అల్–షిఫా ఆసుపత్రి ఎంఆర్‌ఐ సెంటర్‌లో హమాస్ దాచిన ఆయుధాలను చూపిస్తున్న ఇజ్రాయెల్ అధికారులు
ఖాన్ యూనిస్: గాజాలో సాధారణ పాలస్తీనియన్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. హమాస్ మిలిటెంట్లపై యుద్ధం పేరిట ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది. భూతల, వైమానిక దాడులతో భారీ భవనాలు క్షణాల్లో శిథిలాల దిబ్బలుగా మారిపోతున్నాయి. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. నిత్యం వందల సంఖ్యలో జనం కాళ్లు, చేతులు విరిగి క్షతగాత్రులుగా మారుతున్నాయి. యుద్ధం దక్షిణ గాజాకు విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర గాజాపై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు దక్షిణ గాజాపై దృష్టి పెట్టింది. ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలంటూ కరపత్రాలు పంపిణీ చేస్తోంది.
పల్లెలు, పట్టణాలను ఖాళీ చేసి మరో చోటుకు వెళ్లాలని ఇజ్రాయెల్ సేనలు హెచ్చరిస్తుండడంతో ప్రజలకు దిక్కుతోచడం లేదు. ఇలాంటి కరపత్రాలను ఉత్తర గాజాలోనూ జారవిడిచిన సంగతి తెలిసిందే. ఉత్తర గాజా నుంచి ఇప్పటికే లక్షలాది మంది ప్రాణభయంతో దక్షిణ గాజాకు వలస వచ్చారు. ఇక్కడ కూడా దాడులు ఉధృతం చేస్తామని ఇజ్రాయెల్ చెబుతుండడంతో ఇక ఎక్కడికి వెళ్లాలని విలపిస్తున్నారు. ఉత్తర, దక్షిణ గాజా అనే తేడా లేకుండా హమాస్ మిలిటెంట్లు ఎక్కడ దాగి ఉన్న దాడులు తప్పవని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్ స్పష్టంచేశారు. గాజా ప్రజలను తమ భూభాగంలోకి అనుమతించే ప్రసక్తే లేదని పొరుగు దేశం ఈజిప్టు మరోసారి తెగేసి చెప్పింది.
అల్–షిఫా ఆసుపత్రిలో రెండో రోజూ తనిఖీలు
గాజా స్ట్రిప్‌లో అతిపెద్దదైన అల్–షిఫా ఆసుపత్రిలో ఇజ్రాయెల్ సైన్యం తనిఖీలు రెండో రోజు గురువారం కూడా కొనసాగాయి. ఈ హాస్పిటల్ ప్రాంగణంలో ఓ భవనంలోని ఎంఆర్‌ఐ ల్యాబ్‌లో హమాస్ మిలిటెంట్ గ్రూప్ పెద్ద ఎత్తున ఆయుధాలు నిల్వ చేసిందంటూ సంబంధిత వీడియోను సైన్యం విడుదల చేసింది. అసాల్ట్ రైఫిల్స్, గ్రెనేడ్లు, హమాస్ దుస్తులు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. అయితే, ఇన్నాళ్లూ చెబుతున్నట్లు అల్–షిఫా ఆసుపత్రి కింద భూగర్భంలో హమాస్ కమాండ్ సెంటర్ ఉన్నట్లు ఇప్పటిదాకా ఎలాంటి సాక్ష్యాన్ని బయటపెట్టలేదు. అల్–షిఫా ఆసుపత్రి చుట్టూ ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు మోహరించాయి. అల్–షిఫాలో తుపాకీ పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని ప్రత్యక్ష సాకు‡్ష్యలు గురువారం చెప్పారు. ఇజ్రాయెల్ జవాన్లు కాల్పులు జరుపుతున్నారని ఆరోపించారు.
ఆసుపత్రుల్లో మృత్యు ఘంటికలు
గాజాలో ఆసుపత్రులన్నీ తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రాణం పోయాల్సిన ఆసుపత్రుల్లో మృత్యు ఘంటికలు వినిపిస్తున్నాయి. గాజాలో మొత్తం 35 ఆసుపత్రులు ఉండగా, వీటిలో 26 ఆసుపత్రులు పని చేయడం లేదు. విద్యుత్, ఇంధనం, ఔషధాల కొరత వల్ల ఇక్కడ వైద్య సేవలు నిలిపివేశారు. పని చేస్తున్న కొన్ని ఆసుపత్రుల్లో వసతులు లేక రోగులు, శిశువులు విగత జీవులవుతున్నారు. యుద్ధం మొదలయ్యాక గాజాలో ఇప్పటివరకు 12,000 మందికిపైగా మరణించారు. 2,700 మంది అదృశ్యమయ్యారు. వీరంతా శిథిలాల కింద చిక్కుకొని మృత్యువాత పడినట్లు తెలుస్తోంది.
హమాస్ నాయకుల ఇళ్లపై క్షిపణుల వర్షం
గాజాలో హమాస్ ముఖ్యనేతల నివాసాలను ఇజ్రాయెల్ సైన్యం టార్గెట్ చేసింది. ఇప్పటికే పలువురు నాయకులను హతమార్చింది. సీనియర్ హమాస్ కమాండర్ ఇస్మాయిల్ హనియేహ్ ఇంటిని నేలమట్టం చేశామని సైన్యం గురువారం ప్రకటించింది. అయితే, ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లేదా? అనేది తెలియరాలేదు.
‘ఆగ్నేయ ఆసియా’ రక్షణ మంత్రుల వినతి
ఇజ్రాయెల్–హమాస్‌యుద్ధంలోఅమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం బాధాకరమని ఆగ్నేయ ఆసియా దేశాల రక్షణ శాఖ మంత్రులు పేర్కొ న్నారు. 1967 నాటి సరిహద్దులతో ఇజ్రాయెల్‌తోపాటు స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేసే దిశగా శాంతి చర్చలు ప్రారంభించాలని సూచించారు. ఈ మేరకు ‘అసోసియేషన్ ఆఫ్ సౌత్‌ఈస్టు ఆసియన్ నేషన్స్’ పేరిట గురువారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.
తీర్మానం ఆమోదం
ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం ఎట్టకేలకు ఆమోదం పొందింది. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో సామాన్య పాలస్తీనియన్లు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారని మండలి ఆందోళన వ్యక్తం చేశారు. గాజా ప్రజలకు మానవతా సాయం అందించేందుకు గాజా అంతటా ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేయాలని, వారికి తగిన రక్షణ కలి్పంచేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, దాడులకు విరామం ఇవ్వాలని ఇజ్రాయెల్‌కు సూచిస్తూ మండలిలో తీర్మానాన్ని ఆమోదించారు. బందీలను వెంటనే విడుదల చేయాలని ఈ తీర్మానంలో హమాస్‌కు విజ్ఞప్తి చేశారు. మండలిలో 15 సభ్యదేశాలుండగా, మాల్టా దేశం ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి మద్దతుగా 12 దేశాలు ఓటువేశాయి. అమెరికా, యూకే, రష్యా గైర్హాజరయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment