టెల్ అవీవ్: హమాస్ మిలిటెంట్ల భరతం పట్టడమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై వైమానిక, భూతల దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం, శనివారం హమాస్ మిలిటెంట్ల ఎదురుదాడిలో 14 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. దీంతో ఈ యుద్ధంలో ఇప్పటివరకు బలైన ఇజ్రాయెల్ సైనికుల సంఖ్య 153కు చేరుకుంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. ఒకేసారి 14 మంది జవాన్లను కోల్పోవడం ఇజ్రాయెల్ జీరి్ణంచుకోలేకపోతోంది. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర స్థాయిలో విరుచుకుపడుతోంది. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల వ్యవధిలో 166 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హమాస్ చెరలోని బందీలను విడిపించాలంటే యుద్ధం తప్పదని ఇజ్రాయెల్ అంటోంది.
హమాస్‌పై పోరాటం వల్ల భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోందని, అయినప్పటికీ ముందుకెళ్లడం తప్ప మరో మార్గం లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. మరోవైపు ఆయనకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో జనం వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. నెతన్యాహు తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment