బుధవారం దక్షిణ గాజాలోని రఫా పట్టణంలో ఆహారం కోసం పాలస్తీనియన్ల ఆరాటం
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలై నెల రోజులు దాటింది. గాజాపై భూతల దాడులను తాత్కాలికంగా నిలిపివేసిన ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులను కొనసాగిస్తోంది. బుధవారం గాజా అంతటా క్షిపణులు, రాకెట్లు ప్రయోగించింది. గాజా గత 24 గంటల వ్యవధిలో 214 మంది మరణించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నెల రోజులకుపైగా సాగుతున్న యుద్ధంలో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం పైచేయి సాధిస్తోంది.
గాజాలో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య 10,569కి చేరుకుంది. గాజాలో పెరిగిపోతున్న మరణాలపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజాస్ట్రిప్ మొత్తం చిన్నపిల్లల శ్మశాన వాటికగా మారుతోందని చెప్పారు. మృతుల సంఖ్య పెరుగుతోంది అంటే ఇజ్రాయెల్ సైన్యం తప్పుడు దారిలో పయనిస్తున్నట్లు అర్థమని స్పష్టం చేశారు.
దాడులకు 4 గంటలు విరామం
ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర గాజా నుంచి నిత్యం వేలాది మంది దక్షిణ గాజాకు వలస వెళ్తున్నారు. ఇప్పటిదాకా దాదాపు 70 శాతం మంది వెళ్లిపోయినట్లు అంచనా. గాజా ఆసుపత్రుల్లో గుండెను పిండేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ లేక ఆసుపత్రుల్లో ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఔషధాలు, వైద్య పరికరాలు లేక క్షతగాత్రులకు చికిత్స అందించడం లేదు. ఇంక్యుబేటర్లలో శిశువులు విగత జీవులుగా మారుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు.
చాలా హాస్పిటళ్లలో పెట్రోల్, డీజిల్ లేక జనరేటర్లు పనిచేయడంలేదు. ఇజ్రాయెల్ సైన్యం తొలిసారిగా బుధవారం గాజాపై దాడులను 4 గంటలపాటు నిలిపివేసింది. గాజాకు మానవతా సాయం చేరవేయడానికి వీలుగా దాడులు ఆపినట్లు వెల్లడించింది. హమాస్‌పై యుద్ధం ముగిశాక గాజా రక్షణ బాధ్యతను తాము స్వీరిస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని చేసిన ప్రకటనపై అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ స్పందించారు. గాజాను ఆక్రమించుకొనే ఆలోచన చేయొద్దని ఇజ్రాయెల్‌కు హితవు పలికారు.
ఇజ్రాయెల్‌కు జీ7 దేశాల మద్దతు
ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంపై జీ7 దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధులు జపాన్ రాజధాని టోక్యోలో చర్చలు జరిపారు. రెండు రోజులుగా జరుగుతున్న ఈ చర్చలు బుధవారం ముగిశాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడిని వారు ఖండించారు. ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించారు. ఆత్మరక్షణ చేసుకొనే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని తేల్చిచెప్పారు. గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించానికి మార్గం సులభతరం చేయాలని, ఇందుకోసం హమాస్‌పై యుద్ధానికి కొంత విరామం ఇవ్వాలని జీ7 ప్రతినిధులు ఇజ్రాయెల్‌కు సూచించారు. కాల్పుల విరమణ పాటించాలని సూచించకపోవడం గమనార్హం.
50 వేల మందికి 4 టాయిలెట్లు
గాజాలో నెలకొన్న భయానక పరిస్థితులను అమెరికా నర్సు ఎమిలీ చలాహన్ మీడియాతో పంచుకున్నారు. గాజాలో క్షతగాత్రులకు సేవలందించిన ఎమిలీ ఇటీవలే అమెరికా చేరుకున్నారు. 26 రోజుల తర్వాత ఈరోజే స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నానని తెలిపారు. గాజాలో 26 రోజుల్లో ఐదు చోట్లకు మారాల్సి వచి్చందన్నారు. ఒకచోట 35 వేల మంది నిరాశ్రయులు ఉన్నారని తెలిపారు. ముఖాలు, మెడ, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలున్న చిన్నారులు కనిపించారని వెల్లడించారు. 50 వేల మంది తలదాచుకుంటున్న ఓ శిబిరంలో కేవలం 4 మరుగుదొడ్లు ఉన్నాయని పేర్కొన్నారు. అక్కడ రోజుకు కొద్దిసేపు మాత్రమే నీటి సరఫరా జరిగేదని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment