మోర్ముగావ్, ఇంఫాల్, సూరత్ పేర్లని పెట్టారు.
ఈ క్లాస్‌లో చివరిది ఐఎన్‌ఎస్ సూరత్. ముంబైలోని మజ్‌గావ్ డాక్స్ లిమిటెడ్ (ఎండీఎల్)లో తయారు చేశారు. శత్రువుకి సంబంధించిన లక్ష్యాన్ని దేన్నైనా, ఎక్కడ ఉన్నా ఛేదించగలదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్‌ఎస్ సూరత్.. శత్రువుల పాలిట సింహస్వప్నమే.
యుద్ధ నౌక విశేషాలు..
బరువు – 7,400 టన్నులు
పొడవు – 535 అడుగులు
బీమ్ – 57 అడుగులు
డ్రాఫ్ట్ – 21 అడుగులు
వేగం – గంటకు 56 కిమీ
పరిధి – ఏకధాటిగా 15 వేల కి.మీ ప్రయాణం చేయగలదు
గ్యాస్ టర్బైన్లు– 4
సిబ్బంది– 50 మంది అధికారులు, 250 మంది సిబ్బంది
» సెన్సార్స్, ప్రాసెసింగ్ వ్యవస్థలు– మల్టీ ఫంక్షన్ రాడార్, ఎయిర్ సెర్చ్, సర్ఫేస్ సెర్చ్ రాడార్లు
» ఆయుధాలు – 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76 ఎంఎం సూపర్ రాపిడ్ గన్‌మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్స్ నాలుగు, రెండు జలాంతర్గామి వ్యతిరేక రాకెట్ లాంచర్లు
» విమానాలు – రెండు వెస్ట్‌ల్యాండ్ సీ కింగ్ విమానాలు లేదా రెండు హెచ్‌ఏఎల్ ధృవ్ విమానాలు
Comments
Please login to add a commentAdd a comment