Sakshi News home page

పాక్‌ ఎన్నికల్లో ఆర్మీ రిగ్గింగ్‌?.. కౌంటింగ్‌ వేళ ట్విస్టులు, ఝలక్‌లు.. వీడియోలు బయటకు!

Published Fri, Feb 9 2024 7:52 PM

Pak Election Results: Social Media Flooded With one on one Allegations - Sakshi

పాకిస్థాన్‌లో ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న వేళ.. అయోమయం, గందరగోళం నెలకొంది. అక్కడ హింస చెలరేగినట్లు సోషల్‌ మీడియాలో ఉవ్వెత్తున్న ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో   జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన ‘పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌’ (PTI) పార్టీని పోటీ చేయకుండా.. కనీసం గుర్తు క్రికెట్‌ బ్యాట్‌ను వినియోగించకుండా  అక్కడి ఎన్నికల సంఘం నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన ఖాన్‌ మద్దతుదారులు.. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటున్నట్లు సమాచారం. 

ఫలితాల ప్రకటనలో జాప్యం.. ఫలితాల తారుమారు చేసేందుకేనంటూ పీటీఐ ఆందోళనకు దిగగా.. ఆందోళనకారులపై ఆర్మీ, అక్కడి పోలీసు బలగాలు దాడులకు తెగబడినట్లు ప్రచారం నడుస్తోంది. కాల్పుల్లో పలువురు మరణించినట్లు.. మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు ఫొటోలు, వీడియోల్ని వైరల్‌ చేస్తున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో ఆర్మీ రిగ్గింగ్‌కు దిగిందంటూ కొన్ని వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

మరోవైపు.. పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం మాత్రం ఎవరు ఆధిక్యంలో ఉన్నారో అధికారికంగా ప్రకటించలేదు. అయితే కొందరు మాత్రం నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పీఎంఎల్‌-ఎన్‌ వెనుకంజలో ఉందని(షరీఫ్‌ మాత్రం గెలిచారు).. ఖాన్‌ మద్దతుదారులు విజయ దుందుభి మోగిస్తున్నట్లు పలువురు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అయితే పీఎంఎల్‌-ఎన్‌ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తోంది. షరీఫ్‌ నాలుగోసారి ప్రధాని కావడం ఖాయమంటూ ఆయన వర్గీయులు ప్రచారానికి దిగగా.. ఇమ్రాన్‌ ఖాన్‌ పేరిట ఎన్నికల్లో నెగ్గుతున్న అభ్యర్థులు సైతం తమకే మద్దతు ఇస్తారంటూ పీఎంఎల్‌-ఎన్‌ ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లున్నాయి. వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరిగాల్సి ఉంది. ఓ సీటులో అభ్యర్థి చనిపోవడంతో ఈసారి 265 సీట్లకే ఎన్నికలు జరిగాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్‌ చేస్తారు. వీటిని ఆయా పార్టీలకు అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 135 సీట్లలో గెలుపొందాల్సి ఉంది. ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతుదారులు ఇప్పటికే సగానికిపైగా సీట్లు సాధించినట్లు పోస్టులు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. పాకిస్థాన్‌లో గురువారం సాయంత్రం ఎన్నికలు ముగియగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తొలి ఫలితాన్ని (Pak Poll Results) ప్రకటించారు. పీటీఐ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి సమియుల్లా ఖాన్‌ గెలుపొందినట్లు ఈసీపీ ప్రత్యేక కార్యదర్శి జాఫర్‌ ఇక్బాల్‌ మీడియాకు వెల్లడించారు. అయితే.. ఆ తర్వాత ఏం ఫలితాల వెల్లడిని నిలిపివేశారు. 

కొన్ని గంటల తర్వాత తిరిగి ప్రకటించడం ప్రారంభించారు. అయితే.. ‘ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ (ECP)’ కావాలనే ఫలితాలను ఆలస్యం చేస్తోందని పీటీఐ ఆరోపించింది. మరోవైపు జాప్యంపై పాక్‌ హోంశాఖ వివరణ ఇచ్చింది. భద్రతా కారణాలు, కమ్యూనికేషన్‌ లోపం కారణంగానే ఫలితాలు ఆలస్యమవుతున్నాయని తెలిపింది. ఓటింగ్‌ ప్రారంభానికి ముందు గురువారం ఉదయం 8 గంటల నుంచి పాక్‌ కేర్‌టేకర్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సెల్‌ఫోన్‌, మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. వాటిని ఇంకా పునరుద్ధరించకపోగా.. కొందరు మాత్రం పాక్‌లో ఇదీ పరిస్థితి అంటూ నెట్‌లో ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement