11 మందిని రక్షించిన అధికారులు
మరో ఇద్దరు మత్స్యకారులు గల్లంతు
కొనసాగుతున్న గాలింపు చర్యలు
న్యూఢిల్లీ: గోవా తీరం నుంచి సముద్రంలో 70 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదం చోటుచేసుకుంది. భారత నావికా దళానికి చెందిన జలాంతర్గామిని మత్స్యకారుల పడవ ఢీకొట్టినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సముద్రంలో చేపలు పట్టేందుకు ఉపయోగించే ఈ పడవ పేరు మార్తోమా. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 13 మంది ఉన్నారు. వారిలో 11 మందిని అధికారులు రక్షించారు.
మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి కోసం ఆరు నౌకలను, హెలికాప్టర్లను రంగంలోకి దించినట్లు నావికా దళం అధికార ప్రతినిధి చెప్పారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని పేర్కొన్నారు. ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కో–ఆర్డినేషన్ సెంటర్(ఎంఆర్‌సీసీ)తో కలిసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు వివరించారు. కోస్ట్ గార్డ్ సిబ్బంంది సేవలు కూడా వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, జలాంతర్గామిని పడవ ఢీకొన్న ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు నావికా దళం ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment