ఉద్యోగులు, పెన్షనర్లకు అందని నగదు రహిత ఉచిత వైద్యం
క్యాష్‌లెస్ వైద్యం అందించని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు
సొంతంగా డబ్బులు కట్టి చికిత్స చేయించుకుంటున్న తీరు
రీయింబర్స్‌మెంట్ కోసంఅప్లై చేసుకున్నా.. తిరిగొచ్చే సొమ్ము అంతంతేనని ఆవేదన
ఈహెచ్‌ఎస్‌తో ప్రయోజనం లేకుండా పోయిందంటున్నఉద్యోగులు
కాంట్రిబ్యూటరీ పద్ధతిపై ఇంకా నిర్ణయం తీసుకోని సర్కారు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) అటకెక్కింది. నగదు రహిత వైద్యసేవలు అందక ఉద్యోగులు, పింఛన్‌దారులు గగ్గోలు పెడుతున్నారు. నగదు రహిత ఆరోగ్య కార్డుతో వైద్యం చేయడానికి ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు.
డబ్బులు చెల్లించనిదే అడ్మిట్ చేసుకోవడం లేదని ఉద్యోగులు వా పోతున్నారు. ఉద్యోగులు గత్యంతరం లేక లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి వైద్యం పొందుతున్నారు. ఆరోగ్య పథకంతో తమకు ప్రయోజనం పెద్దగా ఉండటం లేదని వాపోతున్నారు. కొన్నేళ్లుగా ఈ పరిస్థితి కొనసాగుతున్నా, పూర్తిస్థాయిలో పరిష్కారం కనుగొనడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టడం లేదని పేర్కొంటున్నారు.
ఆస్పత్రులకు బకాయిలతో..
ఈహెచ్‌ఎస్ పరిధిలో సుమారు 5.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 20 లక్షల మంది ఈ పథకంలోకి వస్తారు. ఈహెచ్‌ఎస్ కార్డు చూపిస్తే.. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఫీజులేమీ తీసుకోకుండానే అడ్మిషన్ ఇచ్చి వైద్యం చేయాలనేది ఈ పథకం ఉద్దేశం.
ఆస్పత్రులకు ఆ సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో.. ఆస్పత్రులు నగదు రహిత వైద్యం అందించడంపై ఆసక్తి చూపడం లేదు. ఉద్యోగ సంఘాల నేతల లెక్కల ప్రకారం.. ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు దాదాపు రూ. 500 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది.
రీయింబర్స్‌మెంట్‌తో మరింత సమస్య
ప్రభుత్వం ఈహెచ్‌ఎస్ పథకంతోపాటు రీయింబర్స్‌మెంట్‌ను కూడా అమలు చేస్తోంది. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులెవరైనా అనారోగ్యానికి గురైతే.. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో సొంత డబ్బుతో చికిత్స చేయించుకోవాలి. తర్వాత ఆస్పత్రి బిల్లులను ప్రభుత్వానికి సమరి్పస్తే.. ఆ సొమ్ము రీయింబర్స్‌మెంట్ అవుతుంది. కానీ దీనితో తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని ఉద్యోగులు, పెన్షనర్లు వాపోతున్నారు.
రూ.10 లక్షల బిల్లు అయితే.. రూ.లక్ష, లక్షన్నర మాత్రమే వెనక్కి ఇస్తున్నారని, అది కూడా ఆరేడు నెలల నుంచి రెండేళ్ల సమయం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగదు రహిత వైద్య పథకం సరిగా అమలవకపోవడం, రీయింబర్స్‌మెంట్ పూర్తిగా రాకపోవడంతో.. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామని, ఏటా రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ప్రీమియం కట్టాల్సి వస్తోందని ఉద్యోగులు అంటున్నారు.
కాంట్రిబ్యూటరీ స్కీమ్‌పై అస్పష్టత
గత ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌కు కొన్ని రోజుల ముందు ‘ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్‌సీటీ)’ ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి.. ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత, ప్రభుత్వం నుంచి కొంత కలిపి జమ చేయాలని పేర్కొంది. అది అమల్లోకి రాలేదు. కొత్త ప్రభుత్వం ఈ స్కీంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
నగదు రహిత వైద్యం అందేలా చూడాలి
హెల్త్‌కార్డులు నిరుపయోగంగా మారాయి. రీయింబర్స్‌మెంట్ ద్వారా పూర్తి మొత్తం అందడం లేదు. ఉపాధ్యాయుల మూల వేతనంలో ఒక శాతం ప్రీమియం చెల్లిస్తామని, ప్రత్యేక ట్రస్టుతో పథకం అమలు చేయాలని గత ప్రభుత్వాన్ని కోరాం. అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. విధివిధానాలు ఖరారుకాలేదు. అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదురహిత వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. - ఎం.పర్వత్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్టీయూటీఎస్
ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయడంలేదు
హెల్త్‌కార్డులు నామ్ కే వాస్తేగా మారాయే తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై దృష్టిసారించి అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలు అందించేలా చూడాలి. – కొమ్ము కృష్ణకుమార్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఆదిలాబాద్ జిల్లా
బిల్లు కట్టి.. ఎదురుచూపులు
నిజామాబాద్ జిల్లాకు చెందిన రిటైర్డ్ పెన్షనర్ ప్రభుదాస్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందగా.. రూ.లక్ష బిల్లు అయింది. రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకుని నాలుగు నెలలైంది. ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు.
తల్లికి చికిత్స చేయించి..
నిజామాబాద్ జిల్లాలోని డీఆర్‌డీవో ఆఫీసులో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నర్సింగ్.. తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. రూ.లక్షకుపైగా బిల్లు అయితే సొంతంగా చెల్లించారు. రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకుని, మూడు నెలలైనా ఇంకా రాలేదు.
రూ.28 వేలు ఖర్చయితే.. రూ.12 వేలు వచ్చాయి
మా అమ్మగారికి కంటి ఆపరేషన్ చేయించడం కోసం రూ.28 వేలు ఖర్చయ్యాయి. రీయింబర్స్‌మెంట్ కింద మెడికల్ బిల్లులు సమర్పించినప్పుడు రూ.12 వేలు మాత్రమే, అదీ ఏడాది తర్వాత అందాయి. ప్రభుత్వం నగదు రహిత చికిత్సఅందిస్తేనే.. ఏమైనా ప్రయోజనం ఉంటుంది. – బుర్ర రమేష్, రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ ప్రధానోపాధ్యాయుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment