ఈహెచ్‌ఎస్‌ వైద్యం.. కార్డులకే పరిమితం | conditions for EHS | Sakshi
Sakshi News home page

ఈహెచ్‌ఎస్‌ వైద్యం.. కార్డులకే పరిమితం

Published Sat, Jul 23 2016 10:33 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

ఈహెచ్‌ఎస్‌ వైద్యం.. కార్డులకే పరిమితం

ఈహెచ్‌ఎస్‌ వైద్యం.. కార్డులకే పరిమితం

– ఉద్యోగులకు నగదు పెడితేనే వైద్యం
– మళ్లీ తప్పని రీయింబర్స్‌మెంట్‌
– జర్నలిస్ట్‌ హెల్త్‌కార్డుదారులకూ కష్టాలు
– ప్రీమియం చెల్లించినా అందని ఉచిత వైద్యం
 
నగదు రహిత వైద్యం ఉద్యోగులకు కలగానే మిగిలిపోతోంది. ఈహెచ్‌ఎస్‌ (ఎంప్లాయ్‌ హెల్త్‌ స్కీమ్‌) వైద్యం అమలు చేసేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు ఎన్‌టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌ పలు రకాల ఆంక్షలు పెడుతోంది. కొన్నిసార్లు అత్యవసర వైద్యానికి సైతం ఈ పథకం వర్తించకపోవడంతో ప్రై వేటు ఆసుపత్రుల్లో చికిత్సకయ్యే ఖర్చు భరించలేక ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు అప్పులపాలవుతున్నారు. మరోవైపు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనూ దీర్ఘకాలిక వ్యాధులకు నిర్వహించే ఓపీ నామమాత్రంగా కొనసాగుతోంది. 
– కర్నూలు(హాస్పిటల్‌)
 
జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు  నగదు రహిత వైద్యం అందించేందుకు జిల్లాలో 20కి పైగా నెట్‌వర్క్‌ ఆసుపత్రులు సేవలందిస్తున్నాయి. వీటితో పాటు దంత, కంటి ఆసుపత్రుల్లోనూ వీరు ఉచితంగా వైద్యసేవలు అందుకునే సౌలభ్యం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ కార్డులను సైతం జారీ చేసింది. ఈ కార్డును తీసుకెళితే చాలు నగదు రహిత వైద్యం చేస్తారంటూ పేర్కొంది. మొత్తం 1800 రకాల చికిత్సలకు నగదు రహిత వైద్యం అందిస్తామని వివరించింది. ఇదే విధంగా జర్నలిస్ట్‌ హెల్త్‌కార్డుదారులకూ వర్తిస్తుందని చెప్పింది. ఈ మేరకు సూపరింటెండెంట్‌ కేడర్‌ వరకు నెలకు రూ.120, దీనికి కింది స్థాయి ఉద్యోగుల నుంచి నెలకు రూ.90ల ప్రీమియం వసూలు చేస్తున్నారు. జర్నలిస్ట్‌ హెల్త్‌కార్డుదారుల నుంచి సైతం సంవత్సరానికి రూ.1300 వరకు వసూలు చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఈ పథకం సరిగ్గా అమలు కావడం లేదు. ప్రధానంగా మెడికల్‌ కేసులకు పలు ఆంక్షలు పెట్టారు. ఐసీయూలో చేరి చికిత్స పొందే పలు రకాల వ్యాధులను ఈ జాబితాలో చేర్చకపోవడంతో పలువురు ఉద్యోగులు చికిత్సకు నోచుకోవడం లేదు. ఈ కారణంగా వీరు ప్రై వేటు ఆసుపత్రుల్లో వేలకు వేల రూపాయలు ఖర్చు చేసి వైద్యం చేయించుకుంటున్నారు. దానిని మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ చేయించుకోవడానికి ఆయా శాఖల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వస్తోంది. అది కూడా ఉదాహరణకు రూ.1లక్ష వైద్యానికి ఖర్చు చేస్తే అందులో 20 నుంచి 40 శాతం వరకు కోత కోస్తున్నారు.  
 
పెద్దాసుపత్రిలో నామమాత్రంగా ఓపీ
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌(ఈహెచ్‌ఎస్‌) కింద ఉద్యోగులు, రిటైర్‌ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల కోసం ప్రత్యేక ఓపీ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఓపీ కొనసాగుతుంది. 25 రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఇక్కడ చికిత్స అందిస్తారు. సోమ, గురువారాల్లో న్యూరో, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, మంగళ, శుక్రవారాల్లో కార్డియాలజీ, ఎండోక్రై నాలజి, బుధ, శనివారాల్లో పల్మనాలజీ, నెఫ్రాలజీ, కార్డియోథొరాసిక్, సోమవారం నుంచి శనివారం వరకు మెడికల్, ఆర్థోపెడిక్, మానసిక వ్యాధులు, చర్మవ్యాధులకు చికిత్స చేస్తారు. ఇక్కడ ఆయా విభాగాల నుంచి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వచ్చి చికిత్స అందించాలి. కానీ కేవలం మెడిసిన్, సర్జరీ, ఆర్థోపెడిక్‌ విభాగాల నుంచి మాత్రమే వైద్యులు హాజరవుతున్నారు. అది కూడా కొన్నిసార్లు పీజీ వైద్యులు ఓపీలో చికిత్స చేస్తున్నారు. చికిత్స పొందిన రోగులకు అవసరమైతే వ్యాధి నిర్దారణ పరీక్షలు అక్కడే నిర్వహించాల్సి ఉన్నా సాధారణ రోగుల మాదిరిగానే రెగ్యులర్‌ ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. అది కూడా మరుసటిరోజు రిపోర్ట్‌ ఇస్తున్నారు. దీనికితోడు చికిత్సకయ్యే మందులు సైతం ప్రభుత్వ ఆసుపత్రిలో లభించేవి మాత్రమే ఇస్తున్నారు. కొన్ని మందులు లేకపోతే బయటకు రాస్తున్నారు. ఈ కారణంగా ఉచిత వైద్యమే గానీ అదనంగా వ్యయ, ప్రయాసలవుతున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement