సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్)లో సమస్యలను పరిష్కరించడం, పథకాన్ని మరింత మెరుగ్గా నిర్వహించడంపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ దృష్టిసారించింది. దీనికి సంబం ధించి మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. ఇందులో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో నిమ్స్ డైరెక్టర్ మనోహర్, వైద్య విద్య డైరెక్టర్ రమేశ్ రెడ్డి, సీఎంవో ప్రత్యేకాధికారి తాడూరి గంగాధర్, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డైరెక్టర్ ప్రీతిమీనా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈహెచ్‌ఎస్ అమలు కోసం ఉద్యోగుల మూల వేతనంలో ఒక శాతాన్ని తీసుకోవాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి, పథకాన్ని సక్రమంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నా..
ఈహెచ్‌ఎస్ అమలు పరిస్థితిపై ఉద్యోగులు, పింఛన్ దారులు అసంతృప్తితో ఉన్నారని.. చాలా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ఈ పథకాన్ని అమలు చేయడం లేదని సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. బడ్జెట్లో ఈ పథకానికి రూ.300 కోట్ల మేర కేటాయిస్తున్నా.. నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని అధికారులు అభిప్రాయపడ్డారు. ‘‘సరిగా బిల్లులు అందడం లేదని, వివిధ చికిత్సలకు చెల్లించే ధరలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రైవేటు ఆస్పత్రులు అంటున్నాయి. ఈ కారణాలతోనే ఈహెచ్‌ఎస్ కింద వైద్యచికిత్సలు అందించేందుకు నిరాకరిస్తున్నాయి.
ఆస్పత్రులపై ఒత్తిడి చేయలేని పరిస్థితి ఉంది..’’అని అధికారులు రిజ్వీ దృష్టికి తీసుకొచ్చారు. గత ఐదేళ్లలో పథకం అమలు గణాంకాలను వివరించారు. దీనిపై స్పందించిన రిజ్వీ.. వెంటనే పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక ఉద్యోగులు కోరుతున్నట్టుగా వారి మూల వేతనంలో ఒక శాతం మొత్తాన్ని కంట్రిబ్యూషన్‌గా తీసుకుంటే.. సమస్య పరిష్కారమవుతుందా అన్న చర్చ జరిగింది. ఉద్యోగులు కంట్రిబ్యూషన్ ఇచ్చాక ఇంకా ప్రభుత్వం ఎంత భరించాల్సి ఉంటుందన్న అంచనాలు వేశా రు. దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని, తగిన ప్రతిపాదనలతో సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment