సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం
ఇప్పటికైనా నిజాలు బయటపెట్టాలని డిమాండ్
న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో చాలామంది చనిపోయారని, వారి సంఖ్యను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాచిపెడుతోందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. మృతుల సంఖ్యపై ఇప్పటికైనా నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఆయన మంగళవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడారు. కుంభమేళాను సక్రమంగా నిర్వహించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని అన్నారు. అక్కడ జరిగిన వైఫల్యాల సంగతి బయటకు రాకుండా తొక్కిపెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిజిటల్ కుంభమేళా నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం మృతుల సంఖ్యను మాత్రం బయటపెట్టడం లేదని మండిపడ్డారు.
‘బడ్జెట్ సంఖ్యల గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు కుంభమేళా తొక్కిసలాట మృతుల లెక్కలు చెప్పండి’ అని అఖిలేశ్ యాదవ్ నిలదీశారు. ఒకవైపు మృతదేహాలు మార్చురీలో ఉంటే, మరోవైపు కుంభమేళా జరుగుతున్న ప్రాంతంపై హెలికాప్టర్ ద్వారా పూలు చల్లారని, ఇదెక్కడి సనాతన సంప్రదాయమని ధ్వజమెత్తారు. జేసీబీలతో మృతదేహాలను నదిలోకి నెట్టేశారని ఆరోపించారు. కుంభమేళాలో ఎంతోమంది భక్తులు చనిపోతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కనీసం విచారం వ్యక్తం చేయలేదని విమర్శించారు. కుంభమేళా ఏర్పాట్లపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కుంభమేళాలో భద్రతా ఏర్పాట్లు చూసే బాధ్యతను సైన్యానికి అప్పగించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment