ఉక్రేనియన్లకు ఊరటగా స్టాండప్ కామెడీ
సంస్కృతిలో భాగంగా మారిన వైనం
ఆర్థిక సాయమూ అందిస్తున్న కమెడియన్లు
2023 అక్టోబరు 14. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక రాజప్రాసాదం ఓ అసాధారణ షోకు వేదికైంది. అది స్టాండప్ కామెడీ. ప్రఖ్యాత కమేడియన్ ఆంటోన్ టైమోషేంకో సోలో ప్రదర్శన ఇచ్చారు. ఆ ఘనత సాధించిన తొలి ఉక్రేనియన్‌గా నిలిచారు. దాదాపు మూడేళ్లుగా యుద్ధ విషాదంలో మునిగి తేలుతున్న ఉక్రెయిన్‌కు స్టాండప్ కామెడీ ఇప్పుడు తాత్కాలిక ఉపశమనంగా మారింది. ఒకప్పుడు విలాసవంతమైనవిగా గుర్తింపు పొందిన షోలు ఇప్పుడు ఉక్రెయిన్ సంస్కృతిలో భాగమయ్యాయి. స్టాండప్ కామెడీని సైకోథెరపీ బడ్జెట్ వర్షన్‌గా అభివర్ణిస్తున్నారు టైమోషేంకో .
యుద్ధ సమయంలో కామెడీ చేయడం నిజానికి అంత్యక్రియల్లో జోక్ వేయడం వంటిదే. అయినా దేశ ప్రజల ముఖాల్లో మాయమైన నవ్వును తిరిగి తెచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు స్టాండప్ కమెడియన్లు. షెల్టర్ హోమ్స్‌లో, సాయుధ దళాల కోసం, ఔట్‌డోర్ స్టేజీలపై... ఇలా వీలైన చోటల్లా ప్రదర్శనలు ఇస్తున్నారు. రష్యా క్షిపణులు ఉక్రెయిన్ నగరాల్లోకి దూసుకొస్తున్నా ప్రజలను నవ్వించడానికి ప్రయత్నిస్తున్న స్టాండప్ కామిక్స్‌లో 30 ఏళ్ల టైమోషెంకో ఒకరు. క్లిష్ట సమయాలను అధిగమించడానికి, సమాజ భావనను నిర్మించడానికి, మనోధైర్యాన్ని పెంచడానికి ఈ హాస్యం ఉత్తమమైన మార్గం అంటున్నారాయన.
గాయాలను గుర్తు చేయకుండా
భయంకర ఘర్షణ వాతావరణంలో హాస్యం నవ్వించగలుగుతుందా? అంటే అవునంటున్నారు కమెడియన్లు. ప్రమాదాన్ని ఎగతాళి చేయడం వల్ల దాన్ని ఎదుర్కోగల శక్తి వస్తుందంటారు కమెడియన్ హన్నా కొచెహురా. యుద్ధ సమయంలో వేసే జోక్స్ సహజంగానే యుద్ధానికి సంబంధించినవే ఉంటాయి. ఫ్రాంక్ జానర్‌లాగా ఉండే స్టాండప్ కామెడీలో కమెడియన్లు తమ సొంత అనుభవాలు, ఆలోచనల్లోంచే మాట్లాడతారు. యుద్ధ సమయంలో జోక్స్ ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయని అడిగితే, ఆకాశంలో రష్యా క్షిపణులను చూడగానే వాటంతటవే పుట్టకొస్తాయంటూ వ్యంగంగా బదులిస్తారు ఆంటోన్.
పట్నంలో ఉన్న కొడుకుతో గ్రామంలో ఉంటున్న అమ్మ ఫోన్‌లో మాట్లాడుతూ, ‘బాబూ! ఈ రోజు మన ఇంటిపై నుంచి ఎన్ని రాకెట్లు వెళ్లాయో తెలుసా?’అంటూ బెదిరిపోతుంటుంది. ‘‘భయపడకులేమ్మా! అవన్నీ పట్నంలో ఉన్న నా వైపుకే వచ్చాయి’’అంటూ భయాన్ని పోగొడుతుంటాడు కొడుకు. ఇలా ఉంటుంది వారి కామెడీ. అయితే యుద్ధంపై జోక్ చేయడం కత్తిమీద సాము. ఆ క్రమంలో గాయాలను మళ్లీ రేపకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు వీళ్లు. విచారంగా, విషాదంగా అనిపించే విషయాలను కామెడీ చేయరు.
సైన్యానికి సాయంగా..
ఉక్రెయిన్‌లో స్టాండప్ కామెడీకి మరో కోణమూ ఉంది. అది సైన్యానికి సాయం. యూరప్, ఉత్తర అమెరికా, ఆ్రస్టేలియాల్లోనూ వీళ్లు ప్రదర్శనలిస్తున్నారు. వచ్చిన డబ్బును సాయుధ దళాలకు సాయంగా ఇస్తున్నారు. ‘‘యుద్ధ సమయంలో ప్రతిదీ సైన్యానికి ఆచరణాత్మకంగా ఉపయోగపడాలి. దూసుకొస్తున్న క్షిపణుల మధ్య కళ గురించి మాత్రమే మాట్లాడటం మతిలేనితనం. కానీ నాకు తెలిసిన ఏకైక మార్గం కామెడీ. ఆ షోల ద్వారా నిధులు సేకరిస్తున్నా. ఇప్పటిదాకా రకూ రూ.6 కోట్లకు పైగా విరాళాలిచ్చా’’అని టైమోషేంకో చెప్పారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment