Israel-Hamas War: చక్రబంధంలో గాజా సిటీ! | Israel-Hamas War Latest Updates: Israeli Army Surrounds Gaza City As War Enters Day 28 - Sakshi
Sakshi News home page

Israel-Hamas War Updates: చక్రబంధంలో గాజా సిటీ!

Published Sat, Nov 4 2023 4:46 AM | Last Updated on Sat, Nov 4 2023 12:24 PM

Israel-Hamas War: Israeli Army Surrounds Gaza City - Sakshi

ఖాన్‌ యూనిస్‌/జెరూసలేం/న్యూఢిల్లీ: గాజాలో హమాస్‌ మిలిటెంట్లతో హోరాహోరీ పోరు కొనసాగుతోందని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. తమ పదాతి సేనలు, వైమానిక దళాలు శత్రువులపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయని, ప్రశంసనీయమైన విజయాలు సాధిస్తున్నాయని హర్షం వ్యక్తం చేసింది. మిలిటెంట్ల దాడులను తమ జవాన్లు గట్టిగా తిప్పికొడుతున్నారని పేర్కొంది. శుక్రవారం జరిగిన దాడుల్లో చాలామంది మిలిటెంట్లు హతమయ్యారని, వారి సొరంగాలు నామరూపాల్లేకుండా పోయాయని తెలియజేసింది.

గాజా సిటీలో దాడులు ఉధృతం చేయబోతున్నామని ప్రకటించింది. ఇజ్రాయెల్‌–హమాస్‌ ఘర్షణలో మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. శుక్రవారం నాటికి గాజాలో 9,200 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. గాజాలో మిలిటెంట్ల అదీనంలో ఉన్న 240 మంది బందీల ఆచూకీ కోసం ఇజ్రాయెల్‌ సైన్యం ముమ్మరంగా ప్రయతి్నస్తోంది. ఇందుకోసం అమెరికా డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఈ డ్రోన్లు గత వారం రోజులుగా గాజా ఉపరితలంపై చక్కర్లు కొడుతున్న దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.    

గాజాని చుట్టుముట్టాం: ఇజ్రాయెల్‌   
గాజాలో ప్రధాన నగరం, హమాస్‌ మిలిటెంట్ల ముఖ్యమైన అడ్డా అయిన గాజా సిటీని తమ సేనలు చుట్టుముట్టాయని ఇజ్రాయెల్‌ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ ప్రకటించారు. భూతల దాడులు ప్రారంభమైన వారం రోజుల తర్వాత గాజా సిటీ చుట్టూ తమ దళాలు పూర్తిస్థాయిలో మోహ రించినట్లు తెలిపారు. గాజాలో కాల్పుల విరమణ పాటించాలంటూ ప్రపంచ దేశాల నుంచి తమపై ఒత్తిడి వస్తున్నట్లు వెలువడుతున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.   

నల్ల బ్యాగుల్లో తిరిగి వెళ్తారు: హమాస్‌  
గాజాలో ఇజ్రాయెల్‌ సైన్యానికి దారుణ పరాజయం ఎదురు కాబోతోందని హమాస్‌ మిలిటరీ విభాగమైన ఖాసమ్‌ బ్రిగేడ్స్‌ స్పష్టం చేసింది. తమ భూభాగంలో అడుగుపెట్టిన ఇజ్రాయెల్‌ సైనికులు నల్ల బ్యాగుల్లో తిరిగి వెళ్తారని హెచ్చరించింది. తద్వారా వారికి తమ చేతుల్లో చావు తప్పదని పేర్కొంది.  

కాల్పుల విరమణ లేదు: నెతన్యాహూ
హమాస్‌ మిలిటెంట్ల చెరలో ఉన్న బందీలందరినీ విడుదల చేసే దాకా గాజాలో కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూ తేలి్చచెప్పారు. మానవతా సాయం గాజాకు చేరవేయడానికి, విదేశీయులను బయటకు పంపించడానికి వీలుగా తాత్కాలికంగా కాల్పు ల విరమణ పాటించాలన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభ్యర్థనపై ఆయన స్పందించారు. నెతన్యాహూ శుక్రవారం అమెరి కా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌తో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు.  

