జెరూసలేం: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో నెత్తుటేర్లు పారుతున్నాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ మూడు రోజులుగా కొనసాగుతూనే ఉంది. హమాస్ మిలిటెంట్ల పీచమణచడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం సోమవారం గాజాపై వైమానిక దాడులు ఉధృతం చేసింది. మిలిటెంట్ల చొరబాట్లను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు, డ్రోన్లను మోహరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి.
దక్షిణ గాజాలోని రఫాలో సోమవారం ఉదయం ఇజ్రాయెల్ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా 19 మంది మృతిచెందారు. మరోవైపు దక్షిణ ఇజ్రాయెల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ జవాన్లపై కాల్పులకు దిగుతున్నారు. అడపాదడపా రాకెట్లు కూడా ప్రయోగిస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యం తిప్పికొడుతోంది. గాజాలో వెయ్యికి పైగా టార్గెట్లపై దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
గాజాలో ఎక్కడ చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. తాజా యుద్ధంలో మృతుల సంఖ్య 1,200 దాటింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 700 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 500 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్‌లో 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ అ«దీనంలో ఉన్నారని హమాస్ ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్‌లో లెబనాన్‌కు చెందిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య కాల్పులు జరుగుతున్నాయి.
గాజా దిగ్బంధానికి ఆదేశాలు
గాజాలో హమాస్ ముష్కరులను, వారి ప్రభుత్వాన్ని తుదముట్టిస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తేలి్చచెప్పారు. హమాస్‌ను ఇప్పటికే చాలావరకు బలహీనపర్చామని ఇజ్రాయెల్ అధికార వర్గాలు వెల్లడించాయి. గాజాను పూర్తిగా దిగ్బంధించాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గల్లాంట్ తమ సైన్యాన్ని ఆదేశించారు. గాజాకు విద్యుత్, ఆహారం, ఇంధనం సరఫరా కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇజ్రాయెల్–గాజా సరిహద్దుల్లో 24 కాలనీలు ఉండగా, 15 కాలనీలను ఖాళీ చేయించారు. మిగిలినవాటిని 24 గంటల్లోగా ఖాళీ చేయిస్తామని ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. గాజాపై ఇప్పటిదాకా వైమానిక దాడులకే పరిమితం అయిన ఇజ్రాయెల్ ఇక భూ యుద్ధంపై దృష్టి పెట్టింది. నేరుగా భూమిపైనుంచే క్షిపణులు ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. యుద్ధం వల్ల గాజాలో 1,23,000 మంది నిరాశ్రయులయ్యారని, ఇళ్లు విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
గాజా బయట తమ పోరాటం కొనసాగుతోందని, సోమవారం ఉదయం మరికొంతమంది ఇజ్రాయెల్ పౌరులను బంధించామని హమాస్ ప్రతినిధి అబ్దెల్–లతీఫ్ అల్–ఖనౌవా చెప్పారు. ఇజ్రాయెల్ చెరలో ఉన్న పాలస్తీనా ఖైదీలందరినీ విడిపించి, స్వేచ్ఛ ప్రసాదించడమే తక్ష లక్ష్యమని ఉద్ఘాటించారు. హమాస్ చేతిలో ఉన్న బందీలను విడిపించడానికి సహకరించాలంటూ ఇజ్రాయెల్ కోరిందని ఈజిప్టు అధికారులు చెప్పారు.
ఇజ్రాయెల్‌కు అమెరికా సాయం
మిత్రదేశం ఇజ్రాయెల్ కోసం అమెరికా రంగంలోకి దిగింది. సైనిక సాయం అందిస్తోంది. తూర్పు మధ్యదరా సముద్రానికి యుద్ధ నౌకలను పంపించింది. ఇంకా అదనపు సైనిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది.
260 మృతదేహాలు లభ్యం
దక్షిణ ఇజ్రాయెల్‌లో శనివారం సూపర్‌నోవా ఫెస్టివల్‌లో ఆనందంగా గడుపుతున్న జనంపై హమాస్ ముష్కరులు హఠాత్తుగా దాడి చేశారు. సైనిక దుస్తుల్లో వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 260కిపైగా మృతదేహాలను ఇజ్రాయెల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతం గాజాకు సమీపంలోనే ఉంది.
నా భార్యాబిడ్డలను అపహరించారు
యువకుడు యెనీ అషెర్ గాజా సరిహద్దుకు సమీపంలో ఇజ్రాయెల్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. హమాస్ మిలిటెంట్లు అతడి భార్య డోరన్, కుమార్తెలు రజ్(5), అవివ్(3)ను శనివారం అపహరించారు. ఎక్కడ దాచారో తెలియడం లేదు. వారి కోసం అషెర్ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. వారిని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకంటున్నాడు.
ఫోన్‌లో మాట్లాడుతుండగానే చంపేశారు
ఇలాన్ ట్రోయెన్ అమెరికాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె డెబోరా మతియాస్, అల్లుడు స్కోమ్లీ మతియాస్, మనవడు ఇజ్రాయెల్‌లో ఉంటున్నారు. శనివారం ఆమె అమెరికాలో ఉన్న తన తండ్రితో ఫోన్‌లో మాట్లాడుతుండగా హమాస్ తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డెబోరా, స్కోమ్లీ దంపతులు బలయ్యారు. వారి 16 ఏళ్ల కుమారుడు గాయాలతో బయటపడ్డాడు.
హమాస్ దాడిలో కేరళ మహిళకు గాయాలు
ఇజ్రాయెల్ ఆయాగా పనిచేస్తున్న కేరళ మహిళ షీజా ఆనంద్ హమాస్ మిలిటెంట్ల దాడిలో గాయపడ్డారు. కేరళ రాష్ట్రం కన్నూర్ జిల్లా పయ్యావూర్‌కు చెందిన షీజా ఆనంద్ దక్షిణ ఇజ్రాయెల్‌లోని సముద్ర తీర నగరం అషె్కలాన్‌లో ఆయాలో పని చేస్తున్నారు. శనివారం హమాస్ మిలిటెంట్ల అషె్కలాన్‌పై రాకెట్లు ప్రయోగించంతో ఆమె గాయాలపాలయ్యారు. భారత్‌లో ఉన్న భర్త ఆనంద్‌తో వీడియో కాల్ ద్వారా మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు షీజా ఆనంద్‌ను ఆసుపత్రిలో చేరి్పంచారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. ఆదివారం మధ్యాహ్నం షీజా భారత్‌లోని తన తల్లితో మాట్లాడారు. ‘అమ్మా.. ఐయామ్ ఓకే’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment