ఏ కష్టం వచ్చిందో.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య | Patancheru Software Employee And His Family Deceased | Sakshi
Sakshi News home page

ఏ కష్టం వచ్చిందో.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య

Published Fri, Jan 21 2022 3:16 AM | Last Updated on Fri, Jan 21 2022 10:06 AM

Patancheru Software Employee And His Family Deceased - Sakshi

రోదిస్తున్న మృతుల కుటుంబ సభ్యులు

పటాన్‌చెరు టౌన్‌: ఆ దంపతులిద్దరిదీ ప్రేమ వివాహం. పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నారు. అతనో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఆమె ప్రైవేటు స్కూల్లో టీచర్‌. వారికి ఏడేళ్ల కుమార్తె కూడా ఉంది. ముచ్చటైన కుటుంబం. ఆర్థికపరమైన ఇబ్బందులేమీ లేవు. ఏమైందో, ఏ కష్టం వచ్చిందో చిన్నారి కూతురితో పాటు దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే వీరి నుదుటిన ఎర్రటి బొట్లు ఉండడం, దేవుడి గదిలో చిత్రపటాలు బోర్లించి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం వెలుగుచూసింది.  

నోట్లో నురగలతో తల్లీకూతుళ్లు.. ఉరేసుకున్న శ్రీకాంత్‌ 
సీఐ శ్రీనివాసులురెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసే శ్రీకాంత్‌గౌడ్‌ (42), తన భార్య అనామిక (40) కుమార్తె శ్రీస్నిగ్ధతో కలిసి అమీన్‌పూర్‌ వందనపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్‌ది మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట్‌ మండలం పోతాయపల్లి కాగా అనామిక కుటుంబం అల్వాల్‌లో ఉండేది. వేర్వేరు కులాలకు చెందిన వీరిద్దరూ పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. 2015 నుంచి వందనపురి కాలనీలో ఉంటున్నారు. అనామిక స్థానికంగా ఉన్న ప్రాచీన్‌ గ్లోబల్‌ కార్పొరేట్‌ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. స్నిగ్ధ రెండో తరగతి చదువుతోంది. రెండురోజులుగా ఒకరి ఫోను స్విచ్ఛాప్‌ రావడం, మరొకరి ఫోను మోగుతున్నా ఎత్తకపోవడంతో అనామిక తండ్రి శ్రీరామచంద్రమూర్తి వందనపురిలోని వారింటికి వచ్చారు.

తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో అనుమానంతో అమీన్‌పూర్‌ పోలీసులకు, ఇతర కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా.. అనామిక, శ్రీస్నిగ్ధ నోట్లో నురగలతో విగతజీవులుగా పడి ఉన్నారు. పక్క గదిలో శ్రీకాంత్‌గౌడ్‌ ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో వారు ఆత్మహత్యలకు పాల్పడినట్టు భావిస్తున్నారు. విగతజీవులుగా ఉన్న ముగ్గుర్నీ చూసి కుటుంబసభ్యులు పెద్దపెట్టున రోదించారు. శ్రీకాంత్, అనామికలు బాగానే ఉండేవారని, ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమీ లేవని శ్రీరామచంద్రమూర్తి విలపించారు. క్లూస్‌ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. పోలీసులు దంపతులిద్దరి ఫోన్‌లను, శ్రీకాంత్‌గౌడ్‌ ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాంత్‌గౌడ్‌ ఫోన్‌కు లాక్‌ ఉందని సీఐ తెలిపారు. 

సెల్‌ఫోన్‌ డేటా రికవరీకి నిర్ణయం 
పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాంత్‌ దంపతులకు చెందిన ఒక ఫోన్‌ ఫార్మాట్‌ చేసి ఉంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో ఈ ఫార్మాట్‌ అయిన సెల్‌ఫోన్‌ కూడా ఉంది. ఈ సెల్‌ఫోన్‌ను ఎందుకు ఫార్మాట్‌ చేశారు.. అందులోని డేటాను ఎందుకు తొలగించారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోయిన డేటాను రికవరీ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఈ దంపతులకు ఆర్థిక ఇబ్బందులేమైనా ఉన్నాయా అనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

వీరి బ్యాంకు అకౌంట్‌ వివరాలు సేకరించారు. ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. వీరికి సుమారు రూ.30 లక్షల వరకు అప్పులు ఉన్నాయనే ప్రాథమిక సమాచారం పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. కానీ వారు నివసిస్తున్న ఇల్లే రూ.కోటికి పైగా విలువ చేసేది కావడంతో పాటు, వీరికి పొలాలు ఇతర స్థిరాస్తులు కూడా ఉన్నట్టు తెలియడంతో ఈ అప్పులేవీ ఆత్మహత్యలకు కారణం కాకపోయి ఉండవచ్చని అనుకుంటున్నారు. ఇంట్లో సూసైడ్‌ లెటర్‌లు ఏవీ కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. పని మనిషిని రెండురోజుల ముందే రావద్దని చెప్పినట్లు తెలిసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement