లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయంగా ఒక్కసారిగా వేడెక్కింది. అధికార బీజేపీలో కోల్డ్ వార్ కొనసాగుతున్న వేళ కాషాయ పార్టీ నేతలపై ఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో అఖిలేష్‌కు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కౌంటరిచ్చారు.
కాగా, అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై కేశవ్ మౌర్య స్పందిస్తూ..‘కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం బలంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ గుండాయిజం తిరిగి రావడం అసాధ్యం. 2017 ఎన్నికల ఫలితాలే 2027లో కూడా రిపీట్ అవుతాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇక, అంతకుముందు యూపీ బీజేపీ రాజకీయాలపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ..‘యోగి ఆదిత్యానాథ్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం అస్ధిరతతో సతమతమవుతోంది. బీజేపీ నేతలు సీఎం కుర్చీ కోసం కొట్టాడుకుంటున్నారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు చోటుచేసుకుంటున్నాయి. కాషాయ నేతల మధ్య ఆధిపత్య పోరుతో అభివృద్ధి అటకెక్కింది. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధిస్తోంది. రాష్ట్ర రాజధాని లక్నోలో ఇళ్ల కూల్చివేత నిర్ణయాన్ని వాయిదా వేశారు. యూపీలో యోగి సర్కార్ బలహీనపడుతుంది అనేందుకు ఇదే ఉదాహరణ అని సెటైరికల్ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేదాలు మరింతగా ముదిరినట్లు తెలుస్తున్నది. లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ పేలవ ప్రదర్శన తర్వాత వీరి మధ్య విభేదాలు మరింతగా పెరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన సమావేశం కావడం యూపీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కాగా, యూపీలో పార్టీ వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సమావేశాలు జరిగినట్లు సమాచారం.
మరోవైపు.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని 80 లోక్‌సభ స్థానాలకు గాను సమాజ్‌వాదీ పార్టీ, ఇండియా కూటమి 43 స్థానాలను గెలుచుకోగా.. బీజేపీ నేతృత్వంలోని ఏన్డీయే 36 స్థానాలను గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 64 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment