క్రైస్తవ, ముస్లిం, యూదు మతాల పవిత్ర స్థలాలకు నెలవైన జెరూసలేంలోని అల్–అక్సా మసీదు ప్రాంతంలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దళాల దాడులతో రాజుకున్న వివాదం చివరకు హమాస్–ఇజ్రాయెల్ యుద్ధంగా తీవ్రరూపం దాల్చి ఆదివారంతో 100 రోజులు పూర్తిచేసుకుంది.
అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపై హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడులు, 1,200 మంది ఇజ్రాయెల్ పౌరుల హతం, 200 మందికిపైగా అపహరణతో మొదలైన ఈ ఘర్షణ ఆ తర్వాత ఇజ్రాయెల్ భూతల, గగనతల భీకర దాడులతో తీవ్ర మానవీయ సంక్షోభంగా తయారైంది.
వందల కొద్దీ బాంబు, క్షిపణి దాడుల ధాటికి లక్షలాది మంది పాలస్తీనియన్లు ప్రాణభయంతో పారిపోయారు. దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులై తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేక, కనీసం తాగు నీరు లేక జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్నారు. ఈ యుద్ధం 23 వేలకుపైగా ప్రాణాలను బలితీసుకోగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులను మరింత పెంచింది. ఐక్యరాజ్యసమితి మానవీయ సాయం డిమాండ్లు, తీర్మానాలతో కాలం వెళ్లదీస్తోంది.
మృత్యు నగరాలు
ఇజ్రాయెల్ దాడులతో గాజా స్ట్రిప్‌లోని ప్రతి పట్టణం దాదాపు శ్మశానంగా తయారైంది. మొత్తం 23 లక్షల జనాభాలో 85 శాతం మంది వలసపోయారు. ఉత్తర గాజాపై, ఆ తర్వాత దక్షిణ గాజాపై దాడుల ఉధృతి పెరగడంతో జనం ఈజిప్ట్ చిట్టచివరి సరిహద్దు ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. లెబనాన్‌లోని హెజ్»ొల్లా మిలెంట్లు, యెమెన్‌లోని హౌతీల దాడులతో యుద్దజ్వాలలు పశ్చిమాసియాకు పాకుతున్నాయి. కాల్పుల విరమణ ప్రకటించేదాకా బందీలను వదిలిపెట్టబోమని, దాడులను ఆపబోమని హమాస్, దాన్ని హమాస్‌ను కూకటివేళ్లతో పెకలించేదాకా యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ అంటున్నాయి!
ఫలించని దౌత్యం
ఖతార్, అమెరికా దౌత్యం తొలుత సఫలమైనట్లే కనిపించింది. ఇజ్రాయెల్, పాలస్తీనా పరస్పరం బందీలను విడుదల చేశాయి. కానీ ఆ వెంటనే మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఈ వంద రోజుల్లో లక్షలాది ఇళ్లు, వేలాది ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉండటం అత్యంత విషాదకరం.
రోగాల పుట్టలుగా శరణార్థి శిబిరాలు
గాజాలో శరణార్థి శిబిరాలు కిటకిటలాడుతున్నాయి. జనం రోగాలబారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. ఆహార, సరకులు, ఔషధ సాయం అందకుండా ఇజ్రాయెల్ దాడులకు దిగుతుండటంతో అక్కడ ఎటు చూసినా భయానక పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment