పాక్ చర్యలను బట్టే భారత్ స్పందన: ఏకే ఆంటోనీ
కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో భారత జవాన్ల కాల్చివేతపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఈ అంశంపై రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ రాజ్యసభలో మంగళవారం సాయంత్రం ఓ ప్రకటన చేశారు. పాకిస్థాన్ చర్యలను బట్టే భారతదేశం స్పందన కూడా ఉంటుందని ఆయన తెలిపారు. పాకిస్థానీ సైన్యం యూనిఫాం ధరించిన వ్యక్తులతో కలిసి ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు తమకు కచ్చితమైన సమాచారం ఉందని ఆయన తెలిపారు.
అంతకుముందు పాకిస్థాన్ దుశ్చర్యపై రాజ్యసభలో బీజేపీ సభ్యులు వెంకయ్య నాయుడు, రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం ఈ అంశంపై ఓ ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు దీనిపై చర్చిద్దామని అధ్యక్ష స్థానంలో ఉన్న పీజే కురియన్ సూచించినా వెంకయ్యనాయుడు తన వాదనను కొనసాగించారు. ప్రభుత్వం దీనిపై స్పందించి తీరాల్సిందేనని ఆయన పట్టుబట్టారు.
లోక్సభ సమావేశం కాగానే సమాజ్వాదీ పార్టీకి చెందిన సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి, పాకిస్థాన్ దుశ్చర్య అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ సభ్యులు తమ స్థానాల్లోనే లేచి నిలబడి, భారత సైనికుల హత్యను లేవనెత్తారు. సమాజ్వాదీ అద్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, పార్టీ ఎంపీ శైలేంద్రకుమార్ దీనిపై వాయిదా తీర్మానం లేవనెత్తారు. ఈ గందరగోళంతో సభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది.