Anton
-
యుద్ధ గాయాలకు ఉపశమనం
2023 అక్టోబరు 14. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక రాజప్రాసాదం ఓ అసాధారణ షోకు వేదికైంది. అది స్టాండప్ కామెడీ. ప్రఖ్యాత కమేడియన్ ఆంటోన్ టైమోషేంకో సోలో ప్రదర్శన ఇచ్చారు. ఆ ఘనత సాధించిన తొలి ఉక్రేనియన్‌గా నిలిచారు. దాదాపు మూడేళ్లుగా యుద్ధ విషాదంలో మునిగి తేలుతున్న ఉక్రెయిన్‌కు స్టాండప్ కామెడీ ఇప్పుడు తాత్కాలిక ఉపశమనంగా మారింది. ఒకప్పుడు విలాసవంతమైనవిగా గుర్తింపు పొందిన షోలు ఇప్పుడు ఉక్రెయిన్ సంస్కృతిలో భాగమయ్యాయి. స్టాండప్ కామెడీని సైకోథెరపీ బడ్జెట్ వర్షన్‌గా అభివర్ణిస్తున్నారు టైమోషేంకో . యుద్ధ సమయంలో కామెడీ చేయడం నిజానికి అంత్యక్రియల్లో జోక్ వేయడం వంటిదే. అయినా దేశ ప్రజల ముఖాల్లో మాయమైన నవ్వును తిరిగి తెచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు స్టాండప్ కమెడియన్లు. షెల్టర్ హోమ్స్‌లో, సాయుధ దళాల కోసం, ఔట్‌డోర్ స్టేజీలపై... ఇలా వీలైన చోటల్లా ప్రదర్శనలు ఇస్తున్నారు. రష్యా క్షిపణులు ఉక్రెయిన్ నగరాల్లోకి దూసుకొస్తున్నా ప్రజలను నవ్వించడానికి ప్రయత్నిస్తున్న స్టాండప్ కామిక్స్‌లో 30 ఏళ్ల టైమోషెంకో ఒకరు. క్లిష్ట సమయాలను అధిగమించడానికి, సమాజ భావనను నిర్మించడానికి, మనోధైర్యాన్ని పెంచడానికి ఈ హాస్యం ఉత్తమమైన మార్గం అంటున్నారాయన. గాయాలను గుర్తు చేయకుండా భయంకర ఘర్షణ వాతావరణంలో హాస్యం నవ్వించగలుగుతుందా? అంటే అవునంటున్నారు కమెడియన్లు. ప్రమాదాన్ని ఎగతాళి చేయడం వల్ల దాన్ని ఎదుర్కోగల శక్తి వస్తుందంటారు కమెడియన్ హన్నా కొచెహురా. యుద్ధ సమయంలో వేసే జోక్స్ సహజంగానే యుద్ధానికి సంబంధించినవే ఉంటాయి. ఫ్రాంక్ జానర్లాగా ఉండే స్టాండప్ కామెడీలో కమెడియన్లు తమ సొంత అనుభవాలు, ఆలోచనల్లోంచే మాట్లాడతారు. యుద్ధ సమయంలో జోక్స్ ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయని అడిగితే, ఆకాశంలో రష్యా క్షిపణులను చూడగానే వాటంతటవే పుట్టకొస్తాయంటూ వ్యంగంగా బదులిస్తారు ఆంటోన్. పట్నంలో ఉన్న కొడుకుతో గ్రామంలో ఉంటున్న అమ్మ ఫోన్లో మాట్లాడుతూ, ‘బాబూ! ఈ రోజు మన ఇంటిపై నుంచి ఎన్ని రాకెట్లు వెళ్లాయో తెలుసా?’అంటూ బెదిరిపోతుంటుంది. ‘‘భయపడకులేమ్మా! అవన్నీ పట్నంలో ఉన్న నా వైపుకే వచ్చాయి’’అంటూ భయాన్ని పోగొడుతుంటాడు కొడుకు. ఇలా ఉంటుంది వారి కామెడీ. అయితే యుద్ధంపై జోక్ చేయడం కత్తిమీద సాము. ఆ క్రమంలో గాయాలను మళ్లీ రేపకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు వీళ్లు. విచారంగా, విషాదంగా అనిపించే విషయాలను కామెడీ చేయరు. సైన్యానికి సాయంగా.. ఉక్రెయిన్‌లో స్టాండప్ కామెడీకి మరో కోణమూ ఉంది. అది సైన్యానికి సాయం. యూరప్, ఉత్తర అమెరికా, ఆ్రస్టేలియాల్లోనూ వీళ్లు ప్రదర్శనలిస్తున్నారు. వచ్చిన డబ్బును సాయుధ దళాలకు సాయంగా ఇస్తున్నారు. ‘‘యుద్ధ సమయంలో ప్రతిదీ సైన్యానికి ఆచరణాత్మకంగా ఉపయోగపడాలి. దూసుకొస్తున్న క్షిపణుల మధ్య కళ గురించి మాత్రమే మాట్లాడటం మతిలేనితనం. కానీ నాకు తెలిసిన ఏకైక మార్గం కామెడీ. ఆ షోల ద్వారా నిధులు సేకరిస్తున్నా. ఇప్పటిదాకా రకూ రూ.6 కోట్లకు పైగా విరాళాలిచ్చా’’అని టైమోషేంకో చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మాట తోక
నువ్వు దీన్ని జనరల్ ఇంటికి తీసుకుపోయి, అక్కడ విచారించు. నాకు కనిపిస్తే పంపానని చెప్పు. ఇది ఖరీదైన కుక్క కావొచ్చు. ప్రతి అడ్డమైనవాడూ దాని మూతి మీద సిగరెట్‌తో కాల్చితే అది త్వరగా పాడైపోతుంది. నీవింకా ఆ వేలును చూపడం మానెయ్, దద్దమ్మా. తప్పంతా నీదే. కొత్త చలికోటు తొడుక్కుని, చంకలో ఏదో పార్శిల్ పెట్టుకున్న పోలీస్ సూపరింటెండెంట్ ఒచుమేలొవ్ మార్కెట్ దాటుతున్నాడు. ఆయన వెనుక ఎర్ర జుట్టు పోలీసు నడుస్తున్నాడు, స్వాధీనం చేసుకున్న గూస్బెర్రీ పండ్లు అంచుదాకా ఉన్న జల్లెడను మోసుకుంటూ. మార్కెట్లో ఎవరూ లేరు. అంతా నిశ్శబ్దం. కనీసం బిచ్చగాళ్లు కూడా దాపులో లేరు. ‘అయితే కరుస్తావా, పాపిష్టి మృగమా?’ హఠాత్తుగా ఒచుమేలొవ్ చెవిన పడింది. ‘అబ్బాయిలూ, దాన్ని పోనీయకండి. యీ రోజుల్లో కరవడం చెల్లదు. పట్టుకోండి! ఆ ఆ!’ అటు నుంచి కుక్క మూలుగు వినబడింది. ఒచుమేలొవ్ శబ్దం వచ్చిన వైపు చూశాడు. వర్తకుడు పిచూగిన్ కలప అడితి నుండి ఒక కుక్క మూడు కాళ్ల మీద పరుగెత్తుకుంటూ వచ్చింది. గంజి పెట్టిన కాటన్ చొక్కా, గుండీలు పెట్టుకోని వేస్టుకోటూ తొడుక్కున్న ఒకతను దాన్ని తరుముతున్నాడు. ఆ మనిషి తొట్రుకుని కుక్క వెనక కాళ్లు పట్టుకున్నాడు. కుక్క మూలుగుతో పాటు, ‘దాన్ని పోనీయొద్దు’ అనే అరుపు మరోసారి వినబడింది. దుకాణాల్లోంచి నిద్ర ముఖాలు బయటికి వచ్చాయి. నేల ఈనినట్లుగా కలప అడితి చుట్టూ జనాలు పోగైనారు. ‘యువరానర్, ఏదో గొడవలా ఉంది’ అన్నాడు పోలీసు. ఒచుమేలొవ్ ఎడమ వైపు సగం తిరిగి గుంపు వద్దకు నడిచాడు. అడితి గేటు ముందు గుండీలు పెట్టుకోని వేస్టుకోటు మనిషి కనిపించాడు. తన కుడిచేయి పైకెత్తి రక్తం కారుతున్న వేలును జనానికి చూపుతున్నాడు. అతడు స్వర్ణకారుడు హ్య్రూకిన్ అని ఒచుమేలొవ్ గుర్తించాడు. గుంపునకు సరిగ్గా మధ్యన, ముందరి కాళ్లు దూరదూరంగా పెట్టుకుని దోషి కూర్చుని వుంది, దేహమంతా వణుకుతూ. అది తెల్లని బొరోయ్ కుక్క. కొనదేలిన ముక్కు. వీపున పసుపురంగు మచ్చ. దాని తడి కళ్లల్లో భయం కనబడుతోంది. ఒచుమేలొవ్ గుంపులోకి తోసుకుంటూ పోయి, ‘ఏమిటిదంతా?’ అని అడిగాడు. హ్య్రూకిన్ పిడికిట్లోకి దగ్గుతూ ప్రారంభించాడు. ‘నా మానాన నేను దారిలో నడుస్తున్నాను. కలప గురించి యీ మీత్రియ్ మీత్రిచ్తో కొంచెం పనివుండింది. నిష్కారణంగా ఆ పాడు కుక్క నా వేలు కరిచింది. నేను పనిచేసుకునేవాణ్ని. నాది చాలా సున్నితమైన పని. ఒక వారందాకా నేను ఈ వేలిని కదిలించలేను. నాకు నష్టపరిహారం ఇప్పించండి’. ‘ఊ, సరే’ అన్నాడు ఒచుమేలొవ్, కనుబొమ్మలు ముడేస్తూ. ‘ఎవరిదీ కుక్క? దీన్ని వదిలిపెట్టను. కుక్కలను ఊరిమీద వదిలేవాళ్లకు బుద్ధి చెప్పాలి. కుక్కలనూ పశువులనూ వీధుల్లో తిరగనివ్వడమంటే ఏమిటో వాడికి తెలియజేస్తాను’. పోలీసు వైపు తిరిగి, ‘ఎల్దీరిన్, ఇది యెవరి కుక్కో కనుక్కో. దీని మెడ నులిమి చంపేయాలి. ఇది పిచ్చికుక్క అయ్యుండాలి. నేను అడుగుతున్నాను చెప్పండి, ఎవరిదీ కుక్క?’ ‘ఇది జనరల్ జిగాలొవ్ది అనుకుంటాను’. జనంలో నుండి ఎవరో అన్నారు. ‘జనరల్ జిగాలొవ్దా? ఎల్దీరిన్, నా కోటు విప్పాలి. అబ్బ, ఎంత ఉక్కగా ఉంది. వర్షం వచ్చేట్లుంది.’ ఆయన హ్య్రూకిన్ వైపు తిరిగి అన్నాడు: ‘ఒక విషయం నాకు అర్థం కాలేదు. అది నిన్ను ఎలా కరిచింది? దానికి నీ వేలు ఎలా దొరికిందని? అదేమో అంత చిన్న కుక్క, నువ్వేమో గుర్రంలా ఉన్నావు. నీ వేలికి ఎక్కడో చీల గీరుకుని ఉంటుంది! డబ్బు సంపాదించవచ్చని నీకు తర్వాత ఆలోచన వచ్చివుండాలి. మీలాంటి వాళ్ల సంగతి నాకు బాగా తెలుసు’. ‘అతడు కాలే సిగరెట్‌తో తమాషాకు దాని మూతి కాల్చాడు సార్. అది ఊరుకుంటుందా? ఈ హ్య్రూకిన్ ఎప్పుడూ ఏదో ఒక తుంటరి పనిచేస్తుంటాడు’. ‘ఒరేయ్ మెల్లకన్నోడా! నువ్వు చూడలేదు, ఎందుకురా అబద్ధాలు చెబుతున్నావు? ఆయన అన్నీ తెలిసిన పెద్దమనిషి. ఎవరు అబద్ధం చెబుతున్నదీ, ఎవరు నిజం చెబుతున్నదీ ఆయనే తెలుసుకుంటాడు. నేను అబద్ధమాడుతూ ఉంటే, నన్ను కోర్టులో విచారించండి. ఈ రోజుల్లో మనమందరం సమానమే. నీకు తెలియదేమో, పోలీసు డిపార్ట్మెంటులో నాకూ ఓ తమ్ముడున్నాడు’. ‘వాదించొద్దు.’ ‘ఊహూ, అది జనరల్ కుక్క కాదు’ దృఢ విశ్వాసంతో ప్రకటించాడు పోలీసు. ‘జనరల్‌కు అలాంటి కుక్క లేదు. ఆయనవన్నీ వేటకుక్కలు’. ‘నీకు కచ్చితంగా తెలుసా?’ ‘అవును సార్’ ‘నాకూ తెలుసు. జనరల్ వన్నీ ఖరీదైనవి, జాతైనవి. ఇది చూడు ఎలావుందో! అల్ప ప్రాణి. ఇలాంటి దాన్ని పెంచుకోవడమంటే... అర్థమే లేదు. ఇలాంటి కుక్క మాస్కోలోనో, పీటర్స్బర్గ్లోనో కనబడితే ఏం చేస్తారో తెలుసా? చట్టాన్ని ఎవరూ పట్టించుకోరు. క్షణంలో లాగిపారేస్తారు. హ్య్రూకిన్, నీకు గాయమైంది. విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టొద్దు. వాళ్లకు బుద్ధి చెప్పాలి. దానికిదే తగిన సమయం’. ‘అది జనరల్‌దే కావొచ్చు’ పోలీసు తనలో తాను గొణుక్కున్నాడు. ‘దాని ముఖం మీద ఏమీ రాసిలేదుగా. మొన్నోసారి అలాంటి కుక్కే ఆయన పెరట్లో చూశాను’. ‘అది కచ్చితంగా జనరల్‌దే’ జనంలోంచి ఒక గొంతు వినిపించింది. ‘హు, ఎల్దీరిన్, అబ్బాయీ, గాలి వీస్తోంది. కోటు వేసుకోవడానికి కొంచెం సాయం చెయ్యి. చలిగా ఉంది. నువ్వు దీన్ని జనరల్ ఇంటికి తీసుకుపోయి, అక్కడ విచారించు. నాకు కనిపిస్తే పంపానని చెప్పు. బయటికి వదలొద్దని చెప్పు. ఇది ఖరీదైన కుక్క కావొచ్చు. ప్రతి అడ్డమైనవాడూ దాని మూతి మీద సిగరెట్‌తో కాల్చితే అది త్వరగా పాడైపోతుంది. కుక్క సుకుమారమైన జంతువు. నీవింకా ఆ వేలును చూపడం మానెయ్, దద్దమ్మా. తప్పంతా నీదే’. ‘అదిగో, జనరల్ వంటమనిషి వస్తున్నాడు, అతణ్ని అడుగుదాం. ఓయ్ ప్రొహోర్, ఇలారా. ఈ కుక్కను చూడు. ఇది మీదేనా?’ ‘భలేవాళ్లే! యిలాంటిది మాకెప్పుడూ లేదు’. ‘ఇక అడిగి లాభం లేదు’ అన్నాడు ఒచుమేలొవ్. ‘ఇది వీధికుక్క. అతడు ఇది వీధికుక్కన్నాడంటే ఇది వీధికుక్కే. దీన్ని చంపేసి విషయం ముగించెయ్యాలంతే’. ‘ఇది మా కుక్క కాదు...’ ప్రొహోర్ కొనసాగించాడు. ‘కానీ ఇది జనరల్ తమ్ముడిది. మొన్న ఆయన వచ్చాడు. మా అయ్యగారికి రేసుకుక్కల మీద అంత ఇది లేదు. కానీ ఆయన తమ్మునికిష్టం’. ‘ఏంటీ? జనరల్ తమ్ముడు వచ్చాడనిగానీ చెప్పడం లేదుగదా నువ్వు? వ్లదీమిర్ ఇవానిచ్?’ అడిగాడు ఒచుమేలొవ్. అతడి ముఖమంతా పరవశత్వపు చిరునవ్వుతో వెలిగింది. ‘చిత్రంగా ఉందే. నాకు తెలియనే లేదు. చూడటానికి వచ్చాడా?’ ‘అవును’. ‘అస్సలు అనుకోలేదు. వాళ్ల అన్నకు దూరంగా అసలు ఉండలేడు. నాకు తెలియనేలేదు. అయితే ఇది ఆయనగారి కుక్కన్నమాట. బాగుంది. ఎత్తుకో దాన్ని. అంత చెడ్డ కుక్కేమీ కాదు. ఎంత ముచ్చటగా ఉంది! వాడి వేలు కొరికింది! హహహ. రా, ఎందుకు భయపడుతున్నావు? గ్ర్ గ్ర్... దీనికి కోపమొచ్చింది? అబ్బో ఏం కుక్క!’ ప్రొహోర్ కుక్కను పిలుచుకుని, కలప అడితి నుండి తీసుకుపోయాడు. జనం హ్య్రూకిన్ను చూసి నవ్వారు. ‘ఎప్పుడోసారి నీ పని చూస్తాను’ అంటూ ఒచుమేలొవ్ అతణ్ని బెదిరించి, తన చలికోటు చుట్టూ కప్పుకొని తన దోవన వెళ్లిపోయాడు. నలభై నాలుగేళ్లకే మరణించిన ఆంటన్ చెహోవ్ (1860–1904) రష్యన్ కథ ‘ఊసరవెల్లి’ సంక్షిప్త రూపం ఇది. ప్రపంచ కథా సాహిత్యంలో గొప్ప కథకుల్లో ఒకరుగా పేరొందారు చెహోవ్. ముందు డబ్బుల కోసమే రాయడం ప్రారంభించినా, తర్వాత ఆయనలోని కళాపిపాస కథను కొత్త పుంతలు తొక్కించడానికి కారణమైంది. ఆధునిక రంగస్థల పితామహుల్లో ఒకరిగానూ ఆయనకు ఖ్యాతి ఉంది. ఆంటన్ చెహోవ్ -
దౌత్య విషాదం!
సంపాదకీయం: కీలకమైన ఈ వానాకాలపు పార్లమెంటు సమావేశాల కోసం ముందస్తుగా ఎన్నో కసరత్తులు చేసి మరీ బరిలోకి దిగిన యూపీఏ ప్రభుత్వం హఠాత్తుగా పాకిస్థాన్ నుంచి తలెత్తిన పూంచ్ సమస్యకు బెంబేలెత్తి, సెల్ఫ్‌గోల్ చేసుకున్నంత పనిచేసింది. జమ్మూకాశ్మీర్ పూంచ్ సెక్టార్లో పాకిస్థాన్ సైన్యం సోమవారం రాత్రి వాస్తవాధీన రేఖను అతిక్రమించి ఐదుగురు భారత సైనికులను కాల్చి చంపిన ఘటనపై ప్రభుత్వం రెండు రోజుల్లోనే రెండు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయాల్సి వచ్చింది. పాక్ సైనిక దుస్తులు ధరించిన వ్యక్తులతో కలిసి వచ్చిన కొందరు ఉగ్రవాదులు మన సైనికులను కాల్చి చంపారని రక్షణ మంత్రి ఆంటోనీ లోక్‌సభలో మంగళవారం ప్రకటించారు. అది తొలి సమాచారంపై ఆధారపడి చేసిన ప్రకటన అని గురువారం ఆయన వివరణ ఇచ్చారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్‌సింగ్ ఘటనా స్థలాన్ని సందర్శించిన తదుపరి అందిన తాజా సమాచారమంటూ తొలి ప్రకటనకు విరుద్ధమైన మరో ప్రకటన చేశారు. ప్రత్యేక శిక్షణ పొందిన పాక్ సైనికులే ఈ దురాగతానికి పాల్పడ్డారని స్పష్టం చేశారు. ఆకుకు అందని పోకకు పొందని ఆంటోనీ తొలి ప్రకటన పార్లమెంటులో పెద్ద దుమారాన్నే లేపింది. ఎన్నికలకు ముందు ఈ సున్నితమైన సమస్యపై భేషజాలకు పోరాదని కాంగ్రెస్ అధిష్టానం ఆలస్యంగానైనా గ్రహించింది. ప్రజాగ్రహాన్ని ప్రతిఫలించేలా రక్షణ మంత్రి ప్రకటనను సవరింపజేసింది. సవరించిన ప్రకటనకు ప్రధాన ప్రతిపక్ష నేత్రి సుష్మాస్వరాజ్ సంతృప్తి చెందడంతో పార్లమెంటు సమావేశాల నిర్వహణకు అడ్డు తొలగింది. సమసిపోయినట్టుగా కనిపిస్తున్న ఈ వివాదం నిజానికి మన విదేశాంగ నీతికి సంబంధించి పలు మౌలిక సమస్యలను లేవనెత్తింది. 2003 నాటి వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం నేటికీ అమల్లో ఉన్నందున సరిహద్దుకు ఎటువైపు నుంచి అతిక్రమణ జరిగితే ఆ దేశమే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎలా జరిగినా ఇది పాక్ సరిహద్దుల నుంచి జరిగిన ఉల్లంఘన. కాబట్టి పాక్ ప్రభుత్వమే అందుకు బాధ్యత వహించాలి. అలాంటి బాధ్యతను కనబరిచే ప్రకటన ఏదీ అటు నుంచి వెలువడక ముందే పాక్ సైన్యం ప్రమేయం లేదని మన ప్రభుత్వం తీర్పు చెప్పాల్సిన అగత్యం ఏమిటి? వచ్చే నెలలో జరగనున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా న్యూయార్క్‌లో మన ప్రధాని మన్మో హన్‌సింగ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. ఆ చర్చలకు విఘాతం కలుగుతుందన్న భయమే వాస్తవాలను మరుగున పరిచిన మంగళవారం ప్రకటనకు కారణమైంది. ఈ హత్యాకాండ ప్రత్యేక శిక్షణను పొందిన వృత్తి నైపుణ్యంగల సైనికులు చేసిందే తప్ప, ప్రభుత్వేతరశక్తుల చర్య కాదని సైన్యం మొదటే ధృవీకరించిందని ఉన్నత సైనికాధికారుల కథనం. ఆ నివేదికను సవివరంగా చర్చించిన తర్వాతే ప్రభుత్వం ‘జాగ్రత్త’గా తొలి ప్రకటనను తయారు చేసిందనేది స్పష్టమే. శాంతి చర్చల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలన్న చిత్తశుద్ధి ఇరుపక్షాలకూ ఉండటం అవసరం. ఏ పక్షం నుంచి చర్చల వాతావరణాన్ని దెబ్బతీసే పరిస్థితులు తలెత్తితే అదే దిద్దుబాటు చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. చర్చలపట్ల ఆ దేశపు చిత్తశుద్ధికి నిదర్శనం అదే. ఆ ప్రాథమిక దౌత్యనీతి సూత్రాన్ని సైతం విస్మరించి, అకారణంగా ఐదుగురు జవాన్లను కోల్పోయిన దేశమే చర్చల కోసం అంగలార్చడం ఏమిటి? సహేతుకమైన ఈ ప్రశ్న నేడు జాతీయస్థాయి చర్చగా మారింది. బీజేపీ నేతల నుంచే కాదు, మీడియాలో సైతం ఈ సమయంలో పాక్‌తో చర్చలు సరికాదనే ఆభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. పూంచ్ సెక్టార్ దాడికి పాల్పడ్డ పాక్ సైనికులు లేదా ఉగ్రవాదులు లేదా ఇద్దరూ ఏ లక్ష్యంతో ఈ హత్యాకాండకు పూనుకున్నారో అది నెరవే రే పరిస్థితిని సృష్టించింది ఎవరు? మన్మోహన్ ప్రభుత్వం కాదా? పాక్ సైన్యం మద్దతు లేకుండా అటు వేపు నుంచి ఏదీ జరగదన్న అందరికీ తెలిసిన వాస్తవానికి ఆంటోనీ తాజా ప్రకటన తీవ్ర హెచ్చరికను జోడించింది. ఆ హెచ్చరిక కూడా చర్చలపై అనుమానాలను రేకెత్తించింది. సుదీర్ఘకాలంగా నలుగుతున్న పాక్ సమస్యపై మన విదేశాంగ విధానం ఇలా ఒక కొస నుంచి మరో కొసకు కొట్టుకుపోయే దుస్థితికి ఎవరిని నిందించాలి? ఎంతటి తీవ్ర సమస్యలైనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే నాగరిక దేశాలు అనుసరించాల్సిన సూత్రం అనడంలో సందేహం లేదు. సైనిక నేతల దశాబ్దాల ఏలుబడిలో బలహీనమైపోయిన పాక్ ప్రజాస్వామ్య వ్యవస్థకు చేయూతనిచ్చే సానుకూల వైఖరిని అవలంబించడం మంచిదే. అలా అని సైన్యం, ఐఎస్ఐలకూ, సీమాంతర ఉగ్రవాద ముఠాలకూ మధ్య ఉన్న పీటముళ్లు యథాతథంగా ఉండగానే శాంతి సాధ్యమనుకోగలమా? పాక్‌తో ద్వైపాక్షిక శాంతిచర్చల పునరుద్ధరణ కోసం భారత్‌పై అమెరికా తెస్తున్న ఒత్తిడి అందరికీ తెలిసిందే. 2008 ముంబై ఉగ్రవాద దాడుల అసలు సూత్రధారి జమాతే ఉద్ దవా అధినేత హఫీజ్ సయీద్‌ను అది ఉగ్రవాదిగా ప్రకటించి అతని తలపై కోటి డాలర్ల నజరానా ప్రకటించింది. శుక్రవారం కరాచీలో జరిగిన బ్రహ్మాండమైన ఈద్గా ప్రార్థనా సమావేశానికి సయీద్ నేతృత్వం వహించడమే కాదు, భారత వ్యతిరేక ఉన్మాదాన్ని ప్రేరేపించే విషాన్ని వెలిగక్కాడు. భారత్-పాక్ సత్సంబంధాలకు అమెరికా అంత ప్రాధాన్యం ఇచ్చేట్టయితే సయీద్ పాక్‌లో స్వేచ్ఛగా తిరగడమేగాక, పట్టుకోగలిగితే పట్టుకోమని సవాలు విసురుతుంటే అది చేతులు ముడుచుకు కూచుంటుందా? భారత్-పాక్ స్నేహసంబంధాల ఎదుగుదలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్న సైనిక, ఉగ్రవాద శక్తులపై కనీస అదుపును సంపాదించడానికి నిన్నటి ఆసిఫ్ ఆలీ జర్దారీ ప్రభుత్వం ప్రయత్నించింది లేదు. నేటి నవాజ్ ప్రభుత్వం సైతం వెన్నెముకలేని అదే విధానాన్ని అనుసరిస్తూ, భారత్‌కు స్నేహహస్తాన్ని చాస్తున్నది. పాక్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కేవలం భారత్ బాధ్యత మాత్రమే కాదు. ఆ విషయం నవాజ్తోపాటూ, అమెరికా కూడా గుర్తించడం అవసరం.