పాలస్తీనియన్లను కాపాడండి
గాజాలో ఇజ్రాయెల్‌ దాడుల్లో సామాన్య పాలస్తీనియన్లు మరణిస్తుండడం పట్ల అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో ప్రజలను కాపాడడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేశారు. లేకపోతే ‘శాంతికి భాగస్వాములు’ ఎవరూ ఉండరని చెప్పారు. గాజాను శ్మశానంగా మార్చొద్దని పరోక్షంగా తేలి్చచెప్పారు. గాజాకు భారీస్థాయిలో మానవతా సాయం అవసరమని, ఆ దిశగా ఇజ్రాయెల్‌ ప్రభుత్వం చర్యలు ప్రారంభించాలని అన్నారు. ప్రపంచ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న మానవతా సాయాన్ని గాజాలోకి విస్తృతంగా అనుమతించాలని, ఈ విషయంలో ఆంక్షలు తొలగించాలని చెప్పారు. ఆంటోనీ బ్లింకెన్‌ శుక్రవారం ఇజ్రాయెల్‌లో పర్యటించారు.

పవిత్ర యుద్ధం చేస్తున్నాం: హసన్‌ నస్రల్లా   
ఇజ్రా యెల్‌పై దా డుల విషయంలో అమెరికా హెచ్చరికలు తమను భయపెట్టలేవని లెబనాన్‌కు చెందిన షియా మిలిటెంట్‌ సంస్థ ‘హెజ్బొల్లా’ అధినేత హసన్‌ నస్రల్లా పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధానికి హెజ్బొల్లా దూరంగా ఉండాలంటూ అమెరికా చేసిన హెచ్చరికలపై ఆయన శుక్రవారం స్పందించారు. ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధం మొదలైన తర్వాత ఆయన మాట్లాడడం ఇదే తొలిసారి.

ఇజ్రాయెల్‌పై తొలుత దాడిచేసిన హమాస్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఇజ్రాయెల్‌పై పవిత్ర యుద్ధంలో త్యాగాలు చేయడానికి  సిద్ధంగా ఉన్నామని వివరించారు. మధ్యధరా సముద్రంలో అమెరికా సైనిక బలగాలను చూసి తాము బెదిరిపోవడం లేదని అన్నారు. తమ దగ్గర బలమైన సైన్యం ఉందని, అన్నింటికీ సిద్ధపడే ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్నట్లు నస్రల్లా పేర్కొన్నారు.  నస్రల్లా ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియదు. ఆయన ప్రసంగాన్ని  టీవీల్లో ప్రసారం చేశారు.

ఇజ్రాయెల్‌ నుంచి పాలస్తీనా కారి్మకులు వెనక్కి
తమ దేశంలో పని చేస్తున్న పాలస్తీనియన్‌ కారి్మకులను వారి సొంత ప్రాంతమైన గాజాకు పంపించాలని ఇజ్రాయెల్‌ నిర్ణయించింది. శుక్రవారం పదుల సంఖ్యలో కారి్మకులను గాజాకు పంపించింది. భారమైన హృదయంతో వారు వెనక్కి వెళ్లిపోయారు. ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య అక్టోబర్‌ 7 నుంచి ఘర్షణ మొదలైంది. అంతకంటే ముందు 18,000 మంది పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం వర్క్‌ పరి్మట్లు జారీ చేసింది. వారిలో చాలామంది ఇజ్రాయెల్‌కు చేరుకొని, వేర్వేరు పనుల్లో కుదురుకున్నారు.  మారిన పరిస్థితుల నేపథ్యంలో పాలస్తీనియన్లు వెనక్కి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్‌ ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement