ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మధ్యాహ్నం భోజనం పథకం కింద పాఠశాల చిన్నారులకు అందిస్తున్న ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను బీజేపీ సీనియర్ నాయకురాలు మేనకా గాంధీ కోరారు. ఈ మేరకు ఆమె సీఎంకు లేఖ రాశారని ఆయన కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. చిన్నారులకు వడ్డిస్తున్న భోజనంలో పురుగులు, బల్లులు వస్తున్నాయని ఆమె ఆరోపించారు. యూపీలోని తన నియోజకవర్గమైన అనొలలో పర్యటనలో భాగంగా ఆ విషయాన్ని గుర్తించినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
అంతేకాకుండా ఆహార పదార్థాలను తయారు చేసేటప్పుడు కూడా ఆ పరిసరాలు తగు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. అయితే గత నెలరోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పాఠశాల చిన్నారులకు నాణ్యమైన భోజనం పెడుతున్నారని, కానీ కొన్ని ప్రదేశాల్లో ఆ భోజనంలో క్రిమికీటకాలు ఉంటున్నాయని తెలిపారు. గతనెల్లో బీహార్ రాష్ట్రంలో శరన్ జిల్లాలోని చాప్రా డివిజన్లో గందమయిలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసి 23 మంది మరణించిన సంగతిని మేనకా గాంధీ రాసిన లేఖలో ప్రస్తావించారు.
అయితే మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఇప్పటికే అఖిలేష్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ రాయబరేలి జిల్లాలోని రైయిన్ గ్రామంలో ఆకస్మిక పర్యటన నిర్వహించారు. అందులో భాగంగా స్థానిక పాఠశాలను ఆయన సందర్శించారు. భోజనంలో ఆహారం సరిగా ఉండటం లేదని పాఠశాల విద్యార్థులు అఖిలేష్కు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయన ఉన్నతాధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. స్థానిక విద్యాశాఖ అధికారులను బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు.
అఖిలేష్ యాదవ్ కు మేనకాగాంధీ లేఖ
Published Thu, Aug 8 2013 9:55 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
Advertisement