ఇజ్రాయెల్ దాడులతో భీతిల్లి సోమవారం గాజా నగరం వదిలి వలస వెళ్లిపోతున్న పాలస్తీనియన్లు
ఖాన్ యూనిస్/జెరూసలేం: హమాస్ మిలిటెంట్ల సొరంగాలు, రహస్య స్థావరాలను నేలమట్టం చేయడమే ధ్యేయంగా ఇజ్రాయెల్ సైన్యం భూతల, వైమానిక దాడులు ఉధృతం చేస్తుండడం గాజాలో సాధారణ పాలస్తీనియన్లకు ప్రాణసంకటంగా మారింది. సోమవారం మరిన్ని దళాలు ఇజ్రాయెల్ భూభాగం నుంచి గాజాలోకి అడుగుపెట్టాయి. ఇజ్రాయెల్ సేనలు గాజాలోకి మరింత ముందుకు చొచ్చుకొస్తున్నాయి. గాజాలో 24 గంటల్లో 600 హమాస్ స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
మిలిటెంట్ల ఆచూకీ కోసం అణువణువూ గాలిస్తున్నాయి. గాజాలో క్యాన్సర్ బాధితులకు చికిత్స అందిస్తున్న ఏకైక ఆసుపత్రి అయిన ‘టర్కిష్ ఫ్రెండ్‌షిప్ హాస్పిటల్’ సమీపంలోనే ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం రాత్రి వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో ఆసుపత్రి స్వల్పంగా ధ్వంసమయ్యింది. ఉత్తర, దక్షిణ గాజాను అనుసంధానించే ప్రధాన జాతీయ రహదారిని ఇజ్రాయెల్ యుద్ధట్యాంకులు, బుల్డోజర్లు దిగ్బంధించాయి. ఈ రహదారిపై వాహనాల రాకపోకలను ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంటోంది.
ఇందుకు కారణం ఏమిటన్నది బయటపెట్టడం లేదు. ఉత్తర గాజా నుంచి జనం దక్షిణ గాజాకు వెళ్లలేకపోతున్నారు. ఉత్తర గాజాలకు భూతల దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యాన్ని గట్టిగా ప్రతిఘటిస్తున్నామని హమాస్ వెల్లడించింది. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లో 304 మంది మృతిచెందారని గాజా ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. ఇప్పటిదాకా 8,306 మంది పాలస్తీనియన్లు మరణించారని, 21,048 మంది గాయపడ్డారు. ఇంకా 1,950 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని వివరించింది. ఇజ్రాయెల్‌లో 1,400మందికిపైగా మృత్యువాత పడ్డారు.
అరకొర సాయమే
ప్రపంచ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు అందజేస్తున్న మానవతా సాయం ఇప్పుడిప్పుడే గాజాకు చేరుకుంటోంది. ఆహారం, నిత్యావసరాలు, ఔషధాలు, దుస్తులు, నీటి శుద్ధి యంత్రాలు వంటివి అందుతున్నాయి. 75 వాహనాలతో కూడిన భారీ కాన్వాయ్ తాజాగా ఈజిప్టు నుంచి దక్షిణ గాజాలోకి అడుగుపెట్టింది. ఈ వాహనాలు టన్నుల కొద్దీ ఆహారం, తాగు నీరు, పలు రకాల కీలక ఔషధాలను చేరవేశాయి. గాజాలోని 23 లక్షల జనాభాకు ఈ సాయం ఏమాత్రం చాలదని అక్కడి స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. దక్షిణ గాజాలో రెండు నీటి సరఫరా పైపులైన్లను పునరుద్ధరించామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
యూదుల కోసం విమానంలో గాలింపు
ఇజ్రాయెల్ నుంచి వచి్చన విమానంలో యూదుల కోసం రష్యాలోని ముస్లింలు గాలించడం సంచలనాత్మకంగా మారింది. ఆదివారం టెల్ అవీవ్ నుంచి విమానం రష్యాలో ముస్లిం ప్రాబల్య ప్రాంతమైన మాఖాచ్‌కలాలోని దగెస్తాన్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ విమానంలో యూదులు ఉన్నారన్న అనుమానంతో వందలాది మంది ముస్లింలు ఎయిర్‌పోర్టును దిగ్బంధించారు. పాలస్తీనా జెండాలను చేబూని, ఎయిర్‌పోర్టులోకి లోపలికి ప్రవేశించి అలజడి సృష్టించారు. యూదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వారిని చంపేయాలంటూ నినదించారు. కొందరు రన్‌వే పైకి దూసుకెళ్లారు. ఇజ్రాయెల్ విమానాన్ని చుట్టుముట్టారు. గాజాపై ఇజ్రాయెల్ దాడుల పట్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూదులపై దాడి చేయడానికే ఎయిర్‌పోర్టుకు వచి్చనట్లు తెలుస్తోంది. అడ్డుకొనేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపైనా తిరగబడ్డారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలో పలువురు పోలీసులు సహా 20 మంది గాయపడ్డారు. పోలీసులు ఎట్టకేలకు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు 60 మందిని అరెస్టు చేశారు. ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు.
అపహరించిన షానీ లౌక్‌ను హత్య చేశారు
23 ఏళ్ల యువతి షానీ లౌక్ ఈ నెల 7న ఇజ్రాయెల్‌లోని కిబుట్జ్‌లో ఓ సంగీత వేడుకలో ఉండగా హమాస్ మిలిటెంట్లు హఠాత్తుగా దాడి చేశారు. కొందరిని కాలి్చచంపారు. షానీ లౌక్‌తోపాటు మరికొందరిని అపహరించారు. బందీలుగా బలవంతంగా గాజాకు లాక్కెళ్లారు. అయితే, మిలిటెంట్ల చెరలో షానీ లౌక్ క్షేమంగా ఉండొచ్చని ఆమె తల్లి, సోదరి భావించారు. త్వరలోనే ప్రాణాలతో తిరిగివస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే దుర్వార్త తెలిసింది.
గాజాలో మిలిటెంట్లు ఓ యువతి మృతదేహాన్ని వాహనంలో ఉంచి, ‘అల్లాహో అక్బర్’ అని అరుస్తూ గాజా వీధుల్లో ఊరేగిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. శవంగా మారిన ఆ యువతి షానీ లౌక్ అని తల్లి రికార్డా లౌక్, సోదరి అడీ లౌక్ గుర్తించారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇజ్రాయెలీ–జర్మన్ జాతీయురాలైన షానీ లౌక్‌ను మిలిటెంట్లు హత్య చేయడం దారుణమని, ఈ ఘటన తమను కలచివేసిందని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment