ప్రైవేట్‌ బీమానా? కార్పస్‌ ఫండా?  | Telangana Govt Major Reforms In Employee Health Scheme | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ బీమానా? కార్పస్‌ ఫండా? 

Published Wed, Nov 30 2022 1:41 AM | Last Updated on Wed, Nov 30 2022 1:41 AM

Telangana Govt Major Reforms In Employee Health Scheme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నగదు రహిత ఆరోగ్య పథకంలో భారీ సంస్కరణలు తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం అమలవుతున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) తీరుపై అసంతృప్తి నేపథ్యంలో గుణాత్మక మార్పు తీసుకురావాలని యోచిస్తోంది. వైద్య సేవల్లో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలని నిర్ణయించింది. ప్రస్తుత నగదు రహిత ఆరోగ్య పథకం స్థానంలో రెండు ప్రత్యామ్నాయ పథకాలపై దృష్టిసారించింది.

ఒకటి ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రైవేట్‌ ఆరోగ్య బీమా సంస్థకు అప్పగించి.. వారి కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించడం. ఇందులో ఎవరికైనా జబ్బు చేస్తే తక్షణమే ఆసుపత్రికి వెళ్లి నగదు రహిత వైద్య సేవలు పొందేలా చూడాలని భావిస్తోంది. దీనికి ఉద్యోగులు ఏడాదికి రూ.20 వేలు ప్రీమియం చెల్లించడంతోపాటు ప్రభుత్వం కూడా కొంత చెల్లించాలని యోచిస్తోంది.

రెండో ప్రత్యామ్నాయమేంటంటే... ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంతో కార్పస్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయడం. ఉద్యోగులు, ప్రభుత్వం కలిపి ఏడాదికి రూ.700 కోట్లు కార్పస్‌ ఫండ్‌ తయారు చేసి, ఉద్యోగ కుటుంబ సభ్యులు వైద్యం పొందిన వెంటనే సంబంధిత ఆసుపత్రులకు సొమ్ము అందించేలా చూడటం.  

ఆరోగ్యశ్రీకి రీయింబర్స్‌మెంట్‌..! 
ప్రస్తుతం రీయింబర్స్‌మెంట్‌ పథకం కూడా ఉన్నా.. డబ్బులు చెల్లించి వైద్య సేవలు తీసుకున్న ఉద్యోగులు రీయింబర్స్‌మెంట్‌ పొందడం గగనంగా మారింది. వైద్య విద్యాసంచాలకుల పరిధిలో ఉన్న ఆ వ్యవస్థను ఆరోగ్యశ్రీకి అప్పగించడం ద్వారా సులభతరం చేయాలని కూడా సర్కారు యోచిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఆయా పథకాలను అధ్యయనం చేయాలని కూడా నిర్ణయించింది. కీలకమైన ఉద్యోగుల ఆరోగ్య పథకంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఉద్యోగులు, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో బుధవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రత్యామ్నాయ వైద్య పథకంపై చర్చించనున్నారు. 

ఇక ఎన్‌ఏబీహెచ్‌ ఆసుపత్రుల్లోనే...
నగదురహిత వైద్యం అందిస్తున్నా, ఉద్యోగులు ఏమాత్రం సంతృప్తిగా లేరు. కార్పొరేట్, ప్రైవే టు ఆసుపత్రులు తమను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం కింద దాదాపు 5.50 లక్షల మంది ఉద్యోగులు, పింఛన్‌దారులు లాందుతున్నారు. రాష్ట్రంలో 96 ప్రభుత్వ నెట్‌వర్క్, 236 ప్రైవేటు నెట్‌వర్క్, 67 డెంటల్‌ ఆసుపత్రులున్నాయి. వీటిలో ప్రభుత్వం పేర్కొన్నట్లుగా దాదాపు 900 రకాల వ్యాధులకు వైద్యం చేస్తారు. సాధారణ వైద్య సేవలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని, కేవలం శస్త్రచికిత్సలకే పరిమితమవుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు.

నగదు రహిత వైద్యం ఉండి కూడా డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాల్సిన అగత్యం ఏర్పడిందని, మరోవైపు రీయింబర్స్‌మెంట్‌లో కోత కోస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. దీంతో ఆరోగ్య పథకంలో సంస్కరణలు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. కొత్తగా తెచ్చే పథకాన్ని కొన్ని ఆసుపత్రులకే పరిమితం చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా నేషనల్‌ అక్రెడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్స్‌ (ఎన్‌ఏబీహెచ్‌)లోనే అమలు చేయాలని యోచిస్తోంది. అంటే కార్పొరేట్, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనే వైద్య సేవలు అందుతాయన్నమాట. 

నాలుగు స్థాయిల్లో వాటా! 
ఆరోగ్య బీమా కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కేడర్‌ వారీగా సొమ్ము వసూలు చేస్తారు. అలాగే రాష్ట్రంలోనూ వేతనాలను బట్టి లెవెల్స్‌ నిర్ధారించి నాలుగు శ్లాబుల్లో ఉద్యోగుల నుంచి వాటాను తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని ద్వారా నిధులు సేకరించి కార్పస్‌ ఫండ్‌ తయారుచేస్తారు. తక్కువ వేతనదారుల నుంచి రూ.250, భారీ వేతనం తీసుకునే వారి నుంచి రూ.500–600 వసూలు చేసే అవకాశాలపై చర్చ జరుగుతోంది.

తాము నెలకు రూ. 500 చెల్లించడానికైనా సిద్ధమని ఉద్యోగులు ఎప్పటినుంచో చెబుతున్నారు. అలా చేస్తే ఏడాదికి రూ. 350 కోట్లు వసూలవుతుంది. దానికి ప్రభుత్వం రూ. 350 కోట్లు ఇస్తే, మొత్తం రూ.700 కోట్లతో కార్పస్‌ఫండ్‌ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనివల్ల తమ సమస్యలు తీరుతాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదించే రెండు ప్రత్యామ్నాయాల్లో దేనికైనా తాము సిద్ధమేనని అంటున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement