‘స్టార్‌’ లయన్‌ | Kenya special documentary on the scarface lion | Sakshi
Sakshi News home page

‘స్టార్‌’ లయన్‌

Published Mon, Mar 24 2025 5:33 AM | Last Updated on Mon, Mar 24 2025 9:09 AM

Kenya special documentary on the scarface lion

ముసాయి మారా నేషనల్ రిజర్వు ఫారెస్ట్ రారాజు 

130 మగ సింహాలు, 400 హైనాలను హతమార్చింది

14 ఏళ్ల పాటు 400 మైళ్ల అడవిని ఏలిన మృగరాజు 

హిప్పోతోనూ పోరాడి గెలిచిన చరిత్ర దీని సొంతం 

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు

కంటిపై గాయంతో ‘స్కార్‌ ఫేస్‌ లయన్‌’గా గుర్తింపు 

స్కార్‌ ఫేస్‌ లయన్‌పై ‘కెన్యా’ ప్రత్యేక డాక్యుమెంటరీ

‘అనగనగా ఓ పెద్ద అడవి. ఆ అడవికి రాజు సింహం’.. ఎన్నో తరాలుగా పిల్లలకు చెప్పే కథే ఇది! 

ఇక్కడ కూడా అడవిలో రారాజుగా వెలుగొందిన ఓ మృగరాజు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎన్నో యుద్ధాలు చేసి రాజ్యాన్ని, బలగాన్ని విస్తరించి, తన రాజ్యాన్ని 14 ఏళ్ల పాటు ఆఫ్రికా ఖండంలోనే ఓ పెద్ద అడవిని ఏక ఛత్రాధిపత్యంతో ఏలింది ఈ సింహం. కుడి కంటిపై గాటుతో భయంకరంగా కనిపించే ఈ సింహం 2021 జూన్‌ 11న వృద్ధాప్యంతో ప్రాణాలు విడిచింది. ఈ గాటు వల్లనే దానికి ‘స్కార్‌ ఫేస్‌ లయన్‌’గా పేరుపొందింది. 

ఐదేళ్ల క్రితం ఓ సింహం గడ్డిలో పొర్లాడుతూ భయంకరమైన గర్జన చేస్తూ చనిపోయిన వీడియో  ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అవుతోంది. అది ఎక్కడ జరిగిందో అని చాలా మంది ఆరా తీయగా.. కెన్యాలోని మసాయి మారా నేషనల్‌ పార్కులోదిగా తేల్చారు. అప్పుడే ఈ లయన్‌ కింగ్‌ ప్రత్యేకత తెలిసింది. అడవుల్లో సింహాలు గరిష్టంగా 12 ఏళ్లు బతికితే.. ఇది మాత్రం 14 సంవత్సరాలు జీవించింది. 

ఇదేం పెద్ద గొప్పకాకున్నా..బతికినంత కాలం రారాజుగానే ఉండి, సహజ మరణం పొందడమే విశేషం. ఈ లయన్‌ కింగ్‌ జీవితం, పోరాటాలు, సాహసాలపై కెన్యా ప్రభుత్వం పలు సందర్భాల్లో వీడియోలు తీసి, ఓ డాక్యుమెంటరీగా రూపొందించింది. అందులోని కొన్ని భాగాలు ఇప్పుడు మనదాకా వచ్చాయి. ఈ ‘స్టార్‌ లయన్‌ కింగ్‌’ ప్రత్యేకత ఏంటంటే..  – సాక్షి, అమరావతి

పుట్టింది -  2007
మరణం - 2021 జూన్‌ 11 
వేట - 130 మగ సింహాల మరణం 400 హైనాలు ఒక హిప్పోపోటమస్లెక్కలేనన్ని అలిగేటర్స్‌ (మొసళ్లు)
సొంత కుటుంబం - 120 సింహాలు
జీవించిన కాలం - 14 సంవత్సరాలు
ఆఫ్రికాలోనే అత్యంత సెలబ్రిటీ లయన్‌గాగుర్తింపు

మరో సింహానికి అవకాశం ఇవ్వకుండా..
ఆఫ్రికా ఖండంలో అతి పెద్ద నేషనల్‌ పార్కుల్లో ఒకటి కెన్యాలోని మసాయి మారా నేషనల్‌ పార్కు. 400 చదరపు కిలోమీటర్లు విస్తరించిన ఈ అరణ్యంలో  2007లో పుట్టిందీ సింహం. మూడేళ్లకే అరివీర భయంకరిగా మారింది. అడవుల్లో సహజంగా మగ సింహాల మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది. ఈ పోరులో గెలిచిన సింహం శత్రు గుంపులోని ఆడ సింహాలను, ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకుంటుంది. 

ఇంత పెద్ద అడవిలో ఈ లయన్‌ మరో మగ సింహానికి అలాంటి అవకాశమే ఇవ్వలేదు. ప్రతి యుద్ధంలో గెలిచింది. ఆడ సింహాలన్నింటినీ సొంతం చేసుకుంది. 14 ఏళ్ల జీవిత కాలంలో 130 మగ సింహాలను హతమార్చింది. 400కు పైగా హైనాలను హతమార్చింది. ఖడ్గమృగాలు, బలీయమైన మొసళ్లను చంపేసింది. సాధారణంగా సింహాలు హిప్పో (నీటి ఏనుగు)ల జోలికి పోవు. కానీ ఈ స్కార్‌ ఫేస్‌ లయన్‌ ఓ మగ హిప్పోతో ఒంటరిగా పోరాడి గెలిచింది.  ఇవి అధికారికంగా అటవీ సంరక్షకులు గుర్తించిన సంఖ్య మాత్రమే.

120 సింహాల గుంపునకు నాయకత్వం
కంటిపై గాటుతో కనిపించే ఈ మృగరాజు జీవితాంతం సవాళ్లతో పోరాడింది. స్థానిక సింహాలనే కాదు.. వేటగాళ్ల దాడులను సైతం దీటుగా ఎదుర్కొంది.ఎదురే లేని రారాజుగా నిలిచిందని అటవీ పరిరక్షకులు చెబుతుంటారు. పోరాటాల్లో తగిలిన తీవ్రమైన గాయాల నుంచి త్వరగా కోలుకోవడంతో పాటు ప్రతికూల పరిస్థితుల్లోనూ గర్వంగా నిలబడింది. అడవిలో ఓర్పుకు చిహ్నంగా మారింది. 

సాధారణంగా సింహాల గుంపులో 5 నుంచి 20 వరకు ఉంటాయి. కానీ ఈ మృగరాజు మాత్రం 120 సింహాలతో కూడిన పెద్ద గుంపుతో తిరిగేది. అందుకే మసాయి మారాలోని ఇతర జీవులకు ఈ కింగ్‌ అంటే హడల్‌. 

‘స్కార్‌ ఫేస్‌ లయన్‌’గా మారింది ఇలా..
2012లో ఓ గుంపులోని ఆల్ఫా లయన్‌తో జరిగిన పోరాటంలో కుడి కంటికి, దాని పైభాగంలో లోతైన గాయమైంది. అదే పెద్ద గాటుగా మారిపోయింది. దాంతో దానికి‘స్కార్‌ ఫేస్‌ లయన్‌’గా సందర్శకులు పేరు పెట్టారు. ఈ సింహం 2021 జూన్‌ 11న వృద్ధాప్యంతో మరణించింది. 

మసాయి మారా రిజర్వ్‌ ఫారెస్ట్‌ సందర్శనకు వచ్చే వారికి ఈ స్కార్‌ ఫేస్‌ లయన్‌ డాక్యుమెంటరీని చూపిస్తారంటే దాని ప్రత్యేకతను అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఈ మృగరాజు వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement