ఆయుధాలను పేల్చడం వల్లే సింధురక్షక్ ప్రమాదం: ఆంటోనీ
ఐఎన్ఎస్ సింధురక్షక్లో ఆయుధ సామగ్రిని పేల్చడం వల్లే పేలుడు సంభవించి ఉండొచ్చని ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ రాజ్యసభలో సోమవారం వెల్లడించారు. రెండుసార్లు వాయిదా పడిన తర్వాత మధ్యాహ్నం రాజ్యసభ తిరిగి సమావేశమైంది. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ సింధురక్షక్ ప్రమాద అంశం చర్చకు వచ్చినప్పుడు దానిపై ఆంటోనీ మాట్లాడారు. అయితే, పేలుడుకు సంబంధించిన కారణం ఏంటో ఇంతవరకు తెలియరాలేదని, దీనిపై ఫోరెన్సిక్ నిపుణులు దృష్టి పెడుతున్నారని ఆయన చెప్పారు. నీళ్లలో మునిగిపోయిన జలాంతర్గామిని బయటకు తీసి, అందులోని నీరు మొత్తాన్ని తోడిన తర్వాత గానీ వివరాలు తెలియవన్నారు.
పేలుడు తీవ్రత, దానివల్ల జలాంతర్గామికి సంభవించిన నష్టాన్ని బట్టి చూస్తే... అందులో ఉన్ 18 మందిలో ఏ ఒక్కరూ బతికుండే అవకాశం కనిపించడంలేదని ఆంటోనీ చెప్పారు. మొత్తం ఎస్ఓపీలకు సంబంధించి ఆడిట్ చేయాలని నౌకాదళం ఆదేశించిందని, ఆయుధాల భద్రతకు సంబంధించిన పరిశీలన మొత్తం జరుగుతోందని, నౌకాదళంలో ఉన్న మొత్తం జలాంతర్గాములన్నింటికి సంబంధించి ఇలాంటి పరీక్షలు చేస్తారని ఆంటోనీ తెలిపారు.