కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌ | CM Revanth Reddy Angry With The Performance Of The Collectors, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌

Published Fri, Jan 10 2025 9:19 PM | Last Updated on Sat, Jan 11 2025 12:53 PM

Cm Revanth Reddy Angry With The Performance Of The Collectors

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్‌ స్కూళ్లల్లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘డైట్‌ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాం. అయినా ఇలాంటి ఘటనలు జరగడం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోందంటూ సీరియస్‌ అయ్యారు. శుక్రవారం ఆయన కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ, స్కూళ్లను కలెక్టర్లు తనిఖీ చేయకపోవడమే ఘటనలకు కారణమవుతున్నాయని.. ఇక నుంచి ప్రతివారం ప్రభుత్వ రెసిడెన్షియల్‌ స్కూళ్లల్లో కలెక్టర్లు తనిఖీలుచేసి రిపోర్ట్‌ ఇవ్వాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి. కొంతమంది కలెక్టర్లు ఫీల్డ్‌ విజిట్‌ చేయడం లేదు. అలసత్వం వహిస్తున్న కలెక్టర్లపై వేటు తప్పదు’’  అంటూ సీఎం హెచ్చరించారు.

‘‘జనవరి 26 తర్వాత ఆకస్మిక పర్యటలు ఉంటాయి. అన్ని రకాల వివరాలతో సిద్ధంగా ఉండాలి. ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కుల గణన సర్వే 96 శాతం పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్లకు అభినందనలు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది కలెక్టర్లే. కలెక్టర్ల పనితీరే ప్రభుత్వ పనితీరుకు కొలమానం. కలెక్టర్లు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చాం. కానీ కొంతమంది ఇంకా ఆఫీసులలో కూర్చునే పనిచేయాలని భావిస్తున్నారు’’ అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.

‘‘సమస్యలు వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మీ పని తీరును మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా గతంలో రైతు పెట్టుబడి సాయం అందించారు. అనర్హులకు రైతు భరోసా ఇవ్వొద్దు. క్షేత్ర స్థాయిలో వెళ్లి అనర్హులను గుర్తించాల్సిందే. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. రాష్ట్రంలో వన్ రేషన్ వన్ స్టేట్ విధానాన్ని తీసుకురాబోతున్నాం. తెలంగాణలో ఒకరికి ఒకచోట మాత్రమే రేషన్ కార్డు ఉండాలి. ఈ నెల 11 నుంచి 15లోగా పథకాల అమలుకు కావాల్సిన ప్రిపరేటరీ వర్క్ పూర్తి చేయాలి. కలెక్టర్లు అర్హుల జాబితాను ఇంఛార్జ్‌ మంత్రికి అందించాలి. ఇంఛార్జ్ మినిస్టర్ ఆమోదంతోనే కలెక్టర్లు అర్హుల జాబితాను విడుదల చేయాలి

ఇదీ చదవండి: కేటీఆర్‌పై మరో కేసు నమోదు

..జనవరి 26న అంత్యంత ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేయబోతున్నాం. ఇందుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని, గొప్పగా పనిచేస్తున్నదన్న నమ్మకం ప్రజలకు కలిగించాలి. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నెలలో ఒక్కసారైనా హాస్టల్స్ విజిట్ చేసి రాత్రి బస చేయాలి. మహిళా అధికారులు బాలికల హాస్టళ్లకు వెళ్లి అక్కడి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపండి. సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయికి చేరేలా చర్యలు తీసుకోండి. జనవరి 26 తరువాత నేను ఆకస్మిక తనిఖీలు చేస్తా. నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవు’’ అంటూ సీఎం రేవంత్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement