మాస్కో: ఉక్రెయిన్ నగరం ఖర్కీవ్‌పై రష్యా ప్రయోగించిన క్షిపణి ఆటస్థలంలో పడటంతో 14 ఏళ్ల బాలిక మృత్యువాత పడింది. సరిహద్దులకు సమీపంలోని ఖర్కీవ్‌పైనే జరిపిన మరో దాడిలో 12 అంతస్తుల నివాస భవనం ధ్వంసమయింది. ఘటనలో ఐదుగురు చనిపోగా మరో 59 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 9 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో 20 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఘటనలో భవనంలో పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. భవనం వెలుపలి గోడ తీవ్రంగా దెబ్బతింది.
సమీపంలో పార్కు చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఇలా ఉండగా, సరిహద్దులకు సమీపంలోని బెల్గొరోడ్ ప్రాంతంపై ఉక్రెయిన్ ఆర్మీ జరిపిన దాడుల్లో ఐదుగురు చనిపోయినట్లు రష్యా ప్రకటించింది. కాగా, డొనెట్‌స్క్ రిజియన్‌లోని చాసివ్ యార్ పట్టణంపై రష్యా జరిపిన దాడుల్లో ఏడుగురు మృతి చెందారు. పట్టణంలోని పౌరులందరూ ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆ ప్రాంత గవర్నర్ కోరారు. ఉక్రెయిన్ బలగాల మౌలిక వనరుల రవాణాకు కీలకంగా ఉన్న పొక్రొవ్‌స్క్ నగరానికి అతి సమీపంలో రష్యా బలగాలు తిష్టవేశాయి.
ఎయిర్ ఫోర్స్ చీఫ్ తొలగింపు: ముందుకు చొచ్చుకు వస్తున్న రష్యా బలగాలను నిలువరించి, ఎదురు దాడులు చేయడంలో అమెరికా మిత్ర దేశాలు అందించిన ఎఫ్–16 యుద్ధ విమానాలను ఉక్రెయిన్ కీలకంగా భావిస్తోంది. అయితే, సోమవారం ఒక ఎఫ్–16 యుద్ధ విమానాన్ని రష్యా ఆర్మీ కూల్చి వేసింది. అందులోని పైలట్ కూడా చనిపోయారు. ఘటనను అధ్యక్షుడు జెలెన్‌స్కీ సీరియస్‌గా తీసుకున్నారు. వైమానిక దళం చీఫ్ మికోలా ఒలెశ్‌చుక్‌ను బాధ్యతల నుంచి తొలగిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇందుకు కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. సైనికుల భద్రతకు ఆయనదే పూర్తి బాధ్యతని మాత్రమే వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment