Health Department
-
వ్యాక్సిన్ వ్యతిరేకితో భారత్‌కు నష్టం?
అమెరికా అధ్యక్షపీఠాన్ని డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధిరోహించనున్నారు. ఇప్పటికే తన వద్ద పనిచేసే మంత్రులను నియమిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఆరోగ్య, ప్రజా సేవల మంత్రిగా వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమకారుడు రాబర్ట్ ఎఫ్ కెనెడీ జూనియర్‌ను నియమించనున్నట్లు ప్రకటించారు. అయితే ఇందుకు సెనెట్‌లో ఆమోదం లభించాల్సి ఉంటుంది. అమెరికాకు అత్యధికంగా భారత ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఈ తరుణంలో కెనెడీ నియామకం పట్ల భారత కంపెనీలు కొంత ఆందోళన చెందుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.‘ప్రజారోగ్యం విషయంలో మందుల కంపెనీల మోసాలు, తప్పుడు సమాచారం తదితరాలతో అమెరికన్లు చాలాకాలంగా నలిగిపోయారు. కెనెడీ వీటికి అడ్డుకట్ట వేసి అమెరికాను మళ్లీ గొప్పగా, ఆరోగ్యంగా మారుస్తారు. ఔషధాలు, వ్యాక్సిన్లు, ఆహార భద్రత, వైద్య పరిశోధన, సామాజిక భద్రత, మెడికేర్ వంటి కీలక వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు’ అని ట్రంప్ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు.2023 ఆర్థిక సంవత్సరంలో భారత్ దాదాపు 7.55 బిలియన్ డాలర్లు (రూ.62,615 కోట్లు) విలువ చేసే ఫార్మా ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. యాంటిసెరా, వ్యాక్సిన్లు, టాక్సిన్లు, గ్రంథులు.. వంటి వాటిని ఎగుమతి చేస్తున్నారు. అమెరికాకు ఎగుమతి చేసే దేశీయ కంపెనీల్లో ప్రధానంగా సన్ ఫార్మాస్యూటికల్స్, సిప్లా లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అరబిందో ఫార్మా, లుపిన్ లిమిటెడ్.. వంటి కంపెనీలున్నాయి. వీటితోపాటు ప్రధానంగా కరోనా సమయం నుంచి ‘వ్యాక్సిన్ మైత్రి’లో భాగంగా దేశీయంగా తయారైన కొవాక్సిన్, కొవిషీల్డ్ వంటి వ్యాక్సిన్లు అమెరికాకు భారీగా ఎగుమతి చేస్తున్నారు. ఆరోగ్య మంత్రిగా వ్యాక్సిన్ వ్యతిరేకిగా ఉన్న కెనెడీ నియామకం ఫార్మా కంపెనీల్లో కొంత ఆందోళన కలిగిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో రియల్టీ జోరు!‘మేక్ అమెరికా హెల్దీ అగైన్’ నినాదానికి కెనెడీ పూర్తిగా న్యాయం చేస్తారని ట్రంప్ విశ్వాసం వెలిబుచ్చారు. తన రెండో విడత పాలనలో ప్రజారోగ్యం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కెనెడీకి పూర్తి స్వేచ్ఛనిస్తానని ట్రంప్ పదేపదే చెప్పుకొచ్చారు. టీకాలు తదితరాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తికి ఏకంగా ఆరోగ్య శాఖ అప్పగించడం పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా, నిబంధనల ప్రకారం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(యూఎస్ ఎఫ్‌డీఏ) ధ్రువపరిచిన ఫార్మా ఉత్పత్తుల ఎగుమతికి ఎలాంటి ఢోకా లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. -
గుర్లలో కలరా!
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా గుర్లలో 14 మంది మరణించడంతో పాటు, వందల సంఖ్యలో బాధితులు ఆస్పత్రులపాలవ్వడానికి కారణం కలరా అని తెలుస్తోంది. బాధితుల నుంచి సేకరించిన నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా కలరా ఆనవాళ్లను గుర్తించినట్టు సమాచారం. వైద్య శాఖ నియమించిన ర్యాపిడ్ రియాక్షన్ టీమ్ సైతం ఈ అంశాన్ని ధ్రువీకరిస్తూ ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిసింది. గుర్లలో చోటు చేసుకున్న మరణాలను దాచినట్లుగానే, సమస్యకు కారణాలను సైతం బయటకు పొక్కకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆస్పత్రిలో చేరిన కొందరు బాధితుల నుంచి నమూనాలు సేకరించి.. విజయనగరం వైద్యకళాశాల ల్యాబ్‌లో పరీక్షించారు. కల్చర్ టెస్ట్‌లో విబ్రియో కలరా ఆనవాళ్లను గుర్తించినట్టు తెలిసింది. పూర్తి స్థాయిలో నిర్ధారణ కోసం కోల్‌కతాలోని ల్యాబ్‌కు పంపినట్టు సమాచారం. కలరా సోకిన వారిలో తీవ్ర స్థాయిలో విరోచనాలు అవుతాయి. దీంతో తొందరగా శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి బాగా నీరసించిపోతారు. ఆపై కిడ్నీల పనితీరుపై ప్రభావం పడి మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌తో మరణాలు సంభవిస్తాయని వైద్యులు చెబుతున్నారు. -
అందరికీ సంతాన భాగ్యం!
రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ దవాఖాన్లలో ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులకు ఇది ఓ రకంగా శుభవార్త అని డాక్టర్లు చెబుతున్నారు. సంతానం కోసం అనేకమంది దంపతులు ఐవీఎఫ్ సెంటర్లను ఆశ్రయిస్తూ లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ పేరిట ప్రత్యేక ప్యాకేజీలు పెట్టి మరీ బాధితుల వద్ద రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారు. రూ. 50 నుంచి రూ. 80 వేల ఖర్చులో పూర్తయ్యే ఐవీఎఫ్ చికిత్సకు, రూ.3 నుంచి రూ.6 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇంత ఖర్చు చేస్తున్నా, సగం మందికి ఫలితం దక్కడం లేదు. కానీ, ప్రైవేట్ ఆస్పత్రులు మార్కెటింగ్ ట్రిక్స్‌తో బాధిత దంపతులను మభ్యపెట్టి లక్షల్లో దండుకుంటున్నాయి. –సాక్షి, హైదరాబాద్పెరుగుతున్న ఇన్ఫర్టిలిటీ సమస్యలురాష్ట్రంలో యువతకు సంతాన సమస్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రతి వంద జంటల్లో 30 నుంచి 40 జంటలు ఏదో ఒక స్థాయి ఇన్ఫర్టిలిటీ సమస్యను ఎదుర్కొంటున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ చెబుతోంది. ప్రభుత్వ దవాఖాన్లలో ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ అందించే సౌకర్యాలు లేకపోవడం, ప్రైవేట్ ఆస్పత్రులు రూ.లక్షల్లో చార్జీలు వసూలు చేస్తుండడంతో ఎంతో మంది మానసికంగా, ఆర్థికంగా కుంగిపోతున్నారు. మారిన జీవనశైలితో ఆడ, మగ ఇద్దరిలోనూ ఇన్ఫర్టిలిటీ సమస్యలు పెరిగాయని వైద్య,ఆరోగ్యశాఖ అంచనా వేస్తుంది. పిల్లలు పుట్టకపోవడంతో కొత్త జంటలు మానసిక వేదనను అనుభవిస్తున్నాయి. ఈ సమస్య తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ దవాఖాన్లలో ఫర్టిలిటీ సెంటర్లు పెడుతామని 2017లో అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. 2023 వరకూ ఒక్క గాం«దీలో మాత్రమే ఫర్టిలిటీ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే అందులో సౌకర్యాలు కల్పించలేదు. నెల రోజుల క్రితం గాంధీ ఆస్పత్రికి వెళ్లిన మంత్రి దామోదర దృష్టికి ఈ విషయాన్ని అధికారులు తీసుకొచ్చారు. దీంతో ఆయన ఎంబ్రయాలజిస్ట్‌ను నియమించాలని, అవసరమైన పరి కరాలు, మెడిసిన్ కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్య తీవ్రత దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ఫర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలను అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. -
వైద్య, ఆరోగ్యశాఖలో మరో 371 పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలో కొలువుల జా తర కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 7,300 పోస్టులను భర్తీ చేయగా...మరో 6,500 పో స్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మరో 272 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టులు, 99 ఫార్మసిస్ట్ (గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సరీ్వసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. గత నెల 18న విడుదల చేసిన 2,050 నర్సింగ్ ఆఫీ సర్ పోస్టులకు, ఈ 272 పోస్టులు అదనం అని నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో మొత్తం నర్సింగ్ ఖాళీల సంఖ్య 2,322కు పెరిగింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలవగా, ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు చివరి గడువుగా పేర్కొంది. నవంబర్ 23న ఆన్లైన్లో (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) రాత పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తంగా 732 ఫార్మసిస్ట్ పోస్టులు: గత నెల 24న 633 ఫార్మసిస్ట్(గ్రేడ్ 2) పోస్టులకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దరఖా స్తుల ప్రక్రియ మొదలైంది. ఇదే నోటిఫికేషన్‌కు అదనంగా మరో 99 పోస్టులను జత చేస్తున్నామని, మొత్తం పోస్టు ల సంఖ్య 732కు పెరిగిందని తెలుపుతూ శుక్రవారం బోర్డు ప్రకటించింది. ఈ పోస్టులకు అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇచి్చంది. నవంబర్ 30న ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. జోన్లు, కేటగిరీలవారీగా ఖాళీల సం ఖ్యను బోర్డు వెబ్సైట్ https://mhsrb.telangana.gov. in/MHSRB/home.htm లో అందుబాటులో ఉంచారు. -
దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదు
తిరువనంతపురం: ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్ (ఎంపాక్స్) భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది. ఎర్నాకుళం జిల్లాలో ఈ కేసు వెలుగుచూసినట్లు శుక్రవారం ఆ రాష్ట్ర వైద్య శాఖ ధ్రువీకరించింది. కేరళ ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం. .ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల్లోమంకీపాక్స్ ఉన్నట్లు నిర్ధారించారు. వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తేలింది. బాధితుడికి సోకిన ఎంపాక్స్ వైరస్ జాతి ఇంకా వెలుగులోకి రాలేదు. అంతకుముందు సెప్టెంబర్ 18 న, యూఏఈ నుండి ఇటీవల కేరళ మలప్పురం జిల్లాకు వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో అతడికి వైద్య పరీక్షలు చేయగా పాజిటీవ్ వచ్చింది. దీంతో కేరళలో తొలి మంకీ పాక్స్ కేను నిర్ధారణైంది. తాజాగా రెండో కేసు నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. మంకిపాక్స్ కేసులు నమోదు దృష్ట్యా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.చదవండి : మంకీపాక్స్ వైరస్ లక్షణాలు -
1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: వైద్య,ఆరోగ్యశాఖలో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్విసెస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు బోర్డు సభ్యకార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి ఆ వివరాలు వెల్లడించారు. అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అక్టోబర్ ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు గడువు విధించారు. దరఖాస్తులో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని ఎడిట్ చేసుకునేందుకు అదే నెల ఐదో తేదీ నుంచి ఏడో తేదీ వరకు అవకాశం కల్పించారు. నవంబర్ 10వ తేదీన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఉంటుందని గోపీకాంత్‌రెడ్డి వెల్లడించారు. వయో పరిమితి 46 సంవత్సరాలుగా పేర్కొన్నారు. అభ్యర్థులు ఎక్కువగా ఉంటే రాత పరీక్షలు రెండు, మూడు సెషన్లో నిర్వహిస్తారు. పరీక్ష పేపరు ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. » మొత్తంగా 1,284 పోస్టులుండగా, అందులో 1,088 ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) విభాగంలో, మరో 183 తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో, మరో 13 హైదరాబాద్ ఎంఎన్‌జే ఆస్పత్రిలో ఉన్నాయి. » ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ), వైద్య విధాన పరిషత్ విభాగంలోని పోస్టులకు పేస్కేల్ రూ.32,810– రూ.96,890. » ఎంఎన్‌జే ఆస్పత్రిలోని పోస్టులకు పేస్కేల్ రూ.31,040–రూ.92,050. ముఖ్యాంశాలు...»అన్ని పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల పరీక్ష కేంద్రాలుంటాయి. హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట. » ఆన్లైన్ పరీక్ష ఫీజు రూ.500, ప్రాసెసింగ్ ఫీజు రూ.200 » మెరిట్ జాబితాను బోర్డు వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. » విద్యార్హతలు: అభ్యర్థులు ల్యాబ్ టెక్నిïÙయన్ కోర్సు చేసి ఉండాలి. ఎంఎల్ ఒకేషనల్, ఇంటర్మీడియట్లో ఎంఎల్ ఒకేషనల్ చేసి ఒక ఏడాది క్లినికల్ శిక్షణ పొందిన వారూ అర్హులే. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నిïÙయన్ కోర్సు(డీఎంఎల్డీ), బీఎస్సీ (ఎంఎల్), ఎంఎస్సీ (ఎంఎల్టీ), డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ (క్లినికల్ పాథాలజీ) టెక్నిïÙయన్ కోర్సు, బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యా»ొరేటరీ టెక్నాలజీ(బీఎంఎల్టీ) పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యా»ొరేటరీ టెక్నాలజీ, పీజీ డిప్లొమో ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ, బీఎస్సీ(మైక్రోబయాలజీ), ఎంఎస్సీ (మైక్రోబయాలజీ) ఎంఎస్సీ ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీ ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ ఇన్ బయోకెమిస్ట్రీ చేసినవారు ఈ పోస్టులకు అర్హులు » పోస్టుల నియామక ప్రక్రియ వంద పాయింట్ల ప్రాతిపదికగా భర్తీ చేస్తారు. రాత పరీక్షకు 80 మార్కులు, మిగిలినవి వెయిటేజీ కింద కలుపుతారు. అభ్యర్థులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తే వెయిటేజీ కింద 20 పాయింట్లు కేటాయిస్తారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో కనీసం ఆరు మాసాలకు పైగా వైద్యసేవలందిస్తే 2.5 పాయింట్లు కేటాయిస్తారు. గిరిజనేతర ప్రాంతాల్లో అయితే ప్రతీ ఆరు నెలలకు 2 పాయింట్లు ఇస్తారు. కనీసం ఆరు నెలలు పనిచేస్తేనే వెయిటేజీ మార్కులొస్తాయి. » నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి వెయిటేజీ కటాఫ్ తేదీగా నిర్ణయించారు. » కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ అభ్యర్థులు అనుభవపూర్వక ధ్రువీకరణపత్రాన్ని వారు విధులు నిర్వర్తిస్తున్న ఆస్పత్రుల నుంచే తీసుకోవాలి. » మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఠీఠీఠీ.ఝజిటటb. ్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను సందర్శించాలి. -
నైట్ పెట్రోలింగ్ ఉండాలి
న్యూఢిల్లీ: కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై రేప్, హత్య ఘటనసహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందిపై లైంగికదాడుల ఘటనలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. వైద్య సిబ్బంది భద్రతకు ఆస్పత్రుల్లో అమలుచేయాల్సిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం బుధవారం జారీచేసింది. బుధవారం వర్చువల్ విధానంలో జరిగిన నేషనల్ టాస్క్ ఫోర్స్ భేటీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర, ప్రధాన కార్యదర్శలు, డీజీపీలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భేటీలో సూచించిన మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి..→ పెద్ద ఆస్పత్రుల్లో జనం పెద్దగా తిరగని చోట్ల, చీకటి ప్రాంతాలు, మూలగా ఉండే చోట్ల సీసీటీవీలు బిగించాలి→ ఆస్పత్రుల్లో భద్రతపై జిల్లా కలెక్టర్లు, డీఎస్పీలు, జిల్లా ఆస్పత్రి యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్ష జరిపి తగు సెక్యూరిటీ ఏర్పాట్లు చూసుకోవాలి→ సెక్యూరిటీ, ఇతర సిబ్బందిని భద్రతా తనిఖీలు చేయాలి→ రాత్రుళ్లు అన్ని ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో సెక్యూరిటీ పెట్రోలింగ్ తరచూ జరుపుతుండాలి→ పెద్ద జిల్లా ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటుచేయాలి. సీసీటీవీలను ఎప్పటికప్పుడు చెక్చేస్తూనే డాటాను కూడా తరచూ బ్యాకప్ తీసుకోవాలి→ అత్యవసర కాల్స్‌కు స్పందించి కంట్రోల్ రూమ్, సెక్యూరిటీ, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలి. కాంట్రాక్ట్ సెక్యూరిటీ సిబ్బంది శారీరకదారుఢ్యం మెరుగు కోసం వారికి శిక్షణ ఇప్పించాలి→ రోగులను స్ట్రెచర్, ట్రాలీ, చక్రాల కుర్చీల్లోకి మారుస్తూ ఎక్కువ మంది బంధువులు ఆస్పత్రుల్లో పోగుబడుతున్నారు. వీరి సంఖ్యను తగ్గించేందుకు ఆస్పత్రులే ఈ పనులకు తగు సిబ్బందిని నియమించాలి→ వైద్యారోగ్య సిబ్బంది రక్షణ కోసం ఉన్న భారతీయ న్యాయ సంహిత చట్టాలు, వారిపై దాడులకు పాల్పడితే బాధ్యులకు విధించే శిక్షలకు సంబంధించిన వివరాలను ఆసుపత్రి ప్రాంగణంలో స్పష్టంగా ప్రదర్శించాలి→ తమ రాష్ట్రాల్లో హెల్ప్‌లైన్ నంబర్లు 100, 112 ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని చాలా రాష్ట్రాలు స్పష్టంచేశాయి.→ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో వైద్య సిబ్బంది రక్షణ కోసం మెరుగైన విధానాలు అమల్లో ఉన్నాయని ఆయా రాష్ట్రాలను కేంద్రం మెచ్చుకోవడం విశేషం. -
మళ్లీ ‘ప్రజాపాలన’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరోమారు ‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డులు జారీ చేయడమే ఎజెండాగా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి పది రోజుల పాటు రాష్ట్రమంతటా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించాలని, తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఇక నుంచి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు లింకు ఉండదని, వేర్వేరుగా రెండు కార్డులు జారీ చేస్తామని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17 నుంచి నిర్వహించే ప్రజాపాలనలో ఇదే ఎజెండాగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి అవసరమైన వివరాలు సేకరించాలని.. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణాల్లోని ప్రతి వార్డులో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డిజిటల్ హెల్త్ కార్డుల విషయంలో ఫ్రాన్స్‌లో ఉత్తమమైన విధానాన్ని అనుసరిస్తున్నారని ఇటీవల విదేశాల పర్యటనకు వెళ్లినప్పుడు తనను కలిసిన ప్రతినిధులు చెప్పారని.. అక్కడ అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇకపై రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్యసేవలతోపాటు సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా అందించే సాయానికి ఈ డిజిటల్ హెల్త్ కార్డే ప్రామాణికంగా ఉంటుందని చెప్పారు. సీజనల్ వ్యాధులపై ప్రత్యేక కార్యాచరణ రాష్ట్రంలో డెంగీ, చికెన్‌గున్యా, ఇతర వైరల్ జ్వరాల కేసులు పెరుగుతున్న అంశంపై సమావేశంలో సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలన కోసం ఫాగింగ్, రసాయనాల స్ప్రే వంటి కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలని, ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని సూచించారు. పనిచేయని ఉద్యోగులు, ప్రజల ఆరోగ్యం పట్ల ఉదాసీనంగా వ్యవహరించే సిబ్బందిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారంతో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కలి్పంచాలని సూచించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకోవాలని ఆదేశించారు. డెంగీ, చికెన్‌గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి అవసరమైన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులకు సూచించారు. -
దయచేసి విధుల్లో చేరండి.. వైద్యులను కోరిన కేంద్ర ఆరోగ్యశాఖ
సాక్షి, ఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీ కార్ ఆసుపత్రి ఘటన కారకులపై చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో, వైద్యసేవలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ స్పందిస్తూ.. వైద్యులు తమ ఆందోళనను విరమించాలని కోరింది.వివరాల ప్రకారం.. ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనకు నిరసనగా దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయి. వైద్యులు ఆసుపత్రుల్లో వైద్యసేవలను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో వైద్యులు తమ ఆందోళన విరమించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది. ఈ సందర్భంగా హెల్త్ కేర్ ప్రొఫెషనల్ భద్రతకు తగిన చర్యలు చేపడతామని కేంద్రం హామీ ఇచ్చింది. అలాగే, వైద్యుల భద్రతకు కమిటీని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించింది. #WATCH | Doctors stage a protest at Delhi’s Lady Hardinge Medical College against the rape-murder incident at Kolkata's RG Kar Medical College and Hospital pic.twitter.com/yf06mkCSpj— ANI (@ANI) August 17, 2024 ఇదే సమయంలో వైద్య రంగానికి సంబంధించిన అన్ని వర్గాలతో సంప్రదించి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సిఫారసు చేయనుంది. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేసింది. -
ప్రిస్క్రిప్షన్ బాగు.. బాగు..
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖకు 2024–25 బడ్జెట్లో రూ.90,958.63 కోట్లను కేటాయించారు. ఇది 2023–24 సవరించిన అంచనాల కంటే (రూ.80,517.62 కోట్లు) 12.96 శాతం ఎక్కువ కావడం గమనార్హం. అలాగే ఈ బడ్జెట్లో కేన్సర్ చికిత్సకు ఉపయోగించే మూడు కీలక మందుల (ట్రాస్తుజుమబ్ డెరక్స్‌టెకన్, ఒసిమెర్టినిబ్, డుర్వాలుమాబ్)పై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ‘కేన్సర్ రోగులకు ఉపశమనం ఇచ్చేందుకు మరో మూడు మందులపై కస్టమ్స్ డ్యూటీని మినహాయిస్తున్నాం. అలాగే ఎక్స్‌రే ట్యూబ్స్, మెడికల్ ఎక్స్‌రే మిషన్లలో వాడే ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ)లో మార్పులు చేస్తున్నాం’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖకు గత ఏడాది రూ.3వేల కోట్లు ఇవ్వగా, ఈసారి 3,712.49కోట్లకు పెంచారు. ఆరోగ్య శాఖకు కేటాయించిన మొత్తం రూ.90,958.63 కోట్లలో రూ.87,656.90 కోట్లను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు, ఆరోగ్య పరిశోధన విభాగానికి రూ.3,301.73 కోట్లను కేటాయించారు. గత ఏడాది ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.77,624.79 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.100కోట్ల మేర పెరగడం విశేషం. కేంద్ర ప్రాయోజిత పథకాలైన జాతీయ ఆరోగ్య మిషన్‌కు కేటాయింపులు గత ఏడాది రూ.31,550.87 కోట్లు ఉండగా, ఈసారి అది 36,000 కోట్లకు పెరిగింది. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం జేఏవై)కి కేటాయింపులు రూ. 6,800 కోట్ల నుంచి రూ.7,300 కోట్లకు పెరగడం గమనార్హం. జాతీయ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్‌కు కేటాయింపులను రూ.65 కోట్ల నుంచి రూ.90 కోట్లకు పెంచారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌కు గత ఏడాది మాదిరే రూ.200 కోట్లు కేటాయించారు. స్వయంప్రతిపత్తి విభాగాలకు గత ఏడాది (రూ.17,250.90) కేటాయించిన దాని కంటే స్వల్పంగా పెంచుతూ రూ.18,013.62 కోట్లు కేటాయించారు. ఢిల్లీ ఎయిమ్స్‌కు గత ఏడాది రూ.4,278 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్లో రూ.4,523 కోట్లు ఇచ్చారు. భారత మెడికల్ కౌన్సిల్‌కు గత ఏడాది రూ.2295.12 కోట్ల ఇవ్వగా ఈసారి రూ.2,732.13 కోట్లు కేటాయించారు.మూడు కేన్సర్ మందులు 20% మేర తగ్గుతాయికేన్సర్ చికిత్సలో వాడే మూడు రకాల మందులపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించడంపై ఆరోగ్యరంగ నిపుణులు హర్షం వ్యక్తంచేశారు. ఈ సుంకం తగ్గింపు వల్ల మందుల ధరలు 10–20 శాతం మేర తగ్గుతాయని ఢిల్లీలోని సీకే బిర్లా ఆస్పత్రికి చెందిన సర్జికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ మన్దీప్ సింగ్ మల్హోత్రా చెప్పారు. అయితే, ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతానికి పెంచాలన్న సుదీర్ఘ డిమాండ్‌ను ఈ బడ్జెట్ కూడా నెరవేర్చకపో వడంపై నిపుణులు పెదవి విరుస్తున్నారు. -
రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీకి లింకు పెట్టొద్దు: సీఎం రేవంత్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ మంగళవారం సమావేశమయ్యారు. ప్రజా పాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్ వ్యవసాయం, ప్రజారోగ్యం- సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, ఎడ్యుకేషన్, లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ నిర్మూలనపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సదస్సుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు హాజరయ్యారు.అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందాలి: సీఎంకలెక్టర్ల సమీక్షలో ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని స్పష్టం చేశారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందన్న సీఎం.. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.ఆసుపత్రుల్లో ప్రతీ బెడ్‌కు ఒక సీరియల్ నెంబర్గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతీ బెడ్‌కు ఒక సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలని పేర్కొన్నారు.‘డిసెంబర్ 24, 2023న కలెక్టర్లతో మొదటిసారి సమావేశం నిర్వహించాం. ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని ఆ సమావేశంలో ఆదేశించాం.ఎన్నికల కోడ్ ముగియగానే పారదర్శకంగా కలెక్టర్ల బదిలీలు నిర్వహించాం. ప్రభుత్వానికి కళ్లు,చెవులు మీరే.. కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినవారు ఉన్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే మీరు ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారు. తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో మీ నిర్ణయాలు ఉండాలి. ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా పనిచేయాలిఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా మీరు పనిచేయాలి. క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోండి. కేవలం ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా ఎలాంటి సంతృప్తి ఉండదు.మీ ప్రతీ చర్య ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలి. ఈ ప్రజా ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలి. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపైనే ఉంది. కలెక్టర్లు క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందే. ప్రతీ పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతీ నెలా రూ.85వేలు ఖర్చు పెడుతోంది.ప్రజా ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కల్పించాలి: సీఎంతెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకం.విద్యావ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు బదిలీ అయితే.. విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుడిలా స్పందించారు. కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా మీ పనితనం ఉండాలి. ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత మీపైనే ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు విశ్వాసం కల్పించాలి. -
యూపీలో మహిళా చోరులు!
లక్నో: ముసుగులు ధరించిన మహిళలు ఆయుధాలు చేతబూని భారీ దొంగతనానికి పూనుకున్నారు. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి దర్జాగా ప్రవేశించి కేవలం 50 నిమిషాల్లో ఉన్నదంతా ఊడ్చేసి గోతాముల్లో నింపుకుని వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. ఈ నెల ఏడో తేదీన తెల్లవారుజామున 3 గంటలకు ఆషియానా పోలీస్‌స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ సందీప్ గులాటి ఇంట్లో ఈ మహిళా దొంగలు చొరబడ్డారు. ఒకరిద్దరు ఆయుధాలతో బయట కాపలాగా ఉండిపోగా మిగతా వారు ఇంట్లో సీలింగ్ ఫ్యాన్లు సహా ప్రతి వస్తువు తీసుకుని ఐదు బస్తాల నిండా దర్జాగా నింపుకుని నెమ్మదిగా వెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
ఏపీ వైద్య రంగం పై రామోజీ తప్పుడు వార్తలు
-
భారీగా ‘బ్యాక్లాగ్’! ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మిగిలిపోతున్న పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న నియామక సంస్థలకు బ్యాక్లాగ్ తిప్పలు పట్టుకున్నాయి. ఒకే సమయంలో భారీగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియలు చేపడుతుండటంతో.. గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. పోటీ పరీక్షల కోసం పకడ్బందీగా సిద్ధమవుతున్న చాలా మంది అభ్యర్థులు.. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారు. వాటిలో ఒకదానిని ఎంచుకోవడంతో మిగతా ఉద్యోగాలు ఖాళీగా మిగిలిపోతున్నాయి. ఉద్యోగ నియామక సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం, వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల కౌన్సెలింగ్‌ను ఒకే సమయంలో నిర్వహించడం వంటివి దీనికి కారణమవుతున్నాయి. ఉద్యోగాలకు ఎంపికైనవారు వాటిని వదులుకుంటే.. తర్వాతి మెరిట్ అభ్యర్థులకు కేటాయించే పరిస్థితి (రిలిక్విష్ మెంట్) లేకపోవడం కూడా సమస్యకు దారితీస్తోంది. ఇలా మిగిలిపోయిన ఉద్యోగాలకు మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసి, భర్తీ ప్రక్రియ చేపట్టాల్సి వస్తోంది. ఇటీవల భర్తీ చేసిన గురుకుల కొలువులు, పోలీస్ కానిస్టేబుల్, స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్ తదితర కేటగిరీ ఉద్యోగాల్లో సుమారు 10శాతానికిపైగా ఇలా మిగిలిపోవడం గమనార్హం. 33వేల కొలువుల్లో.. 4,590 ఉద్యోగాలు ఖాళీ.. రాష్ట్రంలో గత మూడు నెలల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో 33 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగింది. ఇందులో 4,590 ఉద్యోగాలు మిగిలిపోయినట్టు నియామక సంస్థల ప్రాథమిక గణాంకాలు చెప్తున్నాయి. ఉద్యోగులంతా పూర్తిస్థాయిలో విధుల్లో చేరితే ఇందుకు సంబంధించి మరింత స్పష్టత రానుంది. గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు పరిధిలో ఇప్పటివరకు 8.820 ఉద్యోగాల భర్తీ చేపట్టగా.. ఏకంగా 1,810 ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలినట్టు సమాచారం. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఇటీవల చేపట్టిన 15,644 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో దాదాపు 2వేల ఉద్యోగాలు భర్తీ కాలేదు. ఇక మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7 వేల స్టాఫ్ నర్సు, 1,150 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయగా.. వీటిలోనూ 780 ఉద్యోగాలు మిగిలిపోయాయి. రిలిక్విష్మెంట్ లేకపోవడంతో.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఉద్యోగ ఖాళీల భర్తీలో రిలిక్విష్మెంట్ విధానాన్ని అనుసరించారు. అంటే ఏదైనా నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రకటించిన ఖాళీలు పూర్తిస్థాయిలో భర్తీ కాకుంటే.. అందులోని తర్వాతి మెరిట్ అభ్యర్థులతో భర్తీచేసేందుకు వీలు ఉండేది. 2018 వరకు ఈ విధానాన్ని అనుసరించారు. కానీ ఈ విధానంలో పారదర్శకత లోపించిందంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, దానికితోడు ఇతర కారణాలతో రిలిక్విష్మెంట్ విధానాన్ని పక్కనబెట్టారు. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చాక జారీ అయిన నోటిఫికేషన్లలో రిలిక్విష్మెంట్ అంశాన్ని జతచేయలేదు. అంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎన్ని పోస్టులు మిగిలినా అదే నోటిఫికేషన్ కింద భర్తీ చేసే అవకాశం లేదు. ఇటీవల రిలిక్విష్మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి, నిబంధనలపై చర్చించినా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా భర్తీ ప్రక్రియలో బ్యాక్లాగ్ ఖాళీలు మిగిలిపోతున్నాయి. వాటిని భర్తీ చేయాలంటే మళ్లీ కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయాల్సిందేనని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం నియామకాల ప్రక్రియలు ఇంకా కొనసాగుతుండటంతో.. నోటిఫికేషన్ల వారీగా ఏర్పడే ఖాళీలపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. -
త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు కొత్తగా కార్డులివ్వాలని నిర్ణయించింది. ప్రతి కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని యూనిక్ నంబర్‌తో కార్డులు ఇవ్వనుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఒక్కో సబ్ నంబర్ ఇస్తారు. ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్‌కు లింక్ చేసి, స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను తయారు చేస్తారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు కసరత్తు చేస్తోంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు కొందరు పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. అంతేకాకుండా అనేకమంది తెల్ల రేషన్‌కార్డును ఆధారం చేసుకొనే ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింకు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల జారీ అంశంపై ఆరోగ్యశ్రీ ట్రస్టు దృష్టిసారించింది. ఈ మేరకు లబ్దిదారుల గుర్తింపుపై మార్గదర్శకాలు రూపొందిస్తోంది. అందరికీ ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ.1,100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందరికీ వర్తింప చేయడం వల్ల అదనంగా రూ.400 కోట్ల భారం పడే అవకాశం ఉందని, ఇది పెద్ద భారం కాదన్న భావనలో సర్కారు ఉంది. మధ్యతరగతి ప్రజల్లో చాలామందికి, ఉద్యోగులకు, ఇతరులకు పలు పథకాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఆరోగ్య బీమాతో ఆరోగ్య సేవలు పొందుతున్న వారూ చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కార్డులతో అందరికీ సార్వజనీన ఆరోగ్య సేవలు అందించవచ్చని సర్కారు యోచిస్తోంది. వంద శస్త్రచికిత్సలు చేర్చే అవకాశం రాష్ట్రంలో 293 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు, 198 ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే గత ఏడాది 809 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లోనూ ఆరోగ్యశ్రీ కింద సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తంగా రాష్ట్రంలో 1,310 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి అర్హులుగా 77.19 లక్షల మంది పేదలు ఉన్నారు. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని కూడా ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈజేహెచ్ఎస్ కిందకు వస్తారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 1,376 శస్త్రచికిత్సలు, 289 వైద్య సేవలున్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద 1,949 వ్యాధులకు వైద్యం అందుతోంది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌లో ఈ రెండింటిలో ఉన్న వ్యాధులను కలిపి అమలు చేస్తున్నారు. వీటికి సుమారు మరో వంద శస్త్రచికిత్సలను చేర్చే అవకాశం ఉంది. ఒక్కో కుటుంబానికి 10 లక్షల కవరేజీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్రం 2022లో ప్యాకేజీలను సవరించింది. గతంలో ఆరోగ్యశ్రీ కింద కవరేజీ రూ. 2 లక్షలు ఉండగా, ఆయుష్మాన్ భారత్ పథకం రావడంతో దాన్ని రూ. 5 లక్షలు చేశారు. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రూ.10 లక్షలు చేసిన సంగతి తెలిసిందే. ఏడాదికి ఈ పథకాల కింద ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల వరకు కవరేజీ వర్తిస్తుంది. దీనికి ప్యాకేజీ సొమ్ము కూడా పెంచితే ఏటా రూ.1,500 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈహెచ్ఎస్ పథకంపై తేలని నిర్ణయం ఈహెచ్ఎస్ పథకంపై ఉద్యోగులు కంట్రిబ్యూషన్ ఇస్తామని పేర్కొన్న సంగతి విదితమే. గత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ) ఏర్పాటు చేసి అమలు చేయాలని నిర్ణయించింది. పథకం అమలుకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత మొత్తాన్ని, అంతే మొత్తంలో ప్రతి నెలా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా జమ చేయాలని పేర్కొన్నది. ఈ మేరకు తమ మూల వేతనంలో ఒక శాతం కాంట్రిబ్యుషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేశాయి. ఆసుపత్రుల్లో తమకు వైద్యం అందనందున ఈ ప్రక్రియకు ఉద్యోగులు కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల బకాయిల చెల్లింపునకు ఏర్పాట్లు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రం ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం చేయడంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. బ కాయిలు పేరుకుపోవడంతో పాటు ఆరో గ్యశ్రీ కింద ఆసుపత్రులకు ఇచ్చే ప్యాకేజీ సొమ్ము సరిపోవడం లేదని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నా యి. దీంతో ఆరోగ్యశ్రీ లబ్దిదారులు, ఈ హెచ్ఎస్ బాధితులు డబ్బులు చెల్లించి వైద్యం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా తర్వాత అనారోగ్య సమస్యలు పెరగడంతో చాలామంది ప్రైవేట్ ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. ఉద్యోగులైతే రీయింబర్స్మెంట్ పద్ధతిలో ముందుగా డబ్బులు చెల్లించి వైద్యం పొందుతున్నా రు. అయితే బిల్లుల సొమ్ము మాత్రం పూ ర్తి స్థాయిలో రావడంలేదని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. పెద్దఎత్తున బిల్లులు పే రుకుపోవడం వల్లే తాము వైద్యం అందించలేకపోతున్నామని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు నెట్వర్క్ ఆసుపత్రుల లెక్క ప్రకా రం దాదాపు రూ.500 కోట్లు ఆరోగ్యశ్రీ నుంచి తమకు రావాల్సిన బిల్లుల బకా యిలు పెండింగ్‌లో ఉన్నాయని అంటున్నాయి. మరోవైపు వివిధ వ్యాధులకు 2013లో నిర్ధారించిన ప్యాకేజీ ప్రకారమే ఆసుపత్రులకు సొమ్ము అందుతోంది. అంటే తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటివరకు ఒక్కసారి కూడా వ్యాధులు, చికిత్సలకు ప్యాకేజీ సవరణ జరగలేదు. ఈ రెండు కారణాల వల్ల తాము ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ పథకాల కింద వైద్యం చేయలేకపోతున్నామని ఆసుపత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
చింతలపూడి వంద పడకల ఆసుపత్రి పనులు వేగవంతం
-
‘నాట్కో’ ట్రస్ట్‌తో ప్రభుత్వం ఎంవోయూ
సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్: క్యాన్సర్ రోగులకు ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గుంటూరు జీజీహెచ్‌లోని నాట్కో సెంటర్‌ను లెవల్–1 క్యాన్సర్ సెంటర్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీన్లో భాగంగా నాట్కో సెంటర్లో ప్రస్తుతం ఉన్న 100 పడకలకు అదనంగా మరో 100 పడకలతో బ్లాక్ నిర్మాణానికి ‘నాట్కో’ ఫార్మా సంస్థ వైద్య, ఆరోగ్య శాఖతో ఎంవోయూ కుదుర్చుకుంది. మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు సమక్షంలో డీఎంఈ డాక్టర్ నరసింహం, నాట్కో ఫార్మా వ్యవస్థాపకుడు, నాట్కో ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ వి.సి.నన్నపనేని మంగళవారం ఎంవోయూ చేసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ.. ఈ సెంటర్లో రేడియేషన్, మెడికల్, సర్జికల్ వంటి అన్ని రకాల విభాగాల్ని ఏర్పాటు చేయడం ద్వారా క్యాన్సర్ రోగులకు సమగ్ర చికిత్స అందుతుందని వివరించారు. క్యాన్సర్ చికిత్స నిర్ధారణ కోసం అవసరమైన పెట్, సిటి మెషిన్ కొనుగోలుకు కూడా టెండర్లు పిలిచామని తెలిపారు. ఈ సెంటర్లో శిక్షణ పొందిన నర్సులు మాత్రమే పని చేసే విధంగా 30 ప్రత్యేక పోస్టులతో కలిపి మొత్తం 120 పోస్టుల్ని మంజూరు చేశామన్నారు. వి.సి. నన్నపనేని మాట్లాడుతూ సుమారు 35 వేల చదరపు అడుగుల్లో అదనంగా 100 పడకల క్యాన్సర్ బ్లాక్ నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని తెలిపారు. నాట్కో క్యాన్సర్ సెంటర్లోని రోగులకు ఉచిత మందుల పంపిణీలో భాగంగా ఈ త్రైమాసికానికి రూ.60 లక్షల విలువైన మందుల్ని కృష్ణబాబుకు ఆయన అందజేశారు. కార్యక్రమంలో నాట్కో ఫార్మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు, క్యాన్సర్ సెంటర్ సమన్వయకర్త యడ్లపాటి అశోక్‌కుమార్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. -
వైద్యశాఖలో ఉద్యోగాల పండుగ
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆస్పత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓవైపు ఈ పోస్టుల భర్తీ కొనసాగుతుండగానే మరోవైపు 253 వైద్య పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 234 పోస్టులు నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలో ఉన్నాయి. మరో 19 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో భర్తీ చేయనున్నట్టు రిక్రూట్మెంట్ బోర్డ్ సభ్య కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. 11 స్పెషాలిటీల్లో 19 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విమ్స్‌లో వాక్ ఇన్ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నారు. అర్హులైన వైద్యులు నేరుగా హాజరు కావాలి. బ్రాడ్ స్పెషాలిటీల్లో నెలకు రూ.92 వేలు, సూపర్ స్పెషాలిటీల్లో నెలకు రూ.1.60 లక్షలు చొప్పున వేతనాలు ఇస్తారు. 7 వరకు దరఖాస్తులకు అవకాశం కాగా ఎన్హెచ్ఎం పరిధిలో 234 స్పెషలిస్ట్ వైద్య పోస్టులకు http://apmsrb.ap.gov.in/msrb/ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 7 వరకు గడువు ఉంది. ఓసీలు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్ వర్గాలకు చెందినవారు రూ.500 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఉద్యోగాలకు ఎంపికైనవారికి మైదాన ప్రాంతాల్లో అయితే నెలకు రూ.1.10 లక్షలు, గిరిజన ప్రాంతాల్లో అయితే రూ.1.40 లక్షలు చొప్పున వేతనాలు ఇస్తారు. దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే అభ్యర్థులు 7416664387/8309725712 నంబర్లను సంప్రదించవచ్చు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా ఎప్పటికప్పుడు ఖాళీలను వైఎస్ జగన్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తోంది. ఈ క్రమంలో 2019 నుంచి ఇప్పటివరకు ఏకంగా 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టింది. అంతేకాకుండా వైద్య శాఖలో నియామకాల కోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డ్‌ను సైతం ఏర్పాటు చేసింది. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా బోర్డుకు అత్యవసర అనుమతులు ఇచ్చింది. దీంతో గతంలో ఎన్నడూలేని విధంగా వైద్య శాఖలో పోస్టుల భర్తీ కొనసాగుతోంది. -
ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
-
ఏపీ సర్కార్‌పై కేంద్రమంత్రి ప్రశంసలు
సాక్షి, విజయవాడ: నగరంలోని పాత ప్రభుత్వాసుపత్రిలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం పర్యటించారు. ఓల్డ్ జీజీహెచ్‌లో రూ.25 కోట్లతో నిర్మించనున్న క్రిటికల్ కేర్ బ్లాక్, బీఎస్ఎల్-3 ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొత్తగా 1.25 కోట్లతో నిర్మించిన ఐపీహెచ్ఎల్ ల్యాబ్స్‌ను కేంద్రమంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ, ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు చాలా బాగుందని ప్రశంసించారు. ఆరోగ్య రంగంలో ఏపీకి పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతోనే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఏపీ ప్రభుత్వం హెల్త్ సెక్టార్‌పై ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమన్నారు. సీఎం జగన్‌కి, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనికి కేందమంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ‘‘ప్రజల ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రధాని మోదీ హెల్త్ సెక్టార్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా 1.70 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను నిర్మించాం. గత తొమ్మిదేళ్లలో 350 కి పైగా కొత్త మెడికల్ కళాశాలలనుప్రదాని మోదీ నిర్మించారు. గ్రామీణ స్ధాయిలో హెల్త్ వెల్ నెస్ సెంటర్లని జిల్లా ఆసుపత్రులు, ఎయిమ్స్ లాంటి సంస్ధలతో అనుసంధానం చేశాం. గ్రామీణ ప్రాంతవాసులకు స్పెషలిస్ట్ సేవలు టెలీ కన్సల్టేషన్ ద్వారా ఉచితంగా అందిస్తున్నాం. ప్రతీ రోజూ 4 లక్షల వరకు టెలీ కన్సల్టేషన్ సేవలు అందిస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందిస్తున్నాం’’ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఇదీ చదవండి: అందుకేనట బాబు రహస్య మంతనాలు! -
శానిటరీ నాప్కిన్ల పంపిణీలో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: ఆడబిడ్డల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ వారిపట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్ధ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మెన్స్ట్రువల్ హైజీన్ (నెలసరి పరిశుభ్రత) కార్యక్రమం అమలులో ఏపీ దేశంలోనే అగ్రగామిగా ఉంటోంది. ఈ అంశాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ లోక్‌సభలో వెల్లడించింది. నెలసరి సమయంలో స్కూళ్లు, కాలేజీల్లో చదివే విద్యార్థినులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ద్వారా శానిటరీ నాప్కిన్లను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇలా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు మధ్య 72.59 లక్షల నాప్కిన్లను పంపిణీ చేసి పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉండగా.. 59,63,209 శానిటరీ నాప్కిన్ల పంపిణీతో ఏపీ రెండో స్థానంలో ఉంది. అనంతరం.. 45.86 లక్షలతో తమిళనాడు మూడో స్థానంలో నిలిచింది. ఇక కేరళలో 80,166, కర్ణాటకలో కేవలం 5,613, తెలంగాణలో 3,920 మాత్రమే పంపిణీ చేశారు. కేటాయించిన నిధుల ఖర్చులో నెంబర్ వన్.. ఇక నెలసరి పరిశుభ్రత కార్యక్రమాలు అమలుచేయడం ద్వారా భవిష్యత్తులో బాలికలు అనారోగ్య సమస్యల బారినపడకుండా నియంత్రించేందుకు కేటాయించిన నిధులను ఖర్చుచేయడంలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్ల మేర నిధులు కేటాయించడమే కాకుండా దేశంలోనే అత్యధికంగా వంద శాతం నిధులను ఖర్చుచేసింది. పశ్చిమ బెంగాల్లో రూ.389 కోట్లు కేటాయించగా కేవలం రూ.9.32 కోట్లు, తెలంగాణాలో రూ.303 కోట్లు కేటాయించినప్పటికీ రూ.4 లక్షలు మాత్రమే ఖర్చుచేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రతీనెలా 10 లక్షల మంది బాలికలకు.. నెలసరి ఇబ్బందులతో బాలికలు విద్యకు దూరమవుతున్న పరిస్థితులను సీఎం జగన్ ప్రభుత్వం గుర్తించింది. దేశంలో దాదాపు 23 శాతం బాలికల చదువులు ఆగిపోవడానికి ప్రధాన కారణం నెలసరి సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులేనని యునైటెడ్ నేషన్స్ వాటర్ సఫ్లై అండ్ శానిటేషన్ కొలాబరేటివ్ కౌన్సిల్ నివేదికల్లో వెల్లడించారు. ఈ తరహా డ్రాపౌట్స్‌ను తగ్గించడంతో పాటు, బాలికలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని 2021లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఏడు నుంచి ఇంటర్మిడియట్ చదువుతున్న 10 లక్షల మంది బాలికలకు ప్రతినెలా ఒకొక్కరికి 10 చొప్పున నాణ్యమైన, బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్లను ఉచితంగా అందిస్తున్నారు. ఇందుకోసం ఏటా ప్రభుత్వం రూ.30 కోట్ల మేర ఖర్చుచేస్తోంది. ప్రత్యేకంగా స్నేహపూర్వక కౌమార దశ క్లినిక్‌లు.. ఇక కౌమార దశలో బాలబాలికలకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యల నివృత్తికి, వారికి వైద్యసేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రత్యేకంగా స్నేహపూర్వక కౌమార క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. క్లినిక్‌లలో సేవలు అందించే వైద్యులు.. కౌమార దశ పిల్లలపట్ల ఏ విధంగా వ్యవహరించాలి.. తదితర అంశాలపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చారు. అంతేకాక.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గ్రామాలకు వెళ్లిన డాక్టర్లు మధ్యాహ్నం నుంచి పాఠశాలలు సందర్శించి అక్కడి బాలికల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఎదుగుతున్న సమయంలో శరీరంలో వచ్చే మార్పుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళా ఉపాధ్యాయులు, మహిళా అధ్యాపకులు, గ్రామ సచివాలయాల్లోని ఏఎన్ఎంలు ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అపరిశుభ్ర పద్ధతులతో సమస్యలు.. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థినుల్లో చాలావరకు మధ్యతరగతి, పేద కుటుంబాల వారుంటారు. వీరికి శానిటరీ నాప్కిన్లు కొనే ఆర్థిక స్థోమత ఉండదు. దీంతో.. ► నెలసరి సమయంలో వస్త్రాన్ని వాడే విధానాన్ని అపరిశుభ్ర పద్ధతిగా వైద్యులు చెబుతారు. ఇలా వాడటంతో రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్ఫన్లు (జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్లు–ఆర్టీఐ) వస్తాయి. ► అలాగే.. సాధారణంగా జననాంగంలో రక్షణకు అవసరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను స్రవించే లాక్టోబాసిల్లై అనే మంచి బ్యాక్టీరియాతో పాటు కొద్ది మోతాదులో వేరే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. వస్త్రం వంటి అపరిశుభ్రమైన పద్ధతులతో జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్ల ముప్పు ఏర్పడిన తర్వాత కాలంలో సంతానలేమి, శృంగారంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధులొస్తాయి. ► అంతేకాదు.. హానికరమైన బ్యాక్టీరియాతో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది. భవిష్యత్‌లో సంతానలేమి సమస్యలూ తలెత్తుతాయి. -
ఆరోగ్య రంగానికీ నియంత్రణలు!
న్యూఢిల్లీ: ఆరోగ్య పరిరక్షణ రంగానికి ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు.. అందరికీ ఆరోగ్య బీమా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక, ఆరోగ్య శాఖల మధ్య ఇందుకు ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్లు సంబంధిత ప్రభుత్వ అధికారులు ఇద్దరు తెలియజేశారు. అందరికీ ఆరోగ్య బీమా లక్ష్యాన్ని సాధించేందుకు మరింత సమర్ధవంత చర్యలకు తెరతీయవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య బీమాను అందుబాటులో అందరికీ అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ఇటీవల జాతీయ బీమా ఏజెన్సీ(ఎన్ఐఏ) వెలువరించిన నివేదిక ప్రకారం 40 కోట్లమందికిపైగా వ్యక్తులకు జీవిత బీమా అందుబాటులో లేదు. అంటే మొత్తం జనాభాలో మూడో వంతుకు బీమా అందడం లేదు. బీమా వ్యాప్తిలేకపోవడం, చాలీచాలని కవరేజీ, ఆరోగ్య పరిరక్షణా వ్యయాలు పెరిగిపోవడం ఇందుకు కారణాలుగా అధికారులు పేర్కొన్నారు. అయితే చికిత్సా వ్యయాలలో ప్రామాణికత, ఆరోగ్య క్లెయిములను పరిష్కారించడం తదితర అంశాలలో విభిన్న సవాళ్లు, అవకాశాలు ఉన్నట్లు వివరించారు. ఆరోగ్య రంగంలో తాజాగా ఏర్పాటు చేయతలపెట్టిన నియంత్రణ సంస్థ తప్పనిసరిగా వీటిని పరిష్కరించవలసి ఉంటుందని తెలియజేశారు. వెరసి సవాళ్ల పరిష్కార వ్యూహాలు, నియంత్రణ సంస్థ(హెల్త్ రెగ్యులేటర్) పాత్ర వంటి అంశాలపై చర్చించేందుకు ఆరోగ్య బీమా రంగ కంపెనీలతోపాటు.. సంబంధిత వ్యక్తులు, సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. అంతేకాకుండా హెల్త్ రెగ్యులేటర్.. ఆరోగ్య క్లెయిముల జాతీయ ఎక్సే్ఛంజీ(ఎన్‌హెచ్‌సీఎక్స్) పరిధిని విస్తరించడం, పరిశ్రమను మరింత సమర్ధవంతంగా పర్యవేక్షించే అధికారాలను కలిగి ఉండటం ముఖ్యమని మరో అధికారి వ్యాఖ్యానించారు. -
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ : పేదలకు ఆరోగ్యమస్తు
సాక్షి, అమరావతి: వైద్యం కోసం పేదలు ఏ ఒక్కరూ అప్పుల పాలు కాకూడదనే తాపత్రయంతో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేశామని, ఇది ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వమని, గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రభుత్వ వైద్య రంగం స్వరూపాన్ని మార్చామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స వ్యయం పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచుతూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులంటే సిబ్బంది ఉండరనే దుస్థితిని మన ప్రభుత్వం పూర్తిగా మార్చేసిందన్నారు. ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే 53,126 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్ లాంటి వైద్య సిబ్బందిని నియమించి మానవ వనరుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వాసుపత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61 శాతం ఉంటే మన రాష్ట్రంలో కేవలం 3.96 శాతం మాత్రమే ఉందని, ఈ కొరతను కూడా అధిగమించేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఇక జాతీయ స్థాయిలో నర్సుల కొరత 27 శాతం అయితే మన రాష్ట్రంలో సున్నా అని తెలిపారు. జాతీయ స్థాయిలో ల్యాబ్ టెక్నీషియన్ల కొరత 33 శాతం అయితే మన రాష్ట్రంలో సున్నా స్థాయికి తెచ్చామని, నూటికి నూరు శాతం పోస్టులను భర్తీ చేశామని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు పొందడానికి ఏం చేయాలి? ఎవరిని అడగాలి? ఎక్కడికి వెళ్లాలి? చికిత్స వ్యయం ఎంతవరకు వర్తిస్తుంది? తదితర సందేహాలను సంపూర్ణంగా నివృత్తి చేస్తూ సరికొత్త ఫీచర్లతో రూపొందించిన ఆరోగ్యశ్రీ కొత్త కార్డులను లబ్ధిదారులకు అందజేసి విస్తృత అవగాహన కల్పించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం జగన్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు, స్మార్ట్ కార్డుల పంపిణీ, లబ్దిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ కార్యక్రమాలను సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆ వివరాలివీ.. 4.25 కోట్ల మందికి ఆరోగ్య భరోసా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరింత మందికి ఆరోగ్యశ్రీ అందించాలనే ఉద్దేశంతో రూ.5 లక్షల వార్షికాదాయం ఉన్న ప్రతి కుటుంబాన్ని పథకం పరిధిలోకి తెచ్చాం. దీంతో 1.48 కోట్ల కుటుంబాలు పథకం పరిధిలోకి వచ్చాయి. తద్వారా 4.25 కోట్ల మందికి ఆరోగ్య భరోసా కల్పించాం. 2019 నాటికి ఆరోగ్యశ్రీలో కేవలం 1,059 ప్రొసీజర్లు మాత్రమే ఉండగా మనం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2,300 వరకు కొత్తగా పథకం పరిధిలోకి తెచ్చాం. అనంతరం మరికొన్ని చేర్చి ఇవాళ 3,257 ప్రొసీజర్లతో ఉచిత ఆరోగ్య సేవలను అందిస్తున్నాం. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటిన సందర్భాల్లో ఏ ఒక్కరూ ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నాం. గత సర్కారు హయాంలో అరకొర సేవలతో కేవలం 820 ఆస్పత్రులకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిమితమైంది. ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలతో కలిపి 2,513 ఆస్పత్రులకు సేవలను విస్తరించాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లోనూ 204 కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 716 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీని వర్తింపచేస్తున్నాం. ఆరోగ్య సంరక్షణకు రూ.14,439 కోట్లు గత సర్కారు ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ కోసం కేవలం రూ.5,171 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఏడాదికి రూ.1,034 కోట్లు మాత్రమే వెచ్చించిన దుస్థితి. 2014–19 మధ్య 108, 104 సేవల కోసం రూ.729 కోట్లు ఖర్చు చేశారు. మన ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కోసం ఏడాదికి సగటున రూ.4,100 కోట్లు వ్యయం చేస్తున్నాం. దీనికి అదనంగా ఏటా మరో రూ.300 కోట్లు 104, 108 సేవల కోసం ఖర్చు పెడుతున్నాం. ఆరోగ్యశ్రీ, 104, 108 కోసం గత సర్కారు రూ.5,900 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా మనం ఏటా ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరుస్తూ ఇప్పటికే రూ.14,439 కోట్లు వెచ్చించాం. గత సర్కారు హయాంలో 22.32 లక్షల చికిత్సలు అందించగా మన ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 2019 నుంచి ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీతో 53 లక్షల చికిత్సలు అందించగలిగాం. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ నాడు – నేడు ద్వారా పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రి వరకూ అన్ని స్థాయిల్లో సదుపాయాలు కల్పించాం. 2019కు ముందు రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా ఇవాళ కొత్తగా మరో 17 వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో నెలకొల్పుతున్నాం. గతంలో 104, 108 వాహనాలు ఎక్కడున్నాయో కూడా తెలియని దుస్థితి. నాడు 108 వాహనాలు కేవలం 336 మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఆదుకునేందుకు మొత్తం 2,204 వాహనాలను అందుబాటులో ఉంచాం. చికిత్సానంతరం ఆసరా.. ఆరోగ్యశ్రీ కింద పేదవాడికి ఉచిత వైద్యం అందించడమే కాకుండా చికిత్స అనంతరం వైద్యులు సూచించిన మేరకు విశ్రాంతి సమయంలో నెలకు రూ.5 వేలు చొప్పున, రెండు నెలలు అయితే రూ.10 వేలు పేదవాడి చేతిలో పెట్టి మరీ ఇంటికి పంపుతున్నాం. ఆరోగ్య ఆసరా కింద 25,27,870 మందికి రూ.1,309 కోట్లు అందించాం. లక్షలు ఖర్చయ్యే ప్రాణాంతక వ్యాధులకూ.. గతంలో ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ లాంటి రోగాలకు చికిత్స ఖర్చు రూ.5 లక్షలు దాటితే ఇచ్చేవారు కాదు. కీమోథెరపీ లాంటిది ప్రారంభిస్తే కేవలం రెండు మూడు డోసులకే రూ.5 లక్షలు ఖర్చు అయిపోతాయి. దీంతో ఇక ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయలేమని వెనక్కు పంపడం లేదంటే నామమాత్రంగా చికిత్స చేసేవారు. 6 నెలలు తర్వాత ఆ పేషెంట్‌కు మళ్లీ క్యాన్సర్ తిరగబెట్టడంతో వైద్యం అందక చనిపోయిన దుస్థితి ఉండేది. ఇప్పుడు చికిత్స వ్యయంతో పని లేకుండా పూర్తిస్థాయిలో క్యాన్సర్ చికిత్స అందిస్తున్నాం. రూ.12 లక్షల ఖరీదైన కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు రెండు చెవులకూ చేయిస్తున్నాం. ప్రాణాంతక వ్యాధుల్లో రూ.11 లక్షలు ఖర్చయ్యే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, స్టెమ్‌సెల్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేయిస్తున్నాం. రూ.11 లక్షలయ్యే గుండె మార్పిడి చికిత్సలు నిర్వహిస్తున్నాం. ప్రాణాంతక వ్యాధుల బారినపడ్డ 1,82,732 మందికి ఆరోగ్యశ్రీతో ఉచితంగా చికిత్స అందించి తోడుగా నిలబడ్డాం. ఒక్క క్యాన్సర్ చికిత్సకే ఏకంగా రూ.1,900 కోట్లు ఖర్చు చేశాం. 60.27 లక్షల మందికి ఫేజ్ 1లో వైద్య సేవలు ఫేజ్ 1 ఆరోగ్య సురక్షను 50 రోజుల పాటు నిర్వహించాం. 60,27,843 మంది వైద్య సేవలు అందుకున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పంపిణీ చేసే ప్రతి ఔషధం డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలు ప్రకారం ఉండేలా చర్యలు తీసుకున్నాం. 562 రకాల మందులను అందుబాటులోకి తెచ్చాం. ప్రివెంటివ్ కేర్‌తో ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి వైద్యం అందిస్తూ అడుగులు వేసిన ఏకైక రాష్ట్రం మనదే. దేశంలో తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కూడా తెచ్చాం. మండలానికి రెండు పీహెచ్‌సీలు.. ప్రతి పీహెచ్‌సీలోనూ ఇద్దరు డాక్టర్లు చొప్పున నలుగురు వైద్యులను అందుబాటులోకి తెచ్చాం. పాల్గొన్న ఉన్నతాధికారులు.. కార్యక్రమంలో సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఆరోగ్యశ్రీ సీఈవో బాలాజీ, ఎంఏయూడీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి ప్రచార కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కింద ఉచిత సేవలు పొందటాన్ని ప్రతి ఒక్కరికి వివరంగా తెలియచేసే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నాం. మంగళవారం నుంచి ప్రతి నియోజకవర్గంలోని ఐదు గ్రామాల్లో ఆరోగ్యశ్రీ ప్రచార కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామాల్లో వీటిని ప్రారంభిస్తారు. ఇలా ప్రతి వారం మండలానికి నాలుగు గ్రామాల చొప్పున కార్యక్రమాలు చేపట్టాలి. ఇందులో ఏఎన్ఎంలు, సీహెచ్‌వోలు ఒక బృందంగా, మరో బృందంలో ఆశా వర్కర్లు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వానికి మద్దతు తెలిపేవారు, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపేవారు పాలు పంచుకుంటారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆయా కుటుంబాలకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డును ఇవ్వడమే కాకుండా ఉచితంగా వైద్య సేవలు ఎలా పొందాలో వివరించాలి. ఇంట్లో కనీసం ఒకరి మొబైల్ ఫోన్లోనైనా ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్లోడ్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించాలి. మహిళా పోలీసులు కూడా ఇందులో పాల్గొని దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయాలి. ఆరోగ్యశ్రీ సేవలపై వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన 6 నిమిషాల వీడియో సందేశాన్ని ఆయా కుటుంబాలకు చూపించాలి. వారి ఫోన్లలో కూడా ఈ వీడియోను ఉంచండి. సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ కార్డులు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆరోగ్యశ్రీ కార్డుల్లో సరికొత్త ఫీచర్లున్నాయి. ఇవి స్మార్ట్ కార్డులు. ఇందులో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. పేషెంట్లకు సంబంధించిన అన్ని వివరాలూ నిక్షిప్తం అవుతాయి. దీంతో వైద్యులు సులభంగా వైద్యం అందించడానికి వీలవుతుంది. ఇది ఈ కార్డులో విశిష్టత. వీటిని ప్రతి ఇంట్లో చక్కగా వివరించాలి. వైద్య రంగంలో అద్భుతాలు ప్రజలంతా మంచి ఆరోగ్యంతో ఉండాలన్న గొప్ప ఆలోచనతో అత్యున్నత స్థాయి వైద్యం ఉచితంగా అందిస్తూ సీఎం జగన్ వినూత్న సంస్కరణలు చేపట్టారు. ఆరోగ్యశ్రీ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు. నాడు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి ప్రాణం పోస్తే నేడు సీఎం జగన్ మరింత విస్తరించారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా జగనన్న ప్రభుత్వం వైద్య శాఖలో 53 వేలకుపైగా నియామకాలు చేపట్టిన ఘనత దక్కించుకుంది. జిల్లాకు ఒక వైద్య కళాశాల, ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ భరోసా, గుమ్మం వద్దకే ఫ్యామిలీ డాక్టర్, పల్లెకు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజారోగ్యానికి భరోసాగా నిలుస్తున్నారు. వైద్యులు రోగిని కాపాడి మిరాకిల్స్ చేస్తారు. సీఎం జగన్ వైద్య ఆరోగ్య రంగంలో అద్భుతాలు చేస్తున్నారు. – విడదల రజిని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జనవరి 1 నుంచి ‘సురక్ష’ ఫేజ్–2 జనవరి 1వతేదీ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్–2 ప్రారంభం అవుతుంది. ప్రతి మండలంలోనూ ప్రతి వారం ఒక గ్రామంలో సురక్ష శిబిరం నిర్వహిస్తారు. మండలాన్ని రెండుగా విభజించి ఒక డివిజన్లో మంగళవారం, మరో డివిజన్లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి బుధవారం శిబిరాల నిర్వహణ ఉంటుంది. ఉచితంగా మందులు కూడా డోర్ డెలివరీ చేస్తున్నాం. ఇప్పటికే ట్రైల్ రన్ ప్రారంభించాం. జనవరి ఒకటో తేదీ నుంచి మందులు ఉచితంగా డోర్ డెలివరీ ద్వారా అందుతాయి. రిఫరెల్ కేసుల వివరాలు తెలుసుకుని డాక్టర్ వద్దకు పంపించే కార్యక్రమం విలేజ్ క్లినిక్స్ ద్వారా జరుగుతుంది. రోగులకు ప్రయాణ ఖర్చుల కింద రూ.300 ప్రభుత్వమే అందిస్తుంది. వీటిని జగనన్న ఆరోగ్య సురక్ష–2లో భాగంగా చేపడతారు. -
వైద్యరంగంలో ఏపీ నంబర్ వన్
సాక్షి, అమరావతి: ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు, శానిటేషన్, ఇతర సదుపాయాల కల్పనపై సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తొలినుంచీ ప్రత్యేక దృష్టి పెడుతూ వస్తోంది. ఇందులో భాగంగా నాడు–నేడు కింద ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖల్లో సమూల మార్పులు తీసుకొచ్చింది. ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్వచ్ఛత, పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయి. దేశంలోనే కాయకల్ప గుర్తింపు కలిగిన అత్యధిక ఆస్పత్రులు మన రాష్ట్రంలోనే ఉండటం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ పార్లమెంట్లో వెల్లడించింది. 3,161 ఆస్పత్రులకు కాయకల్ప గుర్తింపు పరిశుభ్రతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2014లో స్వచ్ఛ భారత్ అభియాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆస్పత్రుల్లో పరిశుభ్ర వాతావరణాన్ని పెంపొందించి అంటు వ్యాధులు, ఇన్ఫెక్షన్లు నియంత్రించడానికి ‘కాయకల్ప’ కార్యక్రమాన్ని 2015లో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆస్పత్రుల్లో స్వచ్ఛత, రోగులకు, వారి కుటుంబ సభ్యులకు అందుతున్న సదుపాయాలు, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇన్ఫెక్షన్ సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు, పారిశుధ్యం, రికార్డుల నమోదు, సిబ్బంది పనితీరు వంటి ఏడు ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని ఆస్పత్రులకు అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేస్తోంది. ఇందులో భాగంగా 2022–23లో దేశవ్యాప్తంగా 20,336 ప్రభుత్వ ఆస్పత్రులకు ఈ అవార్డులను కేటాయించారు. ఇందులో 3,161 ఆస్పత్రులకు అవార్డులు పొందిన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. 2,619 ఆస్పత్రులతో తమిళనాడు రెండో స్థానంలో, 2,414 ఆస్పత్రులతో ఒడిశా మూడో స్థానంలో నిలిచాయి. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణలో 734, కర్ణాటకలో 371, కేరళలో ఆస్పత్రులకు మాత్రమే అవార్డులు లభించాయి. ఇదిలా ఉండగా ఆస్పత్రుల్లో జాతీయ స్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటించే విభాగంలోనూ ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 2022–23లో దేశవ్యాప్తంగా 2,041 ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్వాష్) లభించగా.. ఇందులో 18 శాతం ఆస్పత్రులు ఏపీ నుంచి ఉన్నాయి. -
నళినిపై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీస్, వైద్య..ఆరోగ్య శాఖలపై సమీక్ష సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ పోలీస్ అధికారిణి నళిని అంశాన్ని అధికారుల వద్ద ప్రస్తావించిన ఆయన.. ఆమెకు తిరిగి అదే ఉద్యోగం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ‘‘ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఓడిపోయాక.. తిరిగి ఉద్యోగాల్లో చేరుతున్నారు. అలాంటిది తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాన్ని వదులుకున్న నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వడం న్యాయమే. ఆమెకు అదే పొజిషన్ అప్పజెప్పండి. ఒకవేళ పోలీస్ శాఖలో తీసుకునేందుకు రూల్స్ అడ్డువస్తే.. మరేయితర డిపార్ట్మెంట్లోకి అయినా తీసుకోండి’’ అని సీఎం రేవంత్, సీఎస్.. డీజీపీలను ఆదేశించారు. పన్నెండేళ్ల కిందట.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు ఆమె అనుకూలంగా పని చేశారనే అభియోగాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేశారామె. పారదర్శకంగా నియామకాలు చేపట్టండి తెలంగాణ రాష్ట్రంలో పోలీసు నియామకాలు చేపట్టాలని పోలీస్ శాఖను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అత్యంత పారద్శకంగా, అవకతవకలకు తావులేకుండా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారాయన. హోంగార్డుల నియామకాలను కూడా చేపట్టాలన్నారు. అలాగే.. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన నియామాకాల పై నివేదిక ఇవ్వాలని కోరారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ లాగే రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు ఉంటుందని, ఉత్తర, దక్షిణ తెలంగాణ లో ఈ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. టైం టు టైం ఆలోచన చేయండి ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సచివాలయ అధికారుల్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అలా వచ్చే ప్రజల కోసం మంత్రుల ఛాంబర్లో నిర్దిష్టమైన టైం ఏర్పాట్లపై అధ్యయనం చేయాలని సూచించారాయన. అలాగే.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొదటివారంలో ఒకట్రెండు రోజులపాటు సభలు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తే.. అక్కడి ప్రజలు హైదరాబాద్ దాకా వచ్చే పరిస్థితి ఉండదని అన్నారు. ప్రతీ నెల మొదటి వారంలో రెండు రోజులపాటు సభలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కరానికి చోరవ చూపాలని అధికారులకు సూచించారాయన. అలాగే.. ఫిర్యాదుల్ని డిజిటలైజేషన్ చేయాలని, ప్రజా వాణికి వస్తున్న స్పందన దృష్ట్యా ఇంకా టేబుల్స్ పెంచాలని అధికారులకు చెప్పారు. అవసరం అయితే శిక్షణ లో ఉన్న ఐఎఎస్ ల సేవలను వినియోగించుకోవాలన్నారు.