రఫా(గాజా్రస్టిప్)/జెరూసలేం/న్యూఢిల్లీ/టెల్ అవీవ్: పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య ఘర్షణలు మరింత ఉధృతం అవుతున్నాయి. ఇజ్రాయెల్ భీకర యుద్ధం ప్రారంభించింది. ఇప్పటిదాకా గాజాలో వైమానిక దాడులు నిర్వహించగా, ఇక సిరియా, వెస్ట్‌బ్యాంక్‌లోని హమాస్ స్థావరాలపైనా దృష్టి పెట్టింది. గాజాతోపాటు సిరియాలో రెండు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు, వెస్ట్‌బ్యాంక్‌లో ఒక మసీదుపై క్షిపణులు ప్రయోగించింది. శనివారం రాత్రి మొదలైన ఈ దాడుల ఆదివారం కూడా కొనసాగాయి.
మూడు ప్రాంతాల్లోని టార్గెట్లపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు నిప్పుల వర్షం కురిపించాయి. సిరియాలోని ఎయిర్‌పోర్టులు, వెస్ట్‌బ్యాంక్ మసీదును హమాస్ మిలిటెంట్లు అడ్డాగా మార్చుకున్నారని, అక్కడి నుంచే తమపై దాడులకు సన్నాహాలు చేస్తున్నారని, అందుకే ముందుగానే ఎదురుదాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. సిరియా ఎయిర్‌పోర్టులపై జరిగిన దాడిలో ఒకరు మరణించారు. రన్‌వేలు దెబ్బతిన్నాయి. వెస్ట్‌బ్యాంక్‌లో కనీసం ఐదుగురు మరణించారు. మరోవైపు లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్ భూభాగంపై రాకెట్లు ప్రయోగిస్తూనే ఉంది. ఇజ్రాయెల్ దళాలు సైతం ప్రతిదాడి చేస్తున్నాయి. దీంతో ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
సైన్యం సన్నద్ధతపై నెతన్యాహూ సమీక్ష
ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలై రెండు వారాలు దాటింది. ఇప్పటివరకు గాజాలో 4,385 మంది జనం మృత్యువాతపడ్డారు. ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా మరణించారు. గాజాపై భూతల దాడులకు ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ శనివారం రాత్రి మంత్రివర్గ సహచరులతో సమావేశమయ్యారు. ఉత్తర గాజాపై భూతల దాడుల విషయంలో సైన్యం సన్నద్ధతపై ఈ భేటీలో సమీక్ష సమాచారం. ఇజ్రాయెల్–గాజా సరిహద్దుల్లో వేలాదిగా ఇజ్రాయెల్ సైనికులు మోహరించారు. ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర గాజా నుంచి ఇప్పటికే 7 లక్షల మంది జనం దక్షిణ గాజాకు వెళ్లిపోయినట్లు అంచనా.
అనూహ్య స్థాయిలో ‘తదుపరి దాడి’
గాజాపై జరుగుతున్న వైమానిక దాడులు ‘యుద్ధంలో తదుపరి దశ’కు రంగం సిద్ధం చేయడానికేనని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ చెప్పారు. తదుపరి దాడి అనూహ్య స్థాయిలో ఉంటుందని అన్నారు. తమ పదాతి దళాలు గాజా భూభాగంలోకి అడుగుపెట్టడానికి వీలుగా సానుకూల పరిస్థితులు సృష్టించడానికి వైమానిక దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సానుకూల పరిస్థితులు ఉన్నప్పుడే తదుపరి దశ యుద్ధంలోకి ప్రవేశించాల్సి ఉంటుందని అన్నారు.
హమాస్‌ను అంతం చేయడానికి గాజాలో అడుగుపెడతామని ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెర్జీ హలేవీ చెప్పారు. మిలిటెంట్ల సన్నద్ధతను తక్కువ అంచనా వేయొద్దని తమ సైన్యానికి సూచించారు. ఆయన తాజాగా ఇజ్రాయెల్ సైనికాధికారుతో సమావేశయ్యారు. గాజాలో ప్రవేశించిన తర్వాత ఊహించని పరిణామాలకు సైతం సిద్ధంగా ఉండాలని అన్నారు. కిక్కిరిసిన జనాభాతో గాజా స్ట్రిప్ చాలా సంక్లిష్టంగా ఉంటుందని తెలిపారు. శత్రువులు మన కోసం అక్కడ ఎన్నో యుద్ధ రీతులను సిద్ధం చేసి పెట్టారని, మన ప్రతిస్పందన అత్యంత చురుగ్గా, వేగంగా ఉండాలని సూచించారు.
ఇజ్రాయెల్ తాజా హెచ్చరిక
గాజా ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం మరోసారి అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర గాజా నుంచి దక్షిణం గాజాకు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించింది. అలా వెళ్లనివారిని హమాస్ మిలిటెంట్ల సానుభూతిపరులుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ రక్షణ దళం(ఐడీఎఫ్) పేరు, లోగోతో ఉన్న కరపత్రాలను గాజా సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలకు పంపిణీ చేశారు. అలాగే మొబైల్ ఫోన్ ఆడియో సందేశాలను కూడా గాజా స్ట్రిప్‌లోని ప్రజలకు చేరవేశారు. ‘‘ఉత్తర గాజాలో మీకు ముప్పు పొంచి ఉంది. దక్షిణ గాజాకు వెళ్లకుండా ఉత్తర గాజాలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నవారిని హమాస్ సానుభూతిపరులుగా పరిగణిస్తాం’’ అని అందులో పేర్కొన్నారు.
పాలస్తీనియన్లకు భారత్ ఆపన్న హస్తం
గాజాలోని పాలస్తీనియన్లకు భారత్ ఆపన్న హస్తం అందిస్తోంది. 6.5 టన్నుల ఔషధాలు, 32 టన్నుల విపత్తు సహాయక సామగ్రిని పంపించింది. ఔషధాలు, సామగ్రితో భారత వైమానిక దళానికి చెందిన సి–17 రవాణా విమానం ఆదివారం భారత్ నుంచి నుంచి బయలుదేరింది. ఇది ఈజిప్టులోని ఎల్–అరిష్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనుంది. మానవతా సాయాన్ని అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో గాజాకు చేరవేయనున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
అత్యవసర ప్రాణ రక్షక ఔషధాలు, సర్జికల్ సామగ్రి, టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్టు, శానిటరీ వస్తువులు, నీటి శుద్ధి మాత్రలు తదితర సామగ్రిని గాజాకు పంపించినట్లు తెలియజేశారు. పాలస్తీనియన్లకు మరింత సాయం పంపిస్తామని వెల్లడించారు. గాజాలో సామన్య ప్రజల మరణం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మొమమ్మద్‌కు అబ్బాస్‌కు ఫోన్ చేసి, సంతాపం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈజిప్టు నుంచి గాజాకు రెండో షిప్‌మెంట్
ఇజ్రాయెల్ సైన్యం దాడులతో అల్లాడిపోతున్న గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం ఇప్పుడిప్పుడే చేరుతోంది. నిత్యావసరాలు, ఇతర సహాయక సామగ్రితో కూడిన 17 వాహనాలు ఆదివారం ఈజిప్టు నుంచి గాజాలో అడుగుపెట్టాయి. గత రెండు రోజుల వ్యవధిలో ఇది రెండో షిప్‌మెంట్. శనివారం 20 వాహనాలు ఈజిప్టు నుంచి గాజాకు చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment