సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఎంప్లాయీ హెల్త్ స్కీం (ఈహెచ్‌ఎస్) కింద ఏర్పాటు చేసిన వెల్‌నెస్ సెంటర్లు రోగులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. నాలుగు లక్షల మంది ఉద్యోగులతోపాటు మరో 7 లక్షల మంది వారి కుటుంబ సభ్యుల కోసం రాష్ట్రవ్యాప్తంగా కేవలం రెండు కేంద్రాలనే ఏర్పాటు చేయడం...అవి కూడా హైదరాబాద్‌లోనే ఉండటం వైద్యం కోసం వచ్చే వారికి తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. వైద్య సేవలు, వివిధ రకాల పరీక్షలు, వాటి నివేదికల కోసం రోగులు ఒక్కోసారి రోజులపాటు నిరీక్షించాల్సి వస్తోంది.
రెండు కేంద్రాలకు కలిపి ప్రతిరోజూ సగటున 1,500 మంది వస్తున్నారు. ఎక్కువ మంది రావడంతో వైద్యుల అపాయింట్‌మెంట్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. పరీక్షలు నిర్వహించాలని వైద్యులు సూచిస్తే వాటి కోసం మరో రోజు వరకు వేచి చూడాల్సి వస్తోంది. దీంతో వైద్యం కోసం వచ్చిన వారు వసతి కోసం కష్టపడుతున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు బంధువుల ఇళ్లకు వెళ్లలేక డబ్బులు చెల్లించి హోటళ్లలో ఉండాల్సి వస్తోంది. హైదరాబాద్‌కు వచ్చేందుకు రవాణా చార్జీలు, బస ఖర్చులు కలిపి తడిసిమోపెడవుతున్నాయి.
కేవలం హైదరాబాద్‌లోనే వెల్‌నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వ ఉచిత వైద్యం అనే పదానికి అర్థం లేకుండాపోతోందని ఆరోగ్య శాఖలోని అధికారులే అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అన్ని జిల్లాల్లో వెల్‌నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇప్పటికైతే కనీసం పాత జిల్లాల్లో అయినా వెంటనే వెల్‌నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
త్వరలో అన్ని జిల్లాల్లో..
దశలవారీగా అన్ని జిల్లాల్లో వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నాం. భవనాలు సిద్ధమైన చోట వెంటనే ప్రారంభించనున్నాం. ప్రస్తుత వెల్‌నెస్ సెంటర్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందిస్తున్నాం. – కె.పద్మ, ఈహెచ్‌ఎస్ సీఈఓ
ఇప్పటివరకు 1.75 లక్షల మందికి వైద్యం...
ఈహెచ్‌ఎస్ మొదలైన వెంటనే వైద్య, ఆరోగ్యశాఖ 2016 డిసెంబర్ 17న హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో మొదటి వెల్‌నెస్ సెంటర్‌ను, 2017 ఫిబ్రవరి 2న వనస్థలిపురంలో మరో వెల్‌నెస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో అన్ని విభాగాల వైద్యులను అందుబాటులో ఉంచింది. వెల్‌నెస్ సెంటర్లకు వచ్చే రోగులకు వైద్యంతోపాటు వివిధ పరీక్షలు, నివేదికలు, అవసరమైన మందులను ఈ కేంద్రాల్లోనే ఉచితంగా అందిస్తోంది.
ప్రస్తుతం పని చేస్తున్న రెండు సెంటర్లలో కలిపి ఇప్పటి వరకు 1,75,175 మందిని వైద్యులు పరీక్షించారు. ఈ విధానం బాగానే ఉన్నా వెల్‌నెస్ కేంద్రాల ఏర్పాటులో వైద్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ఉద్యోగులకు ఇబ్బందులు కలిగిస్తోంది. వెల్‌నెస్ కేంద్రాల్లో వైద్యం పొందాల్సిన వారు 11 లక్షల మంది ఉంటే రెండు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ లక్ష్యం సైతం నెరవేరడంలేదు. సిద్దిపేటలో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సేవలు మొదలుకాలేదు. మిగిలిన జిల్లాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది.