రఫా/వాషింగ్టన్: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మరో కీలక దశలోకి ప్రవేశించింది. ఊహించినట్లుగానే ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర గాజాపై భూతల దాడులు ప్రారంభించింది. హమాస్ స్థావరాలను నేలమట్టం చేయడానికి ఇజ్రాయెల్ పదాతి దళాలు, యుద్ధ ట్యాంకులు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సరిహద్దు దాటి గాజా భూభాగంలోకి అడుగుపెట్టాయి. ‘లక్ష్యాల’పై స్పల్పస్థాయిలో దాడులు నిర్వహించాయి. గురువారం తెల్లవారుజాము వరకూ ఈ దాడులు కొనసాగాయి. ఉత్తర గాజాపై అతిత్వరలో పూర్తిస్థాయి భూతల యుద్ధం ప్రారంభం అవుతుందని ఇజ్రాయెల్ సైన్యం సంకేతాలిచి్చంది.
యుద్ధక్షేత్రాన్ని సిద్ధం చేయడానికే స్వల్పంగా భూతల దాడులు చేశామని గురువారం వెల్లడించింది. చాలామంది మిలిటెంట్లు హతమయ్యారని, హమాస్ మౌలిక సదుపాయాలను, ఆయుధ వ్యవస్థను ధ్వంసం చేశామని పేర్కొంది. గత 24 గంటల్లో గాజాపై దాదాపు 250 వైమానిక దాడులు చేశామని ప్రకటించింది. గాజాలో సహాయక చర్యలకు ఆటంకాలు సృష్టించవద్దని, భూతల దాడులను విరమించుకోవాలని ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి చేసినా ఇజ్రాయెల్ సైన్యం లెక్కచేయకపోవడం గమనార్హం.
ప్రాణనష్టం.. ఊహించలేం
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ ‘హమాస్’ 2007 నుంచి గాజాలో అధికారం చెలాయిస్తోంది. ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై హఠాత్తుగా విరుచుకుపడింది. భారీ సంఖ్యలో రాకెట్లు ప్రయోగించింది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా సామాన్య ప్రజలు, సైనికులు మరణించారు. తమ భద్రతకు సవాలు విసురుతున్న హమాస్‌కు బుద్ధి చెప్పడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడికి దిగింది. గాజాపై వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరుపక్షాల మధ్య గత 20 రోజులుగా హోరాహోరీ యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 7,000 మందికిపైగా పాలస్తీనియన్లు మృత్యువాతపడ్డారు. వీరిలో 2,900 మంది చిన్నపిల్లలు, 1,500 మంది మహిళలు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. పూర్తిస్థాయిలో భూతల దాడులు మొదలైతే గాజాలో ప్రాణనష్టం ఊహించని స్థాయిలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఖాన్ యూనిస్‌లో 15 మంది బలి
ఇజ్రాయెల్ సైన్యం గురువారం ఉత్తర గాజాపై భూతల దాడులతోపాటు దక్షిణ గాజాలో వైమానిక దాడులను కొనసాగించింది. ఈ దాడుల్లో ఖాన్ యూనిస్ సిటీలో 8 ఇళ్లు నేలమట్టమయ్యాయి. 15 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. సామాన్య ప్రజలకు హాని కలిగించడం లేదని, కేవలం హమాస్ స్థావరాలపైనే దాడుల చేస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. మరోవైపు మిలిటెంట్లు సైతం ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు కొనసాగిస్తున్నారు. తాజాగా సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని పెటా తిక్వా నగరంపై రాకెట్ ప్రయోగించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు.
మానవతా సాయం అంతంత మాత్రమే
గాజాలో ఆహారం, నీరు, ఔషధాలు, నిత్యావసరాలు లేక జనం పిట్టల్లా రాలిపోతుండడంతో ఇజ్రాయెల్‌పై ప్రపంచదేశాలు ఒత్తిడి పెంచాయి. ఇజ్రాయెల్ అనుమతితో ఈజిప్టు నుంచి ఇప్పటివరకు 70కి పైగా వాహనాలు గాజాలోకి అడుగుపెట్టాయి. ఈజిప్టు నుంచి అందుతున్న మానవతా సాయం ఏ మూలకూ చాలడం లేదని గాజా అధికారులు చెబుతున్నారు. ఈ సాయం సముద్రంలో నీటి»ొట్టంత అని గాజాలోని ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్‌క్రాస్ ప్రతినిధి విలిమయ్ ష్కోమ్‌బర్గ్ అన్నారు. ఆకలితో అలమటించిపోతున్న ప్రజల ప్రాణాలు నిలబెట్టాలంటే ఇంకా ఎన్నో రెట్ల సాయం కావాలని కోరారు.
అల్–జజీరా జర్నలిస్టు భార్య, పిల్లలు మృతి
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో బుధవారం అంతర్జాతీయ మీడియా సంస్థ అల్–జజీరా సీనియర్ జర్నలిస్టు వాయెల్ దాహ్‌దౌ భార్య, కుమారుడు, కుమార్తె, మనవడు ప్రాణాలు కోల్పోయారు. గాజాలోని నుసీరాత్ శరణార్థుల శిబిరంపై జరిగిన దాడిలో వారు మరణించారు. మరికొందరు కుటుంబ సభ్యులు కనిపించకుండాపోయారు. గురువారం వాయెల్ భార్య, కుమారుడు, కుమార్తె, మనవడి అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తన భార్య, కుటుంబ సభ్యుల మృతదేహాలను చూసి ఆయన కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలు కలిచివేశాయి. సంతాపం ప్రకటిస్తూ వారు పోస్టులు పెట్టారు. ప్రతీకారం తీర్చుకోవాలంటే మా పిల్లలను బలి తీసుకోవాలా? అని వాయెల్ నిలదీశారు. పాలస్తీనా జాతీయుడైన వాయెల్ చాలా ఏళ్లుగా గాజాలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఇక్కడి ప్రజల దీనగాథలను, ఇజ్రాయెల్ సైన్యం దుశ్చర్యలను బయటి ప్రపంచానికి తెలియజేస్తున్నారు.
ఆ ఎకనామిక్ కారిడార్ వల్లే హమాస్ దాడి!: బైడెన్
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భారత్‌లో జి–20 సదస్సులో ప్రకటించిన ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్‌ను హమాస్ మిలిటెంట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఈ ప్రాజెక్టును విరమించుకొనేలా ఒత్తిడి పెంచడానికే ఇజ్రాయెల్‌పై అకస్మాత్తుగా దాడి చేశారన్న వాదన కొంతవరకు తనకు సబబుగానే కనిపిస్తోందని అన్నారు.
హమాస్ దాడికి గల కారణంపై తన అంతరాత్మ ఇదే చెబుతోందని వ్యాఖ్యానించారు. అయితే, దీనికి తనవద్ద స్పష్టమైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొన్నారు. అమెరికా పర్యటనకు వచి్చన ఆ్రస్టేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బానీస్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎకనామిక్ కారిడార్ గురించి బైడెన్ ప్రస్తావించడం గత వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. రైలు, రోడ్డు మార్గాలతో ఆసియా, మధ్యప్రాచ్యం, యూరప్ దేశాలను అనుసంధానించడానికి ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్‌ను జి–20 దేశాలు తలపెట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment