Ukraine - Russia
-
వచ్చే ఏడాది భారత్‌లో పుతిన్ పర్యటన!
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించే వీలుంది. దశాబ్దాల స్నేహం, బలమైన రక్షణ, వాణిజ్య బంధాలు, పరస్పరసహకారాలతో ఇరుదేశాల ద్వైపాక్షిక బంధం పటిష్టంగా ఉన్న నేపథ్యంలో వార్షిక పర్యటనల్లో భాగంగా వచ్చే ఏడాది పుతిన్ భారత్‌కు రావొచ్చని దౌత్యవర్గాలు మంగళవారం వెల్లడించాయి. పుతిన్ పర్యటన వేళ రష్యా ఏఏ అంశాలపై భారత్‌తో ఒప్పందాలు చేసుకోవచ్చు అనేది ఇంకా ఖరారుకాలేదని తెలుస్తోంది. ఈ ఏడాది జూలైలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా రాజధాని మాస్కోలో పర్యటించి పుతిన్‌తో విస్తృతస్థాయి చర్చలు జరిపిన విషయం విదితమే. భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతంకానుందని మంగళవారం రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పుతిన్ భారత పర్యటన ఖాయమని దాదాపు స్పష్టమైంది. మంగళవారం ఆయన భారత సీనియర్ సంపాదకులతో వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ పుతిన్ త్వరలోనే భారత్‌లో పర్యటిస్తారు. అయితే పర్యటన తేదీలపై ఇరుదేశాలు సంప్రదింపులు జరపాల్సి ఉంది’ అని పెస్కోవ్ అన్నారు. అయితే ఏ తేదీల్లో ఎన్ని రోజులు భారత్‌లో పుతిన్ పర్యటిస్తారన్న వివరాలను దిమిత్రీ వెల్లడించలేదు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మోదీ గత నెలలో కజక్‌స్తాన్‌లో పర్యటించిన విషయం తెల్సిందే. దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్‌కు అందించాలని బైడెన్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెస్కోవ్ మాట్లాడారు. ‘‘అమెరికా నిర్ణయం ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మరింత ఆజ్యంపోస్తోంది. యుద్ధం మరింతగా విస్తరించడం ఖాయం. బైడెన్ ప్రభుత్వం యుద్ధానికే మద్దతు పలుకుతోంది. శాంతిస్థాపనకు కాదు. రష్యాపై అధునాతన ఆయుధాల వినియోగానికి అమెరికా పచ్చజెండా ఊపిన నేపథ్యంలో మేం కూడా మా అణ్వస్త్ర విధానాన్ని సవరించాల్సిన సమయమొచ్చింది’’ అని పెస్కోవ్ అన్నారు. అణ్వాయుధ వినియోగానికి సంబంధించిన కీలక దస్త్రంపై పుతిన్ సంతకం చేసిన వేళ పెస్కోవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం?
రష్యాపై యూఎస్ తయారీ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో ఉక్రెయిన్ దాడులు. తీవ్రస్థాయిలో మండిపడుతున్న రష్యా. దీన్ని అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణిస్తామని ప్రకటన. అణు దాడితో దీటుగా బదులిచ్చేందుకు వీలుగా రష్యా అణు విధానాన్ని సవరిస్తూ అధ్యక్షుడు పుతిన్ నిర్ణయం. ‘ఏ క్షణాన్నయినా అణు యుద్ధం ముంచుకు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి’ అంటూ ప్రజలకు యూరప్ దేశాల ‘వార్ గైడ్‌లైన్స్’. సోమవారం ఒక్క రోజే శరవేగంగా జరిగిన తీవ్ర ఆందోళనకర పరిణామాలివి! ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి తెర తీసి సరిగ్గా 1,000 రోజులు పూర్తయిన నాడే చోటుచేసుకున్న ఈ తీవ్ర పరిణామాలు గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే నాల్కలు చాస్తున్న యుద్ధ జ్వాలలు మరింతగా విస్తరించి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అన్న ఆందోళనలు సర్వత్రా తలెత్తుతున్నాయి.అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ విజయంతో ఉక్రెయిన్ యుద్ధానికి తెర పడుతుందని, పశ్చిమాసియా కల్లోలమూ కాస్త అదుపులోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇందుకు బీజం పడింది. అమెరికా అందజేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాలో సుదూర లక్ష్యాలపై దాడుల నిమిత్తం వాడేందుకు ఉక్రెయిన్‌కు ఆయన అనుమతివ్వడం ఒక్కసారిగా ఉద్రిక్తతలను రాజేసింది. దీన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న ఉక్రెయిన్ మంగళవారమే రష్యాపై యూఎస్ దీర్ఘశ్రేణి ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టం (ఏటీఏసీఎంస్) బాలిస్టిక్ క్షిపణులను ఎడాపెడా ప్రయోగించింది. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతమే లక్ష్యంగా దాడులకు దిగింది. ఈ క్షిపణులను ఉక్రెయిన్ యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి. అలాంటి చర్యలకు దిగితే తీవ్రస్థాయి ప్రతిస్పందన తప్పదని ఇప్పటికే హెచ్చరించిన రష్యా ఈ పరిణామంపై భగ్గుమంది. తమ భూభాగాలపైకి కనీసం ఆరు అమెరికా తయారీ ఏటీఏసీఎంఎస్ క్షిపణులు వచ్చి పడ్డాయని ధ్రువీకరించింది. వాటిలో ఐదింటిని కూల్చేయడంతో పాటు ఆరో దాన్నీ ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా అణు దాడులు! తాజా పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మండిపడుతున్నారు. మంగళవారం ఆయన రక్షణ తదితర శాఖల అత్యున్నత స్థాయి అధికారులతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ క్షిపణి దాడులను అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణించాలని నిర్ణయించారు. అందుకు వీలు కలి్పంచేలా దేశ అణు విధానానికి సవరణ కూడా చేశారు! దాని ప్రకారం సంప్రదాయ ఆయుధాలతో రష్యాపై జరిగే దాడికి ఏ అణ్వాయుధ దేశమైనా మద్దతిస్తే దాన్ని ఆ రెండు దేశాల సంయుక్త దాడిగానే పరిగణిస్తారు. సదరు దేశాలపై అణు దాడులకు దిగుతారా అన్నదానిపై సవరణలో స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే రష్యాపై భారీ స్థాయి వైమానిక, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణి దాడులు జరిగితే అణ్వాయుధాలతో బదులిచ్చేందుకు అది వీలు కలి్పస్తుండటం విశేషం! అంతేగాక మిత్ర దేశమైన బెలారస్‌పై దుందుడుకు చర్యలకు దిగినా అణ్వాయుధాలతో బదులు చెప్పేందుకు తాజా సవరణ అనుమతించనుంది! ఉక్రెయిన్‌కు మరింత సాయం చేయకుండా యూరప్ దేశాలను నియంత్రించడంతో పాటు అవసరమైతే దానిపై అణ్వాయుధ ప్రయోగానికి, అమెరికాపై సైనిక చర్యకు కూడా దిగడం పుతిన్ తాజా నిర్ణయాల ఉద్దేశమని భావిస్తున్నారు. అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులతో ఉక్రెయిన్ చేసిన తాజా దాడులకు బదులుగానే అణు విధాన సవరణ జరిగిందా అన్న ప్రశ్నకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ నేరుగా బదులివ్వలేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా అణు విధానాన్ని అప్డేట్ చేయాల్సిందిగా పుతిన్ ఆదేశించారంటూ నర్మగర్భంగా స్పందించారు. ఇటీవలి కాలంలో రష్యా అణు విధానానికి పుతిన్ సవరణ చేయడం ఇది రెండోసారి. రష్యాకు దన్నుగా ఉత్తర కొరియా సైన్యం కూడా ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాల్గొంటుండటం తెలిసిందే. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అమెరికా ఇప్పటికే ప్రకటించింది. దీర్ఘశ్రేణి క్షిపణుల వాడకానికి అనుమతి దాని పర్యవసానమేనంటున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ జ్వాలలు త్వరలో కొరియా ద్వీపకల్పం దాకా విస్తరించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బైడెన్ మతిలేని విధానాలతో ట్రంప్ పగ్గాలు చేపట్టే నాటికే ప్రపంచాన్ని పెనుయుద్ధం ముంగిట నిలిపేలా ఉన్నారని ఆయన కుమారుడు జూనియర్ ట్రంప్ మండిపడటం తెలిసిందే.నిత్యావసరాలు నిల్వ చేసుకోండితాజా పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కన్పిస్తుండటంతో యూరప్ దేశాలు భీతిల్లుతున్నాయి. అలాంటి పరిస్థితే తలెత్తితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ స్వీడన్, ఫిన్లండ్, నార్వే, డెన్మార్క్ తదితర నాటో సభ్య దేశాలు తమ పౌరులను హెచ్చరించడం విశేషం. ‘‘ఏ క్షణంలోనైనా అణు యుద్ధం ముంచుకు రావచ్చు. సిద్ధంగా ఉండండి’’ అంటూ స్వీడన్ ఏకంగా ఇంటింటికీ కరపత్రాలే పంచుతోంది. ‘సంక్షోభమో, యుద్ధమో వస్తే...’ అనే శీర్షికతో కూడిన 52 లక్షల కరపత్రాలను సోమవారం నుంచి వారం పాటు పంచనుంది! అది నిజానికి 32 పేజీలతో కూడిన డాక్యుమెంట్. ‘‘మనపై ఎవరైనా దాడికి తెగబడితే దేశ స్వాతంత్య్ర పరిరక్షణకు అందరమూ ఒక్కటవుదాం’’ అని అందులో పౌరులకు స్వీడన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. దాంతోపాటు, ‘‘పిల్లల డైపర్లు, బేబీ ఫుడ్, దీర్ఘకాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలు, మంచినీరు తదితరాలన్నింటినీ వీలైనంతగా సేకరించి పెట్టుకోండి’’ అని సూచించింది. అంతేగాక బాంబు దాడులు జరిగితే వాటిబారి నుంచి ఎలా తప్పించుకోవాలి, గాయపడితే రక్తస్రావాన్ని నిరోధించేందుకు, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఏం చేయాలి, యుద్ధ బీభత్సం చూసి భీతిల్లే చిన్నారులను ఎలా సముదాయించాలి వంటి వివరాలెన్నో పొందుపరిచింది.‘‘పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వీడన్ ఇలాంటి చర్యకు దిగడం ఇది ఐదోసారి. నార్వే కూడా ఇలాంటి ‘యుద్ధ’ జాగ్రత్తలతో ప్రజలకు ఎమర్జెన్సీ పాంప్లెంట్లు పంచుతోంది. ‘పూర్తిస్థాయి యుద్ధంతో పాటు ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే వారం దాకా ఇల్లు కదలకుండా గడిపేందుకు సిద్ధపడండి’ అంటూ అప్రమత్తం చేస్తోంది. డెన్మార్క్ కూడా కనీసం మూడు రోజులకు పైగా సరిపడా సరుకులు, మంచినీరు, ఔషధాలు తదితరాలు నిల్వ ఉంచుకోవాలంటూ తన పౌరులందరికీ ఇప్పటికే ఈ–మెయిళ్లు పంపింది! ఫిన్లండ్ కూడా అదే బాట పట్టింది. ‘రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండండి. నిత్యావసరాలను వీలైనంతగా సేకరించి పెట్టుకోండి’ అంటూ తన పౌరులకు ఆన్లైన్ బ్రోషర్లు పంపింది.అపారంగా అణ్వాయుధాలు రష్యా వద్ద వేలాదిగా అణ్వాయుధాలు పోగు పడి ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో అణు వార్హెడ్లున్న దేశం రష్యానే. 1994లో సోవియట్ నుంచి విడిపోయేనాటికి ఉక్రెయిన్ వద్ద కూడా భారీగానే అణ్వాయుధాలుండేవి. ఆ జాబితాలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశంగా ఉక్రెయిన్ ఉండేది. కానీ రష్యాతో ఒప్పందంలో భాగంగా తన అణ్వాయుధాలన్నింటినీ నాశనం చేసింది. కాకపోతే అమెరికాతో పాటు అణు సంపత్తి ఉన్న పలు దేశాలు ఉక్రెయిన్‌కు దన్నుగా ఉన్నాయి.క్షిపణులే మాట్లాడతాయి భారీ క్షిపణి దాడులకు మాకు అనుమతి లభించిందంటూ మీడియా ఏదేదో చెబుతోంది. కానీ దాడులు జరిగేది మాటలతో కాదు. వాటిని ముందుగా చెప్పి చేయరు. ఇక మా తరఫున క్షిపణులే మాట్లాడతాయి. – ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
వెయ్యి రోజుల యుద్ధం
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి నేటికి వెయ్యి రోజులు పూర్తయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన ఈ యుద్ధం ఐరోపాలో అత్యంత ఘోరమైన సంఘర్షణగా రూపుదిద్దుకుంది. పలు నివేదికలలోని వివరాల ప్రకారం ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఒక మిలియన్(10 లక్షలు)కు పైగా జనం మరణించడమో, తీవ్రంగా గాయపడటమో జరిగింది.2022లో ప్రారంభమైన 21వ శతాబ్దపు ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌లోని నగరాలు, పట్టణాలు, గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రాణనష్టం, ఆస్తి నష్టం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. యుద్ధంలో దెబ్బతిన్న దేశం నుంచి నిరంతరం హృదయాన్ని కదిలించే వార్తలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి కంటే ఇప్పుడు ఆ దేశం ఎంతో బలహీనంగామారింది.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం యుద్ధంలో 80 వేల మంది ఉక్రేనియన్ సైనికులు మరణించారు. నాలుగు లక్షల మందికి పైగా సైనికులు గాయపడ్డారు. పాశ్చాత్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అందించిన వివరాల ప్రకారం రష్యన్ సైనికుల మరణాల గణాంకాలు భిన్నంగా ఉన్నాయి. కొన్ని నివేదికలలో మరణించిన సైనికుల సంఖ్య సుమారు రెండు లక్షలు, గాయపడిన వారి సంఖ్య దాదాపు నాలుగు లక్షలుగా పేర్కొన్నారు. రెండు దేశాల జనాభా ఇప్పటికే క్షీణించింది. యుద్ధానికి ముందే ఇరు దేశాలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. యుద్ధం కారణంగా సంభవించిన భారీ మరణాల ప్రభావం ఇరు దేశాల జనాభా గణాంకాలపై కనిపిస్తోంది.మరణించిన సైనికుల డేటా గోప్యం?ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మిషన్ తెలిపిన వివరాల ప్రకారం ఉక్రెయిన్‌లో ఆగస్టు 2024 నాటికి 11,743 మంది పౌరులు మరణించారు. 24,614 మంది గాయపడ్డారు. ముఖ్యంగా మారియుపోల్ వంటి రష్యన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో ఈ మరణాలు సంభవించాయి. ఇదేకాకుండా ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు 589 మంది చిన్నారులు కూడా మరణించారు. యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు, గ్రౌండ్ దళాలు నిరంతరం దాడులు చేస్తున్నాయి. జాతీయ భద్రత కోసం యుద్ధంలో మరణించిన తమ సైనికుల డేటాను ఇరుపక్షాలు గోప్యంగా ఉంచాయని, పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ఇచ్చిన అంచనాలలో చాలా తేడా ఉందని ఒక ఈ మీడియా నివేదిక పేర్కొంది. సైనిక ప్రాణనష్టం విషయంలో కూడా రష్యాకు భారీ నష్టం వాటిల్లిందనే అంచనాలున్నాయి ఈ భీకర యుద్ధంలో ఒక్క రోజులో వెయ్యి మందికి పైగా రష్యన్ సైనికులు మరణించారు. ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ 2024, ఫిబ్రవరిలో 31 వేలకు పైగా ఉక్రేనియన్ సైనికులు మృతిచెందారని తెలిపారు.ఉక్రెయిన్ జనాభాలో 25 శాతం మృతియుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో జననాల రేటు రెండున్నరేళ్ల క్రితం ఉన్న దానికంటే ఇప్పుడు మూడో వంతుకు పడిపోయింది. ఉక్రెయిన్‌లో దాదాపు నాలుగు మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. ఆరు మిలియన్లకు పైగా ఉక్రేనియన్ పౌరులు విదేశాల్లో ఆశ్రయం పొందారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ జనాభా 10 మిలియన్లకు పైగా తగ్గింది. ఇది అక్కడి జనాభాలో నాలుగింట ఒక వంతు. అంటే ఉక్రెయిన్ జనాభాలో 25 శాతం తుడిచిపెట్టుకుపోయింది. యుక్రేనియన్ ప్రభుత్వం యుద్ధంలో రోజువారీ ఖర్చు 140 మిలియన్ అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ అని అంచనా వేసింది. ఉక్రెయిన్ 2025 ప్రతిపాదిత బడ్జెట్లో రక్షణ కోసం 26 శాతం అంటే 53.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావంయుద్ధం కారణంగా ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ 2022లో 33 శాతం క్షీణించింది. 2023లో ఈ పరిస్థితి కాస్త మెరుగుపడి నష్టం 22 శాతానికి పరిమితమైంది. హౌసింగ్, రవాణా, వాణిజ్యం, పరిశ్రమలు, ఇంధనం, వ్యవసాయ రంగాలు యుద్ధానికి అమితంగా ప్రభావితమయ్యాయి. ఉక్రెయిన్‌లోని రిమోట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రష్యా లక్ష్యంగా చేసుకోవడంతో ఉక్రెయిన్ ఇంధన రంగం తీవ్రంగా దెబ్బతింది.ఉక్రెయిన్‌లో కొంతభాగం రష్యా స్వాధీనంరాయిటర్స్ నివేదిక ప్రకారం ఉక్రెయిన్‌లో ఐదవ వంతును రష్యా స్వాధీనం చేసుకుంది. ఆ ప్రాంతాలను తన అదుపులో ఉంచుకుంది. ఈ భాగం గ్రీస్ దేశ పరిమాణంతో సమానం. రష్యన్ దళాలు 2022 ప్రారంభంలో ఉక్రెయిన్‌లోని ఉత్తర, తూర్పు, దక్షిణ భాగాలలో దాడి చేసి, ఉత్తరాన కీవ్ శివార్లకు చేరుకుని, దక్షిణాన డ్నిప్రో నదిని దాటాయి. రష్యా దాదాపు ఉక్రెయిన్‌లోని తూర్పు డాన్బాస్ ప్రాంతాన్ని, దక్షిణాన అజోవ్ సముద్ర తీరాన్ని స్వాధీనం చేసుకుంది.పుతిన్‌కు గిట్టని ఉక్రేనియన్ గుర్తింపు ఉక్రెయిన్ ఒకప్పుడు రష్యన్ సామ్రాజ్యంలో భాగం. తరువాత సోవియట్ యూనియన్‌లో భాగమైంది. ఉక్రెయిన్ను మళ్లీ రష్యాలో విలీనం చేయడమే తన లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పలు సందర్భాల్లో చెప్పారు. పుతిన్ ఉక్రేనియన్ రాష్ట్ర హోదాను, గుర్తింపును తిరస్కరించారు. ఉక్రేనియన్లు నిజానికి రష్యన్లేనని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం లక్షలాది మంది ప్రాణాలను బలిగొనడమే కాకుండా ఇరు దేశాల జనాభా, ఆర్థిక వ్యవస్థ, సామాజిక నిర్మాణాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ యుద్ధం ప్రపంచ సంక్షోభానికి కూడా దారితీసింది. ఇది కూడా చదవండి: భారత్ దౌత్య విజయం.. ఏకాభిప్రాయం అమలుకు చైనా సిద్ధం -
రష్యా-ఉక్రెయిన్ వార్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. పుతిన్‌కు ఫోన్!
వాషింగ్టన్: గత రెండున్నరేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు దేశాల మధ్య పోరులో ఇప్పటికే వేల సంఖ్యలో సామన్య పౌరులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ మొదటిసారిగా మార్-ఎ-లాగో బహిరంగ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ..‘రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంపై వచ్చిన నివేదికను పరిశీలించాను. గత రెండున్నరేళ్లలో వేలాదిమంది మరణించారు. నేను అధికారంలోకి వచ్చిన అనంతరం రష్యా-ఉక్రెయిన్ల యుద్ధాన్ని ఆపేస్తాను. అలాగే, పశ్చిమాసియాలోనూ శాంతిస్థాపనకు కృషి చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో అమెరికా సైన్యాన్ని బలోపేతం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఇదిలా ఉండగా.. అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, తాను అధికారంలోకి వస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ ఇదివరకే పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఇక, ఇటీవల ఈవిషయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడి.. యుద్ధాన్ని విస్తరించొద్దని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికైనా రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు నిలిచిపోవాలని దేశాలు కోరుతున్నాయి. This is what POTUS TRUMP wants for ending RUSSIA UKRAINE war , he wants this 800 miles line to be declared LAC with buffer zones on both sides pic.twitter.com/FJEpf4nCXk— VINAY. KUMAR DELHI (@wadhawan2011) November 15, 2024 -
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్ ఫోన్‌కాల్
-
Tony Radakin: రోజుకు 1,500!
లండన్: ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యా యుద్ధక్షేత్రంలో భారీగా రక్తమోడుతోందని బ్రిటన్ తాజాగా ప్రకటించింది. సంబంధిత వివరాలను బ్రిటన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ టోనీ ర్యాడకిన్ ఆదివారం వెల్లడించారు. గత నెలలో ఉక్రెయిన్ నుంచి భారీ స్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో అక్టోబర్‌లో ప్రతి రోజూ 1,500 మంది రష్యా సైనికులు చనిపోవడమో, తీవ్రంగా గాయపడటమో జరిగిందని టోనీ చెప్పారు. ‘‘ 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా మొదట్లో పలు ఉక్రెయిన్ ప్రాంతాలను వేగంగా ఆక్రమించుకుంది. కానీ తర్వాత యూరప్ దేశాల దన్నుతో, అధునాతన ఆయుధాల సాయంతో ఉక్రెయిన్ దీటుగా బదులిస్తోంది. ప్రతిఘటనను పెంచింది. దీంతో ఇటీవలి కాలంలో సమరంలో సమిధలవుతున్న రష్యా సైనికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా అక్టోబర్‌లో ప్రతి రోజూ 1,500 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడమో, శరీరభాగాలు కోల్పోవడమో జరిగింది. యుద్ధం మొదలైననాటి నుంచి చూస్తే ఒక్క నెలలో ఇంతటి నష్టం ఇదే తొలిసారి. పుతిన్ రాజ్యవిస్తరణ కాంక్షకు ఇప్పటిదాకా ఉక్రెయిన్ యుద్ధంలో 7,00,000 మంది రష్యా సైనికులు బలయ్యారు. ఆక్రమణతో రష్యా భూభాగం పెరుగుతోంది. జాతీయభావనను పెంచి పుతిన్ రష్యాలో మరింత పాపులర్ అయ్యారు. కానీ ప్రభుత్వ ఖజానా, సైన్యంపరంగా దేశానికి అపార నష్టం వాటిల్లుతోంది. రష్యా ప్రభుత్వ వ్యయంలో దాదాపు 40 శాతాన్ని కేవలం ఈ యుద్ధం కోసమే పుతిన్ కేటాయిస్తున్నారు. ఇది దేశార్థికంపై పెను దుష్ప్రభావం చూపుతుంది. పుతిన్ యుద్ధోన్మాదం లక్షలాది మంది రష్యన్లను కష్టాలపాలుచేస్తోంది. యువతను బలవంతంగా సైన్యంలోకి తీసుకుంటున్నారు. ఎంతో మంది తమ ఆప్తులను యుద్ధభూమిలో కోల్పోతున్నారు’’ అని టోనీ అన్నారు. దీనిపై రష్యా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. రష్యా 145, ఉక్రెయిన్ 70 డ్రోన్లతో దాడులు మాస్కో/కీవ్: రష్యా, ఉక్రెయిన్లు పరస్పరం పెద్ద సంఖ్యలో డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. రష్యా శనివారం రాత్రి 145 షహీద్ డ్రోన్లను ఉక్రెయిన్‌పైకి ప్రయోగించింది. యుద్ధం మొదలయ్యాక ఒకే రాత్రిలో ఇంత భారీ సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించడం ఇదే మొదటిసారని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలు 62 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నాయంది. మరో 67 డ్రోన్లు వివిధ ప్రాంతాల్లో పడ్డాయని, 10 వరకు డ్రోన్లు గురితప్పి మాల్డోవా, బెలారస్, రష్యా ప్రాంతాలవైపు దూసుకెళ్లాయని ఉక్రెయిన్ పేర్కొంది. ఆదివారం ఉదయం మాస్కో దిశగా ఉక్రెయిన్ ఆర్మీ అత్యధికంగా 34 డ్రోన్లను ప్రయోగించిందని రష్యా తెలిపింది. ఆరు ప్రాంతాలపైకి మొత్త 70 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపింది. ఈ సంఖ్యలో ప్రయోగించడం ఇదే మొదటిసారని పేర్కొంది. వీటన్నిటినీ కూల్చేశామని వివరించింది. డ్రోన్ శకలాలు పడి రెండో చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. -
రష్యాకు ‘అక్టోబర్’ షాక్.. రోజుకు 1500 మంది సైనికుల మృతి!
లండన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై.. దాదాపు మూడేళ్లు గడుస్తోంది. అయితే.. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అత్యంత దారుణమైన ప్రతిఘటనను అక్టోబర్ నెలలో రష్యా బలగాలు ఎదుర్కొన్నాయని బ్రిటన్ సాయుధ దళాల అధిపతి అన్నారు. అక్టోబర్‌లో రోజుకు సగటున 1,500 మంది రష్యన్ సైనికులు మరణించటం లేదా గాయపడటం జరిగిందని బిట్రన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ టోనీ రాడాకిన్ తెలిపారు.‘‘రష్యా తన యుద్ధంలో మరణించిన వారి సంఖ్యను వెల్లడించలేదు. అయితే ఫిబ్రవరి 2022లో రష్యా.. ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించినప్పటి నుండి గత నెలలో అత్యధికంగా సైనికులను కోల్పోయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశయం కారణంగా సమామరు 7 లక్షమ మంది మరణించటం లేదా గాయపడటం జరిగింది. పుతిన్ ఆశయం కోసం రష్యా ఈ భారీ నష్టం, నొప్పి, బాధ భరించవల్సి వచ్చింది. చాలా తక్కువ భూభాగం కోసం అధిక సైన్యం నష్టపోయింది. రష్యా ప్రభుత్వం.. రక్షణ, భద్రతపై ప్రజా వ్యయంలో 40 శాతానికి పైగా ఖర్చు చేస్తోంది. అధ్యక్షుడు పుతిన్ దేశంపై అధిక భారం వేశారు. ఉక్రెయిన్‌కు బ్రిటన్ మద్దతు ఇస్తునే ఉంటుంది. అది అధ్యక్షుడు పుతిన్ గ్రహించవలసిన సందేశం. ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి భరోసా’’ అని అన్నారు.రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాటంలో ఉక్రెయిన్ బలమైన మద్దతుదారులలో బ్రిటన్ ఒకటి. ఉక్రెయిన్‌కు బిలియన్లకొద్ది పౌండ్లతో సైనిక సహాయంతో పాటు ఆయుధాలు, బలగాలకు శిక్షణను అందిస్తోంది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి పాశ్చాత్య దేశాల భవిష్యత్తు నిబద్ధత గురించి ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ ఉక్రెయిన్‌కు మద్దతును మరోసారి ప్రకటించటం గమనార్హం.చదవండి: కెనడాలో టెంపుల్‌పై దాడి.. ఖలిస్తానీ నిరసన నిర్వాహకుడు అరెస్ట్ -
15 భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. కారణం..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న మొత్తం 275 కంపెనీలకు సంబంధించి ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో ప్రధానంగా భారత్, చైనా, స్విట్జర్లాండ్, తుర్కియేకు చెందిన సంస్థలుండడం గమనార్హం.ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు సైనికపరంగా ప్రత్యేక్షంగా, పరోక్షంగా సాయం చేస్తున్న కంపెనీలపై అమెరికా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 275 కంపెనీలు రష్యాకు సహకరిస్తున్నాయని అమెరికా భావిస్తోంది. దాంతో ఉక్రెయిన్‌కు నష్టం వాటిల్లుతున్నట్లు అమెరికా అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ చర్యలు చేపట్టినట్లు యూఎస్ వర్గాలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: డ్రోన్ కొనుగోలుకు రూ.8 లక్షలు సాయంఅమెరికా ఆంక్షలు విధించిన భారత్‌కు చెందిన 15 కంపెనీల జాబితాను విడుదల చేశారు. వాటి వివరాలు కింది విధంగా ఉన్నాయి.అభర్ టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్డెన్వాస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ఎమ్సిస్టెక్గెలాక్సీ బేరింగ్స్ లిమిటెడ్ఆర్బిట్ ఫిన్‌ట్రేడ్ ఎల్ఎల్పీఇన్నోవియో వెంచర్స్కేడీజీ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ఖుష్బూ హోనింగ్ ప్రైవేట్ లిమిటెడ్లోకేష్ మెషీన్స్ లిమిటెడ్పాయింటర్ ఎలక్ట్రానిక్స్ఆర్ఆర్జీ ఇంజినీరింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్షార్ప్లైన్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్శౌర్య ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్శ్రీఘీ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్శ్రేయ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ -
యుద్ధం మిగిల్చేది పరాజయాన్నే!
ఆధునిక ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు, అంతర్యుద్ధాల వల్ల మానవాళి మాటలకు అందని నష్టాలను చవిచూసింది. అయినా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకుండా తరచూ యుద్ధాల ద్వారానే పలు దేశాలు సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. గత రెండేళ్ల నుంచి సాగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ఏడాది పైబడిన పాలస్తీనా–ఇజ్రాయెల్ యుద్ధం; తాజాగా లెబనాన్, సిరియా, ఇరాన్‌లకు విస్తరించిన ఇజ్రాయెల్ దాడులు– ప్రతిదాడులు... వెరసి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమోనన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అటు ఉక్రెయిన్‌లో, ఇటు గాజాలో పసిపిల్లలతో సహా వేలాదిమంది అమాయకులు ఈ రెండు యుద్ధాల వల్ల బలైపోయారు.ఏ యుద్ధంలోనైనా పరాజితులే ఉంటారు తప్ప విజేతలు ఉండరని చెప్పారు ‘యుద్ధము–శాంతి (వార్ అండ్ పీస్)’ అనే తన అద్భుత నవల ద్వారా రష్యన్ మహా రచయిత లియో టాల్‌స్టాయ్. సరిహద్దులు లేని పరస్పర ప్రేమ ఒక్కటే విశ్వశాంతికి మార్గం వేస్తుందని రెండు శతాబ్దాల ముందే చెప్పారాయన.1910లో టాల్‌స్టాయ్ మరణించిన 4 ఏళ్ల తర్వాత 1914 నుంచి 1917 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. 3 ఏళ్లపాటు జరిగిన ఈ యుద్ధంలో 85 లక్షల మంది సైనికులు, 1 కోటి 30 లక్షల మంది పౌరులు మరణించారు. ఆ యుద్ధంలో అంగవైకల్యం పొందిన వారి సంఖ్యకు లెక్కేలేదు. ఆ తర్వాత, 1939–45 మధ్య 6 ఏళ్ల పాటు సాగిన రెండో ప్రపంచ యుద్ధంలో 6 కోట్ల మంది ఆశువులు బాశారు. కోట్లాది మంది క్షతగాత్రులయ్యారు. హిరోషిమా, నాగసాకీలపై అమెరికా వేసిన అణుబాంబులు ఆ నగరాలను మరుభూమిగా మార్చాయి.1947 తర్వాత... జరిగిన ఆర్థిక పునర్నిర్మాణం కారణంగా ప్రబల ఆర్థిక, సైనిక శక్తులుగా అవతరించిన అమెరికా, సోవియట్ రష్యాల మధ్య సాగిన ఆధిపత్యపోరు క్రమంగా ప్రచ్ఛన్న యుద్ధంగా మారింది. ప్రపంచంలోని అనేక దేశాలు ఆ అగ్రరాజ్యాల సహాయ సహకారాల మీద ఆధార పడటం వల్ల అనివార్యంగా అవి ఏదో ఒక శిబిరంలో చేరాల్సి వచ్చింది. ఫలితంగా ఆ యా దేశాలు సైతం ఆ ప్రచ్ఛన్నయుద్ధంలో భాగస్వాములై నష్టపోయాయి. 1989లో సోవియట్ యూనియన్ పతనమయ్యేంతవరకు ఆ ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది. అంతకుముందే ఇజ్రాయెల్–పాలస్తీనాల మధ్య ఘర్షణలు మొదలై పశ్చిమాసియాలో అశాంతి నెలకొంది. తదుపరి ఇరాన్–ఇరాక్‌ల మధ్య కీచులాటలు కొనసాగాయి. 1962లో ఇండియా–చైనాల మధ్య యుద్ధం, 1972లో ఇండియా–పాక్‌ల మధ్య యుద్ధం, తిరిగి 1999లో ఈ రెండు దేశాల నడుమ కార్గిల్ యుద్ధం, దక్షిణాఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల మధ్య అంతర్యుద్ధం... ఇలా చెప్పుకుంటూపోతే అనేక యుద్ధాలు ప్రపంచాన్ని అస్థిరపరిచాయి. ఈ నేపథ్యంలోనే గత రెండేళ్ల నుంచి సాగుతున్న ఉక్రెయిన్–రష్యా (యురేషియా) యుద్ధం, ఏడాది పైబడిన పాలస్తీనా–ఇజ్రాయెల్ (పశ్చిమాసియా) యుద్ధం; తాజాగా లెబనాన్, సిరియా, ఇరాన్‌లకు విస్తరించిన ఇజ్రాయెల్ దాడులు– ప్రతిదాడులు... వెరసి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమోనన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అటు ఉక్రెయిన్‌లో, ఇటు గాజాలో పసిపిల్లలతోసహా వేలాదిమంది అమాయకులు బలైపోయారు. రెండు ప్రధాన యుద్ధాలలో అపార ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతున్నా... ఎవ్వరూ తగ్గడం లేదు. ఈ యుద్ధాలను ఆపడానికి ఐక్యరాజ్య సమితి చేసిన అరకొర యత్నాలు ఏమాత్రం ఫలితాలివ్వలేదు. పైగా, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ తమ దేశంలో పర్యటించరాదని ఇజ్రాయెల్ హుకుం జారీ చేసింది. హెజ్బొల్లా, ఇరాన్, హౌతీల దాడులను ఐక్యరాజ్య సమితి ఖండించలేదన్నది ఇజ్రాయెల్ ఆరోపణ. గతంలో యుద్ధాలకు దిగే దేశాలపై దౌత్యపరమైన ఆంక్షలు విధించేవారు. కానీ, ఇప్పుడు ఆ దశ దాటి పోయింది. మధ్యవర్తిత్వం వహించాల్సిన వారు కూడా ఏదో ఒక కూటమికి వంత పాడటంతో... కనుచూపు మేరలో ఈ యుద్ధాలకు ముగింపు కార్డుపడే పరిస్థితి కనపడటం లేదు. ప్రపంచ దేశాలకు అత్యధిక స్థాయిలో చమురు సరఫరా చేసే గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సభ్య దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఒమన్, కువైట్ దేశాలు మాత్రం తాము అటు ఇజ్రాయెల్‌కు గానీ, ఇటు ఇరాన్‌కు గానీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంటామని ప్రకటించడం కొంతలో కొంత ఊరట కలిగించే అంశమే.పశ్చిమాసియాలో నెలకొన్న ప్రాంతీయ ఉద్రిక్తతలు, కొనసాగుతున్న యుద్ధం వల్ల భారత్‌కు ఆర్థికంగా అపార నష్టం వాటిల్లే పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయి. పశ్చిమాసియా పరిణామాలు భారత్ స్టాక్ మార్కెట్లను ఇప్పటికే ఒడిదుడుకులకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే భారత ఇంధన అవసరాలు దాదాపు 80 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ప్రధానంగా ఇరాన్ కనుక తన హోర్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేసినట్లయితే ఈ మార్గం ద్వారా చమురు, సహజ వాయువును దిగుమతి చేసుకొంటున్న భారత్ ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని ఎంచుకోవాలి. అలాగే, సూయిజ్ కాలువ ద్వారా రవాణాను అనుమతించనట్లయితే... చుట్టూ తిరిగి దక్షిణాఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా చమురును రవాణా చేసి తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల దూరం పెరిగి రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఇప్పటికే యెమన్ కేంద్రంగా పనిచేసే హౌతీలు హమాస్‌కు మద్దతుగా సూయిజ్ కాలువ ద్వారా రవాణా అవుతున్న నౌకలపై దాడులు చేస్తున్నారు. ఇది భారత్‌కు ఊహించలేని నష్టాన్ని కలిగిస్తోంది. ఇక, దేశంలో ముడి చమురు ధరలు పెరిగితే, దేశ ఆర్థిక వ్యవస్థ తల్లకిందులవడం ఖాయం. 2014–15 లో బ్యారెల్ ముడిచమురు ధర అత్యధికంగా 140 డాలర్లకు చేరినపుడు దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిళ్లకు లోనయింది. ప్రçస్తుతం బ్యారెల్ ముడిచమురు 85–90 డాలర్ల మధ్యనే ఉండటం వల్ల... భారత్ స్థిమితంగానే ఉంది. కానీ, మధ్య ప్రాచ్యంలో యుద్ధం కనుక మరింత ముదిరితే జరిగే పరిణామాలు చేదుగానే ఉంటాయి. పొద్దు తిరుగుడు నూనె, పామాయిల్ నూనెలను అత్యధికంగా ఉత్పత్తి చేసే ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆ నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రపంచీకరణ వేగం పుంజుకొన్న తర్వాత ప్రతి దేశంలో ఆర్థిక పరిస్థితులు బాహ్య పరిణామాలపై ఆధారపడ్డాయి. అందుకు భారత్ మినహాయింపు కాదు. ఒకప్పుడు ‘రష్యా’తో దౌత్యపరంగా సఖ్యత సాగించిన భారత్... తదనంతర పరిణామాలతో అమెరికాకు సైతం దగ్గరయింది. అమెరికా–చైనాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు నేపథ్యంలో భారత్ వ్యూహాత్మకంగా అమెరికాకు మరింత చేరువయింది. రష్యా, అమెరికా... ఈ రెండు అగ్రరాజ్యాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం భారత్‌కు మేలు చేసేదే. అయితే, భారత్ తన దౌత్యనీతిలో ఎల్లప్పుడూ తటస్థంగానే కొనసాగుతోంది.యుద్ధాలతో ఏ సమస్యనూ పరిష్కరించలేమని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల తన రష్యా పర్యటనలో అధ్యక్షుడు పుతిన్‌కు స్పష్టం చేయడం ద్వారా భారత్ తన విదేశాంగ విధానాన్ని చాటి చెప్పారు. ముడిచమురుతో సహా పలు వస్తువులను రష్యా నుంచి దిగుమతి చేసుకొంటున్నప్పటికీ... ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి భారత్ మద్దతు తెలపలేదు. పైగా, ఉక్రెయిన్‌కు నైతిక మద్దతు ప్రకటించింది. విస్తరణ వాదాన్ని సహించబోమని ఒక్క రష్యాకే కాదు.. అరుణాల్ప్రదేశ్ను ఆక్రమించాలని చూస్తున్న చైనాకు కూడా భారత్ పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది.నిజానికి, అటు యురేషియాలో, ఇటు పశిమాసియాలో జరుగుతున్న యుద్ధాలను నిలిపివేయడానికి గల మార్గాలను భారత్ తీవ్రంగా అన్వేషిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలలో అత్యధిక స్థాయిలో ఆర్థికాభివృద్ధి రేటును నమోదు చేస్తున్న భారత్‌కు ఈ అంతర్జాతీయ పరిణామాలు మింగుడు పడనివే. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ తరుణంలో పశ్చియాసియాలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు తనవంతు కృషి చేయడం మినహా భారత్ చేయగలిగింది ఏమీలేదు. లియో టాల్‌స్టాయ్ చెప్పినట్లు పరాజితులుగా మిగిలిపోతారా లేక యుద్ధవిరమణ చేసి విజేతలుగా అవతరిస్తారా అన్నది యుద్ధాల్లో మునిగి ఉన్న దేశాలు, వాటికి మద్దతు ఇస్తున్న దేశాల వైఖరి మీద ఆధారపడి ఉంది. -డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు -
ఉక్రెయిన్‌లోకి ఉత్తర కొరియా సైనికులు! అమెరికా వార్నింగ్
న్యూయార్క్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యాకు మద్దతుగా ఉత్తరకోరియా సైనికులు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించినట్లు వార్తలు వస్తున్న క్రమంలో అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా స్పందించింది. రష్యాతో పాటు ఉక్రెయిన్‌లో పోరాడేందుకు వెళ్లిన ఉత్తర కొరియా సైనికుల మృతదేహాలు శవాల బ్యాగుల్లో తిరిగి వెళ్తాయని అమెరికా ఉత్తరకొరియాకు వార్నింగ్ ఇచ్చింది.‘‘రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా దళాలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించినట్లయితే.. కచ్చితంగా ఉత్తర కొరియా సైనికుల మృతదేహాలు శవాల బ్యాగుల్లో తిరిగి వెళ్తాయి.కాబట్టి అటువంటి నిర్లక్ష్య, ప్రమాదకరమైన చర్యలకు పాల్పటం ఒకటికి రెండుసార్లు ఆలోచించమని నేను ఉత్తర కొరియా అధ్యక్షడు కిమ్ జోంగ్-ఉన్‌కు సలహా ఇస్తాను’’ అని ఐక్యరాజ్యసమితిలో యూఎస్ డిప్యూటీ రాయబారి రాబర్ట్ వుడ్ అన్నారు.North Korean Troops Who Enter Ukraine Will "Return In Body Bags", Warns US"Should DPRK's troops enter Ukraine in support of Russia, they will surely return in body bags," US deputy ambassador to the UN Robert Wood told the Security Council.https://t.co/HVoaV5LbYo— M. Rowland (@melrow74) October 31, 2024చదవండి: ఉక్రెయిన్‌పై దాడులు.. పుతిన్ దళంలోకి ‘కిమ్’ సైన్యం -
యుద్ధాన్ని ఆపే సత్తా మోదీకి ఉంది : జెలెన్స్కీ
కీవ్: ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే సత్తా భారత ప్రధాని మోదీకి ఉందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పేర్కొన్నారు. దీని ద్వారా ఆయనకే కాదు, అంతర్జాతీయంగాను భారత్ ప్రతిష్ట పెరుగుతుందన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు జెలెన్స్కీ ఇటీవల ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించిన పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోదీ జోక్యంతో ఉక్రెయిన్, రష్యాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయా అన్న ప్రశ్నకు జెలెన్స్కీ..‘ప్రధాని మోదీ దీనిని నిజం చేయగలవనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు భారత్‌లోనే చర్చలు జరగొచ్చు. అయితే, యుద్ధం మా గడ్డపై జరుగుతున్నందున మేమిచ్చే షరతులకు లోబడే సంప్రదింపులు జరగాలి’అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు ప్రయతి్నస్తానన్న మోదీ ప్రకటనపై జలెన్ స్కీ..మాటలు కాదు, చేతలు అవసరమన్నారు. ‘జనాభాపరంగా, ఆర్థికంగా, పలుకుబడిపరంగా భారత్ పెద్ద దేశం. అలాంటి దేశానికి ప్రధాని అయిన మోదీ..యుద్ధాన్ని ఆపేందుకు ప్రయతి్నస్తామని కేవలం మాటగా చెప్పడం సరికాదు. యుద్ధాన్ని ఆపేందుకు పలుకుబడిని ఉపయోగించాలి. రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టాలి. ఆదేశం నుంచి చౌకగా దొరుకుతున్న చమురును, రక్షణ రంగ ఉత్పత్తులను కొనరాదు. ఫలితంగా ఆ దేశ యుద్ధ సామర్ధ్యం దెబ్బతింటుంది’అని తెలిపారు. యుద్ధం సమయంలో ఎత్తుకుపోయిన మా చిన్నారుల్లో కనీసం వెయ్యి మందినైనా తిరిగి మాకు ఇచ్చేలా మోదీ రష్యాపై తన పలుకుబడిని ఉపయోగించాలన్నారు. తటస్థత అంటే రష్యా వైపు ఉన్నట్టే ‘యుద్ధం జరుగుతున్న సమయంలో తటస్థంగా ఉండటమంటే రష్యా పక్షాన ఉన్నట్లే అర్థం. దురాక్రమణదారు, బాధిత దేశం మధ్య తటస్థత అనేదే ఉండదు. అలా ఉండటమంటే పరోక్షంగా రష్యాకు మద్దతివ్వడమే’అని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. ‘బ్రిక్స్ శిఖరాగ్రంలో పాల్గొన్న నేతలు కూడా సంక్షోభం సమసేందుకు సహకరిస్తామని చెప్పారు. నా దృష్టిలో అది కూడా మాకంటే రష్యాకే ఎక్కువగా అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నా’అన్నారు. ‘అంతేకాదు, సౌదీ అరేబియా, బ్రెజిల్ వంటి దేశాల నేతలు రానందున బ్రిక్స్ శిఖరాగ్రం విఫలమైనట్లే లెక్క. ప్రపంచాన్ని పుతిన్ పశి్చమ అనుకూల, బ్రిక్స్ అనుకూల దేశాలుగా విభజించాలనుకుంటున్నారు. అందుకే, బ్రెజిల్, చైనాలు తీసుకువచి్చన శాంతి ప్రతిపాదనలను సైతం తిరస్కరించారు. ఈ పరిణామం చైనా, బ్రెజిల్‌లకు చెంపపెట్టు వంటిది’అని చెప్పారు. -
ఉక్రెయిన్‌పై దాడులు.. పుతిన్ దళంలోకి ‘కిమ్’ సైన్యం
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండేళ్లకు పైగా సాగుతున్న దాడుల్లో రెండు దేశాల సైన్యం వీరోచితంగా పోరాడుతూనే ఉంది. ఇప్పటికే ఈ యుద్ధంలో ఎంతో మంది చనిపోయారు. ఈ పోరులో ఉక్రెయిన్ సైన్యం.. రష్యా భూభాగంలో అడుగుపెట్టింది. రష్యాతో పోరులో ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు ఇప్పటికే పలు దేశాలు ముందుకు వచ్చాయి. మరోవైపు.. రష్యాకు సాయం చేసేందుకు ఉత్తర కొరియా బలగాలు రంగంలోకి దిగాయి.ఉక్రెయిన్‌తో యుద్ధంలో మరింతగా పోరాడేందుకు ఉత్తర కొరియా తన బలగాలను రష్యాలోకి తరలిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా నాటో వెల్లడించింది. ఇప్పటికే రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో కిమ్ బలగాలను మోహరించినట్లు నాటో చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలో కొన్ని బలగాలను ఇప్పటికే మోహరించినట్లు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మీడియాకు తెలిపారు. ఇక, ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యం చేసుకోవడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఇది రెండు మధ్య యుద్ధాన్ని మరింత ప్రోత్సహిస్తుందని అన్నారు.NATO confirms North Korean troops have been sent to Russia to support its war in Ukraine. This marks a dangerous escalation, violating UN resolutions and risking global security. As Putin turns to Pyongyang for military aid, democracies must unite to uphold peace and security.… pic.twitter.com/kHT1g57y68— Pete (@splendid_pete) October 28, 2024ఇదిలా ఉండగా.. ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉత్తర కొరియాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే పుతిన్.. ఉక్రెయిన్‌పై పోరుకు నార్త్ కొరియా సాయం కోరినట్టు వార్తలు వెలువడ్డాయి. అందులో భాగంగానే ఉత్తర కొరియా సైన్యం రష్యాకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక, కొద్ది రోజుల క్రితమే ఉత్తర కొరియా సైన్యంలోకి భారీగా యువత వచ్చి చేరారు.మరోవైపు.. రష్యాలోకి కిమ్ సేన ప్రవేశించే అంశంపై ఇటీవల అమెరికా స్పందించింది. ఒకవేళ ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ యుద్ధంలోకి చొరబడితే.. కచ్చితంగా వాళ్లు కూడా లక్ష్యాలుగా మారతారని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోనుందో అనే చర్చ కూడా జరుగుతోంది. -
అదే జరిగితే.. రష్యా బలహీతకు సంకేతం: అమెరికా
న్యూయార్క్: ఉత్తర కొరియాకు చెందిన 3 వేల మంది సైనికులు రష్యాకు వెళ్లి డ్రోన్లు, ఇతర పరికరాలపై శిక్షణ పొందుతున్నారని దక్షిణ కొరియా వ్యాఖ్యలు చేసింది. దక్షిణ కొరియా వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఉత్తర కొరియాకు సైనికులు ఉక్రెయిన్‌పై పోరాటంలో భాగంగా రష్యా ఆర్మీలో చేరితే సైనిక చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొంది. ఉక్రెయిన్‌తో పోరాటాని రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మద్దతు పొందితే అది క్రెమ్లిన్ బలహీనతకు సంకేతమని వైట్ హౌస్ తెలిపింది. అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ బుధవారం మీడియాతో మాట్లాడారు.‘‘రష్యన్లు, ఉత్తర కొరియన్లు ఇక్కడ ఏమి చేయాలని నిర్ణయించుకుంటారో మేము చూస్తాం. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్‌పై పోరాటంలో చేరాలని నిర్ణయించుకుంటే చట్టబద్ధమైన సైనిక లక్ష్యాలుగా మారిపోతాయి. ఈ పరిస్థితులపై నిశితంగా పరిశీలిస్తున్నాం. సైనికులు ఉత్తర కొరియాలోని వోన్సాన్ ప్రాంతం నుంచి రష్యాలోని వ్లాడివోస్టాక్‌కు ఓడలో ప్రయాణించారు. రష్యన్ సైనిక శిక్షణా కేంద్రాలున్న ప్రాంతాలు వెళ్లారు. అయితే.. ఉత్తర కొరియా సైనికులు రష్యన్ మిలిటరీతో కలిసి యుద్ధంలోకి పాల్గొంటాయో లేదో స్పష్టత లేదు. ఉత్తర కొరియా సైనికులు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఉక్రేయిన్ మిలిటరీకి వ్యతిరేకంగా పోరాడేందుకు పశ్చిమ రష్యాకు వెళ్లవచ్చ. ఉక్రెయిన్ ప్రభుత్వానికి కూడా ఈ పరిస్థితి గురించి తెలియజేశాం. ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్‌తో యుద్ధంలో పాల్గొంటే.. రష్యాలో పెరుగుతున్న నిరాశ, బలహీనతకు సంకేతం అవుతుంది’’ అని అన్నారు. ఉత్తర కొరియా ఇప్పటివరకు 3వేల మంది సైనికులను రష్యాకు తరలించిందని దక్షిణ కొరియా తెలుపుతోంది. ఇటీవల 1500 మంది సైనికులను ఉత్తర కొరియా రష్యాకు తరలించినట్లు దక్షిణ కొరియా గూఢచర్య సంస్థ(ఎన్ఐఎస్) వెల్లడించింది. మరోవైపు.. రష్యా రాయబారి జార్జి జినోవిచ్తో భేటీ అయిన దక్షిణ కొరియా విదేశాంగ డిప్యూటీ మినిస్టర్ కిమ్ హాంగ్ క్యూన్ ఉత్తర కొరియా బలగాలను పంపడాన్ని ఖండించటం గమనార్హం.చదవండి: హిట్లర్‌ను ప్రస్తావించిన ట్రంప్.. కమలా హారీస్‌కు బిగ్ బూస్ట్ -
ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి...అన్నివిధాలా సహకరిస్తాం: మోదీ
కజాన్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి తక్షణం శాంతియుత పరిష్కారం కనుగొనాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఎలాంటి సాయమైనా చేసేందుకు భారత్ సదా సిద్ధమని ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఈ మేరకు హామీ ఇచ్చారు. 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మంగళవారం రష్యాలోని కజాన్ నగరం చేరుకున్నారు. గత మూడు నెలల్లో మోదీ రష్యా వెళ్లడం ఇది రెండోసారి. కజాన్ చేరిన కాసేపటికే ఆయన పుతిన్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ యుద్ధంతో పాటు పలు అంశాలపై నేతలిద్దరూ లోతుగా చర్చించుకున్నారు.‘‘ఉక్రెయిన్ సంక్షోభానికి తెర దించే విషయమై మీతో నేను నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నా. నేను ముందునుంచీ చెబుతున్నట్టుగా ఏ సమస్యకైనా శాంతియుత పరిష్కారమే ఏకైక మార్గం’’ అని ఈ సందర్భంగా పుతిన్‌కు మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఆయనతో అన్ని విషయాలపైనా అర్థవంతమైన చర్చ జరిగినట్టు అనంతరం ప్రధాని వెల్లడించారు.ఉక్రెయిన్‌పై రెండేళ్లకు పైగా జరుపుతున్న యుద్ధాన్ని విరమించేలా పుతిన్‌ను ఒప్పించి సంక్షోభానికి తెర దించగలిగింది మోదీ ఒక్కరేనని ప్రపంచ దేశాధినేతలంతా అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి భేటీకి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. రెండు రోజుల పాటు జరగనున్న బ్రిక్స్ సదస్సులో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో కూడా మోదీ సమావేశమయ్యారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఆయన బుధవారం భేటీ కానున్నారు. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ మేరకు వెల్లడించారు.నాకు, మోదీకి మధ్య అనువాదం అవసరమే లేదునవ్వులు పూయించిన పుతిన్ వ్యాఖ్యలు మోదీతో భేటీ సందర్భంగా పుతిన్ చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. ‘‘భారత్‌తో రష్యా బంధం ఎంత బలంగా ఉందంటే నా మాటలను అర్థం చేసుకోవడానికి బహుశా మీకు అనువాదం కూడా అవసరం లేదేమో!’’ అని మోదీని ఉద్దేశించి పుతిన్ అన్నారు. దాంతో ప్రధానితో సహా భేటీలో పాల్గొన్న ఇరు దేశాల ఉన్నతాధికారులు తదితరులంతా చిరునవ్వులు చిందించారు. భారత్‌తో రష్యా బంధం అత్యంత ప్రత్యేకమైనది. ఎంతో దృఢమైనది. అది నానాటికీ మరింతగా బలపడుతోంది’’ అని ఈ సందర్భంగా పుతిన్ అన్నారు.బ్రిక్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యంఅంతర్జాతీయంగా బ్రిక్స్ కూటమి ప్రాధా న్యం నానాటికీ పెరుగుతోందని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘కీలకమైన అంతర్జాతీయ అంశాలపై చర్చలకు బ్రిక్స్ ప్రధాన వేదికగా మారుతోంది. అభివృద్ధి, పరస్పర సహకారం, వాతావరణ మార్పులు, ఆర్థిక సహకారం, దేశాల మధ్య పలు రకాలైన కీలక సరఫరా వ్యవస్థల నిర్మాణం వంటివాటిపై నూతన ఆలోచనల కలబోతకు కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. గతేడాది పలు కొత్త దేశాలు బ్రిక్స్ సభ్యులుగా చేరాయి. మరెన్నో దేశాలు చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతి, ప్రగతికి సంబంధించిన పలు కీలక అంశాలపై బ్రిక్స్ దేశాధినేతలతో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఈ కూటమి 2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలతో బ్రిక్ పేరిట ఏర్పాటైంది. 2010లో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్‌గా మారింది. గతేడాది ఈజిప్‌్ట, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ కూడా కూటమిలో చేరాయి.కాల పరీక్షకు నిలిచిన బంధం: మోదీగత మూడు నెలల్లోనే రష్యాలో ఇది తన రెండో పర్యటన అని మోదీ గుర్తు చేసుకున్నారు. ‘‘ఇరు దేశాల మధ్య నానాటికీ బలపడుతున్న ప్రగాఢ బంధానికి, స్నేహానికి, సమన్వయానికి ఇది సూచిక. రష్యా, భారత మైత్రి కాలపరీక్షకు నిలిచిన బంధం. భారత ఆర్థికాభివృద్ధిలో, భద్రతలో రష్యాది కీలక పాత్ర’’ అంటూ ప్రస్తుతించారు. చరిత్రాత్మక కజాన్ నగరంలో భారత్ నూతన కాన్సులేట్‌ను తెరవడం పట్ల ఆనందంగా ఉందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. గత జూలైలో కూడా ఆయన రష్యాలో పర్యటించడం తెలిసిందే. ఆ సందర్భంగా పుతిన్‌తో జరిగిన శిఖరాగ్ర భేటీలో పలు విషయాలపై లోతుగా చర్చించారు. -
500 మంది సైనికుల మృతదేహాలు.. ఉక్రెయిన్‌కు అప్పగించిన రష్యా
కీవ్: రష్యా శుక్రవారం 501 మంది ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలను ఆ దేశానికి అప్పగించింది. 2022 ఫిబ్రవరిలో రష్యా ఆక్రమణ మొదలయ్యాక ఇంత పెద్ద సంఖ్యలో సైనికుల మృతదేహాలను అప్పగించడం ఇదే మొదటిసారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. డొనెట్స్క్లోని అవ్డివ్కాపై పట్టుకోసం రష్యా ఆర్మీతో జరిగిన పోరులో వీరంతా వీరమరణం పొందారని వెల్లడించారు. మృతులను అధికారులు గుర్తించాక కుటుంబసభ్యులకు అప్పగిస్తామన్నారు. ఇలా ఉండగా, గురువారం రాత్రి తమ భూభాగంపైకి రష్యా ఏకంగా 135 షహీద్ తదితర డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. చాలా వరకు డ్రోన్లను కూలి్చవేశామని పేర్కొంది. నష్టం, మృతుల వివరాలను మాత్రం తెలపలేదు -
Russia-Ukraine war: లండన్, పారిస్, రోమ్, బెర్లిన్..!
లండన్: ఒక వైపు రష్యా సేనల ఆక్రమణ పర్వం కొనసాగుతుండటం, మరో వైపు వచ్చే నెలలో అమెరికాలో జరిగే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే మద్దతు దూర మవుతుందనే భయాల నడుమ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యూరప్ దేశాల్లో సుడి గాలి పర్యటన చేపట్టారు. 48 గంటల వ్యవధి లోనే లండన్, పారిస్, రోమ్, బెర్లిన్లను చు ట్టేశారు. తన వద్ద ఉన్న ‘విక్టరీ ప్లాన్’పై బ్రిట న్ ప్రధాని స్టార్మర్ సహా ఆయా దేశాధినే తలకు వివరించారు. మిత్ర దేశాల నుంచి అందే దీర్ఘ శ్రేణి క్షిపణులతో రష్యాలోని సు దూరంలో ఉండే మిలటరీ లక్ష్యాలకు నష్టం కలిగించడం.. తద్వారా యుద్ధానికి ముగింపు పలికేలా రష్యాను ఇరుకునపెట్టడం జెలెన్స్కీ ‘విక్టరీ ప్లాన్’లక్ష్యం. అయితే, బ్రిటన్ మాత్రమే తన వద్ద ఉన్న స్టార్మ్ షాడో దీర్ఘ శ్రేణి క్షిపణులను అందజేయడానికి సంసిద్ధత తెలిపింది. అమెరికా, జర్మనీ సహా ఇతర మి త్ర దేశాలు మాత్రం లాంగ్ రేంజ్ మిస్సైళ్లను ఉక్రెయిన్‌కు ఇవ్వడమంటే రష్యాతో ముఖా ముఖి యుద్ధానికి దిగడమనే అభిప్రాయంతో వెనుకంజ వేస్తున్నాయి. కేవలం ఒకే ఒక్క ఆయుధంతో యుద్ధంలో గెలుపును సొంతం చేసుకోవడం ఇప్పటివరకు జరగలేదని కూడా బ్రిటన్ అధికారులు అంటున్నారు. దీర్ఘ శ్రేణి క్షిపణులను ఉక్రెయిన్‌కు సమకూర్చడంపై చర్చించామని నాటో చీఫ్ మార్క్ రుట్ వెల్లడించారు. అయితే, అంతిమ నిర్ణయాన్ని ఆయా సభ్యదేశాలకే వదిలివేశామన్నారు. దీంతోపాటు, శనివారం బెర్లిన్‌లో జరగాల్సిన ఉక్రెయిన్ మిత్రదేశాల సమావేశం వాయిదా పడింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వదేశంలో మిల్టన్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఈ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. -
ఇంధన భద్రతకు సవాళ్లు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నానాటికీ పెచ్చరిల్లుతున్న ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనే గాక ఇంధన భద్రతపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వెలిబుచ్చారు. శుక్రవారం కౌటిల్య ఎకనమిక్ కాన్క్లేవ్ మూడో వార్షిక సదస్సులో ప్రధాని ప్రసంగించారు. పశ్చిమాసియా కల్లోలానికి తోడు రెండేళ్లకు పైగా సాగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ప్రస్తావించారు. భారత ఇంధన అవసరాలు 85 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. వీటిలో అధిక భాగం పశ్చిమాసియా నుంచే వస్తుంది.ఈ కల్లోల పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోందని మోదీ అన్నారు. అంతర్జాతీయ సమాజంలో మనకు పెరుగుతున్న ప్రతిష్టకు ఇది నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ‘‘సైన్స్, టెక్నాలజీ మొదలుకుని ఇన్నొవేషన్ల దాకా ఆకాశమే హద్దుగా భారత్ సాగుతోంది. రిఫామ్, పెర్ఫామ్, ట్రాన్స్ఫామ్ నినాదంతో దూసుకుపోతోంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఏకంగా రూ.15 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నాం. పథకాలు తీసుకొచ్చాం. ఎన్డీఏ పదేళ్ల పాలనలో భారత ఆర్థిక ముఖచిత్రాన్నే సమూలంగా మార్చేశాం. మన ఆర్థిక వృద్ధిపై ప్రపంచ నేతలంతా ఎంతగానో నమ్మకం పెట్టుకున్నారు’’ అని చెప్పుకొచ్చారు. 2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు అన్ని రంగాల్లోనూ సంస్కరణలను కొనసాగించేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్టు మోదీ స్పష్టం చేశారు. -
యుద్ధక్షేత్రం పరిష్కారం కాదు
ఐరాస: మానవాళి విజయం సమష్టి శక్తిలోనే దాగుంది తప్ప యుద్ధక్షేత్రంలో కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధం ఎన్నటికీ సమస్యల పరిష్కార వేదిక కాబోదని కుండబద్దలు కొట్టారు. సోమవారం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశంలో భాగంగా ‘ప్రపంచ భవితపై శిఖరాగ్ర సదస్సు’లో ప్రధాని ప్రసంగించారు.ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, దేశాల నడుమ ఉద్రిక్తతలు, గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పుల వంటి పెను సమస్యల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచ శాంతికి, ప్రగతికి ఐరాసతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టే ఏ చర్యలకైనా మనిషి సంక్షేమమే అంతిమ లక్ష్యం కావాలి. అప్పుడే అవి ఫలిస్తాయి’’ అని మోదీ సూచించారు. ‘‘నమస్కారం. ప్రపంచ మానవాళిలో ఆరో వంతుకు సమానమైన 140 కోట్ల మంది భారతీయుల తరఫున వారి గళాన్ని విని్పస్తున్నా’’ అంటూ సాగిన ఐదు నిమిషాల ప్రసంగాన్ని పలు దేశాధినేతలు హర్షధ్వానాలతో స్వాగతించారు. ఉగ్రవాదం పెనుముప్పు ఉగ్రవాదం ప్రపంచ శాంతికి, భద్రతకు పెను ముప్పుగా పరిణమించిందని మోదీ అన్నారు. మరోవైపు సైబర్, స్పేస్, మారిటైమ్ క్రైమ్ పెను సవాళ్లు విసురుతున్నాయని అభిప్రాయపడ్డారు. ‘‘వీటిని సమూలంగా రూపుమాపాలంటే కేవలం మాటలు చాలవు. నిర్దిష్ట కార్యాచరణతో ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలి. అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా, సురక్షితంగా వినియోగించుకునేలా అంతర్జాతీయ స్థాయిలో నియంత్రణ వ్యవస్థ రావాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘మానవాళి సంక్షేమానికి ఆహార, ఆరోగ్య భద్రతకు దేశాలు ప్రాధాన్యమివ్వాలి. సంక్షేమ, సుస్థిరాభివృద్ధి పథకాల ద్వారా 25 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి విముక్తం చేశాం. వాటిని మిగతా దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు. గాడిన పెట్టేందుకే: గుటెరస్ ప్రారం¿ోపన్యాసం చేసిన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలపై మోదీ అభిప్రాయాలతో ఏకీభవించారు. వాటిని బాధ్యతాయుతంగా, నిష్పాక్షికంగా, ప్రభావశీలంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు. ఐరాస భద్రతా మండలిని కాలం చెల్లిన వ్యవస్థగా అభివరి్ణంచారు! సరైన సంస్కరణలతో పనితీరును సరి చేసుకోకుంటే దాని విశ్వసనీయత అడుగంటడం ఖాయమని హెచ్చరించారు. ఘర్షణలకు ముగింపు కనుచూపు మేరలో కని్పంచడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘పట్టాలు తప్పుతున్న ప్రపంచాన్ని దారిన పెట్టేందుకు కఠిన నిర్ణయాలను, చర్యలను సూచించడమే లక్ష్యంగా సదస్సు జరిగింది’’ అన్నారు. మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టాల్సిన చర్యలతో కూడిన ఒప్పందాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. సమగ్రాభివృద్ధి, అంతర్జాతీయ శాంతిభద్రతలు, శాస్త్ర సాంకేతికత, యువత, భావి తరాలు, అంతర్జాతీయంగా పాలన తీరుతెన్నుల్లో మెరుగైన మార్పులపై ఒప్పందం దృష్టి సారించింది.పాలస్తీనా అధ్యక్షునితో భేటీ పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌తో మోదీ భేటీ అయ్యారు. గాజాలో మానవతా సంక్షోభం పట్ల తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. పాలస్తీనా ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. కువైట్ రాకుమారుడు షేక్ సబా ఖలీద్ అల్ సబా, నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి తదితరులతో కూడా మోదీ సమావేశమయ్యారు. -
స్వేచ్ఛాయుత ఇండోపసిఫిక్
విలి్మంగ్టన్/వాషింగ్టన్/న్యూఢిల్లీ: ‘క్వాడ్’ కూటమి ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదని, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థ కోసమే అది కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. ప్రపంచదేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను క్వాడ్ గౌరవిస్తోందని అన్నారు. సంఘర్షణలు, సంక్షోభాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుత, సమగ్ర, శాంతి సౌభాగ్యాలతో కూడిన ఇండో–పసిఫిక్‌కు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో డెలావెర్‌లోని విలి్మంగ్టన్‌లో స్థానిక కాలమానం ప్రకారం శనివారం జరిగిన క్వాడ్ దేశాల అధినేతల శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ ప్రారం¿ోపన్యాసం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యమిచి్చన ఈ సదస్సులో ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులు ఆంథోనీ అల్బనీస్, ఫుమియో కిషిదా కూడా పాల్గొన్నారు. భిన్న రంగాల్లో క్వాడ్ దేశాలు పరస్పరం చక్కగా సహకరించుకుంటున్నాయని మోదీ అన్నారు. ఆరోగ్య సంరక్షణ, వాతావరణమార్పులు, మౌలిక సదుపాయా కల్పనతోపాటు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కలిసి పని చేస్తున్నాయని పేర్కొన్నారు. క్వాడ్ సదస్సులో ఫలవంతమైన చర్చ జరగబోతోందని వ్యాఖ్యానించారు. వ్యూహాత్మక బంధం బలోపేతం ప్రపంచమంతటా శాంతియుత పరిస్థితి నెలకొనాలన్నదే క్వాడ్ ఆకాంక్ష అని కూటమి నేతలు స్పష్టం చేశా రు. ఇండో–పసిఫిక్ దేశాల బాగు కోసమే కూటమి ఏర్పాటైందన్నారు. ‘ఇండో–పసిఫిక్ సంక్షేమానికి కృషి చేస్తున్న శక్తి క్వాడ్’ అని ఉద్ఘాటించారు. తమ కూటమి దేశాల మధ్య వ్వూహాత్మక బంధం గతంలో ఎన్నడూ లేనంతగా బలపడిందని వెల్లడించారు. సదస్సు అనంతరం నేతలంతా ఈ మేరకు ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశారు. ఐరాస భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘిస్తూ ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఇటీవల జరిగిన మిస్సైల్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. చైనా తీరుపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండో–పసిఫిక్ విద్యార్థులకు 50 క్వాడ్ స్కాలర్షిప్లు ఇవ్వనున్నట్లు భారత్ ఈ సందర్భంగా ప్రకటించింది. దీనికింద మొత్తం 5 లక్షల డాలర్లు అందజేయనున్నట్లు వెల్లడించింది. నేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు క్వాడ్ సదస్సు సందర్భంగా ప్రధానులు అల్బనీస్, కిషిదాతో పాటు బైడెన్‌తో కూడా మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి, భద్రతపై భారత వైఖరిని వివరించారు. ఆయా దేశాలతో బంధాల బలోపేతంపై సంప్రదింపులు జరిపారు.ఉక్రెయిన్‌లో శాంతికి మోదీ చొరవ ప్రశంసనీయం: బైడెన్ మోదీపై బైడెన్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ గత నెలలో ఉక్రెయిన్‌లో చరిత్రాత్మక పర్యటన చేపట్టడం, శాంతి సందేశం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో శాంతికి మోదీ ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారని కొనియాడారు. మోదీకి బైడెన్ శనివారం విలి్మంగ్టన్లోని తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉక్రెయిన్–రష్యా ఘర్షణతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్ గళం బలంగా వినిపించేలా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలకు తాను మద్దతు ఇస్తానని ఈ సందర్భంగా బైడెన్ చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కలి్పంచేందుకు తన మద్దతు ఉంటుందన్నారు. మోదీ–బైడన్ భేటీపై భారత్, అమెరికా ఒక ఫ్యాక్ట్ïÙట్ విడుదల చేశాయి. అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ సంస్థ నుంచి భారత్ 31 లాంగ్–రేంజ్ ఎండ్యూరెన్స్ ఎంక్యూ–9బీ ఆర్మ్డ్ డ్రోన్లు కొనుగోలు చేస్తుండడాన్ని బైడెన్ స్వాగతించారు. -
యుద్ధ ఖైదీల మార్పిడి
మాస్కో/కీవ్: రష్యా, ఉక్రెయిన్లు శనివారం 103 మంది చొప్పున యుద్ధఖైదీలను పరస్పరం మారి్పడి చేసుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దీనికి మధ్యవర్తిత్వం వహించింది. ‘మావాళ్లు స్వదేశానికి చేరుకున్నారు. రష్యా చెర నుంచి 103 మంది యోధులను విజయవంతంగా ఉక్రెయిన్‌కు తీసుకొచ్చాం’అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. యుద్ధఖైదీల మారి్పడిలో భాగంగా ఉక్రెయిన్‌కు చేరిన వారిలో 82 సాధారణ పౌరులు, 21 మంది సైనిక సిబ్బంది ఉన్నారు. ‘కస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ బందీలుగా పట్టుకున్న 103 సైనిక సిబ్బంది కీవ్ ఆ«దీనంలోని భూభాగం నుంచి విముక్తులయ్యారు. బదులుగా 103 యుద్ధఖైదీలను ఉక్రెయిన్‌కు అప్పగించాం’అని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ చెర వీడిన రష్యా యుద్ధఖైదీలు ప్రస్తుతం బెలారస్లో ఉన్నారు. వారికి అవసరమైన వైద్య, మానసిక సహాయాన్ని అందిస్తున్నట్లు రష్యా తెలిపింది. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దండెత్తిన తర్వాత యూఏఈ మధ్యవర్తిత్వంలో జరిగిన ఎనిమిదో యుద్ధఖైదీల మారి్పడి ఇది. మొత్తం ఇప్పటిదాకా 1,994 మంది ఖైదీలకు తమ చొరవతో చెరవీడిందని యూఏఈ తెలిపింది. రష్యాలోని సుదూర లక్ష్యాల పైకి దాడికి అనుమతించండి రష్యాలోని సుదూర లక్ష్యాల పైకి దాడి చేయడానికి తమను అనుమతించాలని ఉక్రెయిన్ పునరుద్ఘాటించింది. పశి్చమదేశాలు ఉక్రెయిన్‌కు సుదూరశ్రేణి క్షిపణులను సరఫరా చేసినప్పటికీ.. వాటి వాడకానికి అనుమతివ్వడం లేదు. ‘రష్యా ఉగ్రవాదం వారి ఆయుధాగారాలు, సైనిక విమానాశ్రయాలు, సైనిక స్థావరాల వద్ద మొదలవుతుంది. రష్యా లోపలి ప్రాంతాల్లోని లక్ష్యాలపై దాడులకు అనుమతి లభిస్తే.. పరిష్కారం వేగమంతమవుతుంది’అని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు ఆండ్రీ యెర్మాక్ శనివారం వివరించారు. -
పుతిన్‌పై ప్రశ్న.. రిపోర్టర్‌పై బైడెన్ ఆగ్రహం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా ఓ మీడియా ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం(సెప్టెంబర్13) వైట్‌హౌస్‌లో బైడెన్, బ్రిటన్ పీఎం కీర్ స్టార్మర్ ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించి బ్రీఫింగ్ ఇస్తుండగా స్కై న్యూస్ మీడియా ప్రతినిధి ఒకరు బైడెన్‌ను ప్రశ్నించారు.రష్యాపై ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ క్షిపణులను ప్రయోగించే విషయంలో పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్ ఇవ్వడాన్ని రిపోర్టర్ ప్రస్తావించారు. దీనికి బైడెన్ స్పందిస్తూ నేను మాట్లాడే వరకు మీరు నిశ్శబ్దంగా ఉంటే మంచిది.ముందు నన్నుపూర్తిగా చెప్పనివ్వండని రిపోర్టర్‌పై మండిపడ్డారు. అనంతరం సమావేశం ముగిసిన తర్వాత రిపోర్టర్ బైడెన్‌ను తిరిగి ప్రశ్నించారు.తాను పుతిన్ గురించి అసలు ఆలోచించనని,ఉక్రెయిన్‌తో యుద్ధంలో పుతిన్ గెలిచే ఛాన్సే లేదని బైడెన్ సమానధానమిచ్చారు.ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు అమెరికా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ క్షిపణుల వినియోగించడంపై అమెరికాకు కొత్త విధానమేమీ లేదని చెప్పారు. 2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా,ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. -
పట్టాలపై లైఫ్‌లైన్
నర్సు ఓల్గా.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంతటా విరామం లేకుండా తిరుగుతూనే ఉన్నారు. రోగుల ఆక్సిజన్ స్థాయిలను తనిఖీ చేసి నోట్ చేసుకుంటున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న రోగులను ఓ కంట కనిపెడుతున్నారు. ఓ ఆస్పత్రిలో ఇదో సాధారణ దృశ్యం. కానీ ఆమె పనిచేస్తున్నది నడుస్తున్న రైలులో. వైద్యం అందిస్తున్నది యుద్ధంలో గాయాలపాలైన సైనికులకు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడానికి ఉక్రెయిన్ ఈ రైలాస్పత్రిని నడుపుతోంది. ఆ దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఇప్పుడిది కీలక భాగంగా మారింది. యుద్ధంలో గాయపడిన సైనికుల కోసం తూర్పు ఉక్రెయిన్‌లోని చాలా నగరాల్లోని ఆసుపత్రుల్లో పడకలు లేవు. అవి ఖాళీ చేయడానికి కొందరిని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తుంది. అంబులెన్సుల్లో సుదూర ప్రయాణంతో సైనికుల ప్రాణాలకే ముప్పుకావచ్చు. రష్యా దాడుల నేపథ్యంలో హెలికాప్టర్ అంబులెన్స్‌లు కూడా ఉపయోగించలేరు. ఈ క్లిష్ట స్థితిలో రైళ్లు సైనికుల ప్రాణాలను కాపాడుతున్నాయి. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే ఇందులోని బోగీలు పూర్తి స్థాయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లుగా పనిచేస్తున్నాయి. ఆర్మీ డాక్టర్లు, ఇతర సిబ్బంది సైనికులకు రైలులోనే సేవ లు అందిస్తున్నారు. కదులుతున్న రైలులో ఐసీయూ యూనిట్ నడపడం చాలా కష్టమైన పని. అయినా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ‘ఇక్కడ మా సామర్థ్యం చాలా పరిమితం. ఏదైనా జరిగితే బయటి కన్సల్టెంట్‌ను పిలవలేం. రక్తస్రావాన్ని ఆపడానికి చిన్న చిన్న ఆపరేషన్లు వంటివి చేస్తాం. పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు చేయలేం’అని డాక్టర్స్ చీఫ్ ఒకరు తెలిపారు. పర్యాటక రైలు కాస్తా ఆస్పత్రిగా.. యుద్ధం ప్రారంభంలో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఉక్రెయిన్ సమయస్ఫూర్తికి రైలాస్పిత్రి ఒక ఉదాహరణ. 2022 ఫిబ్రవరిలో దేశంపై రష్యా దాడులు ప్రారంభించినప్పుడు ఉక్రెయిన్ వద్ద ఎటువంటి మెడికల్ రైలు బోగీలు లేవు. గాయపడిన సైనికులను సాధారణ రైళ్లలోకి కిటికీల గుండా బలవంతంగా ఎక్కించేవారు. దీనికి పరిష్కారం ఆలోచించిన ఉక్రెయిన్ రైల్వే.. సాధారణ రోజుల్లో పర్యాటకులను కార్పాతియన్ పర్వతాలకు తీసుకెళ్లడానికి ఉపయోగించే రైళ్లను పునరుద్ధరించింది. అలా ఆస్పత్రి రైలుకు రూపకల్పన జరిగిందని ఉక్రెయిన్ రైల్వే ప్యాసింజర్ ఆపరేషన్స్ సీఈఓ ఒలెక్సాండర్ పెర్తోవ్స్కీ చెప్పారు. గంటకు 50 మైళ్ల వేగంతో.. ఈ రైలు గంటకు 80 కిలోమీటర్లు (50 మైళ్లు) వేగంతో ప్రయాణిస్తుంది. సాధారణ రైలు వేగంలో సగమే అయినప్పటికీ ఐసీయూ మాత్రం అటూఇటూ కదిలిపోతూంటుంది. దీంతో పనిచేసేటప్పుడు సిబ్బంది చాలా అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంబులెన్స్ రైళ్లను మొదట 1850లలో క్రిమియన్ యుద్ధం సమయంలో ఉపయోగించారు. కానీ ఈ ఆధునిక వెర్షన్లలో వెంటిలేటర్లు, లైఫ్ సపోర్ట్ యంత్రాలు, అ్రల్టాసౌండ్ స్కానర్లు, పోర్టబుల్ ఎయిర్ కండిషనర్లు ఉన్నాయి. ప్రతి క్యారేజీలో నిరంతర విద్యుత్ కోసం జనరేటర్లుంటాయి. బోగీల్లో పిల్లల చిత్రాలు, ఉక్రెయిన్ జాతీయ జెండాలు ఉంటాయి. గాయపడిన సైనికులకు ఇవి కొంత ఓదార్పును అందిస్తాయి. రెండు భిన్న దృశ్యాలు.. తొమ్మిది గంటల ప్రయాణం తరువాత రైలాస్పత్రి ఒక నగరంలోని రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించగానే.. అంబులెన్సులు సైనికుల కోసం ఎదురు చూస్తుంటాయి. ఐసీయూ లోని నర్సులు సైనికులను ప్లాట్‌ఫామ్‌పై ఎదురుచూస్తున్న వైద్యులకు అప్పగిస్తారు. స్టేషన్ నుంచి అంబులెన్సులు బయల్దేరి వెళ్లాక ఊపిరి పీల్చుకుంటారు. వారికి ఎదురుగా కొత్తగా రిక్రూట్ అయిన సైనికులతో ఓ రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది. తల్లిదండ్రులకు వీడ్కోలు పలుకుతూ పిల్లలు కనపడతారు. సాయంత్రానికి ఆ యువసైనికులు అపస్మారక స్థితిలోనో, తీవ్ర గాయాలతోనే అదే రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. ఈ రెండు దృశ్యాలకు ప్రత్యక్ష సాకు‡్ష్యలు రైలాస్పత్రి సిబ్బందే. యుద్ధం మిగుల్చుతున్న అంతులేని విషాదమిది. ‘యుద్ధ క్షేత్రం నుంచి తీవ్రంగా గాయపడి వచ్చే సైనికులను చూడటం బాధాకరమైన విషయమే. కానీ, వారికి సేవ చేస్తున్నామన్న తృప్తి మాత్రం మాకు మిగులుతుంది’అని చెబుతున్నారు ఐసీయూ నర్సు ఓల్గా. 2015లో సైన్యంలో నర్సుగా చేరిన ఆమె.. 2022 నుంచి యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స అందిస్తున్నారు. అలసిపోయాం.. యుద్ధం చెల్లించుకుంటున్న మూల్యానికి ఈ రైలాస్పత్రి ఓ చిన్న ఉదాహరణ. ‘రష్యన్ విసిరిన గ్రెనేడ్‌తో నా చేతులు, భుజాలు, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు శబ్దాలు నా వినికిడి శక్తినే దెబ్బతీశాయి. నేనే కాదు.. చాలా మందికి మనోధైర్యం ఉంది. కానీ చాలా అలసిపోయారు. ఇలాంటప్పుడు ఏదేమైనా కానీ భారమంతా దేవుడిదే అనుకుంటాం’అని చెబుతున్నారు రష్యా డ్రోన్ దాడిలో గాయపడి రైలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 35 ఏళ్ల సైనికుడు. అలసట యుద్ధక్షేత్రంలోని సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోందనడానికి ఇదో ఉదాహరణ. ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఈయన 18 నెలల నుంచి డోనెట్స్క్ ప్రాంతంలోని పదాతిదళంలో యాంటీ ట్యాంక్ గన్నర్‌గా పనిచేస్తున్నారు. ఇన్ని రోజుల్లో కేవలం 45 రోజులు మాత్రమే ఫ్రంట్‌లైన్‌కు దూరంగా ఉన్నారు. గాయాల నుంచి ప్రేరణ.. ఈయనకు కొన్ని పడకల దూరంలో కూర్చున్న స్టానిస్లావ్ మూడు నెలల క్రితం స్వచ్ఛందంగా సైన్యంలో చేరారు. అతడున్న కందకంపైన డ్రోన్ దాడి జరగడంతో ఊపిరితిత్తులకు గాయమైంది. పక్కటెముకలు విరిగాయి. అయినా స్టానిస్లావ్ పూర్తి భిన్నమైన మానసిక స్థితిలో కనిపించారు. ‘‘గాయపడ్డాక నాలో ఆత్మస్థైర్యం తగ్గలేదు. నేను మరింత ప్రేరణ పొందాను’’అని చిరునవ్వుతో చెబుతున్నారు. యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యాపై 140 డ్రోన్లతో ఉక్రెయిన్ భారీ దాడి
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కోనసాగుతున్న నేపథ్యంలో మరోసారి ఉక్రెయిన్ సైన్యం రష్యా భూభాగంపై భారీ దాడికి పాల్పడింది. ఉక్రెయిన్.. తమ భూభాగంలో ఏకంగా 140కి పైగా డ్రోన్లను ప్రయోగించిందని రష్యా రక్షణశాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. అయితే.. తమ భూభాగంలోకి ప్రవేశించిన 144 డ్రోన్లను రాత్రికి రాత్రే కూల్చివేశామని తెలిపారు.బ్రయాన్స్క్ ప్రాంతంపై 72, మాస్కో ప్రాంతంపై 20, కుర్స్క్ ప్రాంతంపై 14, తులా ప్రాంతంపై 13, దేశంలోని మరో ఐదు ప్రాంతాలపై 25 ప్రయోగించిన డ్రోన్ల కూల్చివేశామని రష్యా సైన్యం తెలిపింది. ఉక్రెయిన్ చేసిన భారీ వైమానిక దాడుల్లో మాస్కోలో ఒక మహళ మృతి చెందినట్లు మాస్కో ప్రాంతీయ గవర్నర్ ఆండ్రీ వోరోబయోవ్ వెల్లడించారు. దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.మరోవైపు.. ఈ దాడుల కారణంగా నాలుగు విమానాశ్రయాల్లో కొన్ని విమానాలను రద్దు చేసి, మరికొన్నింటిని వాయిదా వేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు. ఇటీవల ఇరుదేశాల మధ్య దాడుల తీవ్రత పెరుగుతోంది. అదేవిధంగా రాత్రి సమయంలో భీకరంగా వైమానిక దాడులకు ఇరు దేశాలు తెగబడటం గమనార్హం.ఇది చదవండి: గాజాపై యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ -
Russia-Ukraine war: నిప్పులు చిమ్మే డ్రాగన్ డ్రోన్
తమ భూభాగాన్ని దురాక్రమించిన రష్యా సైన్యంతో నెలల తరబడి అలుపెరగక పోరాడుతున్న ఉక్రెయిన్ బలగాల చేతికి కొత్త అస్త్రమొచ్చింది. రష్యా స్థావరాలపై భారీ స్థాయిలో మంటలు చిమ్ముతూ, పొగ వెదజల్లే కొత్త తరహా డ్రోన్‌ను ఉక్రెయిన్ యుద్ధరంగంలోకి దింపింది. అటవీప్రాంతాల్లో నక్కిన రష్యా సైనికులు, వారి యుద్ధట్యాంకులపైకి బుల్లి డ్రోన్లు ఏకధాటిగా నిప్పులు వెదజల్లుతున్న వీడియోను ఉక్రెయిన్ రక్షణ శాఖ ‘ఎక్స్’లో విడుదలచేయడంతో ఈ డ్రోన్ల సంగతి అందరికీ తెల్సింది. రణరీతులను మార్చేస్తున్న అధునాతన డ్రాగన్ డ్రోన్ గురించి అంతటా చర్చమొదలైంది. ఏమిటీ డ్రాగన్ డ్రోన్? చైనాలో జానపథ గాథల్లో డ్రాగన్ పేరు ప్రఖ్యాతిగాంచింది. నిప్పులు కక్కుతూ ఆకాశంలో చక్కర్లు కొట్టే డ్రాగన్ గురించి అందరికీ తెలుసు. అచ్చం అలాగే నిప్పులను వెదజల్లుతూ ఆకాశంలో దూసుపోతుంది కాబట్టే ఈ డ్రోన్‌కు డ్రాగన్ అని పేరు పెట్టారు. సంప్రదాయక డ్రోన్లకు భిన్నంగా పనిచేస్తున్న ఈ డ్రోన్లతో రష్యా బలగాలకు నష్టం పెద్దగా ఉంటుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రోన్ ప్రత్యేకత ఏంటి? థర్మైట్ ఈ డ్రోన్‌లో ఉన్న ఏకైక ఆయుధం. అత్యధికంగా మండే స్వభావమున్న ఖనిజాన్ని, అల్యూమినియం, ఐరన్ ఆక్సైడ్ పొడి, ఇంకొంచెం ఇనుప రజను మిశ్రమాన్ని మందుగుండుగా వాడతారు. అయితే మిగతా డ్రోన్లలాగా ఇది పేలే బాంబును లక్ష్యంగాపైకి జాడవిడచదు. తనలోని మిశ్రమాన్ని మండించి తద్వారా విడుదలయ్యే మంటను కొంచెం కొంచెంగా అలా దారి పొడవునా వెదజల్లుకుంటూ పోతుంది. ఊపిరి ఆడకుండా దట్టమైన పొగను సైతం వెదజల్లుతుంది. ద్రవరూపంలోకి వారిన ఖనిజం మండుతూ ఏకంగా 4,000 డిగ్రీ ఫారన్‌హీట్ వేడిని పుట్టిస్తుంది. ఇంతటి వేడి శత్రు స్థావరాలను కాల్చేస్తుంది. ఈ ద్రవఖనిజం మీద పడితే మిలటరీ గ్రేడ్ ఆయుధాలు ఏవైనా కరిగిపోతాయి. సముద్రతీర ప్రాంతాల్లో నీటి అడుగున నక్కిన శత్రువుల ఆయుధాలను ఇది కాల్చేస్తుంది. ఎందుకంటే ఇది నీటిలో కూడా మండగలదు. ఇది మీద పడితే సైనికుల శరీరం, ఎముకలు కాలిపోతాయి. మరణం దాదాపు తథ్యం. ఒకవేళ తృటిలో తప్పించుకున్నా మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు థర్మైట్ ఆయుధంతోపాటు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యంపైకి దూసుకెళ్లడం ఈ డ్రాగన్ డ్రోన్ ప్రత్యేకత. సంప్రదాయక రక్షణ ఉత్పత్తులతో పోలిస్తే ఇది అత్యంత ప్రమాదకరమైందని బ్రిటన్‌లోని యుద్ధవ్యతిరేక దౌత్య సంస్థ ‘యాక్షన్ ఆన్ ఆర్మ్డ్ వయలెన్స్’ పేర్కొంది. దాడి చేయడంతో పాటు నిఘా పనులూ ఇవి ఒకే సమయంలో పూర్తిచేయగలవు. ఎందుకంటే వీటికి స్పష్టమైన కెమెరాలను బిగించారు. యుద్ధట్యాంక్, సైనికుడు, మరేదైనా స్థావరం.. ఇలా శత్రువుకు సంబంధించిన దేనిపై దాడి చేస్తుందో కెమెరాలో ఉక్రెయిన్ బలగాలు స్పష్టంగా చూడొచ్చు.అంకుర సంస్థ చేతిలో.. ఈ డ్రాగన్ డ్రోన్‌ను ఉక్రెయిన్‌లోని స్టార్టప్ సంస్థ ‘స్టీల్ హార్నెట్స్’ తయారుచేసినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ తయారుచేసిన శక్తివంతమైన థరై్మట్ సాయంతో 4 మిల్లీమీటర్ల మందమైన లోహ ఉపరితలానికి సైతం కేవలం 10 సెకన్లలో రంధ్రం పడుతుందని తెలుస్తోంది. యుద్దం మొదలైననాటి నుంచి ఉక్రెయిన్‌కు అన్ని రకాల ఆయుధాలు అందిస్తూ అమెరికా ఆదుకుంటోంది. అమెరికా తన అమ్ములపొదిలోని థర్మైట్ గ్రనేడ్లను ఉక్రెయిన్‌కు ఇస్తోందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అమెరికా ఇస్తేగనక రష్యా సైతం ఇలాంటి ఆయుధాలనే ప్రయోగించడం ఖాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రంగంలోకి అజిత్ దోవల్.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగిసేనా!
ఢిల్లీ : ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రెండు శత్రు దేశాల మధ్య సంధి కుదిర్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ వారంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యాలో పర్యటించనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ.. రష్యా, ఉక్రెయిన్ పర్యటించారు. మోదీ పర్యటన అనంతరం అజిత్ దోవల్ రష్యా వెళ్లడం యుద్ధం ముగింపు పలికే అవకాశం ఉందని మిత్రదేశాల అధ్యక్షులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత ఆగస్ట్ నెలలో మోదీ ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా కాకుండా, శాంతివైపు ఉందని మోదీ చెప్పారు. అంతేకాదు యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా, ఉక్రెయిన్లకు పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిపేందుకు భారత్ సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు.ఇది చదవండి: కిమ్‌కు పుతిన్ గిప్ట్.. ఎందుకంటేఉక్రెయిన్ పర్యటనపై ఆగస్ట్ 27న రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌కు మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విషయంలో భారత్ వైఖరి గురించి వివరించారు. ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న సంక్షోభానికి ముగింపు పలికేలా శాంతియుతంగా చర్చలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. పుతిన్ కీలక ప్రకటనవరుస పరిణామల నేపథ్యంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై వ్లాదిమీర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. రష్యాలోని నార్త్ కొరియా,చైనా సరిహద్దు ప్రాంతమైన వ్లాడివోస్టోక్ నగరంలో సెప్టెంబర్ 3 నుంచి 6 వరకు ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య భారత్, బ్రెజిల్, చైనాలు శాంతి చర్చలు జరిపి అంశంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.స్పందించిన ఇటలీపుతిన్ ప్రకటన అనంతరం..అజిత్ దోవల్ ఈ వారం రష్యాలో పర్యటించడంపై మిత్ర దేశాలు ఉక్రెయిన్-రష్యా యుద్ధం త్వరలో ముగియనుందనే అశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తర ఇటలీలోని సెర్నోబియో నగరంలోని అంబ్రోసెట్టి ఫోరమ్‌లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా – ఉక్రెయిన్ మధ్య వివాదాన్ని పరిష్కరించడంలో భారత్, చైనా వంటి దేశాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయంటూ జార్జియా మెలోని పేర్కొన్నారు. ఇప్పటికే భారత్ ఈ విషయంలో స్పందించిందని గుర్తుచేశారు.రెండేళ్లకు సమీపిస్తున్న యుద్ధంసెప్టెంబర్ 24, 2022 నుంచి కొనసాగుతున్న ఉక్రెయిన్ -రష్యా యుద్ధంలో సుమారు 5లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.