పార్లమెంటులో ‘పాక్ మంటలు’
రెండోరోజూ స్తంభించిన ఉభయ సభలు
పాక్ సైన్యం కాల్పులపై ఆంటోనీ ప్రకటన దుమారం
న్యూఢిల్లీ/జమ్మూ/ఇస్లామాబాద్: పూంచ్‌లో పాక్ సైన్యం కాల్పులకు సంబంధించి రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ చేసిన ప్రకటనతో చెలరేగిన దుమారం బుధవారం కూడా పార్లమెంటును స్తంభింపజేసింది. పాక్ సైన్యానికి రక్షణ మంత్రి క్లీన్ చిట్ ఇచ్చారంటూ ప్రధాన ప్రతిపక్షం విరుచుకుపడింది. ఆయన క్షమాపణకు డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన లోక్‌సభ, రాజ్యసభలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎలాంటి ముఖ్యమైన అంశాలను చేపట్టకుండానే గురువారానికి వాయిదా పడ్డాయి. జమ్మూకాశ్మీర్ పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద సోమవారం అర్ధరాత్రి భారత భూభాగంలోకి చొరబడిన పాక్ సైనికులు కొందరు ఉగ్రవాదులతో కలిసి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లు మరణించారు.
ఈ నేపథ్యంలో.. పాకిస్థాన్ సైనిక యూనిఫామ్‌లో ఉన్న కొందరితో కలిసి ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టుగా ఆంటోనీ చేసిన ప్రకటనపై మంగళవారం నాడే ఉభయ సభల్లోనూ విపక్షాలు మండిపడ్డాయి. బుధవారం రాజ్యసభలో మాట్లాడిన రక్షణ మంత్రి తన వద్ద ఉన్న సమాచారం మేరకు ఆ ప్రకటన చేశానని చెప్పారు. జమ్మూ వెళ్లిన ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్‌సింగ్ తిరిగొచ్చిన తర్వాత ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు లభించినట్టయితే మరోమారు సభకు తెలియజేస్తానని చెప్పారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు విమర్శల దాడిని కొనసాగించారు. తప్పుడు ప్రకటన చేసినందుకు ఆంటోనీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘వాళ్లు (పాక్ సైన్యం) చంపడానికొస్తే మన రక్షణ మంత్రి వారి ప్రమేయం లేదంటున్నారు..’ అని షేమ్ షేమ్ అనే కేకల మధ్య సుష్మాస్వరాజ్ ఎద్దేవా చేశారు. దాడిలో పాక్ సైనికుల ప్రమేయం ఉందని స్పష్టం చేశారు.
పరస్పర విరుద్ధ ప్రకటనలు: జమ్మూలో సైన్యం రూపొందించిన ప్రకటనకు రక్షణ మంత్రి ప్రకటన విరుద్ధంగా ఉందంటూ బీజేపీ సభ్యులు అంతకుముందు ఉభయ సభల్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆంటోనీ మార్పు చేసిన ఆర్మీ ప్రకటనను తీసుకువచ్చారంటూ.. నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి ఎందుకిలా చేశారని ప్రశ్నించారు. ఈ మేరకు బీజేపీ రెండు సభల్లోనూ హక్కుల తీర్మానం నోటీసు ఇచ్చింది. పార్లమెంటును తప్పుదోవ పట్టించారంటూ లోక్‌సభలో ఆ పార్టీ నేత యశ్వంత్‌సిన్హా నోటీసు ఇచ్చారు. మరోవైపు ఆంటోనీ క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో ఆ పార్టీ సభ్యుడు ఎం.వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దేశ నైతికతను దిగజార్చిందంటూ మండిపడ్డారు. ఆర్మీ ప్రకటనలో రక్షణమంత్రి మార్పులెందుకు చేశారని ప్రశ్నించారు.
లోక్‌సభ మొదటిసారి వాయిదాపడిన తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌ను కలిసిన బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ.. ఆర్మీ, ఆంటోనీ పరస్పర విరుద్ధ ప్రకటనలపై తమ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన అద్వానీ.. ఆంటోనీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే కమల్‌నాధ్ ఆంటోనీకి మద్దతుగా నిలిచారు. ఆ సమయంలో అందుబాటులో ఉన్న వాస్తవాల ఆధారంగా రక్షణ మంత్రి ప్రకటన చేశారని విలేకరులతో చెప్పా రు. కాంగ్రెస్ కూడా ఆంటోనీకి దన్నుగా నిలి చింది. పాక్ సైన్యానికి ఆయన క్లీన్‌చిట్ ఇవ్వలేదని ఆ పార్టీ ప్రతినిధి పి.సి.చాకో అన్నారు. పొరుగుదేశంతో ఉన్న వివాదాలకు చర్చలే ఏకైక మార్గమని పేర్కొన్నారు.
ప్రధానితో ఆంటోనీ భేటీ: పూంచ్ మరణాలపై తాను చేసిన ప్రకటన వివాదానికి దారితీసిన నేపథ్యంలో.. ఆంటోనీ ప్రధాని మన్మోహన్‌తో భేటీ అయ్యారు. జమ్మూకాశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితిపై వివరణ ఇచ్చారు. అయితే పాక్ కాల్పులపై రక్షణ శాఖ రూపొందించిన నోట్‌లో 13 మంది ఉగ్రవాదులకు సంబంధించిన ప్రస్తావనను తొలగించారని ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తత నేపథ్యంలో భారత్, పాక్ మిలటరీ ఉన్నతాధికారులు హాట్‌లైన్‌లో మాట్లాడుకున్నారు.
పరిహారం వద్దు: జవాను భార్య
పాట్నా: పాక్ దళాల కాల్పుల్లో మృతిచెందిన ఐదుగురు జవాన్లలో ఓ జవాను భార్య బీహార్ ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల నష్టపరిహారాన్ని నిరాకరించారు. అందుకు బదులుగా పాక్‌పై సైనిక చర్య జరపాలని డిమాండ్ చేశారు. ‘రూ.10 లక్షల పరిహారం నా భర్తను తిరిగి తీసుకురాగలదా? మాకు పరిహారం వద్దు. నా భర్త సహా ఇతర జవాన్లను చంపినందుకు సైన్యం పాక్‌కు దీటైన జవాబివ్వాలి’ అని అమర జవాను విజయ్‌రాయ్ భార్య పుష్పారాయ్ అన్నారు.