Punch Sector
-
భారతీయుల్ని కాల్చిచంపిన పాక్
-
భారతీయుల్ని కాల్చిచంపిన పాక్
శ్రీనగర్ : దాయాది పాకిస్తాన్ మళ్లీ బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దు వెంబడి ఘాతుకానికి తెగబడింది. గ్రామాలపై బుల్లెట్లు, మోర్టార్‌షెల్స్ వర్షం కురిపించింది. కాల్పుల్లో ఐదుగురు పౌరులు మరణించారు. జమ్ముకశ్మీర్ ఫూంచ్ సెక్టార్ బాల్కోట్ సరిహద్దుపైకి పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యయని అధికారులు చెప్పారు. చనిపోయినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారని పేర్కొన్నారు. -
మరో మెరుపు దాడి
భారతీయ ఆర్మీ మరోసారి ప్రతాపం చూపింది. దాయాది దేశం పాకిస్తాన్ కవ్వింపులకు కళ్లు చెదిరే సమాధానం ఇచ్చింది. సరిహద్దులు దాటివెళ్లి శత్రుసైన్య శిబిరంపై విరుచుకుపడింది. గతేడాది జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను గుర్తుకు తెచ్చేలా.. నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) దాటి వెళ్లిన భారత ‘ఘాతక్’ కమాండోలు ముగ్గురు శత్రు సైనికులను హతమార్చి, ఓ జవానును గాయపర్చి వీరోచితంగా తిరిగొచ్చారు. అలా.. శనివారం పాక్ కాల్పుల్లో చనిపోయిన భారత మేజర్ ప్రఫుల్ల అంబదాస్ సహా నలుగురు సహచరులకు తమదైన శైలిలో ఘన నివాళుర్పించారు. పూంచ్ సెక్టార్ దగ్గర్లో సోమవారం సాయంత్రం ఆరుగంటలకు ప్రారంభమైన ఈ ఆపరేషన్.. 45 నిమిషాల్లో ముగిసింది. న్యూఢిల్లీ: భారత సైన్యం మరో సాహసవంతమైన ఆపరేషన్‌ను చేపట్టింది. ఐదుగురు భారత సైనికులు నియంత్రణ రేఖను దాటి వెళ్లి పాక్ సైన్యానికి చెందిన తాత్కాలిక శిబిరాన్ని కూల్చి, అందులోని ముగ్గురు సైనికులను హతమార్చి వీరోచితంగా తిరిగొచ్చారు. కశ్మీర్లో కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాక్ సైన్యం మేజర్ ప్రఫుల్ల సహా నలుగురు భారత సైనికులను పొట్టనబెట్టుకున్న చర్యకు ప్రతీకారంగానే తాజా ఆపరేషన్ జరిగినట్లు భావిస్తున్నారు. భారత జవాన్లందరూ సురక్షితంగా తిరిగొచ్చారని ఆర్మీ వర్గాలు చెప్పాయి. మినీ సర్జికల్ స్ట్రైక్స్! గతేడాది సెప్టెంబరు 28 రాత్రి భారత సైన్యం హెలికాప్టర్లను ఉపయోగించి భారీ ఆపరేషన్‌ను చేపట్టి నియంత్రణ రేఖకు దగ్గర్లో పాక్ సైన్యం మద్దతుతోనే ఏర్పాటైన ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసి రావడం తెలిసిందే. సోమవారం జరిగిన ఆపరేషన్‌లోనూ భారత సైనికులు పూంచ్ సెక్టార్లో నియంత్రణ రేఖను దాటి అవతలకు వెళ్లి పాక్ సైనికుల భరతం పట్టారు. అయితే ఈ ఆపరేషన్‌ను సర్జికల్ స్ట్రైక్స్‌తో పోల్చలేమనీ, ఇది చాలా చిన్న లక్ష్యంతో, స్వల్ప కాలంలోనే పూర్తయిన దాడి అని ఆర్మీ వర్గాలు చెప్పాయి. కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా