సంపాదకీయం: కీలకమైన ఈ వానాకాలపు పార్లమెంటు సమావేశాల కోసం ముందస్తుగా ఎన్నో కసరత్తులు చేసి మరీ బరిలోకి దిగిన యూపీఏ ప్రభుత్వం హఠాత్తుగా పాకిస్థాన్ నుంచి తలెత్తిన పూంచ్ సమస్యకు బెంబేలెత్తి, సెల్ఫ్‌గోల్ చేసుకున్నంత పనిచేసింది. జమ్మూకాశ్మీర్ పూంచ్ సెక్టార్‌లో పాకిస్థాన్ సైన్యం సోమవారం రాత్రి వాస్తవాధీన రేఖను అతిక్రమించి ఐదుగురు భారత సైనికులను కాల్చి చంపిన ఘటనపై ప్రభుత్వం రెండు రోజుల్లోనే రెండు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయాల్సి వచ్చింది. పాక్ సైనిక దుస్తులు ధరించిన వ్యక్తులతో కలిసి వచ్చిన కొందరు ఉగ్రవాదులు మన సైనికులను కాల్చి చంపారని రక్షణ మంత్రి ఆంటోనీ లోక్‌సభలో మంగళవారం ప్రకటించారు. అది తొలి సమాచారంపై ఆధారపడి చేసిన ప్రకటన అని గురువారం ఆయన వివరణ ఇచ్చారు.
ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్‌సింగ్ ఘటనా స్థలాన్ని సందర్శించిన తదుపరి అందిన తాజా సమాచారమంటూ తొలి ప్రకటనకు విరుద్ధమైన మరో ప్రకటన చేశారు. ప్రత్యేక శిక్షణ పొందిన పాక్ సైనికులే ఈ దురాగతానికి పాల్పడ్డారని స్పష్టం చేశారు. ఆకుకు అందని పోకకు పొందని ఆంటోనీ తొలి ప్రకటన పార్లమెంటులో పెద్ద దుమారాన్నే లేపింది. ఎన్నికలకు ముందు ఈ సున్నితమైన సమస్యపై భేషజాలకు పోరాదని కాంగ్రెస్ అధిష్టానం ఆలస్యంగానైనా గ్రహించింది. ప్రజాగ్రహాన్ని ప్రతిఫలించేలా రక్షణ మంత్రి ప్రకటనను సవరింపజేసింది. సవరించిన ప్రకటనకు ప్రధాన ప్రతిపక్ష నేత్రి సుష్మాస్వరాజ్ సంతృప్తి చెందడంతో పార్లమెంటు సమావేశాల నిర్వహణకు అడ్డు తొలగింది.
సమసిపోయినట్టుగా కనిపిస్తున్న ఈ వివాదం నిజానికి మన విదేశాంగ నీతికి సంబంధించి పలు మౌలిక సమస్యలను లేవనెత్తింది. 2003 నాటి వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం నేటికీ అమల్లో ఉన్నందున సరిహద్దుకు ఎటువైపు నుంచి అతిక్రమణ జరిగితే ఆ దేశమే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎలా జరిగినా ఇది పాక్ సరిహద్దుల నుంచి జరిగిన ఉల్లంఘన. కాబట్టి పాక్ ప్రభుత్వమే అందుకు బాధ్యత వహించాలి. అలాంటి బాధ్యతను కనబరిచే ప్రకటన ఏదీ అటు నుంచి వెలువడక ముందే పాక్ సైన్యం ప్రమేయం లేదని మన ప్రభుత్వం తీర్పు చెప్పాల్సిన అగత్యం ఏమిటి? వచ్చే నెలలో జరగనున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా న్యూయార్క్‌లో మన ప్రధాని మన్మో హన్‌సింగ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. ఆ చర్చలకు విఘాతం కలుగుతుందన్న భయమే వాస్తవాలను మరుగున పరిచిన మంగళవారం ప్రకటనకు కారణమైంది.
ఈ హత్యాకాండ ప్రత్యేక శిక్షణను పొందిన వృత్తి నైపుణ్యంగల సైనికులు చేసిందే తప్ప, ప్రభుత్వేతరశక్తుల చర్య కాదని సైన్యం మొదటే ధృవీకరించిందని ఉన్నత సైనికాధికారుల కథనం. ఆ నివేదికను సవివరంగా చర్చించిన తర్వాతే ప్రభుత్వం ‘జాగ్రత్త’గా తొలి ప్రకటనను తయారు చేసిందనేది స్పష్టమే. శాంతి చర్చల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలన్న చిత్తశుద్ధి ఇరుపక్షాలకూ ఉండటం అవసరం. ఏ పక్షం నుంచి చర్చల వాతావరణాన్ని దెబ్బతీసే పరిస్థితులు తలెత్తితే అదే దిద్దుబాటు చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. చర్చలపట్ల ఆ దేశపు చిత్తశుద్ధికి నిదర్శనం అదే. ఆ ప్రాథమిక దౌత్యనీతి సూత్రాన్ని సైతం విస్మరించి, అకారణంగా ఐదుగురు జవాన్లను కోల్పోయిన దేశమే చర్చల కోసం అంగలార్చడం ఏమిటి? సహేతుకమైన ఈ ప్రశ్న నేడు జాతీయస్థాయి చర్చగా మారింది. బీజేపీ నేతల నుంచే కాదు, మీడియాలో సైతం ఈ సమయంలో పాక్‌తో చర్చలు సరికాదనే ఆభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
పూంచ్ సెక్టార్ దాడికి పాల్పడ్డ పాక్ సైనికులు లేదా ఉగ్రవాదులు లేదా ఇద్దరూ ఏ లక్ష్యంతో ఈ హత్యాకాండకు పూనుకున్నారో అది నెరవే రే పరిస్థితిని సృష్టించింది ఎవరు? మన్మోహన్ ప్రభుత్వం కాదా? పాక్ సైన్యం మద్దతు లేకుండా అటు వేపు నుంచి ఏదీ జరగదన్న అందరికీ తెలిసిన వాస్తవానికి ఆంటోనీ తాజా ప్రకటన తీవ్ర హెచ్చరికను జోడించింది. ఆ హెచ్చరిక కూడా చర్చలపై అనుమానాలను రేకెత్తించింది.
సుదీర్ఘకాలంగా నలుగుతున్న పాక్ సమస్యపై మన విదేశాంగ విధానం ఇలా ఒక కొస నుంచి మరో కొసకు కొట్టుకుపోయే దుస్థితికి ఎవరిని నిందించాలి? ఎంతటి తీవ్ర సమస్యలైనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే నాగరిక దేశాలు అనుసరించాల్సిన సూత్రం అనడంలో సందేహం లేదు. సైనిక నేతల దశాబ్దాల ఏలుబడిలో బలహీనమైపోయిన పాక్ ప్రజాస్వామ్య వ్యవస్థకు చేయూతనిచ్చే సానుకూల వైఖరిని అవలంబించడం మంచిదే. అలా అని సైన్యం, ఐఎస్‌ఐలకూ, సీమాంతర ఉగ్రవాద ముఠాలకూ మధ్య ఉన్న పీటముళ్లు యథాతథంగా ఉండగానే శాంతి సాధ్యమనుకోగలమా? పాక్‌తో ద్వైపాక్షిక శాంతిచర్చల పునరుద్ధరణ కోసం భారత్‌పై అమెరికా తెస్తున్న ఒత్తిడి అందరికీ తెలిసిందే. 2008 ముంబై ఉగ్రవాద దాడుల అసలు సూత్రధారి జమాతే ఉద్ దవా అధినేత హఫీజ్ సయీద్‌ను అది ఉగ్రవాదిగా ప్రకటించి అతని తలపై కోటి డాలర్ల నజరానా ప్రకటించింది.
శుక్రవారం కరాచీలో జరిగిన బ్రహ్మాండమైన ఈద్గా ప్రార్థనా సమావేశానికి సయీద్ నేతృత్వం వహించడమే కాదు, భారత వ్యతిరేక ఉన్మాదాన్ని ప్రేరేపించే విషాన్ని వెలిగక్కాడు. భారత్-పాక్ సత్సంబంధాలకు అమెరికా అంత ప్రాధాన్యం ఇచ్చేట్టయితే సయీద్ పాక్‌లో స్వేచ్ఛగా తిరగడమేగాక, పట్టుకోగలిగితే పట్టుకోమని సవాలు విసురుతుంటే అది చేతులు ముడుచుకు కూచుంటుందా? భారత్-పాక్ స్నేహసంబంధాల ఎదుగుదలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్న సైనిక, ఉగ్రవాద శక్తులపై కనీస అదుపును సంపాదించడానికి నిన్నటి ఆసిఫ్ ఆలీ జర్దారీ ప్రభుత్వం ప్రయత్నించింది లేదు. నేటి నవాజ్ ప్రభుత్వం సైతం వెన్నెముకలేని అదే విధానాన్ని అనుసరిస్తూ, భారత్‌కు స్నేహహస్తాన్ని చాస్తున్నది. పాక్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కేవలం భారత్ బాధ్యత మాత్రమే కాదు. ఆ విషయం నవాజ్‌తోపాటూ, అమెరికా కూడా గుర్తించడం అవసరం.
దౌత్య విషాదం!
Published Sat, Aug 10 2013 12:15 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement