
తాజా దాడుల్లో 23 మంది మృతి
మృతుల్లో హమాస్ సీనియర్ నేత
డెయిర్ అల్–బలాహ్: గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి బలైన వారి సంఖ్య 50 వేలు దాటింది! ఆదివారం గాజా ఆరోగ్య విభాగం ఈ మేరకు ప్రకటించింది. ‘‘మృతుల్లో సగానికి పైగా మహిళలు, చిన్నారులే. 1.13 లక్షల మందికి పైగా క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజా జనాభాలో 90 శాతం మంది నిలువనీడ కోల్పోయారు’’ అని ఆవేదన వెలిబుచ్చింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఇజ్రాయెల్ చేపట్టిన తాజా వైమానిక దాడుల్లో హమాస్ రాజకీయ విభాగం సీనియర్ నేత సహా 23 మంది చనిపోయారు.
ఖాన్‌యూనిస్ సమీపంలో దాడుల్లో పాలస్తీనా పార్లమెంట్ సభ్యుడు, తమ రాజకీయ విభాగం సభ్యుడు సలాహ్ బర్దావిల్, ఆయన భార్య చనిపోయినట్లు హమాస్ వర్గాలు ప్రకటించాయి. టెంట్లో ప్రార్థనలు చేస్తున్న సమయంలో వీరిపై దాడి జరిగిందని పేర్కొన్నాయి. హమాస్ రాజకీయ వ్యవహారాలపై తరచూ మీడియాకు బర్దావిల్ ఇంటర్వ్యూలిస్తుంటారు. ఖాన్ యూనిస్‌పై జరిగిన దాడిలో దంపతులతో పాటు వారి ఐదుగురు సంతానం చనిపోయారు. మరో దాడిలో దంపతులు, ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయినట్టు యూరోపియన్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరో దాడిలో చనిపోయిన మహిళ, చిన్నారి మృతదేహాలను ఆస్పత్రికి తీసుకొచ్చినట్టు కువైటీ ఆస్పత్రి నిర్వాహకులు చెప్పారు.
మారణహోమమే
హమాస్ సాయుధులు 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసి 1,200 మందిని చంపడం, 250 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లడం తెలిసిందే. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ భీకర యుద్ధానికి దిగింది. ఆ ప్రాంతాన్ని శ్మశానసదృశంగా మార్చేసింది. జనవరిలో కుదిరిన కాల్పుల విరమణ రెండు నెలల ముచ్చటే అయింది. వారం రోజులుగా మళ్లీ గాజాపై దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment