మీరు భయపెడితే.. భయపడం
బెదిరిపోవడానికి మేం ప్రభుత్వ ఉద్యోగులమేం కాదు
* సీఎం స్పందించే వరకూ ఆరోగ్యశ్రీ సేవలు బంద్
* తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వానికి చెప్పే సేవలు నిలిపివేశాం
* రూ.250 కోట్లు విడుదల చేసినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం
* పాత ప్యాకేజీ ధరలను రివైజ్ చేయాలి.. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే సిద్ధమే
* ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు
హైదరాబాద్: ప్రభుత్వం స్పందించి నేరుగా ముఖ్యమంత్రి తమను చర్చలకు పిలిచే వరకు ‘ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్’ సేవలను పునరుద్ధరించేది లేదని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తేల్చి చెప్పారు.
తమకు ప్రభుత్వం రూ.250 కోట్లను విడుదల చేసినట్లు వస్తున్న కథనాలు అవాస్తమని, గత నెల 30 నుంచి నేటి వరకు తమ అకౌంట్లలో ఒక్క రుపాయి కూడా జమ కాలేదని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించకపోతే కొరడా ఝుళిపించాల్సి వస్తుందని జిల్లాల్లోని కో-ఆర్డినేటర్లు తమ ఆస్పత్రుల్లో సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అయితే వారు భయపెడితే భయపడటానికి తాము ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులం కామని వివరించారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్, వైద్య, ఆరోగ్య మంత్రిని తప్పుదోవ పట్టిస్తోందని, ప్రభుత్వానికి ముందుగా సమాచారం ఇచ్చే తాము రాష్ట్రవ్యాప్తంగా సేవలను నిలుపుదల చేశామని పేర్కొన్నారు.
గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో అసోసియేషన్ సెంట్రల్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ విజయ్‌చందర్‌రెడ్డి, ఇతర సభ్యులు రమేష్, సుధీర్, శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, రవి, ఇంద్రసేనరెడ్డి, రవీందర్, శ్రీనివాస్, మూర్తి, నాగేందర్ తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ‘ఎంఓయూ’ పత్రాన్ని సరళీకృతం చేయాలని జూలైలో ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కోర్ కమిటీని ఏర్పాటు చేసిందని, అయితే ఈ కమిటీ నేటి వరకు ఒకే ఒక్కసారి సమావేశమైందని చెప్పారు. అయితే ఎంఓయూకు సంబంధించిన రీడ్రాఫ్ట్‌ను ఇప్పటి వరకూ ప్రభుత్వానికి సమర్పించలేదన్నారు. 2009లో నిర్థారించిన ప్యాకేజీ ధరలకే ఇప్పుడు కూడా తాము ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని, ఇప్పటికైనా ప్యాకేజీ రేట్లను రివైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
రూపాయి కూడా జమ కాలేదు..
బకాయిలు చెల్లించాలని ఫిబ్రవరి నుంచి ప్రభుత్వానికి విన్నవిస్తున్నామని, స్పందించకపోవడం వల్లే సేవలను నిలుపుదల చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వైద్య తమను ఈ నెల 1న పిలిచి రూ.100 కోట్లు అకౌంట్లలో వేశామని, రేపటి కల్లా(2వ తేదీ) రూ.150 కోట్లు జమ అవుతాయని చెప్పారన్నారు. ఆయన చెప్పినప్పటికీ తమ అకౌంట్లలో ఒక్క రూపాయి కూడా జమ కాలేదన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ సేవలను పటిష్టం చేయాలని సీఎం కేసీఆర్ చూస్తుంటే..
ఆయనకు ట్రస్టు నిర్వాహకులు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా సీఎం స్పందించి తమను చర్చలకు పిలిస్తే వెళ్తామని, ఆయనతో సమావేశంలో ఇంకా ఎన్నో విషయాలు బయటకొస్తాయని విజయ్‌చందర్‌రెడ్డి చెప్పారు. ఆరోగ్యశ్రీ సేవలను నిలుపుదల చేసి ఆరు రోజులు కావొస్తుండగా, నెట్‌వర్క్(కార్పొరేట్) హాస్పిటల్స్ కూడా గురువారం సాయంత్రం నుంచి సేవలను నిలుపుదల చేస్తున్నట్లు తమకు తెలిపిందని విజయ్‌చందర్‌రెడ్డి అన్నా రు. ఇప్పటికై నా ప్రభుత్వం దిగి రాకపోతే పేదలు ఎన్నో సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు.