బీరుట్: లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోయారు. బర్జా పట్టణంపై మంగళవారం రాత్రి జరిగిన దాడిలో ఓ అపార్టుమెంట్ భవనం నేలమట్టమైంది. బుధవారం సహాయక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న కనీసం 30 మృత దేహాలను వెలికితీశారు. మరికొందరు శిథిలాల
కిందే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముందస్తు హెచ్చరికలు లేకుండా చేపట్టిన ఈ దాడిపై ఇజ్రాయెల్ ఆర్మీ స్పందించలేదు.
తీరప్రాంత సిడాన్ నగరానికి ఉత్తరాన ఉన్న ఈ పట్టణంపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడి చేసిన దాఖలాలు లేవు. ఇలా ఉండగా, లెబనాన్‌లోని హెజ్‌బొల్లా సాయుధ గ్రూపు బుధవారం ఇజ్రాయెల్‌పైకి కనీసం 10 రాకెట్లను ప్రయోగించింది. దీంతో, టెల్ అవీవ్‌లో సైరన్లు మోగాయి. ఒక రాకెట్ శకలం సెంట్రల్ ఇజ్రాయెల్ నగరం రాననలోని పార్కు చేసిన కారుపై పడింది. టెల్ అవీవ్‌లోని ప్రధాన విమానాశ్రయం సమీపంలోని బహిరంగ ప్రాంతంలో రాకెట్లు పడ్డాయని మీడియా తెలిపింది. విమానాల రాకపోకలు మాత్రం కొనసాగాయని పేర్కొంది. రాకెట్ల దాడిలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని సహాయక బృందాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment