ehs
-
ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలు బంద్
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు) : ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో అందిస్తున్న ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ), ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) సేవలను నిలిపివేయనున్నట్లు ఏపీ స్పెషాలటీ ఆస్పత్రుల సమాఖ్య (ఆశా) ప్రకటించింది. తమకు రావాల్సిన రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీరాలేదని, నోటీసులో పేర్కొనట్లుగా ఈనెల 6 నుంచి ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. శనివారం విజయవాడలో నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యంతో సమావేశం అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్‌కుమార్, కార్యదర్శి డాక్టర్ సీహెచ్ అవినాష్ మీడియాతో మాట్లాడారు. ‘ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న సేవలకు ప్రతీనెలా రూ.300 కోట్లు బిల్లులు అవుతున్నాయి. మాకు రూ.3,000 కోట్ల వరకు బకాయిలున్నాయి. గతేడాది ఆగస్టులో ఈ బకాయిలపై ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తే సెప్టెంబరులో చెల్లిస్తామని హామీ ఇచ్చారు.కానీ, ఇప్పటికీ దానిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. అడిగితే బడ్జెట్ లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో మేం సేవలు అందించలేం. పాత బకాయిలకు అదనంగా ప్రతినెలా వస్తున్న బిల్లులు తోడవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మేం ఆస్పత్రులను నిర్వహించలేం. మాకు రావాల్సిన మొత్తంలో రూ.1,500 కోట్లు వెంటనే విడుదల చేస్తే సేవలు కొనసాగిస్తాం. లేనిపక్షంలో సోమవారం నుంచి ఈహెచ్ఎస్ సేవలను నిలిపివేస్తాం. ఆరోగ్యశ్రీలో ఉచిత ఓపీ సేవలను నిలిపివేస్తాం’.బీమా ప్యాకేజీలపై తీవ్ర అభ్యంతరం..ప్రభుత్వం కొత్తగా ఇన్సూరెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీనిపై మాకు అభ్యంతరాలున్నాయి. బీమా సంస్థలకు ప్యాకేజీ రేట్లతో బిడ్డింగుకు అనుమతించారో వాటిని ముందుగా నెట్వర్క్ ఆస్పత్రులతో చర్చించకపోవడం ఆందోళన కలిగించే ఆంశం. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాం. బీమా సంస్థలకు ఏ రేట్లు చెల్లిస్తారో వెల్లడించాలి. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టిన సమయంలో నిరుపేదలకు మాత్రమే వర్తించడంతో సేవాభావంతో వైద్యం చేయాలని నిర్ణయించాం. ఇప్పుడు పరిస్థితి మారింది. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం ధరలు 35 శాతం పెరగాలి. ఇప్పటివరకు పెంచకపోగా కనీసం దీనిపై ప్రభుత్వం చర్చించలేదు. ఈనెల 25లోగా మాకు రావాల్సిన బకాయిల్లో సగం మొత్తం రూ.1,500 కోట్లు చెల్లిస్తే సేవలు పునరుద్ధరిస్తాం. లేదంటే గడువు తర్వాత ఆరోగ్యశ్రీ సేవలూ నిలిపివేస్తాం. -
క్యాష్ లెస్.. యూజ్ లెస్!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) అటకెక్కింది. నగదు రహిత వైద్యసేవలు అందక ఉద్యోగులు, పింఛన్‌దారులు గగ్గోలు పెడుతున్నారు. నగదు రహిత ఆరోగ్య కార్డుతో వైద్యం చేయడానికి ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. డబ్బులు చెల్లించనిదే అడ్మిట్ చేసుకోవడం లేదని ఉద్యోగులు వా పోతున్నారు. ఉద్యోగులు గత్యంతరం లేక లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి వైద్యం పొందుతున్నారు. ఆరోగ్య పథకంతో తమకు ప్రయోజనం పెద్దగా ఉండటం లేదని వాపోతున్నారు. కొన్నేళ్లుగా ఈ పరిస్థితి కొనసాగుతున్నా, పూర్తిస్థాయిలో పరిష్కారం కనుగొనడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టడం లేదని పేర్కొంటున్నారు. ఆస్పత్రులకు బకాయిలతో.. ఈహెచ్ఎస్ పరిధిలో సుమారు 5.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 20 లక్షల మంది ఈ పథకంలోకి వస్తారు. ఈహెచ్ఎస్ కార్డు చూపిస్తే.. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఫీజులేమీ తీసుకోకుండానే అడ్మిషన్ ఇచ్చి వైద్యం చేయాలనేది ఈ పథకం ఉద్దేశం. ఆస్పత్రులకు ఆ సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో.. ఆస్పత్రులు నగదు రహిత వైద్యం అందించడంపై ఆసక్తి చూపడం లేదు. ఉద్యోగ సంఘాల నేతల లెక్కల ప్రకారం.. ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు దాదాపు రూ. 500 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. రీయింబర్స్‌మెంట్‌తో మరింత సమస్య ప్రభుత్వం ఈహెచ్ఎస్ పథకంతోపాటు రీయింబర్స్‌మెంట్‌ను కూడా అమలు చేస్తోంది. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులెవరైనా అనారోగ్యానికి గురైతే.. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో సొంత డబ్బుతో చికిత్స చేయించుకోవాలి. తర్వాత ఆస్పత్రి బిల్లులను ప్రభుత్వానికి సమరి్పస్తే.. ఆ సొమ్ము రీయింబర్స్మెంట్ అవుతుంది. కానీ దీనితో తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని ఉద్యోగులు, పెన్షనర్లు వాపోతున్నారు. రూ.10 లక్షల బిల్లు అయితే.. రూ.లక్ష, లక్షన్నర మాత్రమే వెనక్కి ఇస్తున్నారని, అది కూడా ఆరేడు నెలల నుంచి రెండేళ్ల సమయం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగదు రహిత వైద్య పథకం సరిగా అమలవకపోవడం, రీయింబర్స్మెంట్ పూర్తిగా రాకపోవడంతో.. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామని, ఏటా రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ప్రీమియం కట్టాల్సి వస్తోందని ఉద్యోగులు అంటున్నారు. కాంట్రిబ్యూటరీ స్కీమ్‌పై అస్పష్టత గత ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌కు కొన్ని రోజుల ముందు ‘ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ)’ ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి.. ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత, ప్రభుత్వం నుంచి కొంత కలిపి జమ చేయాలని పేర్కొంది. అది అమల్లోకి రాలేదు. కొత్త ప్రభుత్వం ఈ స్కీంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నగదు రహిత వైద్యం అందేలా చూడాలి హెల్త్‌కార్డులు నిరుపయోగంగా మారాయి. రీయింబర్స్మెంట్ ద్వారా పూర్తి మొత్తం అందడం లేదు. ఉపాధ్యాయుల మూల వేతనంలో ఒక శాతం ప్రీమియం చెల్లిస్తామని, ప్రత్యేక ట్రస్టుతో పథకం అమలు చేయాలని గత ప్రభుత్వాన్ని కోరాం. అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. విధివిధానాలు ఖరారుకాలేదు. అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదురహిత వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. - ఎం.పర్వత్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్టీయూటీఎస్ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయడంలేదు హెల్త్‌కార్డులు నామ్ కే వాస్తేగా మారాయే తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై దృష్టిసారించి అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలు అందించేలా చూడాలి. – కొమ్ము కృష్ణకుమార్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఆదిలాబాద్ జిల్లా బిల్లు కట్టి.. ఎదురుచూపులు నిజామాబాద్ జిల్లాకు చెందిన రిటైర్డ్ పెన్షనర్ ప్రభుదాస్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందగా.. రూ.లక్ష బిల్లు అయింది. రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుని నాలుగు నెలలైంది. ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. తల్లికి చికిత్స చేయించి.. నిజామాబాద్ జిల్లాలోని డీఆర్డీవో ఆఫీసులో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నర్సింగ్.. తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. రూ.లక్షకుపైగా బిల్లు అయితే సొంతంగా చెల్లించారు. రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుని, మూడు నెలలైనా ఇంకా రాలేదు. రూ.28 వేలు ఖర్చయితే.. రూ.12 వేలు వచ్చాయి మా అమ్మగారికి కంటి ఆపరేషన్ చేయించడం కోసం రూ.28 వేలు ఖర్చయ్యాయి. రీయింబర్స్మెంట్ కింద మెడికల్ బిల్లులు సమర్పించినప్పుడు రూ.12 వేలు మాత్రమే, అదీ ఏడాది తర్వాత అందాయి. ప్రభుత్వం నగదు రహిత చికిత్సఅందిస్తేనే.. ఏమైనా ప్రయోజనం ఉంటుంది. – బుర్ర రమేష్, రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ ప్రధానోపాధ్యాయుల సంఘం -
ఉద్యోగుల ఆరోగ్యానికి మరింత భద్రత
సాక్షి, అమరావతి: ఉద్యోగుల ఆరోగ్య భద్రతలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మేలు చేసేలా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)ను తీర్చిదిద్దారు. నిధులు కూడా ఎక్కువ కేటాయిస్తున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌పై ఖర్చు చేసిన మొత్తంకంటే ఈ నాలుగేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎక్కువ వెచ్చించింది. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో ఈహెచ్ఎస్ కింద రూ.748.81 కోట్లు మాత్రమే వ్యయం చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ స్కీం కింద రూ.1,094.69 కోట్లు ఖర్చు చేసింది. మరో పక్క ఈహెచ్ఎస్ ఉన్నప్పటికీ ఉద్యోగుల అభ్యర్థన మేరకు మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పొడిగించింది. అవాంతరాల్లేకుండా ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్కు ఎటువంటి అవాంతరాల్లేకుండా, ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా చర్యలు చేపట్టింది. ఈహెచ్‌స్‌కు సంబంధించి ఉద్యోగులు, ప్రభుత్వ కంట్రిబ్యూషన్‌ను ఏ నెలకు ఆ నెల ఎంప్లాయీస్ హెల్త్ స్కీము ట్రస్టుకు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల నుంచి ఇది అమల్లోకి వస్తోంది. ఇందుకు ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలిపింది. అంటే ఈ నెల ఉద్యోగులు, ప్రభుత్వ వాటా వచ్చే నెలలో నేరుగా ట్రస్టుకు జమ అవుతుంది. తద్వారా ఆస్పత్రులకు ఈహెచ్ఎస్ చెల్లింపులు సకాలంలో జరుగుతాయి. దీనివల్ల ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వైద్యానికి ఎటువంటి అవాంతరాలు ఉండవు. ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్మెంట్ కింద గత రెండేళ్లలో రూ..242 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 28,097 బిల్లులకు రూ.109.84 కోట్లు, 2022–23లో 16,495 బిల్లులకు రూ.132.41 కోట్లు మంజూరు చేసింది. క్లెయిమ్స్ పరిష్కారంలో జాప్యం ఉండదు: వెంకటరామిరెడ్డి ఎంప్లాయీస్ హెల్త్ స్కీములో ఉద్యోగులు, ప్రభుత్వ కంట్రిబ్యూషన్లను నెలవారీ ట్రస్టుకు జమ చేయడం వల్ల ఆస్పత్రులకు క్లెయిమ్స్ పరిష్కారంలో ఇకపై జాప్యం ఉండదని, ఇది ఉద్యోగులకు చాలా మేలు చేస్తుందని రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు కె.వెంకటరామి రెడ్డి తెలిపారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను పొడిగించడం కూడా ఉద్యోగులకు మేలు చేకూర్చడమేనని చెప్పారు. హెల్త్ స్కీముల్లో ఎటువంటి ఇబ్బందులున్నా వెంటనే పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. -
ప్రైవేట్ బీమానా? కార్పస్ ఫండా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నగదు రహిత ఆరోగ్య పథకంలో భారీ సంస్కరణలు తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం అమలవుతున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) తీరుపై అసంతృప్తి నేపథ్యంలో గుణాత్మక మార్పు తీసుకురావాలని యోచిస్తోంది. వైద్య సేవల్లో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలని నిర్ణయించింది. ప్రస్తుత నగదు రహిత ఆరోగ్య పథకం స్థానంలో రెండు ప్రత్యామ్నాయ పథకాలపై దృష్టిసారించింది. ఒకటి ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రైవేట్ ఆరోగ్య బీమా సంస్థకు అప్పగించి.. వారి కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించడం. ఇందులో ఎవరికైనా జబ్బు చేస్తే తక్షణమే ఆసుపత్రికి వెళ్లి నగదు రహిత వైద్య సేవలు పొందేలా చూడాలని భావిస్తోంది. దీనికి ఉద్యోగులు ఏడాదికి రూ.20 వేలు ప్రీమియం చెల్లించడంతోపాటు ప్రభుత్వం కూడా కొంత చెల్లించాలని యోచిస్తోంది. రెండో ప్రత్యామ్నాయమేంటంటే... ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయడం. ఉద్యోగులు, ప్రభుత్వం కలిపి ఏడాదికి రూ.700 కోట్లు కార్పస్ ఫండ్ తయారు చేసి, ఉద్యోగ కుటుంబ సభ్యులు వైద్యం పొందిన వెంటనే సంబంధిత ఆసుపత్రులకు సొమ్ము అందించేలా చూడటం. ఆరోగ్యశ్రీకి రీయింబర్స్మెంట్..! ప్రస్తుతం రీయింబర్స్మెంట్ పథకం కూడా ఉన్నా.. డబ్బులు చెల్లించి వైద్య సేవలు తీసుకున్న ఉద్యోగులు రీయింబర్స్మెంట్ పొందడం గగనంగా మారింది. వైద్య విద్యాసంచాలకుల పరిధిలో ఉన్న ఆ వ్యవస్థను ఆరోగ్యశ్రీకి అప్పగించడం ద్వారా సులభతరం చేయాలని కూడా సర్కారు యోచిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఆయా పథకాలను అధ్యయనం చేయాలని కూడా నిర్ణయించింది. కీలకమైన ఉద్యోగుల ఆరోగ్య పథకంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఉద్యోగులు, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో బుధవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రత్యామ్నాయ వైద్య పథకంపై చర్చించనున్నారు. ఇక ఎన్ఏబీహెచ్ ఆసుపత్రుల్లోనే... నగదురహిత వైద్యం అందిస్తున్నా, ఉద్యోగులు ఏమాత్రం సంతృప్తిగా లేరు. కార్పొరేట్, ప్రైవే టు ఆసుపత్రులు తమను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం కింద దాదాపు 5.50 లక్షల మంది ఉద్యోగులు, పింఛన్‌దారులు లాందుతున్నారు. రాష్ట్రంలో 96 ప్రభుత్వ నెట్వర్క్, 236 ప్రైవేటు నెట్వర్క్, 67 డెంటల్ ఆసుపత్రులున్నాయి. వీటిలో ప్రభుత్వం పేర్కొన్నట్లుగా దాదాపు 900 రకాల వ్యాధులకు వైద్యం చేస్తారు. సాధారణ వైద్య సేవలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని, కేవలం శస్త్రచికిత్సలకే పరిమితమవుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. నగదు రహిత వైద్యం ఉండి కూడా డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాల్సిన అగత్యం ఏర్పడిందని, మరోవైపు రీయింబర్స్‌మెంట్‌లో కోత కోస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. దీంతో ఆరోగ్య పథకంలో సంస్కరణలు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. కొత్తగా తెచ్చే పథకాన్ని కొన్ని ఆసుపత్రులకే పరిమితం చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ (ఎన్ఏబీహెచ్)లోనే అమలు చేయాలని యోచిస్తోంది. అంటే కార్పొరేట్, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనే వైద్య సేవలు అందుతాయన్నమాట. నాలుగు స్థాయిల్లో వాటా! ఆరోగ్య బీమా కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కేడర్ వారీగా సొమ్ము వసూలు చేస్తారు. అలాగే రాష్ట్రంలోనూ వేతనాలను బట్టి లెవెల్స్ నిర్ధారించి నాలుగు శ్లాబుల్లో ఉద్యోగుల నుంచి వాటాను తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని ద్వారా నిధులు సేకరించి కార్పస్ ఫండ్ తయారుచేస్తారు. తక్కువ వేతనదారుల నుంచి రూ.250, భారీ వేతనం తీసుకునే వారి నుంచి రూ.500–600 వసూలు చేసే అవకాశాలపై చర్చ జరుగుతోంది. తాము నెలకు రూ. 500 చెల్లించడానికైనా సిద్ధమని ఉద్యోగులు ఎప్పటినుంచో చెబుతున్నారు. అలా చేస్తే ఏడాదికి రూ. 350 కోట్లు వసూలవుతుంది. దానికి ప్రభుత్వం రూ. 350 కోట్లు ఇస్తే, మొత్తం రూ.700 కోట్లతో కార్పస్‌ఫండ్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనివల్ల తమ సమస్యలు తీరుతాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదించే రెండు ప్రత్యామ్నాయాల్లో దేనికైనా తాము సిద్ధమేనని అంటున్నారు. -
ఈహెచ్ఎస్ మరింత పటిష్టం.. ఆరోగ్యశ్రీ తరహాలోనే 21 రోజుల్లో బిల్లుల చెల్లింపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమును (ఈహెచ్ఎస్) మరింత పటిష్టంగా అమలు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరి వైద్య బిల్లులను ఆరోగ్యశ్రీ తరహాలోనే 21 రోజుల్లో ఆటో డెబిట్ స్కీము ద్వారా చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పీఆర్సీపై చర్చల సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ఇచ్చిన మాట మేరకు ఇతర రాష్ట్రాల్లోని నెట్వర్క్ ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవలు అందించేందుకు అనుమతిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆరోగ్య శ్రీలో చేర్చినా, ఎంప్లాయిస్ హెల్త్ స్కీములో కవర్ కాని 565 వైద్య విధానాలను ఇప్పుడు వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకుంది. నెట్వర్క్ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్‌లను మరింత పటిష్టం చేస్తూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీము లబ్ధిదారులకు ఆరోగ్య మిత్రలు తగిన సహాయ సహకారాలు అందిస్తూ నగదు రహిత చికిత్సలు అందేలా చూస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోకు ఉత్తర్వుల్లో సూచించారు. ఉద్యోగులకు ఎంతో మేలు ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం 21 రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని స్పష్టంగా పేర్కొనడంతో మన రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోని ప్రధాన ఆస్పత్రులు ఈ స్కీమును అమలు చేస్తాయని పేర్కొన్నారు. 565 రకాల కొత్త వైద్య సేవల వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. -
TS: ఈహెచ్ఎస్లో ఉద్యోగుల భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)లో సమస్యలను పరిష్కరించడం, పథకాన్ని మరింత మెరుగ్గా నిర్వహించడంపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ దృష్టిసారించింది. దీనికి సంబం ధించి మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. ఇందులో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో నిమ్స్ డైరెక్టర్ మనోహర్, వైద్య విద్య డైరెక్టర్ రమేశ్ రెడ్డి, సీఎంవో ప్రత్యేకాధికారి తాడూరి గంగాధర్, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డైరెక్టర్ ప్రీతిమీనా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈహెచ్ఎస్ అమలు కోసం ఉద్యోగుల మూల వేతనంలో ఒక శాతాన్ని తీసుకోవాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి, పథకాన్ని సక్రమంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నా.. ఈహెచ్ఎస్ అమలు పరిస్థితిపై ఉద్యోగులు, పింఛన్ దారులు అసంతృప్తితో ఉన్నారని.. చాలా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ఈ పథకాన్ని అమలు చేయడం లేదని సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. బడ్జెట్లో ఈ పథకానికి రూ.300 కోట్ల మేర కేటాయిస్తున్నా.. నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని అధికారులు అభిప్రాయపడ్డారు. ‘‘సరిగా బిల్లులు అందడం లేదని, వివిధ చికిత్సలకు చెల్లించే ధరలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రైవేటు ఆస్పత్రులు అంటున్నాయి. ఈ కారణాలతోనే ఈహెచ్ఎస్ కింద వైద్యచికిత్సలు అందించేందుకు నిరాకరిస్తున్నాయి. ఆస్పత్రులపై ఒత్తిడి చేయలేని పరిస్థితి ఉంది..’’అని అధికారులు రిజ్వీ దృష్టికి తీసుకొచ్చారు. గత ఐదేళ్లలో పథకం అమలు గణాంకాలను వివరించారు. దీనిపై స్పందించిన రిజ్వీ.. వెంటనే పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక ఉద్యోగులు కోరుతున్నట్టుగా వారి మూల వేతనంలో ఒక శాతం మొత్తాన్ని కంట్రిబ్యూషన్‌గా తీసుకుంటే.. సమస్య పరిష్కారమవుతుందా అన్న చర్చ జరిగింది. ఉద్యోగులు కంట్రిబ్యూషన్ ఇచ్చాక ఇంకా ప్రభుత్వం ఎంత భరించాల్సి ఉంటుందన్న అంచనాలు వేశా రు. దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని, తగిన ప్రతిపాదనలతో సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాధికి అత్యవసర చికిత్స పొందే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి రూ. లక్ష వరకు మెడికల్ రీయింబర్స్మెంట్ కల్పిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తాజాగా మెమో జారీ చేశారు. హోంశాఖ వివరణ కోరడంతో ఈ మెమో ఇవ్వడం గమనార్హం. ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందినవారికి గరిష్టంగా రూ.లక్ష వరకు రీయింబర్స్మెంట్ చెల్లింపు సౌకర్యం ఉంటుందన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)లో ఈ వసతి లేకపోవడంతో అనేకమంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ విరమణ పొందినవారు 25 లక్షల మంది ఉంటారు. తాజా నిర్ణయం లక్షలాది మందికి ప్రయోజనం కలిగిస్తుందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. -
ఆ పుకార్లు నమ్మొద్దు
సాక్షి, సిటీబ్యూరో: కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్), జర్నలిస్టు హెల్త్ స్కీం(జేహెచ్ఎస్) లబ్దిదారులకు వైద్యసేవలు నిలిచిపోయినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఈహెచ్ఎస్ సీఈఓ డాక్టర్ పద్మ అన్నారు. నెట్వర్క్ పరిధిలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు సహా ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పూర్తిస్థాయి వైద్యసేవలు అందుతున్నాయన్నారు. వైద్యసేవలు అందడం లేదని వస్తున్న పుకార్లను నమ్మవద్దని లబ్దిదారులకు సూచించారు. శుక్రవారం ఆమె ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. కార్పొరేట్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, అత్యవసర పరిస్థితుల్లో నేరుగా ఆయా ఆస్పత్రులకు వెళ్లి చికిత్సలు పొందవచ్చునని సూచించారు. వైద్య ఖర్చుల విషయంలో ఎలాంటి పరిమితి లేదని, లబ్దిదారుల వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే చాలు ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ లబ్దిదారులు వైద్యసేవలు అందించేందుకు నెట్వర్క్ పరిధిలో 269 ప్రైవేటు, 65 ప్రభుత్వ, 18 కార్పొరేట్ ఆస్పత్రులు కొనసాగుతున్నాయి. 12 లక్షల మంది లబ్డిదారులు ఉండగా ఇప్పటి వరకు సుమారు రెండు లక్షల మంది ఓపీ సేవలు వినియోగించుకున్నారు. 1.70 లక్షల మందికి పైగా ఇన్ పేషెంట్ సర్వీసులు పొందారు. అత్యవసర పరిస్థితుల్లో లబ్దిదారులు ఆయా ఆస్పత్రులకు నేరుగా వెళ్లి అడ్మిట్ కావొ చ్చు, రోగి వివరాలు ఆయా ఆస్పత్రులు ఆన్ లైన్ ద్వారా ట్రస్ట్‌కు చేరవేస్తాయి. సర్జరీ అనివార్యమైతే ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే సరి పోతుంది. త్వరలో బయోమెట్రిక్ విధానంః ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో రోజు సగటు ఓపీ 1100 నుంచి 1200 నమోదు అవుతుండగా, వనస్థలిపురంలో 600 నుంచి 700, వరంగల్ సెంటర్లో 300 నుంచి 400 నమోదు అవుతుంది. రోజుకు 200 మంది ఇన్‌పేషంట్లుగా చేరుతున్నారు. ఆయా కేంద్రాల్లో రోగుల నిష్ప త్తికి తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొంత ఇబ్బ ందులు ఎదురవుతున్నాయి. వచ్చిన రోగి ఎక్కువ సేపు నిరీ క్షించాల్సిన అవసరం లేకుండా బయోమెట్రిక్ విధానం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించాం. కూకట్పల్లి, పాతబస్తీ వెల్నెస్ సెంటర్లను కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నాం’ అని సీఈఓ డాక్టర్ పద్మ పేర్కొన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు వైద్యం బంద్
-
‘ఈహెచ్ఎస్’ సేవలపై ప్రైవేటు ఆస్పత్రుల అల్టిమేటం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య సేవల విషయంలో వైద్య, ఆరోగ్యశాఖ వైఖరి ప్రభుత్వానికి ఇబ్బందులు తెస్తోంది. ఎంప్లాయీ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) కింద ఉద్యోగులకు చికిత్సలు అందించిన కార్పొరేట్ సహా అన్ని రకాల ప్రైవేటు ఆస్పత్రులకు వైద్య, ఆరోగ్యశాఖ దాదాపు ఏడాదిగా చెల్లింపులు నిలిపేసింది. కార్పొరేట్ ఆస్పత్రులకు రూ.200 కోట్లు, మిగిలిన ఆస్పత్రులకు రూ.200 కోట్ల చొప్పున బకాయి పడింది. దీంతో ఆస్పత్రులు ఉద్యోగులకు వైద్య సేవలను నిలిపివేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వారం కిందటే సమాచారం ఇచ్చాయి. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యోగులకు వైద్యం విషయంలో కటువుగా వ్యవహరిస్తున్నాయి. వైద్య సేవలు అందించేందుకు సమయం పడుతుందని చెబుతున్నాయి. దీంతో వైద్య సేవలు, చికిత్సల కోసం కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తున్న ఉద్యోగులకు అవమానాలు ఎదురవుతున్నాయి. అత్యవసర వైద్యం అవసరమయ్యే ఉద్యోగులు ఆస్పత్రులను బతిమిలాడుకొని సేవలు పొందాల్సిన పరిస్థితి నెలకొంటోంది. వైద్య, ఆరోగ్య శాఖ తీరుతో తమకు ఇబ్బందులు వస్తున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వం గతంలో ఏడాదికి రూ. 700 కోట్ల వరకు ఖర్చు చేసేదని, ఈహెచ్‌ఎస్‌తో ఇది రూ. 400 కోట్లకు తగ్గిందని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. 1.19 లక్షల మందికి చికిత్సలు... ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్)ను ప్రవేశపెట్టింది. అలాగే అన్ని జిల్లాల్లో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలుత హైదరాబాద్‌లో రెండు, సిద్దిపేట, వరంగల్‌లలో ఒకటి చొప్పున వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. 2016 డిసెంబర్ 17 నుంచి ఈహెచ్ఎస్ సేవలు మొదలయ్యాయి. వెల్నెస్ సెంటర్ల ద్వారా ఓపీ సేవలు, వైద్య పరీక్షలు, మందులను ఉచితంగా అందిస్తున్నారు. పరీక్షల ఆధారంగా అవసరమైన వైద్య చికిత్సల కోసం ఎంపిక చేసిన ఆస్పత్రులకు సిఫారసు చేస్తున్నారు. ఈహెచ్ఎస్ సేవల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 ఆస్పత్రులు ఉన్నాయి. అన్ని ఆస్పత్రులలో కలిపి ఇప్పటివరకు 1,19,210 మంది ఇన్పేషెంట్లుగా చికిత్సలు పొందారు. ఈ సేవలకు రూ. 400 కోట్లు ఖర్చయింది. ఉద్యోగులకు వైద్యం అందించిన ఆస్పత్రుల జాబితాలో 16 బడా కార్పొరేట్ ఆస్పత్రులు కూడా ఉన్నాయి. అత్యవసర, క్లిష్టమైన సేవలు అందించేందుకు అన్ని వసతులుగల ఈ కార్పొరేట్ ఆస్పత్రులకు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు గుర్తింపు ఉంది. ఎన్బీఏ గుర్తింపు ఉన్న ఆస్పత్రుల్లో 24,210 మందికి వివిధ రకాల చికిత్సలు నిర్వహించారు. వారిలో 10,225 మంది ఉద్యోగులు, 13,549 మంది పెన్షన్‌దారులు, 436 మంది జర్నలిస్టులు చికిత్సలు పొందారు. ఈహెచ్ఎస్ కింద అందించిన ఈ సేవల కోసం ఏడాదిలో రూ. 270 కోట్లు ఖర్చయ్యాయి. ఈహెచ్ఎస్ మొదలైన కొత్తలో ఆస్పత్రులు అన్నింటికీ కలిపి వైద్య, ఆరోగ్యశాఖ రూ. 70 కోట్లు చెల్లించింది. కానీ గత 11 నెలలుగా మాత్రం చెల్లింపుల ప్రక్రియను పట్టించుకోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నా వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెల్లింపుల విషయంలో అడ్డుంకులు సృష్టిస్తున్నారని ఆస్పత్రుల నిర్వాహకుల సంఘం ముఖ్యలు ఆరోపిస్తున్నారు. బకాయిలు పెరిగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, శస్త్రచికిత్సలకు అవసరమయ్యే వివిధ రకాల వైద్య పరికరాలను కొనుగోలు చేయలేకపోతున్నామని వాపోతున్నారు. -
రెండే కేంద్రాలు.. లక్షల్లో ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఎంప్లాయీ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) కింద ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లు రోగులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. నాలుగు లక్షల మంది ఉద్యోగులతోపాటు మరో 7 లక్షల మంది వారి కుటుంబ సభ్యుల కోసం రాష్ట్రవ్యాప్తంగా కేవలం రెండు కేంద్రాలనే ఏర్పాటు చేయడం...అవి కూడా హైదరాబాద్‌లోనే ఉండటం వైద్యం కోసం వచ్చే వారికి తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. వైద్య సేవలు, వివిధ రకాల పరీక్షలు, వాటి నివేదికల కోసం రోగులు ఒక్కోసారి రోజులపాటు నిరీక్షించాల్సి వస్తోంది. రెండు కేంద్రాలకు కలిపి ప్రతిరోజూ సగటున 1,500 మంది వస్తున్నారు. ఎక్కువ మంది రావడంతో వైద్యుల అపాయింట్మెంట్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. పరీక్షలు నిర్వహించాలని వైద్యులు సూచిస్తే వాటి కోసం మరో రోజు వరకు వేచి చూడాల్సి వస్తోంది. దీంతో వైద్యం కోసం వచ్చిన వారు వసతి కోసం కష్టపడుతున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు బంధువుల ఇళ్లకు వెళ్లలేక డబ్బులు చెల్లించి హోటళ్లలో ఉండాల్సి వస్తోంది. హైదరాబాద్‌కు వచ్చేందుకు రవాణా చార్జీలు, బస ఖర్చులు కలిపి తడిసిమోపెడవుతున్నాయి. కేవలం హైదరాబాద్‌లోనే వెల్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వ ఉచిత వైద్యం అనే పదానికి అర్థం లేకుండాపోతోందని ఆరోగ్య శాఖలోని అధికారులే అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అన్ని జిల్లాల్లో వెల్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇప్పటికైతే కనీసం పాత జిల్లాల్లో అయినా వెంటనే వెల్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. త్వరలో అన్ని జిల్లాల్లో.. దశలవారీగా అన్ని జిల్లాల్లో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నాం. భవనాలు సిద్ధమైన చోట వెంటనే ప్రారంభించనున్నాం. ప్రస్తుత వెల్నెస్ సెంటర్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందిస్తున్నాం. – కె.పద్మ, ఈహెచ్ఎస్ సీఈఓ ఇప్పటివరకు 1.75 లక్షల మందికి వైద్యం... ఈహెచ్ఎస్ మొదలైన వెంటనే వైద్య, ఆరోగ్యశాఖ 2016 డిసెంబర్ 17న హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో మొదటి వెల్నెస్ సెంటర్‌ను, 2017 ఫిబ్రవరి 2న వనస్థలిపురంలో మరో వెల్నెస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో అన్ని విభాగాల వైద్యులను అందుబాటులో ఉంచింది. వెల్నెస్ సెంటర్లకు వచ్చే రోగులకు వైద్యంతోపాటు వివిధ పరీక్షలు, నివేదికలు, అవసరమైన మందులను ఈ కేంద్రాల్లోనే ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతం పని చేస్తున్న రెండు సెంటర్లలో కలిపి ఇప్పటి వరకు 1,75,175 మందిని వైద్యులు పరీక్షించారు. ఈ విధానం బాగానే ఉన్నా వెల్నెస్ కేంద్రాల ఏర్పాటులో వైద్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ఉద్యోగులకు ఇబ్బందులు కలిగిస్తోంది. వెల్నెస్ కేంద్రాల్లో వైద్యం పొందాల్సిన వారు 11 లక్షల మంది ఉంటే రెండు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ లక్ష్యం సైతం నెరవేరడంలేదు. సిద్దిపేటలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సేవలు మొదలుకాలేదు. మిగిలిన జిల్లాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. -
మీరు భయపెడితే.. భయపడం
బెదిరిపోవడానికి మేం ప్రభుత్వ ఉద్యోగులమేం కాదు * సీఎం స్పందించే వరకూ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ * తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వానికి చెప్పే సేవలు నిలిపివేశాం * రూ.250 కోట్లు విడుదల చేసినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం * పాత ప్యాకేజీ ధరలను రివైజ్ చేయాలి.. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే సిద్ధమే * ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్: ప్రభుత్వం స్పందించి నేరుగా ముఖ్యమంత్రి తమను చర్చలకు పిలిచే వరకు ‘ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్’ సేవలను పునరుద్ధరించేది లేదని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తేల్చి చెప్పారు. తమకు ప్రభుత్వం రూ.250 కోట్లను విడుదల చేసినట్లు వస్తున్న కథనాలు అవాస్తమని, గత నెల 30 నుంచి నేటి వరకు తమ అకౌంట్లలో ఒక్క రుపాయి కూడా జమ కాలేదని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించకపోతే కొరడా ఝుళిపించాల్సి వస్తుందని జిల్లాల్లోని కో-ఆర్డినేటర్లు తమ ఆస్పత్రుల్లో సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అయితే వారు భయపెడితే భయపడటానికి తాము ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులం కామని వివరించారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్, వైద్య, ఆరోగ్య మంత్రిని తప్పుదోవ పట్టిస్తోందని, ప్రభుత్వానికి ముందుగా సమాచారం ఇచ్చే తాము రాష్ట్రవ్యాప్తంగా సేవలను నిలుపుదల చేశామని పేర్కొన్నారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో అసోసియేషన్ సెంట్రల్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ విజయ్‌చందర్‌రెడ్డి, ఇతర సభ్యులు రమేష్, సుధీర్, శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, రవి, ఇంద్రసేనరెడ్డి, రవీందర్, శ్రీనివాస్, మూర్తి, నాగేందర్ తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ‘ఎంఓయూ’ పత్రాన్ని సరళీకృతం చేయాలని జూలైలో ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కోర్ కమిటీని ఏర్పాటు చేసిందని, అయితే ఈ కమిటీ నేటి వరకు ఒకే ఒక్కసారి సమావేశమైందని చెప్పారు. అయితే ఎంఓయూకు సంబంధించిన రీడ్రాఫ్ట్ను ఇప్పటి వరకూ ప్రభుత్వానికి సమర్పించలేదన్నారు. 2009లో నిర్థారించిన ప్యాకేజీ ధరలకే ఇప్పుడు కూడా తాము ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని, ఇప్పటికైనా ప్యాకేజీ రేట్లను రివైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రూపాయి కూడా జమ కాలేదు.. బకాయిలు చెల్లించాలని ఫిబ్రవరి నుంచి ప్రభుత్వానికి విన్నవిస్తున్నామని, స్పందించకపోవడం వల్లే సేవలను నిలుపుదల చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వైద్య తమను ఈ నెల 1న పిలిచి రూ.100 కోట్లు అకౌంట్లలో వేశామని, రేపటి కల్లా(2వ తేదీ) రూ.150 కోట్లు జమ అవుతాయని చెప్పారన్నారు. ఆయన చెప్పినప్పటికీ తమ అకౌంట్లలో ఒక్క రూపాయి కూడా జమ కాలేదన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ సేవలను పటిష్టం చేయాలని సీఎం కేసీఆర్ చూస్తుంటే.. ఆయనకు ట్రస్టు నిర్వాహకులు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా సీఎం స్పందించి తమను చర్చలకు పిలిస్తే వెళ్తామని, ఆయనతో సమావేశంలో ఇంకా ఎన్నో విషయాలు బయటకొస్తాయని విజయ్‌చందర్‌రెడ్డి చెప్పారు. ఆరోగ్యశ్రీ సేవలను నిలుపుదల చేసి ఆరు రోజులు కావొస్తుండగా, నెట్వర్క్(కార్పొరేట్) హాస్పిటల్స్ కూడా గురువారం సాయంత్రం నుంచి సేవలను నిలుపుదల చేస్తున్నట్లు తమకు తెలిపిందని విజయ్‌చందర్‌రెడ్డి అన్నా రు. ఇప్పటికై నా ప్రభుత్వం దిగి రాకపోతే పేదలు ఎన్నో సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. -
ఈహెచ్ఎస్ వైద్యం.. కార్డులకే పరిమితం
– ఉద్యోగులకు నగదు పెడితేనే వైద్యం – మళ్లీ తప్పని రీయింబర్స్మెంట్ – జర్నలిస్ట్ హెల్త్‌కార్డుదారులకూ కష్టాలు – ప్రీమియం చెల్లించినా అందని ఉచిత వైద్యం నగదు రహిత వైద్యం ఉద్యోగులకు కలగానే మిగిలిపోతోంది. ఈహెచ్ఎస్ (ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్) వైద్యం అమలు చేసేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ పలు రకాల ఆంక్షలు పెడుతోంది. కొన్నిసార్లు అత్యవసర వైద్యానికి సైతం ఈ పథకం వర్తించకపోవడంతో ప్రై వేటు ఆసుపత్రుల్లో చికిత్సకయ్యే ఖర్చు భరించలేక ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు అప్పులపాలవుతున్నారు. మరోవైపు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనూ దీర్ఘకాలిక వ్యాధులకు నిర్వహించే ఓపీ నామమాత్రంగా కొనసాగుతోంది. – కర్నూలు(హాస్పిటల్) జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించేందుకు జిల్లాలో 20కి పైగా నెట్వర్క్ ఆసుపత్రులు సేవలందిస్తున్నాయి. వీటితో పాటు దంత, కంటి ఆసుపత్రుల్లోనూ వీరు ఉచితంగా వైద్యసేవలు అందుకునే సౌలభ్యం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కార్డులను సైతం జారీ చేసింది. ఈ కార్డును తీసుకెళితే చాలు నగదు రహిత వైద్యం చేస్తారంటూ పేర్కొంది. మొత్తం 1800 రకాల చికిత్సలకు నగదు రహిత వైద్యం అందిస్తామని వివరించింది. ఇదే విధంగా జర్నలిస్ట్ హెల్త్‌కార్డుదారులకూ వర్తిస్తుందని చెప్పింది. ఈ మేరకు సూపరింటెండెంట్ కేడర్ వరకు నెలకు రూ.120, దీనికి కింది స్థాయి ఉద్యోగుల నుంచి నెలకు రూ.90ల ప్రీమియం వసూలు చేస్తున్నారు. జర్నలిస్ట్ హెల్త్కార్డుదారుల నుంచి సైతం సంవత్సరానికి రూ.1300 వరకు వసూలు చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఈ పథకం సరిగ్గా అమలు కావడం లేదు. ప్రధానంగా మెడికల్ కేసులకు పలు ఆంక్షలు పెట్టారు. ఐసీయూలో చేరి చికిత్స పొందే పలు రకాల వ్యాధులను ఈ జాబితాలో చేర్చకపోవడంతో పలువురు ఉద్యోగులు చికిత్సకు నోచుకోవడం లేదు. ఈ కారణంగా వీరు ప్రై వేటు ఆసుపత్రుల్లో వేలకు వేల రూపాయలు ఖర్చు చేసి వైద్యం చేయించుకుంటున్నారు. దానిని మెడికల్ రీయింబర్స్మెంట్ చేయించుకోవడానికి ఆయా శాఖల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వస్తోంది. అది కూడా ఉదాహరణకు రూ.1లక్ష వైద్యానికి ఖర్చు చేస్తే అందులో 20 నుంచి 40 శాతం వరకు కోత కోస్తున్నారు. పెద్దాసుపత్రిలో నామమాత్రంగా ఓపీ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) కింద ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల కోసం ప్రత్యేక ఓపీ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఓపీ కొనసాగుతుంది. 25 రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఇక్కడ చికిత్స అందిస్తారు. సోమ, గురువారాల్లో న్యూరో, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, మంగళ, శుక్రవారాల్లో కార్డియాలజీ, ఎండోక్రై నాలజి, బుధ, శనివారాల్లో పల్మనాలజీ, నెఫ్రాలజీ, కార్డియోథొరాసిక్, సోమవారం నుంచి శనివారం వరకు మెడికల్, ఆర్థోపెడిక్, మానసిక వ్యాధులు, చర్మవ్యాధులకు చికిత్స చేస్తారు. ఇక్కడ ఆయా విభాగాల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చి చికిత్స అందించాలి. కానీ కేవలం మెడిసిన్, సర్జరీ, ఆర్థోపెడిక్ విభాగాల నుంచి మాత్రమే వైద్యులు హాజరవుతున్నారు. అది కూడా కొన్నిసార్లు పీజీ వైద్యులు ఓపీలో చికిత్స చేస్తున్నారు. చికిత్స పొందిన రోగులకు అవసరమైతే వ్యాధి నిర్దారణ పరీక్షలు అక్కడే నిర్వహించాల్సి ఉన్నా సాధారణ రోగుల మాదిరిగానే రెగ్యులర్ ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. అది కూడా మరుసటిరోజు రిపోర్ట్ ఇస్తున్నారు. దీనికితోడు చికిత్సకయ్యే మందులు సైతం ప్రభుత్వ ఆసుపత్రిలో లభించేవి మాత్రమే ఇస్తున్నారు. కొన్ని మందులు లేకపోతే బయటకు రాస్తున్నారు. ఈ కారణంగా ఉచిత వైద్యమే గానీ అదనంగా వ్యయ, ప్రయాసలవుతున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. -
పేరుకే నగదు రహిత వైద్య పథకం
ప్రీమియం చెల్లిస్తున్నా అందని వైద్యం హైదరాబాద్: నగదు రహిత వైద్య పథకం (ఈహెచ్ఎస్) అమలు తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. వీరి వేతనాల్లో నుంచి ప్రీమియం చెల్లింపులు జరుగుతున్నా ఏ ఆస్పత్రిలోనూ ఈ పథకం కింద వైద్యం అందడం లేదు. దీంతో వీరంతా వైద్యసేవలకోసం మళ్లీ డబ్బు చెల్లించక తప్పడం లేదు. మరోవైపు వైద్య విద్యా శాఖ సంచాలకుల కార్యాలయానికి ప్రతిరోజూ 200 నుంచి 300 మెడికల్ రీయింబర్స్మెంట్ దరఖాస్తులొస్తున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతోపాటు మంత్రి సైతం ఉద్యోగులకు అందించే వైద్య ప్యాకేజీపై ప్రైవేటు ఆస్పత్రులతో చర్చలు జరిపినా ఫలితం దక్కలేదు. ఆరోగ్యశ్రీ ప్యాకేజీ రేట్లు చెల్లిస్తే వైద్యం అందించబోమంటూ ప్రైవేటు ఆస్పత్రులు కుండబద్దలు కొట్టాయి. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రభుత్వాసుపత్రుల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల దాకా ప్రత్యేక క్లినిక్‌లు నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా అమలుకాలేదు. వారంలోగా పరిష్కరిస్తా:మంత్రి కామినేని ఈ విషయమై కొంతమంది సచివాలయ ఉద్యోగులు వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్‌ను కలిశారు. మంత్రి స్పందిస్తూ వారంలోగా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్టు ఉద్యోగులు తెలియజేశారు.