రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీకి లింకు పెట్టొద్దు: సీఎం రేవంత్ ఆదేశం | Cm Revanth Key Comments At Collectors Meeting In Secretariat | Sakshi
Sakshi News home page

రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీకి లింకు పెట్టొద్దు: కలెక్టర్లకు సీఎం ఆదేశం

Published Tue, Jul 16 2024 3:21 PM | Last Updated on Tue, Jul 16 2024 3:32 PM

Cm Revanth Key Comments At Collectors Meeting In Secretariat

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సచివాలంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్‌ మంగళవారం సమావేశమయ్యారు. ప్రజా పాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్​ వ్యవసాయం, ప్రజారోగ్యం- సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, ఎడ్యుకేషన్​, లా అండ్ ఆర్డర్, డ్రగ్స్​ నిర్మూలనపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సదస్సుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు హాజరయ్యారు.

అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందాలి: సీఎం
కలెక్టర్‌ల సమీక్షలో ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని స్పష్టం చేశారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందన్న సీఎం.. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

ఆసుపత్రుల్లో ప్రతీ బెడ్‌కు ఒక సీరియల్ నెంబర్
గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతీ బెడ్‌కు ఒక సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలని పేర్కొన్నారు.

‘డిసెంబర్ 24, 2023న కలెక్టర్లతో మొదటిసారి సమావేశం నిర్వహించాం. ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని ఆ సమావేశంలో ఆదేశించాం.ఎన్నికల కోడ్ ముగియగానే పారదర్శకంగా కలెక్టర్ల బదిలీలు నిర్వహించాం. ప్రభుత్వానికి కళ్లు,చెవులు మీరే.. కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినవారు ఉన్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే మీరు ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారు. తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో మీ నిర్ణయాలు ఉండాలి. 

ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా పనిచేయాలి
ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా మీరు పనిచేయాలి. క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోండి. కేవలం ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా ఎలాంటి సంతృప్తి ఉండదు.మీ ప్రతీ చర్య ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలి. ఈ ప్రజా ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలి. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపైనే ఉంది. కలెక్టర్లు క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందే. ప్రతీ పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతీ నెలా రూ.85వేలు ఖర్చు పెడుతోంది.

ప్రజా ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కల్పించాలి: సీఎం
తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకం.విద్యావ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు బదిలీ అయితే.. విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుడిలా స్పందించారు. కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా మీ పనితనం ఉండాలి. ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత మీపైనే ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు విశ్వాసం కల్పించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement