Israeli air strike
-
Israel-Hamas War: నెల రోజులుగా నెత్తురోడుతోంది
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలై నెల రోజులు దాటింది. గాజాపై భూతల దాడులను తాత్కాలికంగా నిలిపివేసిన ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులను కొనసాగిస్తోంది. బుధవారం గాజా అంతటా క్షిపణులు, రాకెట్లు ప్రయోగించింది. గాజా గత 24 గంటల వ్యవధిలో 214 మంది మరణించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నెల రోజులకుపైగా సాగుతున్న యుద్ధంలో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం పైచేయి సాధిస్తోంది. గాజాలో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య 10,569కి చేరుకుంది. గాజాలో పెరిగిపోతున్న మరణాలపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజాస్ట్రిప్ మొత్తం చిన్నపిల్లల శ్మశాన వాటికగా మారుతోందని చెప్పారు. మృతుల సంఖ్య పెరుగుతోంది అంటే ఇజ్రాయెల్ సైన్యం తప్పుడు దారిలో పయనిస్తున్నట్లు అర్థమని స్పష్టం చేశారు. దాడులకు 4 గంటలు విరామం ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర గాజా నుంచి నిత్యం వేలాది మంది దక్షిణ గాజాకు వలస వెళ్తున్నారు. ఇప్పటిదాకా దాదాపు 70 శాతం మంది వెళ్లిపోయినట్లు అంచనా. గాజా ఆసుపత్రుల్లో గుండెను పిండేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ లేక ఆసుపత్రుల్లో ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఔషధాలు, వైద్య పరికరాలు లేక క్షతగాత్రులకు చికిత్స అందించడం లేదు. ఇంక్యుబేటర్లలో శిశువులు విగత జీవులుగా మారుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. చాలా హాస్పిటళ్లలో పెట్రోల్, డీజిల్ లేక జనరేటర్లు పనిచేయడంలేదు. ఇజ్రాయెల్ సైన్యం తొలిసారిగా బుధవారం గాజాపై దాడులను 4 గంటలపాటు నిలిపివేసింది. గాజాకు మానవతా సాయం చేరవేయడానికి వీలుగా దాడులు ఆపినట్లు వెల్లడించింది. హమాస్‌పై యుద్ధం ముగిశాక గాజా రక్షణ బాధ్యతను తాము స్వీరిస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని చేసిన ప్రకటనపై అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ స్పందించారు. గాజాను ఆక్రమించుకొనే ఆలోచన చేయొద్దని ఇజ్రాయెల్‌కు హితవు పలికారు. ఇజ్రాయెల్‌కు జీ7 దేశాల మద్దతు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంపై జీ7 దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధులు జపాన్ రాజధాని టోక్యోలో చర్చలు జరిపారు. రెండు రోజులుగా జరుగుతున్న ఈ చర్చలు బుధవారం ముగిశాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడిని వారు ఖండించారు. ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించారు. ఆత్మరక్షణ చేసుకొనే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని తేల్చిచెప్పారు. గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించానికి మార్గం సులభతరం చేయాలని, ఇందుకోసం హమాస్‌పై యుద్ధానికి కొంత విరామం ఇవ్వాలని జీ7 ప్రతినిధులు ఇజ్రాయెల్‌కు సూచించారు. కాల్పుల విరమణ పాటించాలని సూచించకపోవడం గమనార్హం. 50 వేల మందికి 4 టాయిలెట్లు గాజాలో నెలకొన్న భయానక పరిస్థితులను అమెరికా నర్సు ఎమిలీ చలాహన్ మీడియాతో పంచుకున్నారు. గాజాలో క్షతగాత్రులకు సేవలందించిన ఎమిలీ ఇటీవలే అమెరికా చేరుకున్నారు. 26 రోజుల తర్వాత ఈరోజే స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నానని తెలిపారు. గాజాలో 26 రోజుల్లో ఐదు చోట్లకు మారాల్సి వచి్చందన్నారు. ఒకచోట 35 వేల మంది నిరాశ్రయులు ఉన్నారని తెలిపారు. ముఖాలు, మెడ, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలున్న చిన్నారులు కనిపించారని వెల్లడించారు. 50 వేల మంది తలదాచుకుంటున్న ఓ శిబిరంలో కేవలం 4 మరుగుదొడ్లు ఉన్నాయని పేర్కొన్నారు. అక్కడ రోజుకు కొద్దిసేపు మాత్రమే నీటి సరఫరా జరిగేదని వివరించారు. -
Israel-Hamas War: చక్రబంధంలో గాజా సిటీ!
ఖాన్ యూనిస్/జెరూసలేం/న్యూఢిల్లీ: గాజాలో హమాస్ మిలిటెంట్లతో హోరాహోరీ పోరు కొనసాగుతోందని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. తమ పదాతి సేనలు, వైమానిక దళాలు శత్రువులపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయని, ప్రశంసనీయమైన విజయాలు సాధిస్తున్నాయని హర్షం వ్యక్తం చేసింది. మిలిటెంట్ల దాడులను తమ జవాన్లు గట్టిగా తిప్పికొడుతున్నారని పేర్కొంది. శుక్రవారం జరిగిన దాడుల్లో చాలామంది మిలిటెంట్లు హతమయ్యారని, వారి సొరంగాలు నామరూపాల్లేకుండా పోయాయని తెలియజేసింది. గాజా సిటీలో దాడులు ఉధృతం చేయబోతున్నామని ప్రకటించింది. ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణలో మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. శుక్రవారం నాటికి గాజాలో 9,200 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. గాజాలో మిలిటెంట్ల అదీనంలో ఉన్న 240 మంది బందీల ఆచూకీ కోసం ఇజ్రాయెల్ సైన్యం ముమ్మరంగా ప్రయతి్నస్తోంది. ఇందుకోసం అమెరికా డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఈ డ్రోన్లు గత వారం రోజులుగా గాజా ఉపరితలంపై చక్కర్లు కొడుతున్న దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గాజాని చుట్టుముట్టాం: ఇజ్రాయెల్ గాజాలో ప్రధాన నగరం, హమాస్ మిలిటెంట్ల ముఖ్యమైన అడ్డా అయిన గాజా సిటీని తమ సేనలు చుట్టుముట్టాయని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారీ ప్రకటించారు. భూతల దాడులు ప్రారంభమైన వారం రోజుల తర్వాత గాజా సిటీ చుట్టూ తమ దళాలు పూర్తిస్థాయిలో మోహ రించినట్లు తెలిపారు. గాజాలో కాల్పుల విరమణ పాటించాలంటూ ప్రపంచ దేశాల నుంచి తమపై ఒత్తిడి వస్తున్నట్లు వెలువడుతున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. నల్ల బ్యాగుల్లో తిరిగి వెళ్తారు: హమాస్ గాజాలో ఇజ్రాయెల్ సైన్యానికి దారుణ పరాజయం ఎదురు కాబోతోందని హమాస్ మిలిటరీ విభాగమైన ఖాసమ్ బ్రిగేడ్స్ స్పష్టం చేసింది. తమ భూభాగంలో అడుగుపెట్టిన ఇజ్రాయెల్ సైనికులు నల్ల బ్యాగుల్లో తిరిగి వెళ్తారని హెచ్చరించింది. తద్వారా వారికి తమ చేతుల్లో చావు తప్పదని పేర్కొంది. కాల్పుల విరమణ లేదు: నెతన్యాహూ హమాస్ మిలిటెంట్ల చెరలో ఉన్న బందీలందరినీ విడుదల చేసే దాకా గాజాలో కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తేలి్చచెప్పారు. మానవతా సాయం గాజాకు చేరవేయడానికి, విదేశీయులను బయటకు పంపించడానికి వీలుగా తాత్కాలికంగా కాల్పు ల విరమణ పాటించాలన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభ్యర్థనపై ఆయన స్పందించారు. నెతన్యాహూ శుక్రవారం అమెరి కా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌తో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. పాలస్తీనియన్లను కాపాడండి గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో సామాన్య పాలస్తీనియన్లు మరణిస్తుండడం పట్ల అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో ప్రజలను కాపాడడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేశారు. లేకపోతే ‘శాంతికి భాగస్వాములు’ ఎవరూ ఉండరని చెప్పారు. గాజాను శ్మశానంగా మార్చొద్దని పరోక్షంగా తేలి్చచెప్పారు. గాజాకు భారీస్థాయిలో మానవతా సాయం అవసరమని, ఆ దిశగా ఇజ్రాయెల్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించాలని అన్నారు. ప్రపంచ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న మానవతా సాయాన్ని గాజాలోకి విస్తృతంగా అనుమతించాలని, ఈ విషయంలో ఆంక్షలు తొలగించాలని చెప్పారు. ఆంటోనీ బ్లింకెన్ శుక్రవారం ఇజ్రాయెల్‌లో పర్యటించారు. పవిత్ర యుద్ధం చేస్తున్నాం: హసన్ నస్రల్లా ఇజ్రా యెల్‌పై దా డుల విషయంలో అమెరికా హెచ్చరికలు తమను భయపెట్టలేవని లెబనాన్‌కు చెందిన షియా మిలిటెంట్ సంస్థ ‘హెజ్బొల్లా’ అధినేత హసన్ నస్రల్లా పేర్కొన్నారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధానికి హెజ్బొల్లా దూరంగా ఉండాలంటూ అమెరికా చేసిన హెచ్చరికలపై ఆయన శుక్రవారం స్పందించారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మొదలైన తర్వాత ఆయన మాట్లాడడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్‌పై తొలుత దాడిచేసిన హమాస్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఇజ్రాయెల్‌పై పవిత్ర యుద్ధంలో త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. మధ్యధరా సముద్రంలో అమెరికా సైనిక బలగాలను చూసి తాము బెదిరిపోవడం లేదని అన్నారు. తమ దగ్గర బలమైన సైన్యం ఉందని, అన్నింటికీ సిద్ధపడే ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్నట్లు నస్రల్లా పేర్కొన్నారు. నస్రల్లా ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియదు. ఆయన ప్రసంగాన్ని టీవీల్లో ప్రసారం చేశారు. ఇజ్రాయెల్ నుంచి పాలస్తీనా కారి్మకులు వెనక్కి తమ దేశంలో పని చేస్తున్న పాలస్తీనియన్ కారి్మకులను వారి సొంత ప్రాంతమైన గాజాకు పంపించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. శుక్రవారం పదుల సంఖ్యలో కారి్మకులను గాజాకు పంపించింది. భారమైన హృదయంతో వారు వెనక్కి వెళ్లిపోయారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య అక్టోబర్ 7 నుంచి ఘర్షణ మొదలైంది. అంతకంటే ముందు 18,000 మంది పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ ప్రభుత్వం వర్క్ పరి్మట్లు జారీ చేసింది. వారిలో చాలామంది ఇజ్రాయెల్‌కు చేరుకొని, వేర్వేరు పనుల్లో కుదురుకున్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో పాలస్తీనియన్లు వెనక్కి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. -
Israel-Hamas war: కొనసాగుతున్న దాడులు
జెరూసలేం: గాజాలో హమాస్ మిలిటెంట్ గ్రూప్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇజ్రాయెల్ పదాతి దళాలు మరింత ముందుకు చొచ్చుకెళ్తున్నాయి. మిలిటెంట్ల కోసం వీధుల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి. హమాస్ మిలిటెంట్లకు గట్టి పట్టున్న గాజా సిటీ దిశగా సైన్యం కదులుతోంది. గాజా భూభాగంలో వైమానిక దాడులు సైతం యథావిధిగా కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి సెంట్రల్ గాజాలో బురీజ్ శరణార్థి శిబిరంలోని ఓ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయడంతో 15 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో జనం శిథిలాల కింద చిక్కుకున్నారు. గాజాలో తమ సైన్యంపై హమాస్ మిలిటెంట్లు యాంటీ ట్యాంక్ మిస్సైళ్లు, గ్రనేడ్లు ప్రయోగించారని ఇజ్రాయెల్ వెల్లడించింది. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ విషయంలో అమెరికాతోపాటు అరబ్ దేశాలు చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌తోపాటు హమాస్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. యుద్ధానికి కనీసం విరామం అయినా ఇవ్వాలని ఇరుపక్షాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, సాధారణ ప్రజల ప్రాణాలను హరించడం తగదని ఆయన పరోక్షంగా తేలి్చచెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శుక్రవారం ఇజ్రాయెల్‌లో పర్యటించబోతున్నారు. జోర్డాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌లోని తమ రాయబారిని వెనక్కి రప్పించింది. యుద్ధం ముగిసేదాకా తమ దేశానికి రావొద్దని ఇజ్రాయెల్ రాయబారికి సూచించింది. గాజాలో 9 వేలు దాటిన మృతులు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 9,061 మంది పాలస్తీనియన్లు మరణించారని, 32,000 మందికిపైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అష్రాఫ్ అల్–ఖుద్రా గురువారం వెల్లడించారు. మృతుల్లో 3,760 మంది 18 ఏళ్లలోపు వారేనని చెప్పారు. ఇవన్నీ అధికారిక గణాంకాలే. వాస్తవానికి ఇంకా ఎంతమంది చనిపోయారో అధికారులు చెప్పలేకపోతున్నారు. గాజాలో వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారంతా మరణించి ఉండొచ్చని తెలుస్తోంది. వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దాడులతోపాటు అంతర్గత ఘర్షణల్లో 130 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా బలయ్యారు. ఈజిప్టుకు మరో 100 మంది.. విదేశీ పాస్‌పోర్టులు కలిగి ఉన్నవారు గాజా నుంచి ఈజిప్టుకు వెళ్లిపోతున్నారు. బుధవారం 335 మంది వెళ్లగా, గురువారం మరో 100 మంది రఫా సరిహద్దును గుండా ఈజిప్టులో అడుగుపెట్టారు. అంతేకాకుండా గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన 76 మంది పాలస్తీనియన్లు వారి సహాయకులతో కలిసి ఈజిప్టు చేరుకున్నారు. వారికి ఈజిప్టులో చికిత్స అందించనున్నారు. గాజాలో ప్రస్తుతం దాదాపు 400 మంది అమెరికన్లు ఉన్నారు. వారందరినీ క్షేమంగా స్వదేశానికి చేర్చడానికి అమెరికా ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. -
Israel-Hamas war: గాజా రక్తసిక్తం
ఖాన్ యూనిస్/రఫా/జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర స్థాయిలో దాడులు కొనసాగిస్తోంది. భూతల దాడులతోపాటు వైమానిక దళం బాంబులు ప్రయోగిస్తోంది. గాజా రక్తసిక్తంగా మారుతోంది. హమాస్ మిలిటెంట్లతోపాటు వందలాది మంది సాధారణ ప్రజలు మృత్యువాత పడుతున్నారు. మృతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. గాజా సిటీ సమీపంలో జబాలియా శరణార్థి శిబిరంలోని అపార్టుమెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం రెండో రోజు బుధవారం కూడా దాడులు సాగించింది. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. క్షతగాత్రులుగా మారి రక్తమోడుతున్న మహిళలను, చిన్నపిల్లలను శిథిలాల నుంచి బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు కనిపించాయి. జబాలియాలో సాధారణ నివాస గృహాల మధ్య ఏర్పాటు చేసిన హమాస్ కమాండ్ సెంటర్‌ను, మిలిటెంట్ల సొరంగాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇక్కడ హమాస్ కీలక కమాండర్‌తోపాటు చాలామంది మిలిటెంట్లు హతమయ్యారని ప్రకటించింది. సాధారణ ప్రజలు 50 మందికిపైగానే మరణించినట్లు, వందలాది మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది. శరణార్థి శిబిరంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)తోపాటు పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హమాస్ చెరలో 240 మంది బందీలు ఇజ్రాయెల్ సైన్యం–హమాస్ మిలిటెంట్ల మధ్య ఘర్షణ మొదలై మూడు వారాలు దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 8,700 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారని, 22,000 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో 122 మంది పాలస్తీనియన్లు చనిపోయారని వెల్లడించింది. హమాస్ చెరలో దాదాపు 240 మంది బందీలుగా ఉన్నారు. ఇప్పటివరకు నలుగురు బందీలను హమాస్ విడుదల చేసింది. బందీగా ఉన్న ఒక ఇజ్రాయెల్ మహిళా జవాన్‌ను ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు విడిపించాయి. 34 మంది జర్నలిస్టులు బలి ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో 34 మంది జర్నలిస్టులు మరణించారని ‘రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్’ సంస్థ వెల్లడించింది. ఇరు పక్షాలూ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాయని ఆరోపించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గాజాలో పాలస్తీనియన్ జర్నలిస్టులు దారుణ హత్యలకు గురవుతున్నారని, వీటిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు విచారణ జరపాలని పేర్కొంది. సాధారణ ప్రజలు నివాసం ఉండే ప్రాంతాల్లో హమాస్ మిలిటెంట్లు మకాం వేస్తున్నారని, తద్వారా ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో భారత సంతతి ఇజ్రాయెల్ సైనికుడు మృతి గాజాలో హమాస్ మిలిటెంట్లతో జరుగుతున్న ఘర్షణలో భారత సంతతి ఇజ్రాయెల్ సైనికుడు హలెల్ సోలోమాన్ (20) బుధవారం మృతిచెందాడు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని డొమోనా పట్టణానికి చెందిన సోలోమాన్ హమాస్ మిలిటెంట్లపై వీరోచితంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతిపట్ల డిమోనా మేయర్ సంతాపం ప్రకటించారు. డిమోనా పట్టణాన్ని ‘లిటిల్ ఇండియా’గా పిలుస్తుంటారు. భారత్ నుంచి వలస వచి్చన యూదులు ఇక్కడ స్థిరపడ్డారు. గాజాలో మిలిటెంట్ల దాడుల్లో ఇప్పటివరకు 11 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతిచెందారు. బుధవారం ఒక్కరోజే 9 మంది మరణించారు. ఇంటర్నెట్, ఫోన్ సేవలకు అంతరాయం గాజాలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలు బుధవారం కొన్ని గంటలపాటు నిలిచిపోయాయి. సాయంత్రానికల్లా పునరుద్ధరించారు. ఇంటర్నెట్, ఫోన్ల సేవలకు తరచూ అంతరాయం కలుగుతుండడం వల్ల సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్‌కు ఆహారం, ఇంధనం ఎగుమతులు ఆపేయండి గాజాలో సాధారణ పాలస్తీనియన్ల ప్రాణాలను బలిగొంటున్న ఇజ్రాయెల్‌కు తగిన బుద్ధి చెప్పాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు. ఇజ్రాయెల్‌కు ఆహారం, ఇంధనం ఎగుమతులను తక్షణమే నిలిపివేయాలని బుధవారం ఆస్లామిక్ దేశాలకు పిలుపునిచ్చారు. గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న నేరాలకు తక్షణమే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇజ్రాయెల్‌ను ఏకాకిని చేయాలని, ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలని ఇస్లామిక్ దేశాలకు సూచించారు. -
Israel-Hamas war: గాజాలో మరణ మృదంగం
ఖాన్ యూనిస్/జెరూసలేం: హమాస్ మిలిటెంట్ల సొరంగాలు, రహస్య స్థావరాలను నేలమట్టం చేయడమే ధ్యేయంగా ఇజ్రాయెల్ సైన్యం భూతల, వైమానిక దాడులు ఉధృతం చేస్తుండడం గాజాలో సాధారణ పాలస్తీనియన్లకు ప్రాణసంకటంగా మారింది. సోమవారం మరిన్ని దళాలు ఇజ్రాయెల్ భూభాగం నుంచి గాజాలోకి అడుగుపెట్టాయి. ఇజ్రాయెల్ సేనలు గాజాలోకి మరింత ముందుకు చొచ్చుకొస్తున్నాయి. గాజాలో 24 గంటల్లో 600 హమాస్ స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మిలిటెంట్ల ఆచూకీ కోసం అణువణువూ గాలిస్తున్నాయి. గాజాలో క్యాన్సర్ బాధితులకు చికిత్స అందిస్తున్న ఏకైక ఆసుపత్రి అయిన ‘టర్కిష్ ఫ్రెండ్షిప్ హాస్పిటల్’ సమీపంలోనే ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం రాత్రి వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో ఆసుపత్రి స్వల్పంగా ధ్వంసమయ్యింది. ఉత్తర, దక్షిణ గాజాను అనుసంధానించే ప్రధాన జాతీయ రహదారిని ఇజ్రాయెల్ యుద్ధట్యాంకులు, బుల్డోజర్లు దిగ్బంధించాయి. ఈ రహదారిపై వాహనాల రాకపోకలను ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంటోంది. ఇందుకు కారణం ఏమిటన్నది బయటపెట్టడం లేదు. ఉత్తర గాజా నుంచి జనం దక్షిణ గాజాకు వెళ్లలేకపోతున్నారు. ఉత్తర గాజాలకు భూతల దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యాన్ని గట్టిగా ప్రతిఘటిస్తున్నామని హమాస్ వెల్లడించింది. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లో 304 మంది మృతిచెందారని గాజా ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. ఇప్పటిదాకా 8,306 మంది పాలస్తీనియన్లు మరణించారని, 21,048 మంది గాయపడ్డారు. ఇంకా 1,950 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని వివరించింది. ఇజ్రాయెల్‌లో 1,400మందికిపైగా మృత్యువాత పడ్డారు. అరకొర సాయమే ప్రపంచ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు అందజేస్తున్న మానవతా సాయం ఇప్పుడిప్పుడే గాజాకు చేరుకుంటోంది. ఆహారం, నిత్యావసరాలు, ఔషధాలు, దుస్తులు, నీటి శుద్ధి యంత్రాలు వంటివి అందుతున్నాయి. 75 వాహనాలతో కూడిన భారీ కాన్వాయ్ తాజాగా ఈజిప్టు నుంచి దక్షిణ గాజాలోకి అడుగుపెట్టింది. ఈ వాహనాలు టన్నుల కొద్దీ ఆహారం, తాగు నీరు, పలు రకాల కీలక ఔషధాలను చేరవేశాయి. గాజాలోని 23 లక్షల జనాభాకు ఈ సాయం ఏమాత్రం చాలదని అక్కడి స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. దక్షిణ గాజాలో రెండు నీటి సరఫరా పైపులైన్లను పునరుద్ధరించామని ఇజ్రాయెల్ ప్రకటించింది. యూదుల కోసం విమానంలో గాలింపు ఇజ్రాయెల్ నుంచి వచి్చన విమానంలో యూదుల కోసం రష్యాలోని ముస్లింలు గాలించడం సంచలనాత్మకంగా మారింది. ఆదివారం టెల్ అవీవ్ నుంచి విమానం రష్యాలో ముస్లిం ప్రాబల్య ప్రాంతమైన మాఖాచ్కలాలోని దగెస్తాన్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ విమానంలో యూదులు ఉన్నారన్న అనుమానంతో వందలాది మంది ముస్లింలు ఎయిర్‌పోర్టును దిగ్బంధించారు. పాలస్తీనా జెండాలను చేబూని, ఎయిర్‌పోర్టులోకి లోపలికి ప్రవేశించి అలజడి సృష్టించారు. యూదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని చంపేయాలంటూ నినదించారు. కొందరు రన్‌వే పైకి దూసుకెళ్లారు. ఇజ్రాయెల్ విమానాన్ని చుట్టుముట్టారు. గాజాపై ఇజ్రాయెల్ దాడుల పట్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూదులపై దాడి చేయడానికే ఎయిర్‌పోర్టుకు వచి్చనట్లు తెలుస్తోంది. అడ్డుకొనేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపైనా తిరగబడ్డారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలో పలువురు పోలీసులు సహా 20 మంది గాయపడ్డారు. పోలీసులు ఎట్టకేలకు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు 60 మందిని అరెస్టు చేశారు. ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. అపహరించిన షానీ లౌక్‌ను హత్య చేశారు 23 ఏళ్ల యువతి షానీ లౌక్ ఈ నెల 7న ఇజ్రాయెల్‌లోని కిబుట్జ్‌లో ఓ సంగీత వేడుకలో ఉండగా హమాస్ మిలిటెంట్లు హఠాత్తుగా దాడి చేశారు. కొందరిని కాలి్చచంపారు. షానీ లౌక్తోపాటు మరికొందరిని అపహరించారు. బందీలుగా బలవంతంగా గాజాకు లాక్కెళ్లారు. అయితే, మిలిటెంట్ల చెరలో షానీ లౌక్ క్షేమంగా ఉండొచ్చని ఆమె తల్లి, సోదరి భావించారు. త్వరలోనే ప్రాణాలతో తిరిగివస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే దుర్వార్త తెలిసింది. గాజాలో మిలిటెంట్లు ఓ యువతి మృతదేహాన్ని వాహనంలో ఉంచి, ‘అల్లాహో అక్బర్’ అని అరుస్తూ గాజా వీధుల్లో ఊరేగిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. శవంగా మారిన ఆ యువతి షానీ లౌక్ అని తల్లి రికార్డా లౌక్, సోదరి అడీ లౌక్ గుర్తించారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇజ్రాయెలీ–జర్మన్ జాతీయురాలైన షానీ లౌక్‌ను మిలిటెంట్లు హత్య చేయడం దారుణమని, ఈ ఘటన తమను కలచివేసిందని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ పేర్కొంది. -
Israel-Hamas War: తీర్మానానికి భారత్ దూరం
ఐక్యరాజ్యసమతి: గాజాపై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. మొత్తం 193 దేశాలున్న ఐరాస జనరల్ అసెంబ్లీలో 45 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండగా 120 దేశాలు తీర్మానానికి మద్దతుగా, 14 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. మిగతావి ఓటింగ్‌లో పాల్గొనలేదు. అయితే ఉగ్రవాదం మానవాళి పట్ల ఎప్పటికీ మాయని మచ్చేనని భారత్ పునరుద్ఘాటించింది. ‘‘ఉగ్రవాదానికి సరిహద్దుల్లేవు. జాతి, జాతీయత లేవు. అందుకే కారణమేదైనా సరే, మతిలేని ఉగ్రవాద చర్యలకు ఎవరూ మద్దతివ్వరాదు. ఈ విషయంలో ప్రపంచమంతా ఒక్కతాటిపై ఉండాలి’’అని పిలుపునిచి్చంది. ఇజ్రాయెల్, హమాస్ తక్షణం పోరుకు స్వస్తి చెప్పాలని తీర్మానం పిలుపునిచి్చంది. గాజాకు అన్ని రకాల సాయం నిరి్నరోధంగా, పూర్తిస్థాయిలో, సురక్షితంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరింది. బందీలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. తీర్మానాన్ని జోర్డాన్ రూపొందించింది. అందులో హమాస్ పేరును ప్రస్తావించకపోవడాన్ని అమెరికా తప్పుబట్టింది. చర్చలతోనే పరిష్కారం: భారత్ ఐరాసలో మన దేశ ఉప శాశ్వత ప్రతినిధి యోజనా పటేల్ తీర్మానంపై చర్చలో భారత్ తరఫున పాల్గొన్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి దిగడం ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన పరిణామమన్నారు. దాన్ని అందరూ ఖండించాల్సి ఉందని చెప్పారు. విభేదాలు, వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ‘అలాగాకుండా పలు దేశాలు పరస్పరం హింసాకాండకు దిగుతుండటం ఆందోళనకరం. మానవతా విలువలకు పాతరేసే స్థాయిలో హింస, ప్రాణ నష్టం చోటుచేసుకుంటుండటం శోచనీయం. రాజకీయ లక్ష్యాల సాధనకు హింసను మార్గంగా చేసుకోవడం శాశ్వత పరిష్కారాలు ఇవ్వజాలదు’అని స్పష్టం చేశారు. ‘ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదు. ఈ విషయంలో దేశాలు పరస్పర విభేదాలను కూడా పక్కన పెట్టాలి’అని పిలుపునిచ్చారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో జరిగని చర్చలు ఉగ్రవాదానికి, హింసకు వ్యతిరేకంగా స్పష్టమైన సందేశమిచ్చాయని అభిప్రాయపడ్డారు. తక్షణం బందీలను విడిచిపెట్టాలని హమాస్‌కు సూచించారు. గాజాకు భారత్ కూడా మానవతా సాయం అందించిందని పటేల్ తెలిపారు. స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటే ఘర్షణకు పరిష్కారమన్నది ముందునుంచీ భారత్ వైఖరి అని స్పష్టం చేశారు. 38 టన్నుల మేరకు ఔషధాలు, పరికరాలు, నిత్యావసరాలను పంపినట్టు చెప్పారు. ఇరుపక్షాలు హింసకు స్వస్తి చెప్పి తక్షణం నేరుగా చర్చలు మొదలు పెట్టాలని కోరారు. హమాస్ పేరు ప్రస్తావించనందుకే...! ఐరాసలో జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంలో హమాస్ పేరును ప్రస్తావించనందుకే దానిపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉన్నట్టు సమాచారం. ఇజ్రాయెల్, అమెరికా తదితర దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాయి. చైనా, ఫ్రాన్స్, రష్యా తదితర దేశాలు అనుకూలంగా ఓటేయగా భారత్‌తో పాటు కెనడా, జర్మనీ, బ్రిటన్, జపాన్, ఉక్రెయిన్ తదితర దేశాలు దూరంగా ఉన్నాయి. తీర్మానానికి కెనడా ప్రతిపాదించిన కీలక సవరణకు భారత్ మద్దతిచ్చింది. ‘‘ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని, వందల మందిని బందీలుగా తీసుకోవడాన్ని ఏకగ్రీవంగా ఖండిస్తున్నాం. వారిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’అని తీర్మానంలో చేర్చాలని భారత్ కోరింది. భారత్‌తో పాటు మొత్తం 87 దేశాలు సవరణకు అనుకూలంగా, 55 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. 23 దేశాలు దూరంగా ఉన్నాయి. మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో సవరణ ఆమోదం పొందలేదు. -
Israel-Hamas war: హమాస్‌పై ముప్పేట దాడి
రఫా(గాజా్రస్టిప్)/జెరూసలేం/న్యూఢిల్లీ/టెల్ అవీవ్: పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య ఘర్షణలు మరింత ఉధృతం అవుతున్నాయి. ఇజ్రాయెల్ భీకర యుద్ధం ప్రారంభించింది. ఇప్పటిదాకా గాజాలో వైమానిక దాడులు నిర్వహించగా, ఇక సిరియా, వెస్ట్‌బ్యాంక్‌లోని హమాస్ స్థావరాలపైనా దృష్టి పెట్టింది. గాజాతోపాటు సిరియాలో రెండు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు, వెస్ట్‌బ్యాంక్‌లో ఒక మసీదుపై క్షిపణులు ప్రయోగించింది. శనివారం రాత్రి మొదలైన ఈ దాడుల ఆదివారం కూడా కొనసాగాయి. మూడు ప్రాంతాల్లోని టార్గెట్లపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు నిప్పుల వర్షం కురిపించాయి. సిరియాలోని ఎయిర్‌పోర్టులు, వెస్ట్‌బ్యాంక్ మసీదును హమాస్ మిలిటెంట్లు అడ్డాగా మార్చుకున్నారని, అక్కడి నుంచే తమపై దాడులకు సన్నాహాలు చేస్తున్నారని, అందుకే ముందుగానే ఎదురుదాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. సిరియా ఎయిర్‌పోర్టులపై జరిగిన దాడిలో ఒకరు మరణించారు. రన్వేలు దెబ్బతిన్నాయి. వెస్ట్‌బ్యాంక్‌లో కనీసం ఐదుగురు మరణించారు. మరోవైపు లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్ భూభాగంపై రాకెట్లు ప్రయోగిస్తూనే ఉంది. ఇజ్రాయెల్ దళాలు సైతం ప్రతిదాడి చేస్తున్నాయి. దీంతో ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సైన్యం సన్నద్ధతపై నెతన్యాహూ సమీక్ష ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలై రెండు వారాలు దాటింది. ఇప్పటివరకు గాజాలో 4,385 మంది జనం మృత్యువాతపడ్డారు. ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా మరణించారు. గాజాపై భూతల దాడులకు ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ శనివారం రాత్రి మంత్రివర్గ సహచరులతో సమావేశమయ్యారు. ఉత్తర గాజాపై భూతల దాడుల విషయంలో సైన్యం సన్నద్ధతపై ఈ భేటీలో సమీక్ష సమాచారం. ఇజ్రాయెల్–గాజా సరిహద్దుల్లో వేలాదిగా ఇజ్రాయెల్ సైనికులు మోహరించారు. ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర గాజా నుంచి ఇప్పటికే 7 లక్షల మంది జనం దక్షిణ గాజాకు వెళ్లిపోయినట్లు అంచనా. అనూహ్య స్థాయిలో ‘తదుపరి దాడి’ గాజాపై జరుగుతున్న వైమానిక దాడులు ‘యుద్ధంలో తదుపరి దశ’కు రంగం సిద్ధం చేయడానికేనని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ చెప్పారు. తదుపరి దాడి అనూహ్య స్థాయిలో ఉంటుందని అన్నారు. తమ పదాతి దళాలు గాజా భూభాగంలోకి అడుగుపెట్టడానికి వీలుగా సానుకూల పరిస్థితులు సృష్టించడానికి వైమానిక దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సానుకూల పరిస్థితులు ఉన్నప్పుడే తదుపరి దశ యుద్ధంలోకి ప్రవేశించాల్సి ఉంటుందని అన్నారు. హమాస్‌ను అంతం చేయడానికి గాజాలో అడుగుపెడతామని ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెర్జీ హలేవీ చెప్పారు. మిలిటెంట్ల సన్నద్ధతను తక్కువ అంచనా వేయొద్దని తమ సైన్యానికి సూచించారు. ఆయన తాజాగా ఇజ్రాయెల్ సైనికాధికారుతో సమావేశయ్యారు. గాజాలో ప్రవేశించిన తర్వాత ఊహించని పరిణామాలకు సైతం సిద్ధంగా ఉండాలని అన్నారు. కిక్కిరిసిన జనాభాతో గాజా స్ట్రిప్ చాలా సంక్లిష్టంగా ఉంటుందని తెలిపారు. శత్రువులు మన కోసం అక్కడ ఎన్నో యుద్ధ రీతులను సిద్ధం చేసి పెట్టారని, మన ప్రతిస్పందన అత్యంత చురుగ్గా, వేగంగా ఉండాలని సూచించారు. ఇజ్రాయెల్ తాజా హెచ్చరిక గాజా ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం మరోసారి అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర గాజా నుంచి దక్షిణం గాజాకు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించింది. అలా వెళ్లనివారిని హమాస్ మిలిటెంట్ల సానుభూతిపరులుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ రక్షణ దళం(ఐడీఎఫ్) పేరు, లోగోతో ఉన్న కరపత్రాలను గాజా సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలకు పంపిణీ చేశారు. అలాగే మొబైల్ ఫోన్ ఆడియో సందేశాలను కూడా గాజా స్ట్రిప్‌లోని ప్రజలకు చేరవేశారు. ‘‘ఉత్తర గాజాలో మీకు ముప్పు పొంచి ఉంది. దక్షిణ గాజాకు వెళ్లకుండా ఉత్తర గాజాలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నవారిని హమాస్ సానుభూతిపరులుగా పరిగణిస్తాం’’ అని అందులో పేర్కొన్నారు. పాలస్తీనియన్లకు భారత్ ఆపన్న హస్తం గాజాలోని పాలస్తీనియన్లకు భారత్ ఆపన్న హస్తం అందిస్తోంది. 6.5 టన్నుల ఔషధాలు, 32 టన్నుల విపత్తు సహాయక సామగ్రిని పంపించింది. ఔషధాలు, సామగ్రితో భారత వైమానిక దళానికి చెందిన సి–17 రవాణా విమానం ఆదివారం భారత్ నుంచి నుంచి బయలుదేరింది. ఇది ఈజిప్టులోని ఎల్–అరిష్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనుంది. మానవతా సాయాన్ని అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో గాజాకు చేరవేయనున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అత్యవసర ప్రాణ రక్షక ఔషధాలు, సర్జికల్ సామగ్రి, టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్టు, శానిటరీ వస్తువులు, నీటి శుద్ధి మాత్రలు తదితర సామగ్రిని గాజాకు పంపించినట్లు తెలియజేశారు. పాలస్తీనియన్లకు మరింత సాయం పంపిస్తామని వెల్లడించారు. గాజాలో సామన్య ప్రజల మరణం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మొమమ్మద్కు అబ్బాస్‌కు ఫోన్ చేసి, సంతాపం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈజిప్టు నుంచి గాజాకు రెండో షిప్మెంట్ ఇజ్రాయెల్ సైన్యం దాడులతో అల్లాడిపోతున్న గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం ఇప్పుడిప్పుడే చేరుతోంది. నిత్యావసరాలు, ఇతర సహాయక సామగ్రితో కూడిన 17 వాహనాలు ఆదివారం ఈజిప్టు నుంచి గాజాలో అడుగుపెట్టాయి. గత రెండు రోజుల వ్యవధిలో ఇది రెండో షిప్మెంట్. శనివారం 20 వాహనాలు ఈజిప్టు నుంచి గాజాకు చేరుకున్నాయి. -
వైమానిక దాడి : మిలటరీ చీఫ్, భార్య, కుమార్తె మృతి
గాజా: గాజా నగరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హమాస్ మిలటరీ చీఫ్ మహమ్మద్ డిఫ్, అతడి భార్యతోపాటు చిన్నారి (2) కూడా మరణించారు. ఈ మేరకు హమాస్ నేత మౌస్సా అబూ మర్జోక్ బుధవారం ఫేస్ బుక్‌లో పేర్కొన్నారు. ఈ దాడి మంగళవారం రాత్రి చోటు చేసుకుందని... మహమ్మద్ డిఫ్, అతడి భార్య, కుమార్తెలు అమరులయ్యారని చెప్పారు. హామాస్ నాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు తెగబడిందని ఆరోపించారు. వారి మిగిలిన పిల్లులు అనాధులయ్యారని చెప్పారు. వైమానిక దాడిలో మరో 45 మంది మరణించారని తెలిపారు. జూలై 8 నుంచి ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య జరుగుతున్న పోరాటలో 2020 మంది పాలస్తీనియన్లు, 67 మంది ఇజ్రాయెల్ వారు మరణించారని చెప్పారు. 2002లో మహమ్మద్ డిఫ్ హమాస్ మిలటరీ వింగ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారని చెప్పారు. ఆ పదవి చేపట్టిన నాటి నుంచి దాదాపు 5 సార్లు ఆయనపై దాడి జరిగిందని.... ఆయన తృటీలో తప్పించుకున్నారని మౌస్సా అబూ మర్జోక్ వివరించారు.