కేరీ సెక్టార్లో ఓ మేజర్ సహ నలుగురు భారత సైనికులను శనివారం పాకిస్తాన్ సైన్యం బలిగొంది. దీనికి ప్రతీకారంగానే తాజా దాడి జరిగిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. నియంత్రణ రేఖకు 200 నుంచి 300 మీటర్ల దూరంలో ఉన్న పాక్ శిబిరాన్ని భారత సైన్యం వ్యూహాత్మకంగా ఎంచుకుని, ఘాతక్ అనే చిన్న బృందంలోని ఐదుగురు కమాండోలు అక్కడకు వెళ్లి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. మొత్తం నలుగురు పాక్ సైనికులు చనిపోయారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అది నిజం కాదనీ, ముగ్గురు సైనికులు చనిపోగా, ఒకరు గాయపడ్డారని ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రతీకార దాడికి వెళ్లేముందు పాక్ శిబిరంపై స్థానిక కమాండర్ ఆదేశం మేరకు గట్టి నిఘా పెట్టారు. ఆపరేషన్‌లో చనిపోయిన సైనికులు పాక్ బలూచ్ పటాలంకు చెందిన వారనీ, దాడి జరిగిన ప్రాంతం రావల్కోట్లోని కఖ్చక్రీ సెక్టార్ అని ఆర్మీ వర్గాలు తెలిపాయి. కిందిస్థాయి అధికారుల ఆదేశాలతోనే! సాధారణంగా ఇలాంటి ఆపరేషన్లను భారత సైన్యం చేపట్టడం చాలా అరుదు. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత మళ్లీ భారత సైన్యం నియంత్రణ రేఖను దాటి వెళ్లి చేపట్టిన (బహిరంగంగా ప్రకటించిన) ఆపరేషన్ ఇదే. ఇలాంటి ఆపరేషన్లు సాధారణంగా పై స్థాయిలోని ఆర్మీ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంటాయి. కానీ ఈ ఆపరేషన్‌కు కింది స్థాయి అధికారులే ఆదేశాలు ఇచ్చారని రక్షణ శాఖ వర్గాలు చెప్పాయి. పదాతి దళం నుంచి కొందరు సైనికులను ఎంపిక చేసి వారికి ఈ తరహా ఆపరేషన్స్ చేయడానికి అవసరమైన ప్రత్యేక శిక్షణనిచ్చి ఘాతక్ అనే చిన్న బృందంలో చేరుస్తారు. ఈ బృందంలోని ఐదుగురు కమాండోలతోనే తాజా ఆపరేషన్ జరిగింది. అవి కట్టుకథలు: పాక్ తమ ముగ్గురు సైనికులు చనిపోయింది నిజమే కానీ భారత సైనికులు ఎల్వోసీని దాటి రాలేదని పాక్ పేర్కొంది. నియంత్రణ రేఖ వద్ద అశాంతిని రగిలించేందుకు భారత్ కట్టుకథలు చెబుతోందని ఆరోపించింది. ఎలాంటి కవ్వింపు చర్యలూ లేకుండానే ఎల్ఓసీ అవతలి నుంచే భారత సైన్యం కాల్పు ల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ముగ్గు రు జవాన్లను హతమార్చిందని పాక్ ఆరోపించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. పాక్ సైన్యం కూడా దీటుగా బదులిచ్చిందనీ, కొద్దిసేపటికి భారత్ వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయని పాక్ అందులో పేర్కొంది. భారత తాత్కాలిక హై కమిషనర్‌కు సమన్లు జారీ చేసి, భారత చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామంది. -
దౌత్య విషాదం!
సంపాదకీయం: కీలకమైన ఈ వానాకాలపు పార్లమెంటు సమావేశాల కోసం ముందస్తుగా ఎన్నో కసరత్తులు చేసి మరీ బరిలోకి దిగిన యూపీఏ ప్రభుత్వం హఠాత్తుగా పాకిస్థాన్ నుంచి తలెత్తిన పూంచ్ సమస్యకు బెంబేలెత్తి, సెల్ఫ్‌గోల్ చేసుకున్నంత పనిచేసింది. జమ్మూకాశ్మీర్ పూంచ్ సెక్టార్లో పాకిస్థాన్ సైన్యం సోమవారం రాత్రి వాస్తవాధీన రేఖను అతిక్రమించి ఐదుగురు భారత సైనికులను కాల్చి చంపిన ఘటనపై ప్రభుత్వం రెండు రోజుల్లోనే రెండు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయాల్సి వచ్చింది. పాక్ సైనిక దుస్తులు ధరించిన వ్యక్తులతో కలిసి వచ్చిన కొందరు ఉగ్రవాదులు మన సైనికులను కాల్చి చంపారని రక్షణ మంత్రి ఆంటోనీ లోక్‌సభలో మంగళవారం ప్రకటించారు. అది తొలి సమాచారంపై ఆధారపడి చేసిన ప్రకటన అని గురువారం ఆయన వివరణ ఇచ్చారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్‌సింగ్ ఘటనా స్థలాన్ని సందర్శించిన తదుపరి అందిన తాజా సమాచారమంటూ తొలి ప్రకటనకు విరుద్ధమైన మరో ప్రకటన చేశారు. ప్రత్యేక శిక్షణ పొందిన పాక్ సైనికులే ఈ దురాగతానికి పాల్పడ్డారని స్పష్టం చేశారు. ఆకుకు అందని పోకకు పొందని ఆంటోనీ తొలి ప్రకటన పార్లమెంటులో పెద్ద దుమారాన్నే లేపింది. ఎన్నికలకు ముందు ఈ సున్నితమైన సమస్యపై భేషజాలకు పోరాదని కాంగ్రెస్ అధిష్టానం ఆలస్యంగానైనా గ్రహించింది. ప్రజాగ్రహాన్ని ప్రతిఫలించేలా రక్షణ మంత్రి ప్రకటనను సవరింపజేసింది. సవరించిన ప్రకటనకు ప్రధాన ప్రతిపక్ష నేత్రి సుష్మాస్వరాజ్ సంతృప్తి చెందడంతో పార్లమెంటు సమావేశాల నిర్వహణకు అడ్డు తొలగింది. సమసిపోయినట్టుగా కనిపిస్తున్న ఈ వివాదం నిజానికి మన విదేశాంగ నీతికి సంబంధించి పలు మౌలిక సమస్యలను లేవనెత్తింది. 2003 నాటి వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం నేటికీ అమల్లో ఉన్నందున సరిహద్దుకు ఎటువైపు నుంచి అతిక్రమణ జరిగితే ఆ దేశమే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎలా జరిగినా ఇది పాక్ సరిహద్దుల నుంచి జరిగిన ఉల్లంఘన. కాబట్టి పాక్ ప్రభుత్వమే అందుకు బాధ్యత వహించాలి. అలాంటి బాధ్యతను కనబరిచే ప్రకటన ఏదీ అటు నుంచి వెలువడక ముందే పాక్ సైన్యం ప్రమేయం లేదని మన ప్రభుత్వం తీర్పు చెప్పాల్సిన అగత్యం ఏమిటి? వచ్చే నెలలో జరగనున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా న్యూయార్క్‌లో మన ప్రధాని మన్మో హన్‌సింగ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. ఆ చర్చలకు విఘాతం కలుగుతుందన్న భయమే వాస్తవాలను మరుగున పరిచిన మంగళవారం ప్రకటనకు కారణమైంది. ఈ హత్యాకాండ ప్రత్యేక శిక్షణను పొందిన వృత్తి నైపుణ్యంగల సైనికులు చేసిందే తప్ప, ప్రభుత్వేతరశక్తుల చర్య కాదని సైన్యం మొదటే ధృవీకరించిందని ఉన్నత సైనికాధికారుల కథనం. ఆ నివేదికను సవివరంగా చర్చించిన తర్వాతే ప్రభుత్వం ‘జాగ్రత్త’గా తొలి ప్రకటనను తయారు చేసిందనేది స్పష్టమే. శాంతి చర్చల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలన్న చిత్తశుద్ధి ఇరుపక్షాలకూ ఉండటం అవసరం. ఏ పక్షం నుంచి చర్చల వాతావరణాన్ని దెబ్బతీసే పరిస్థితులు తలెత్తితే అదే దిద్దుబాటు చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. చర్చలపట్ల ఆ దేశపు చిత్తశుద్ధికి నిదర్శనం అదే. ఆ ప్రాథమిక దౌత్యనీతి సూత్రాన్ని సైతం విస్మరించి, అకారణంగా ఐదుగురు జవాన్లను కోల్పోయిన దేశమే చర్చల కోసం అంగలార్చడం ఏమిటి? సహేతుకమైన ఈ ప్రశ్న నేడు జాతీయస్థాయి చర్చగా మారింది. బీజేపీ నేతల నుంచే కాదు, మీడియాలో సైతం ఈ సమయంలో పాక్‌తో చర్చలు సరికాదనే ఆభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. పూంచ్ సెక్టార్ దాడికి పాల్పడ్డ పాక్ సైనికులు లేదా ఉగ్రవాదులు లేదా ఇద్దరూ ఏ లక్ష్యంతో ఈ హత్యాకాండకు పూనుకున్నారో అది నెరవే రే పరిస్థితిని సృష్టించింది ఎవరు? మన్మోహన్ ప్రభుత్వం కాదా? పాక్ సైన్యం మద్దతు లేకుండా అటు వేపు నుంచి ఏదీ జరగదన్న అందరికీ తెలిసిన వాస్తవానికి ఆంటోనీ తాజా ప్రకటన తీవ్ర హెచ్చరికను జోడించింది. ఆ హెచ్చరిక కూడా చర్చలపై అనుమానాలను రేకెత్తించింది. సుదీర్ఘకాలంగా నలుగుతున్న పాక్ సమస్యపై మన విదేశాంగ విధానం ఇలా ఒక కొస నుంచి మరో కొసకు కొట్టుకుపోయే దుస్థితికి ఎవరిని నిందించాలి? ఎంతటి తీవ్ర సమస్యలైనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే నాగరిక దేశాలు అనుసరించాల్సిన సూత్రం అనడంలో సందేహం లేదు. సైనిక నేతల దశాబ్దాల ఏలుబడిలో బలహీనమైపోయిన పాక్ ప్రజాస్వామ్య వ్యవస్థకు చేయూతనిచ్చే సానుకూల వైఖరిని అవలంబించడం మంచిదే. అలా అని సైన్యం, ఐఎస్ఐలకూ, సీమాంతర ఉగ్రవాద ముఠాలకూ మధ్య ఉన్న పీటముళ్లు యథాతథంగా ఉండగానే శాంతి సాధ్యమనుకోగలమా? పాక్‌తో ద్వైపాక్షిక శాంతిచర్చల పునరుద్ధరణ కోసం భారత్‌పై అమెరికా తెస్తున్న ఒత్తిడి అందరికీ తెలిసిందే. 2008 ముంబై ఉగ్రవాద దాడుల అసలు సూత్రధారి జమాతే ఉద్ దవా అధినేత హఫీజ్ సయీద్‌ను అది ఉగ్రవాదిగా ప్రకటించి అతని తలపై కోటి డాలర్ల నజరానా ప్రకటించింది. శుక్రవారం కరాచీలో జరిగిన బ్రహ్మాండమైన ఈద్గా ప్రార్థనా సమావేశానికి సయీద్ నేతృత్వం వహించడమే కాదు, భారత వ్యతిరేక ఉన్మాదాన్ని ప్రేరేపించే విషాన్ని వెలిగక్కాడు. భారత్-పాక్ సత్సంబంధాలకు అమెరికా అంత ప్రాధాన్యం ఇచ్చేట్టయితే సయీద్ పాక్‌లో స్వేచ్ఛగా తిరగడమేగాక, పట్టుకోగలిగితే పట్టుకోమని సవాలు విసురుతుంటే అది చేతులు ముడుచుకు కూచుంటుందా? భారత్-పాక్ స్నేహసంబంధాల ఎదుగుదలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్న సైనిక, ఉగ్రవాద శక్తులపై కనీస అదుపును సంపాదించడానికి నిన్నటి ఆసిఫ్ ఆలీ జర్దారీ ప్రభుత్వం ప్రయత్నించింది లేదు. నేటి నవాజ్ ప్రభుత్వం సైతం వెన్నెముకలేని అదే విధానాన్ని అనుసరిస్తూ, భారత్‌కు స్నేహహస్తాన్ని చాస్తున్నది. పాక్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కేవలం భారత్ బాధ్యత మాత్రమే కాదు. ఆ విషయం నవాజ్తోపాటూ, అమెరికా కూడా గుర్తించడం అవసరం. -
పార్లమెంటులో ‘పాక్ మంటలు’
రెండోరోజూ స్తంభించిన ఉభయ సభలు పాక్ సైన్యం కాల్పులపై ఆంటోనీ ప్రకటన దుమారం న్యూఢిల్లీ/జమ్మూ/ఇస్లామాబాద్: పూంచ్‌లో పాక్ సైన్యం కాల్పులకు సంబంధించి రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ చేసిన ప్రకటనతో చెలరేగిన దుమారం బుధవారం కూడా పార్లమెంటును స్తంభింపజేసింది. పాక్ సైన్యానికి రక్షణ మంత్రి క్లీన్ చిట్ ఇచ్చారంటూ ప్రధాన ప్రతిపక్షం విరుచుకుపడింది. ఆయన క్షమాపణకు డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన లోక్‌సభ, రాజ్యసభలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎలాంటి ముఖ్యమైన అంశాలను చేపట్టకుండానే గురువారానికి వాయిదా పడ్డాయి. జమ్మూకాశ్మీర్ పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద సోమవారం అర్ధరాత్రి భారత భూభాగంలోకి చొరబడిన పాక్ సైనికులు కొందరు ఉగ్రవాదులతో కలిసి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లు మరణించారు. ఈ నేపథ్యంలో.. పాకిస్థాన్ సైనిక యూనిఫామ్‌లో ఉన్న కొందరితో కలిసి ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టుగా ఆంటోనీ చేసిన ప్రకటనపై మంగళవారం నాడే ఉభయ సభల్లోనూ విపక్షాలు మండిపడ్డాయి. బుధవారం రాజ్యసభలో మాట్లాడిన రక్షణ మంత్రి తన వద్ద ఉన్న సమాచారం మేరకు ఆ ప్రకటన చేశానని చెప్పారు. జమ్మూ వెళ్లిన ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్‌సింగ్ తిరిగొచ్చిన తర్వాత ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు లభించినట్టయితే మరోమారు సభకు తెలియజేస్తానని చెప్పారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు విమర్శల దాడిని కొనసాగించారు. తప్పుడు ప్రకటన చేసినందుకు ఆంటోనీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘వాళ్లు (పాక్ సైన్యం) చంపడానికొస్తే మన రక్షణ మంత్రి వారి ప్రమేయం లేదంటున్నారు..’ అని షేమ్ షేమ్ అనే కేకల మధ్య సుష్మాస్వరాజ్ ఎద్దేవా చేశారు. దాడిలో పాక్ సైనికుల ప్రమేయం ఉందని స్పష్టం చేశారు. పరస్పర విరుద్ధ ప్రకటనలు: జమ్మూలో సైన్యం రూపొందించిన ప్రకటనకు రక్షణ మంత్రి ప్రకటన విరుద్ధంగా ఉందంటూ బీజేపీ సభ్యులు అంతకుముందు ఉభయ సభల్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆంటోనీ మార్పు చేసిన ఆర్మీ ప్రకటనను తీసుకువచ్చారంటూ.. నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి ఎందుకిలా చేశారని ప్రశ్నించారు. ఈ మేరకు బీజేపీ రెండు సభల్లోనూ హక్కుల తీర్మానం నోటీసు ఇచ్చింది. పార్లమెంటును తప్పుదోవ పట్టించారంటూ లోక్‌సభలో ఆ పార్టీ నేత యశ్వంత్‌సిన్హా నోటీసు ఇచ్చారు. మరోవైపు ఆంటోనీ క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో ఆ పార్టీ సభ్యుడు ఎం.వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దేశ నైతికతను దిగజార్చిందంటూ మండిపడ్డారు. ఆర్మీ ప్రకటనలో రక్షణమంత్రి మార్పులెందుకు చేశారని ప్రశ్నించారు. లోక్‌సభ మొదటిసారి వాయిదాపడిన తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌ను కలిసిన బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ.. ఆర్మీ, ఆంటోనీ పరస్పర విరుద్ధ ప్రకటనలపై తమ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన అద్వానీ.. ఆంటోనీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే కమల్‌నాధ్ ఆంటోనీకి మద్దతుగా నిలిచారు. ఆ సమయంలో అందుబాటులో ఉన్న వాస్తవాల ఆధారంగా రక్షణ మంత్రి ప్రకటన చేశారని విలేకరులతో చెప్పా రు. కాంగ్రెస్ కూడా ఆంటోనీకి దన్నుగా నిలి చింది. పాక్ సైన్యానికి ఆయన క్లీన్చిట్ ఇవ్వలేదని ఆ పార్టీ ప్రతినిధి పి.సి.చాకో అన్నారు. పొరుగుదేశంతో ఉన్న వివాదాలకు చర్చలే ఏకైక మార్గమని పేర్కొన్నారు. ప్రధానితో ఆంటోనీ భేటీ: పూంచ్ మరణాలపై తాను చేసిన ప్రకటన వివాదానికి దారితీసిన నేపథ్యంలో.. ఆంటోనీ ప్రధాని మన్మోహన్‌తో భేటీ అయ్యారు. జమ్మూకాశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితిపై వివరణ ఇచ్చారు. అయితే పాక్ కాల్పులపై రక్షణ శాఖ రూపొందించిన నోట్లో 13 మంది ఉగ్రవాదులకు సంబంధించిన ప్రస్తావనను తొలగించారని ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తత నేపథ్యంలో భారత్, పాక్ మిలటరీ ఉన్నతాధికారులు హాట్లైన్లో మాట్లాడుకున్నారు. పరిహారం వద్దు: జవాను భార్య పాట్నా: పాక్ దళాల కాల్పుల్లో మృతిచెందిన ఐదుగురు జవాన్లలో ఓ జవాను భార్య బీహార్ ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల నష్టపరిహారాన్ని నిరాకరించారు. అందుకు బదులుగా పాక్‌పై సైనిక చర్య జరపాలని డిమాండ్ చేశారు. ‘రూ.10 లక్షల పరిహారం నా భర్తను తిరిగి తీసుకురాగలదా? మాకు పరిహారం వద్దు. నా భర్త సహా ఇతర జవాన్లను చంపినందుకు సైన్యం పాక్‌కు దీటైన జవాబివ్వాలి’ అని అమర జవాను విజయ్రాయ్ భార్య పుష్పారాయ్ అన్నారు. -
అధీనరేఖ మళ్లీ రక్తసిక్తం!
సంపాదకీయం: విఫల రాజ్యం తనకు తానే కాదు... ఇరుగు పొరుగు దేశాలకూ ఎంత ముప్పుగా పరిణమిస్తుందో పాకిస్థాన్ మరోసారి నిరూపించింది. జమ్మూ-కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో అధీన రేఖ ఆవలి నుంచి వచ్చిన సాయుధ ముఠా గస్తీ తిరుగుతున్న భారత జవాన్లపై సోమవారం రాత్రి కాల్పులు జరిపి ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది. ఆ వచ్చినవారు పాకిస్థాన్ సైనికులా, ఉగ్రవాదులా అన్న అంశంపై జరుగుతున్న చర్చ సంగతి అలా ఉంచితే పాకిస్థాన్ భూభాగం నుంచి వచ్చినవారు ఈ ఘటనకు పాల్పడ్డారన్నది మాత్రం వాస్తవం. పూంచ్ సెక్టార్లో జరిగిన కాల్పుల్లో తమ సైన్యం ప్రమేయమేమీ లేదని పాకిస్థాన్ ప్రకటించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేసింది. దాదాపు రెండు దశాబ్దాలుగా భారత్‌లో జరుగుతున్న వివిధ ఉగ్రవాద ఘటనలకు మూలాలు తమవద్దే ఉన్నాయని పదే పదే రుజువవుతున్నా వాటిని నిరోధించడానికి పాకిస్థాన్ తగిన చర్యలు తీసుకోలేకపోతోంది. తాజా ఘటన ఆ పరంపరకు కొనసాగింపేనని గ్రహించి తన వైఫల్యాన్ని అంగీకరించక పోగా ‘మా సైన్యం కాల్పులకు దిగలేద’ని చెబితే సరిపోతుందని పాక్ ప్రభుత్వం ఎలా అనుకుంటున్నదో అర్ధం కాదు. 2003లో అధీన రేఖ వద్ద కాల్పుల విరమణ ప్రకటించాక మూడు నాలుగేళ్లపాటు సరిహద్దులు ప్రశాంతంగానే ఉన్నాయి. అటు తర్వాత అడపా దడపా కాల్పులు, మిలిటెంట్ల చొరబాటు యత్నాల వంటివి చోటుచేసుకోవడం మళ్లీ మొదలయ్యాయి. గత రెండేళ్లుగా అధీనరేఖ వద్ద పరిస్థితి మొదటికొస్తున్న సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి. గత ఏడాది కాల్పుల విరమణకు సంబంధించి అక్కడ మొత్తం 44 ఘటనలు చోటుచేసుకోగా ఈ ఏడాది సోమవారం ఘటనతో కలుపుకుంటే ఇప్పటికే 57 ఘటనలు జరిగాయి. ఈ జనవరిలో మెంధార్ సెక్టార్లో పాక్ దళాలు ఇద్దరు భారత జవాన్లను కాల్చిచంపి వారిలో ఒకరి తలను ఎత్తుకుపోయాయి. మన సైన్యం చెబుతున్నదాన్ని బట్టి ఈ ఏడాది తొలి ఏడు నెలల కాలంలోనూ 100 మంది ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నించారు. ఈ రెండు నెలల కాలంలోనే మన సైన్యం 19 మంది ఉగ్రవాదులను కాల్చిచంపింది. ఇవన్నీ అధీనరేఖ వద్ద ఆనాటికానాటికి పెరుగుతున్న ఉద్రిక్తతలను సూచిస్తున్నాయి. కాల్పుల విరమణ ఉల్లంఘనలు చోటుచేసుకున్నప్పుడల్లా మన ప్రభుత్వం పాకిస్థాన్‌కు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నది. కానీ, పరిస్థితి నానాటికీ దిగజారుతోంది తప్ప మెరుగుపడటం లేదు. పాకిస్థాన్‌తో వచ్చిన సమస్యేమిటంటే అది భౌగోళికంగా ఒక ప్రాంతమే అయినా, దానిపై పటిష్టమైన నియంత్రణగల రాజ్యవ్యవస్థ అక్కడ కొరవడింది. అక్కడి పౌర ప్రభుత్వం అధీనంలో ఉండటాన్ని సైన్యం నామోషీగా భావిస్తుంది. గత ఐదేళ్లుగా అలా చెప్పుచేతల్లో ఉంటున్నట్టు కనబడుతున్నా అది అంతంత మాత్రమే. ఇలాంటి అనిశ్చితిలో పాకిస్థాన్‌లో ఏమైనా జరగవచ్చు. ఉగ్రవాది బిన్ లాడెన్ రాజధాని నగరానికి కూతవేటు దూరంలోనే ఉన్నా ఏళ్ల తరబడి ఆ సంగతిని గ్రహించలేని నిస్సహాయ స్థితి పాక్ ప్రభుత్వానిది. ఎక్కడో ఉన్న అమెరికా సైన్యం ఆకాశమార్గంలో వచ్చి లాడెన్‌ను చంపి శవాన్ని సైతం పట్టుకెళ్లాకగానీ అక్కడి పాలకవ్యవస్థకు తెలియలేదు. రెండు నెలలక్రితం పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టాక ఈ పరిస్థితిలో మార్పు వస్తుందేమోనని అందరూ ఆశించారు. దానికితోడు షరీఫ్ కూడా అలాగే మాట్లాడారు. ఇరుదేశాల సంబంధాల్లోనూ ఏర్పడ్డ సంక్షోభాన్ని అధిగమించడానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. భారత్ లక్ష్యంగా సాగుతున్న ఉగ్రవాద దాడులకు తమ భూభాగం వేదిక కాకుండా గట్టి చర్యలు తీసుకుంటానని చెప్పారు. కానీ, మాటలు చెప్పినంత వేగంగా పరిస్థితులు మారలేదని అధీన రేఖ వద్ద యథావిధిగా కొనసాగుతున్న దుందుడుకు చేష్టలు నిరూపిస్తున్నాయి. భారత్‌తో సయోధ్యకు పాక్ నాయకత్వం ప్రయత్నించి నప్పుడల్లా ఆ వాతావరణాన్ని చెడగొట్టడానికి సైన్యం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు జరిగిన ఘటన కూడా దానికి కొనసాగింపే కావచ్చు. ఎందుకంటే, వచ్చే నెలలో ఇరు దేశాల ప్రధానులూ ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా కలవాల్సి ఉంది. దానికితోడు పాకిస్థాన్ సైనిక దళాల చీఫ్ అష్ఫాక్ కయానీ రిటైర్ కావాల్సి ఉంది. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశం ప్రస్తుతం షరీఫ్ పరిశీలనలో ఉంది. షరీఫ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు, భారత ప్రధానితో చర్చలకు ముందు ఆయన్ను ఇరకాటంలో పెట్టేందుకు సైన్యం ప్రయత్నించి ఉండవచ్చు. ఇలాంటి సమయంలో సమష్టిగా వ్యవహరించి, భారత్ నిరసనను పాకిస్థాన్‌కు ముక్తకంఠంతో తెలియజెప్పాల్సిన ప్రస్తుత తరుణంలో యూపీఏ ప్రభుత్వం తొట్రుపాటు పడిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అధీన రేఖ ఘటనలో తమ సైన్యం ప్రమేయంలేదని పాక్ చేతులు దులుపుకుంటే, మన రక్షణ మంత్రి ఆంటోనీ ‘ఉగ్రవాదులు, పాక్ సైనిక దుస్తుల్లో ఉన్న మరికొందరు’ కాల్పులు జరిపారని ప్రకటించారు. ఆయన ఆంతర్యమేమిటోగానీ, ఆ ప్రకటన సారాంశం మాత్రం పాక్ సైన్యానికి ప్రమేయంలేదని చెప్పినట్టే ఉంది. పాక్ సైన్యం కాల్పులు జరిపి, ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నదని అంతకు గంట క్రితమే జమ్మూ నుంచి సైనిక ప్రతినిధి ప్రకటించారు. ఇలా భిన్నస్వరాలు వినబడటానికి కారణమేమిటి? పాక్ సైన్యమూ, దాని కనుసన్నల్లో నడిచే ఐఎస్ఐ ఉగ్రవాదులకు తోడ్పాటునంది స్తున్నట్టు పదే పదే రుజువవుతున్నా ఇంత ‘జాగ్రత్తగా’ ప్రకటన చేయాల్సిన అవసరం ఆంటోనికి ఏమొచ్చింది? ఇలాంటి అంశాల్లో అప్రమత్తంగా వ్యవహరిం చకపోతే దేశ ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌పై గట్టిగా ఒత్తిడి తెచ్చి, అక్కడి సైన్యం తీరుతెన్నులను ప్రపంచానికి వెల్లడించడం ద్వారా వారిని ఏకాకులను చేయవలసిన ప్రస్తుత తరుణంలో తడబాట్లకు తావుండకూడదు. దౌత్యపరంగా గట్టిగా వ్యవహరించాల్సిన తరుణంలో మనల్ని మనం బలహీనపరుచుకోకూడదు.